గడియారం గోల
మరే గడియారం గోల, పొద్దున్నే నిద్ర లేవడానికి గడియారం గోల తప్పదు. వెనకటికి ఒకడు ఆమ్ వే (AMWAY ) వాడు గడియారం బద్దలు కొట్టినట్టు, పొద్దున్నే అల్లారం మొగగానే దాన్ని బద్దలు గొట్టాలనే ఉంటుంది. కానీ వెంటనే "రాబర్ట్ ఫ్రాస్ట్ " "మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్" అని ఒక్కసారి గుర్తు చేస్తాడు. లేవక తప్పదు. అసలు ఈ గడియారం కని పెట్టిన వాడిని రెండు తన్నాలని పిస్తుంది ఒక్కోసారి. అయితే ఈ గడియారం అదే రిస్ట్ వాచీ తో జీవితం లో చాలా మరపురాని తీయని జ్ఞాపకలు ఉన్నాయి.
టెన్త్ పరీక్షలు రాసి వేసవికాలం సెలవులకు మా గ్రామం వెళ్ళేను. అక్కడ ఇద్దరి చిన్నాన్న పిల్లలు అందరూ సెలవులకు వచ్చేసేరు. భలే సరదాగా రోజులు గడుస్తూ ఉండగా, ఒకరోజు మా చిన్నాన్న న్యూస్ పేపర్ చదువుతూ నూటికి ముప్పయయిదు మంది మాత్రమే టెన్త్ పాస్ అయ్యారట అన్నాడు. ఆ ముప్పయయిదు మందిలో నే ఒకర్తిని అని ధైర్యంగా చెప్పాను.
ఆయన చాలా మురిసిపోయారు. ఆ సంవత్సరమే టెన్త్ పబ్లిక్ పరీక్షలు మొదలు. నా మీద నాకున్న నమ్మకానికి చాలా ఆనందించేరు.
అక్కడ న్యూస్ పేపర్ మధ్యాహ్నం వస్తుంది. దాని కోసం భోజనాలు చేసి అరుగుల మీద కూర్చుని ఎదురు చూసేవాళ్ళం. పేపర్ రాగానే బిక్కు బిక్కుమంటు వుండేవాళ్ళు. ఎవరైనా ఫెయిల్ అయితే పరీక్ష పోయిన వాళ్ళు ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు ముసి ముసిగా నవ్వుకునే వారు. బోలెడు జోక్స్ వేస్తూ వాళ్ళని ఊరుకోపెడుతూ సెప్టెంబర్ లో పాస్ అవ్వొచ్చు అంటూ ధైర్యం చెప్పేవాళ్ళు. మర్నాడు ఫలితాలు వచ్చేయి. నేను పాస్ అయ్యాను. అదే టైం లో మా పెద్దన్నయ్య కొత్త జాబ్ లో జాయిన్ అయ్యాడు. వాడికి అంతకు మునుపే పెళ్లయింది. వాడి మొదటి జీతం తో నాకు టెన్త్ పాస్ అయినందుకు గిఫ్ట్ గా ఎనికార్ కంపెనీ వాచ్ కొని ఇచ్చాడు. జూనియర్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. అంటే నా కాలేజ్ జీవితం నా వాచీ తో మొదలయింది.
నాతోబాటే వదినకి కూడా ఒక వాచ్ కొన్నాడు. అసలు వదినకి వాచీ అవసరం ఏమిటో నాకైతే ఇప్పటికీ అర్ధం కాదు. సూర్యభగవానుడు కూడా రోజూ ఉదయించడం, అస్తమించడం అయిదు నిముషాలు అటు ఇటు అవుతాడేమో గానీ మా వదిన దినచర్యలో మాత్రం తేడా ఉండదు. కుంపట్లు మీద వండే రోజుల్లో కూడా పొద్దున్నే నలుగున్నరకి లేచి కాఫీ పెట్టి అన్నయ్య తను తాగి, ఆరు గంటలకు మాకందరికీ అందించేది. ఎందుకంటే అప్పటిదాకా మేము లేచేవాళ్ళం కాదుకనుక. భోజనానికి వచ్చేయండి అని పిలిచిందంటే పదకొండు అయినట్టే. అలాగే మధ్యాహ్నం కాఫీ వచ్చిందంటే రెండని రాత్రిభోజనం పిలుపు కి ఎనిమిది అయిందని, మన ఆగిపోయిన గడియారాలు ఏవైనా ఉంటే కరెక్ట్ చేసేసుకోవచ్చు. అంత ఠంచన్ ఎలా చెయ్యగలదో ఇప్పటికీ అర్ధం కాదు. అయితే వదినకి చిన్న డయల్ తో భలే ముచ్చటయిన
వాచీ కొన్నాడు. అయితే తను కొత్తలో పెట్టుకున్నా తరవాత దాని జాడలు లేవు.
నాకు కొన్న వాచ్ మాత్రం చాలా స్పెషల్ వాచ్. అసలు అలాంటిది ఎవరి దగ్గరా చూడలేదు, అదీ ఆడ వాళ్ళ దగ్గర అసలు చూడలేదు. సాధారణం గా అమ్మాయిలు చిన్న వాచీలు పెట్టుకుంటారు. నాది కొంచం సైజు లో పెద్దది . ఒకటిన్నర అంగుళం వెడల్పు పొడుగు లతో స్క్వేర్ గా బంగారు రంగు వాచ్ నల్ల బెల్ట్ తో ఎంతో అందంగా ఉంది. చెరో చేతికి బంగారం గాజులు ఉంటే రెండింటినీ కుడి చేతికి వేసుకుని ఎడమ చేతికి వాచ్ పెట్టుకున్నాను. ఎదో ఆకాశం లో తెలిపోతున్న ఫీలింగ్. మా కుటుంబం లో, ఆ వయసులో వాచ్ ఉన్న వ్యక్తిని నేనే. చాలా గర్వంగా అనిపించింది. ఇంతలో మా చిన్నాన్న గారి అబ్బాయి రామం చూసి నువ్వు కుడి చేతికి పెట్టుకోవే అని సలహా ఇచ్చాడు. వెంటనే గాజులు ఎడమ చేతికి వేసుకుని కుడి చేతికి పెట్టుకున్నా.
పొద్దున్న లేచి ఈ వాచీ పెట్టుకుందుకైనా ముందుగా స్నానం చేసేసి వాచ్ పెట్టేసుకునేదాన్ని. రాత్రి ఒకపట్టాన నిద్రపట్టేది కాదు. ఎప్పుడు పొద్దున్న అవుతుందా, ఎప్పుడు వాచ్ పెట్టేసు కుంటానా అన్నట్టుండేది. మళ్ళీ రాత్రి నిద్రపోయేముందే తీయడం. అసలు కొన్ని రోజులు చదువుకుంటూ వాచ్ తీయడం మరిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి.
ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు నా కుడి చేతి వాచ్ చూస్తూ మా చిన్నాన్న గారు, "వాచ్ చూస్తూ జాగ్రత్తగా తినమ్మా, మళ్లీ ఒళ్ళోచ్చేస్తే అమెరికా వెళ్ళడానికి విమానం ఎక్కనివ్వరు" అని వేళాకోళం చేసేరు. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొస్తే నిజం గానే తథాస్తు దేవతలు వుంటారా అనుకుంటా, అంటే వళ్ళురావడం విమానం ఎక్కనివ్వకపోవడం కాదు, అమెరికా రావడం గురించన్నమాట. అమెరికా వస్తానని కలలో కూడా ఊహించలేదు, ఆశించలేదు కూడా.
చాలా ఏళ్లు ఆ వాచ్ నా శరీరం లో ఒక భాగం అయిపోయింది. నా చదువు పూర్తి అయ్యాక, మా మేనకోడలికే ఆ వాచ్ ఇచ్చాను. వాళ్ళ నాన్న కొన్న వాచ్ కదా. పాతది అయినా దానికీ ఆ వాచ్ ఎంతో ఇష్టం గా తీసుకుంది. అదికూడా చాలా కాలం వాడింది.
మాఆయన విదేశాలకు వెళ్ళి ఒక డజను వాచీలు తెచ్చారు. అవన్నీ చేతికి కడియాలలా ఉండేవి. సరే ఆయన ఏవో తెచ్చారు కదా అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పంచేము. తీరా చూస్తే ఒక్కటి పనిచేయడం లేదు. అప్పటికి బాటరీ వాచెస్ మాకు కొత్త. బాటరీ అయిపోయినట్టుంది. అప్పట్లో దొరికేవికాదు. ఎందుకు పనికి రాకుండా పోయాయి.
ఆ తరవాత ఎన్ని వాచీలు కొన్నామో గుర్తులేదు. గుర్తుపెట్టుకో తగ్గ వాచ్ లేదనే చెప్పాలి.
ఇక ఈ రిస్ట్ వాచ్ సంగతి ఇలా ఉండగా, ఒక గోడ గడియారం విషయం గుర్తుకొచ్చింది. మా ఆయన చదువయ్యి సెయిలింగ్ కి వెళ్లే ముందు ఖాళీగా ఉన్న సమయం లో ఇంట్లో పనికి రాని వస్తువులు ఏమైనా ఉంటే రిపేర్ చెయ్యడం మొదలెట్టారు. ఇంట్లో ఉన్న బటర్ నైఫ్, చెంచాలు సుత్తులు గట్రా పోగేసి వాటి సాయం తో అన్నీ విప్పేసి రెండు రోజులు తంటాలు పడి బిగించేసేవారు. అవి బాగానే పని చేసేవి కానీ నాలుగయిదు స్క్రూలు మిగిలిపోయేవి. అయితే మా గంటలు కొట్టే గోడగడియరం సడన్ గా ఆగిపోయింది. మా మవగారు మాత్రమే దానికి వారానికి ఒకరోజు కీ ఇచ్చేవారు. మా అందరికీ అదంటే భలే ఇష్టం. అది బాగుచెయ్యడానికి మా ఆయన పూనుకున్నారు. వద్దని ఇంట్లో అందరం మా మవగారితో సహా బతిమలాడేరు. వింటేగా. చక చకా ఒక స్టూల్ తెచ్చి, అది ఎక్కి గోడపైనుంచి గడియారం దింపేరు. రిపేర్ చెయ్యడం మొదలెట్టారు. ఒకరోజంతా దానిని అటు కదిపి ఇటు కదిపి అవస్థ పడ్డారు ఎలాగైనా తిరుగుతుందేమోనని. రెండో రోజు ధైర్యం వచ్చి ఇంకా కొన్ని పార్ట్లు ఇప్పడం మొదలెట్టేడు. సడన్ గా స్ప్రింగ్ పైకి విచ్చింది. ఆ స్ప్రింగ్ చుట్టబడి వున్నప్పుడు నాలుగు అంగుళాల వ్యాసం తో దగ్గరాగా చుట్టుకుని ఉంది. తీరా అది ఊడిపోయేసరికి బారెడు సైజ్ లోకి వచ్చింది. అది మళ్లీ ఎలా చుట్టబెట్టలో అర్ధం కాలేదు. అదేమీ మెత్తటి టేప్ లాంటిది కాదు. ఒక అరంగుళం వెడల్పు టేపు తో చేసిన మెటల్ స్ప్రింగ్. చాలా టెన్స్ మెటీరియల్. అంతలో ఆయన తిరుపతికి బయలుదేర వలసి వచ్చింది. ఆ స్ప్రింగ్ కి ఒక తాడు కట్టి కొంచం మూరెడు సైజు కి తెచ్చి అన్ని పార్ట్లు ఒక సంచిలో వేసి ఒక్క మూల దాచారు. ఆయన ట్రైన్ ఎక్కగానే మా మరిది ఒక సంచీ తీసుకుని ఇంటికి దగ్గరగా వున్న ఒక వాచీ రిపేర్ షాప్ వాడికిచ్చిరిపేర్ చెయ్యమని ఇచ్చి వచ్చేడు. తిరుపతి నుంచి తిరిగి వచ్చిన మా ఆయన గడియారం పార్ట్లు కనపడక దగ్గర గా ఉన్న గడియారం రిపేర్ షాప్ కి వెళ్లి అడిగితే, మీ తమ్ముడు చెప్పేడండీ మీకివ్వొద్దని. నేనే అని నీకెలా తెలుసు అంటే ఒక గుండుతో మా అన్న వస్తాడు వాడికి మాత్రం ఇవ్వొద్దని చెప్పారండి అన్నాడు. ఇంటికి వచ్చి చెబితే మేమంతా నవ్వలేక చచ్చాము. ఆయన మూతి ముడుచుకుని రెండు రోజులు అలిగారు. ఇప్పుడు తలుచుకుని పడీ పడీ నవ్వుకుంటూ వుంటారు. అయితే ఆ గడియారం బాగవలేదు ఆఖరికి.
కొన్నేళ్ల తరవాత అమెరికా వచ్చేసేము. వచ్చేముంచు మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒక జ్యోతిష్యుడికి చూపించాము. ఆయన నా జాతకం చూసి నువ్వు ఎప్పుడూ వాచ్ పెట్టుకోవాలి. అది నీకు మంచి చేస్తుంది అన్నాడు. అది నిజమే అనిపించింది. నా మొదటి వాచ్ పెట్టుకున్నప్పటి నుంచి నా చదువు బాగానే సాగింది. కొన్నాళ్ళు ఉద్యోగం కూడా బాగానే చేసా. ఉద్యోగం మానేయడం వాచ్ పెట్టుకోక పోవడం ఒకసారి జరిగింది. మా ఆయన వాచ్ కొన్నా పెద్ద ఉత్సాహంగా అనిపించ లేదు.
ఎలాగైతేనేం అమెరికా వచ్చేసేము. చాలా కాలం ఇండియా వెళ్ళలేదు. ఉద్యోగాలు ఉంటే, అవి చేస్తూ, లేనప్పుడు కొత్తవి వెతుక్కుంటూ, అసలు ఎలా రోజులు ఏళ్ళు గడిచేయో తెలియలేదు. 2015లో ఒకసారి ఇండియా ఫోన్ చేస్తే ఏమే నేను బతికుండగా వస్తావా రావా అని అడిగింది. వెంటనే టికెట్ కొనేసేను. వాళ్ళు వెంటనే మా పెద్దన్నాయికి కూడా చెప్పేసేరు. చిన్నన్నయ్య చెన్నై లో ఉంటున్నాడు. పెద్దన్నయ్య అదే పల్లెటూళ్ళో ఉంటున్నాడు. అంచేత నేను ప్లాన్ చేసుకున్న నెల రోజుల్లో పల్లెటూళ్ళో నాలుగు రోజులు ఉండడానికి నిర్ణయించుకున్నాను. అసలు ఒక వారం ఉండాలనే అనుకున్నా, కానీ మధ్యలో మా ఆయన మేన మామ కొడుకు పెళ్ళిరావడం తో మధ్యలో వైజాగ్ లో రెండు రోజులు గడప వలసి వచ్చింది. కంచి చెన్నై కి దగ్గర కదా, నన్నొక పట్టుచీరల షాప్ కి తీసుకెళ్లి, ఒక నాలుగు చీరలు తీసుకోమన్నారు. ఒకానొక రోజుల్లో అయితే ఎగిరి గంతేసే దాన్నే. కానీ అమెరికా లో ఇన్నేళ్లు ఉన్నకా, చీర కట్టుకోవడం అలవాటు తప్పి, ఒకటి చాలు అన్నా. లేదు పెద్దన్నయ్య ఒకటి, మా మేన కోడలు ఒకటి, అమ్మ ఒకటి అన్నయ్య ఒకటి ఇలా లిస్ట్ చెప్పి కొనాల్సిందే అన్నారు. అంతకు మునుపే పెద్దన్నయ్యతో ఫోన్ లో చె ప్పా, నాకు చీర వద్దురా, నాకు నువ్వు ఒక వాచ్ కొను. నాకు నువ్విచ్చే వాచ్ చాలా లక్కీ అని. వాడు చీర వాచ్ రెండు కొనుక్కో అన్నాడు. వద్దులేరా అన్నా వినకుండా చీర కొనేసేరు. వాచ్ కోసం తిరిగితే నాకు ఏదీ అంతగా నచ్చలేదు. వాచ్ కి డబ్బులిచ్చాడు నీకు నచ్చింది కొనుక్కో అని.
అమెరికా కి తిరిగి వచ్చాకా దానితో సిటిజెన్ ఇకో (ECO)వాచ్ సేల్ లో 115 డాలర్లకి ఆన్లైన్ లోకొనుక్కున్నా . దానికి కంపెనీ లైఫ్ టైం వార్రెంటీ ఉంది 2019 డిసెంబర్ లో తిరగడం మానేసింది. సిటిజెన్ వాచ్ కంపెనీకి మైల్ పెట్టేను వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చి కాలిఫోర్నియా లో సర్వీసింగ్ కంపెనీ కి ఇన్సూర్ చేసి పంపమని చెప్పేరు. మా ఆయన ఎందుకు కొత్త వాచ్ కొనుక్కో అన్నారు.
.దాని విలువ ఆయనకేం తెలుసు? మా ఆయన వడ్డాణం కొన్నా ఇవ్వని తృప్తి పుట్టింటి వారిచ్చిన ముక్కుపుడకే ఇస్తుందని ఆయనకి తెలియదు. సరేలే అని ఊరుకున్నా. ఈలోగా కోవిడ్ గోలలో దానిక్కడో పడేసా
ఈ మధ్య క్లోసెట్ తవ్వకాల్లో అది మళ్ళీ బయట పడింది.
ఎవరో చెప్పారు జ్యుయలరి షాప్ వాళ్ళు బాగుచేస్తారని. మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దామని నా పర్సు లో పడేసుకున్నా ఎక్కడైనా జ్యుయలరీ షాప్ కనిపిస్తే చూపిద్దామని.
20 రోజులక్రితం మాల్ లో మొవాడో కంపెనీ కనిపించింది. ఇదివరకు నేను ఆ కంపెనీకి SAP ఇంప్లి మెంటేషన్ లో పని చేసా. వాళ్ళని వెళ్లి అడిగాఅది బాగుచేస్తారా అని. వాళ్ళు పక్కనే జ్యువెలరీ షాప్ వాళ్ళు రిపేర్ చేస్తారని చెప్పారు.అక్కడ ఆ వాచ్ ఇచ్చి రిపేర్ కి ఎంతఖర్చు అవుతుందో చెప్పమన్నా. వర్కర్ లేడు వాచ్ వదిలేసి వెళ్ళండి మేము అతనికి పంపుతాము. మేము కాల్ చేసి ఎంత అవుతుందో చెప్తాము, మీకు నచ్చితే రిపేర్ చేస్తామన్నారు. సరే అని వాడితే వారం పోయాక కాల్ చేసి 120 డాలర్లు అవుతుందన్నారు . నేను కొన్న ఖరీదు 115 డాలర్లు. కొత్తదే కొనుక్కోవచ్చు అనిపించింది. రిపేర్ అక్కర లేదు. నా వాచ్ నాకు ఇచ్చెయ్యండి అన్నా. మూడురోజుల తరవాత షాప్ వచ్చి తీసుకెళ్లామన్నారు. తిరగని వాచీ అయినా అన్నయ్య కొన్నది కదా దాచుకుందామని వెళ్ళా.. తీరా చూస్తే అది పని చేసేస్తోంది. డబ్బులు కట్టాలేమో, రిపేర్ చేసేడేమో అనుమానం వచ్చి చెక్ చేసింది. కానీ అలాంటిదేమి లేదు. వాచీ తిరుగుతోంది. భలే ఆనందం వేసింది.ఒకవేళ నేను 120 డాలర్లకి ఒప్పుకున్నా అదే రిపైర్ చేసేవాడేమో మరి తెలియదు. మళ్లీ గాలిలో తెలుతున్న ఫీలింగ్. ఇప్పుడు ఎడం చేతికే పెట్టుకుంటున్నా. మర్చిపోయి కుళాయి కింద చెయ్యిపెట్టి తడిపేసి మళ్ళీ పాడవవుతుందేమో నాని భయం. అయినా కుడి చేతికి పెట్టుకు చూడాలి, ఏమైనా లాటరీ తగుల్తుందేమో.
అసలు ఎని కార్ వాచ్ సంగతేమిటో ఇన్నాళ్లు తెలియదు. ఇప్పుడు గూగుల్ వుంది కదా. చెక్ చేశా. ఏదీ అయిదు వేల డాలర్లకి తక్కువ లేదు. చాలా ఆశ్చర్యం వేసింది. అలా గూగుల్ చేస్తూ ఉంటే ఒక వాచీ చూసా మూడున్నర లక్షల డాలర్లుట . చూడడానికి అంత గొప్పగా కూడా లేదు. ఇప్పుడు వాట్సాప్ ఉందిగా దాని ఫోటో పెద్దన్నయ్యకి పంపి ఒరేయ్ మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు అది కొనరా అని అడిగా సరదాగా. మరి కొన్ని గంటల్లో వాయిస్ మెసేజ్ వాట్సాప్ లో వచ్చింది. ఈమాత్రం దానికి పెద్ద మెసేజ్ లు ఫోటోలు ఎందుకే, కొనేసుకో నేను చెక్ పంపించేస్తా అని. నాకసలు వాచీ చూసే అలవాటే తప్పింది. చేతికి వాచీ పెట్టుకున్నా సెల్ ఫోన్ ఆన్ చేసి టైం చూసుకుంటున్నా. వాడు చెక్ పంపుతాడా, చెక్ కాష్ అవుతుందా లేదా అనేది ప్రశ్న కాదు. అంత మాట అనగలిగిన అన్న ఎన్ని జన్మలైనా కావాలి.