Tuesday, November 5, 2013

పతి-భక్తి-మతం

డియర్ గీతా,

బాగున్నావా? అసలు ఫోన్ చేసి మాట్లా డు దామని అనుకున్నాను. కానీ ఉత్తరం రాస్తే, మనుసులో చెప్పుకుందామని అనుకున్న అన్ని భావాలూ, ఒక్కటి కూడా మర్చి పోకుండా చెప్పవచ్చు కదా ని రాస్తున్నాను
మధ్య మీ అక్క రాధ ఫోన్ చేసింది. నువ్వు మీ బావగారికి, మా ఆయనికి స్నేహం గురించి నవ్వుతున్నావని చెప్పింది . నిజమే, మీ బావగారు, అస్సలు నోరు విప్పరు.   మా ఆయన నోరు మూత బడదు  , ఇరవై నాలుగు గంటలూ రేడియో లాగ . నిజం చెప్పాలంటే, అందుకే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మా ఆయన చెప్పే థియరీలు ఖంఢించ కుండా వినే మహా గొప్ప వ్యక్తి  మీ మూర్తి బావగారు.   మా ఆయన సూర్యం మాట్లాడుతున్నాప్పుడు, సాధారణం గా, కళ్ళు మూసుకుని  మీ బావగారు, కిక్కురుమన కుండా వింటూ వుంటారు .కొండొకచో, నా అనుమానం, ఆయన నిద్ర పోతూ ఉంటారని. గంటో, రెండు గంటలో అయ్యాకా, ఒక చిన్న జోక్ వెస్తారు.  ఓహో, అంటే, ఈయన వింటున్నారన్న మాట, అనుకుంటాను. మా ఆయన సూర్యం ఒక వక్త అయితే, మీ బావగారు ఒక మంచి   శ్రోత. అందుకే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నేను కూడా ప్రతీ విషయం లోనూ ఖండిస్తూ ఉంటా గానీ, మూర్తి గారు మాత్రం సూర్యం గారిని ఒక్క విషయం లోనూ ఖండించరు. అందుకే  మూర్తిగారంటే, మా  ఆయనకి మహా ఇష్టం,  గౌరవం.  నాకూ కూడా మహా గౌరవం. చెప్పొద్దూ  రాధ  ని  చూస్తే, కొద్దిగా అసూయ కూడా. ఎందుకం టే, తెల్లవారి మూడు గంటల నుంచి, రాత్రి పదకొండూ పన్నెండు గంటలదాకా, ఎక బిగిని, ఎవరితోనో ఒకరితో మా ఆయన, ఫొన్లో మాట్లాడుతూనే వుంటారు. ఒక్కొక్క సారి పక్కనే  వినే నాకు, బుర్ర పిచ్చి ఎక్కి నట్లు వుంటుంది.   అడవి లోకైనా  పారి పోవాలని వుంటుంది. కానీ అదేమి విచిత్రమో, ఆయన, ఒక గంట బయటికి వెళ్తే ఒక్క సారి బతుకంతా శూన్యం గా  అనిపిస్తుంది.


 రాధ ఫొన్ చేసినప్పుడు, మూర్తి గారిని   అరగంట తిట్టింది. నాకు చాలా  ఆశ్చర్యం వేసింది. గుడిలో దేముడి లాగా, కోరిన వరాలిచ్చేస్తూ, జీతం అంతా దొసిట్లో పోసేసి, పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే ముందు కాఫీ కూడా తానే పెట్టేసుకుని, మీ అక్కకి నిద్రా భంగం చెయ్యని, బావగారిని తిట్టుకోడాని ఏముందని నువ్వు కూడా ఆశ్చర్య పోతున్నావు కదూ? అదే మరి. ఆయన ఫోన్ ఎత్తరుట. ఎంత ఎమెర్జెన్సీ వచ్చినా ఫోన్ ఎత్తరు,  మాట్లాడరు. ఆయన మాట్లాడ డానికి మరి రాధ అవకాసం ఇవ్వదో, ఎలానో మాట్లడనివ్వదు కదా ఫోన్ ఎత్తడం  దండగ అనుకుంటారో ఏమో మరి.       బజారుకి వెళ్ళినప్పుడు  లిస్ట్ లో  రాయడం మర్చి పోయిన సరుకు ఏదైనా, చెప్దామని ఫోన్ చెస్తే, అంతే సంగతులు.  ఫోన్ ఎత్తని  దానికి, అసలు ఫోన్  కొనడం  ఎందుకు అంటూ ఒకటే గొడవ పెట్టింది రాధ. ఓహో, మాట్లడక పోవడం లో ఇలాంటి ప్రోబ్లెంస్ కూడా వున్నాయా అని మొదటి సారి తెలిసింది.  మా కజిన్ బ్రదర్ ఒకడు ఉండేవాడు. “ఒరేయ్, కాస్త బజార్ కి వెళ్లి కాసిన్ని ఉల్లిపాయలూ , పచ్చిమిర్చి  తేరా, పెసరట్లు  చేస్తా” అని మా పిన్ని పొద్దున్నే అడిగితే, ఒక సారి కళ్ళలోకి సీరియస్ గా చూసి, చొక్కా వేసుకుని బయటికి వెళ్ళిపోయేవాడు .  పెసర పప్పు నానబోసుకుని కూచుంటే, రాత్రి పదింటికో తిరిగి వచ్చేవాడు. “ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏవిరా” అంటే, “నేను తెస్తానని చెప్పలేదే”, అనేవాడు. “నేను చెప్పింది వినలేదా”, అని అడిగితే, “ విన్నాను కానీ, తెస్తానని చెప్పానా” అని వాదించేవాడుఅసలు సంగతి తరువాత తెలిసింది, వాడికి పెసరట్లు ఇష్టం లేదని.

ఇంత వరకూ పిడకల వేట మాత్రమే. అసలు విషయానికి వస్తున్నా,  రాధ  మూర్తిగారిని  కడుపారా తిట్టేసాకా, మీ ఆయన నాస్తికత్వాన్ని, నీ అగచాట్లు గురించీ చెప్పింది. మీ ఇంట్లో నిన్ను పూజ చెయ్యనివ్వడనీ, అసలు పండగల గొడవే లెదనీ, చెయ్యడానికి వీలులేదనీ, చేస్తే మీ ఆయన వూరుకోడనీ. నిజమా? ఎంత అదృష్టవంతురాలివే తల్లీ. చెప్పొద్దూ, అది విన్నాకా,  మీ  అక్క మీద కన్నానీ మీద నాకు ఎక్కువ  అసూయ వచ్చేసింది .   ఉత్తరం రాయడానికి అసలు కారణం నాస్తికత్వమే.

మన ఇళ్ళల్లో నిత్య అగ్నిహోత్రాలు జరగక పోయినా, రోజూ, దేముడికో దీపం పెట్టి, చిన్న బెల్లం ముక్కో,   అర  గ్లాసుడు పాలో నైవేద్యం పెట్టేసి, కాస్త పనులు తెమిలాకా, కాసేపు, విష్ణు సహస్రమో, భగవద్ గీతో చదువుకోవడం మామూలే కదా.  మీరా  బాయి,   భక్త రామదాసులమూ కాక పోయినా, ఏదో, జన్మ ఇచ్చిన   
భగవంతునికి మాత్రం కృతజ్ఞత  తెలుపుకునే ప్రయత్నం చేస్తాముకదా ? విశాఖ పట్నం లో  వున్నప్పుడు తరచుగా  ఆదివారాలు,  పోర్ట్ వెంకట రమణ మూర్తి గుడి నుంచి, మొదలు కొని, డైరీ ఫారం వరకూ వున్న ప్రతీ గుడి, అంటే, కురుపాం మార్కెట్ దగ్గరి రామాలయం, కనక మహాలక్ష్మి, ఎల్లమ్మ తోటలోఎల్లమ్మ గుడి, బీచ్ వడ్డున, శివుని గుడి, పైడితల్లమ్మ, పరదేసమ్మ,  ఇలా ఒకటేమికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు గా వుండేది మా ఆయనతో. ఓహో , మా ఆయన  మహా భక్తుడు అని మురిసిపోయేదాన్ని. అలాంటిది ఈయన ఎప్పుడు సడన్ గా, నాస్తికునిగా మారిపోయారో తెలియదు.   నిజం చెప్పొద్దూ, మా పుట్టింటి లో నన్నొక నాస్తికురాలని తిట్టేవారు. రోజూ పూజ చెయ్యడానికి అమ్మ, అక్క, అన్నయ్య,  వగైరా లంతా క్యూ కట్టుకుని వుండే వారు. అలా క్యూ లో నా టైం వచ్చేసరికి నా కాలేజి టైం అయి పోయేది. ఎందుకులే గొడవ అని,  నేను సోఫాలోనే కూర్చుని, నా కొచ్చిన   హనుమాన్ చాలీసా, మరో రెండు దేముని శ్లోకాలు  చదువుకునే దాన్ని. నేను పూజ మందిరం జోలికి కూడా వెళ్ళేదాన్ని కాదు. అందుకే, నన్ను అలా నాస్తికురాలిని అనే వారు. ఎవరేమి అనుకుంటే  ఎమిలే, దేముడికి నిజా నిజాలు తెలియవా అనుకునే దాన్ని. పెళ్ళయ్యాకా బాగా చేసుకో వచ్చులే అనుకునే దాన్ని.  పెళ్లి అయ్యాకా, వుమ్మడి కుటుంబం కొన్నాళ్ళు సాగడం తో, మావగారు, అత్తగారు, బావగారు, తోడి కోడళ్ళు, మళ్ళీ క్యూ తప్పలెదు. బాగోదని, వాళ్ళు కూడా నన్ను నాస్తికురాలిగా జమ కట్టేస్తారనే భయంతో, ఏదో ఒక టైం లో పూజ గదిలో దూరి, అగర బత్తి వెలిగించి, అరగంట పూజ చెయ్యడం మొదలు పెట్టాను. మీరాబాయి లెవెల్ కాకా పోయినా, నన్ను భక్తురాలి లిస్టు లో జమ కట్టేశారు. శనివారం, కార్తీక సోమవారం ఉపవాసాలు  అవీ మొదలయ్యాయి. శనివారం అంటే, పూజలూ, పునస్కారాలూ అనుకునేవు,   పొద్దున్నే సుబ్బరం గా తినేసి, రాత్రి మాత్రం, కాస్త మినపరోట్టి, కొబ్బరి పచ్చడో, అల్లం పచ్చడో, ఇడ్లీ సంబారు, కొబ్బరి పచ్చడి, లేక వడ పాయసం, లేక పెరుగు వడలు లాంటివి తినేసి, వేడి చెయ్య కుండా, కొంచం సేమియా పాయసమో, ఫ్రూట్ సాలడ్ లాంటివి తినడం అన్నమాట. అప్పుడప్పుడు," సింపుల్ గా బొబ్బట్లు పులిహార చేసెయ్, "ఇవాళ మీ చిన్న ఆడ బడచు, పిల్లలు వస్తారుట, పొద్దున్నే  చేసేస్తే, ఇంచక్కా, వాళ్ళతో సాయం కాలం కబుర్లు చెప్పుకో వచ్చు " అని మా అత్తగారు, ఆర్డర్ పాస్ చేసేవారు. తప్పుతుందా మరి? ఇంచక్కా,    అమెరికాలోనో పుడితే,  హాయిగా బ్రెడ్ జాము తిని బతికేయొచ్చు కదా, అప్పుడు, దిబ్బరొ ట్లూబొబ్బట్లు, పులిహారాలూ, పూతరేకులూ, వంట పెంటా వుండేది కాదు కదా అని బాధ పెడే  దాన్ని


అయితే, అనుకోకుండా అమెరికా నిఝంగానే వచ్చేశాము కదా. ఇక్కడికి వచ్చాకా కొత్త విషయాలు తెలిసాయి. ఇక్కడ బ్రెడ్ జామే కాదు, గుజరాతీ వాళ్ళ ధర్మమా అని అన్నీ దొరుకుతాయి, అన్నీ వండుకో వచ్చు అని.   వారం రోజులూ, పని బిజీగా ఉంటాము కదా అని శనివారం స్పెషల్ వంటకాలు మాత్రం మారలేదు. పోనీలే, లింగూ లిటుకూ మంటూ ముగ్గురమే కదా,  ఎలానూ అలవాటే కదా అని చెసే స్తున్నాలే . మా ఇంట్లో ఉపవాసం చేసే పూజలేవీ చెయ్యనివ్వరు మా అయన. తొమ్మిది పిండి వంటలతో చేసే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, తరువాతి పది రోజులూ, దసరా నవరాత్రులూ, దీపావళి, లాంటి పూజలు చేసుకో మంటారు. అసలు నిజం చెప్పొద్దూ నాకు దేముదంటే భక్తీ కన్నా భయం ఎక్కువ. అంటే శాపాలు ఇస్తాడని జడిసి కాదు, అంతవరకూ వెళ్ళలేదు . దేముడనగానే నా కళ్ళ ముందు పావు కే జి చింతపండు   డబ్బా విమ్ పౌడర్ కనిపిస్తాయి. విగ్రహాలు తోమాలి కదా కనీసం నెలకొక సారైనా! ఇండియా లో పని మనిషికి పడెయ్య డమో, అమెరికాలో డిష్ వాషేర్ లో పడెయ్యడమో  చెయ్యలేము కదా. చచ్చినట్లు మనమే తోము కోవాలి కదానా మనసులో భావాలన్నీ ఒక సారి మా అడబడచుతో అన్నా, మళ్ళీ తప్పు అనిపించి చెంపలు  వే సుకున్నా. “నీకు సరిగా వేసుకోవడం రావడం లేదు, నేను సరిగా వేస్తారాఅన్నారావిడ
 ఇండియా లో మరో ప్రాబ్లం వుంది. కాస్త  మనకి కొంచం భక్తి వుందని తెలిస్తే చాలు, మన పెళ్ళికో పుట్టిన రోజుకో దేముడి పటాలు గిఫ్ట్ కింద  ఇచ్చేస్తారు.  మా మరిది పెళ్ళికి, పదిహేను పూల సజ్జలు, పన్నెండు అగర వత్తులు గుచ్చుకునేవి, పది హారతి కర్పూరం వెలిగించుకునేవి, పది వేంకటేశ్వరుని పటాలు, ఇరవై రాధా కృష్ణుని పటాలు వచ్చేయి బహుమతులుగా. మధ్య సాయి బాబా బొమ్మలిస్తున్నట్టున్నారు.

పెళ్ళైన కొత్త ల్లో తిరుపతి వెళ్తే అక్కడ నా కోసం ఆయన వెంకటేశ్వరుడు, అలివేలు మంగ, పద్మవతి దేవి విగ్రహాలు ఇత్తడివి కొన్నారు. చెప్పొద్దూ, నాకు ఒక ఫొటో కి దణ్ణం పెట్టేసుకోవడం ఇష్టం. విగ్రహాలు తోముకోవడం అదీ ఇష్టం వుండదు. నాకు అవసరం లేదని మెల్లగా చెప్పా. ఆయన నేనేదో సిగ్గు పడి పోతున్నానని ముచ్చట పడిపోయారు. ఆయన ముచ్చట చూసిని పోనీలే, మూడే కదా అని ఇంకేమీ అనలేక వూరుకున్నా. మెల్ల మెల్లగా, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నా కొసం ఒక వెండిదో, ఇత్తడిదో, విగ్రహాలు బహుమతి గా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇవి కాకుండా కల్యాణం చేయించినప్పుడల్లా విగ్రహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇహ దానితో, దేమునికి కల్యాణం చేయించడం అంటే భయం పట్టుకుంది. మధ్య శ్రీ రామ కల్యాణం చేస్తే హనుమంతుడితో కలిపి రాముల వారి సెట్, కుంది, ఇత్తడి పళ్ళెం, హారతి వెలిగించేది మొత్తం ఇరవయ్ నాలుగు ఇత్తడి వస్తువులు ఇస్తాము, కేవలం రెండు వందల యాభయ్ డాలర్లు ఇస్తే చాలు అన్నారు. గుండె గుభేలు మంది. ఇప్పటికే నా దగ్గర ఇరవయ్ నాలుగు విగ్రహాలు, అవి కాక కుందులు వగైరాలు వున్నాయి. నెలకోసారైనా అవనీ తోమాలి కదా. దేము డంటే, విష్ణుమూర్తో, లక్ష్మీ దేవో కాకుండా, చింతపండూ, నిమ్మకాయ, అంట్లు తోముకునే బిజ్ గుర్తుకు వస్తే ఎలా? ఒక్కొక్కసారి నేను నిజంగానే నాస్తికురాల్నా అని అనుమానం వస్తుందినాకింకా నయం, మా అన్నయ్య మా వదినకి, మా అమ్మకీ నెలకో పట్టు చీర కొంటాడుట, తన కోసం ఒక అడుగు పొడుగు దేముని విగ్రహం కొనుక్కుంటాడుట. మా వదిన గోల ఏమని చెప్పను. ఇప్పటికి రెండు వందల యాభయ్ విగ్రహాలు పోగేసాడుట.   “ఇన్ని విగ్రహాలు ఎందుకు” అంటే, “ఇన్ని చీరలు ఎందుకు అని ఎప్పుడైనా అన్నావా”  అని నిల దీస్తాడుట. అప్పటికీనాకు చీరలు వద్దు మొర్రో” అన్నా వినడుట. “నీకు చీరలు అక్కరలేకపోతే మానేయ్, నేను మాత్రం విగ్రహాలు కొనుక్కుంటాను” అంటాడుట. వాడికి విగ్రహాల పిచ్చి ఎమిటో అర్ధం కాదు నాకు. వాడింట్లో దేముడు, తిరుపతి లో విగ్రహాల కొట్టులా వుంటుందంటే నమ్ముతావా?  రోజూ పువ్వులు అన్ని విగ్రహాలకీ అమర్చి రెండు మూడు గంటలు పూజ చెస్తాడులే.  


  తరవాత డెవలప్ మెంట్   ఏమిటంటే, మా అయన గుడులు చుట్టూ తిరగడం కొంచం ఎక్కువయింది . ఏదోలే, పాపం భక్తి గా తిరుగు తున్నాడు అనుకుందాము అంటే, మత ఆచార్యులు దగ్గర నుండి, మామూలు ట్రాష్ ఎత్తే మనిషి  దాకా,అందరి దగ్గరికి వెళ్లి, తానూ నాస్తికుడి నని, కేవలం ప్రసాదం కోసం మాత్రమే గుడికి వస్తున్నానని చెప్పుకు వస్తాడు .  నాకు సిగ్గుతో తల ఎత్తుకో లేక పోతూ వుంటాను . అవతలి వాళ్ళు నేను ఈయనకి తిండి పెట్టడం లేదని అనుకునే ప్రమాదం కూడా ఉందిగా మరి.   మాట గురువులు కూడా, “అవును  నాయనా! మేమైనా ఇవన్నీ చేస్తున్నది తిండి కోసమే కదా, మా కడుపు కొట్టకు”  అని ఈయనతో చెప్పినట్టు, నా తో అంటూ వుంటారు.  కొన్నాళ్ళు వినీ విననట్లు ఊరుకు న్నా, చివరకి విసుగెత్తి, నేను కూడా నాస్తికురాల్నిఅయిపోతా, ఇక పూజలూ, నైవేద్యాలు మానేస్తా అని డిక్లేర్ చేశా. ఆయన గాభరా పడి " వద్దు, నా కోసం నీ అభిప్రాయాలు మార్చుకోకు, నువ్వేమీ త్యాగాలు చెయ్య నవసరం లేదు, నువ్వు నువ్వు  గానే వుండు  ఎప్పటిలాగానే, చక్ర పొంగలి, పులిహారాలు నైవేద్యంపెట్టుకో, నేను నాస్తికుడి నే  గానీ, ప్రసాదం తిననని అనలేదు కదా" అంటూఆయనకి నా మీద వున్నా ప్రేమని వ్యక్తం చేసారు.  అలా అని గుడికి వెళ్ళడం మానేస్తారా  అంటే అదీ లేదు. నమ్మని దేముని గుడికి వెళ్ళడం ఎందుకు అంటే, దేముడు లేదని కన్ఫర్మ్ చేసుకుందుకే అంటారు . ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని అడిగితే, ముంది, దేముడికి భక్తీ గా దణ్ణం పెట్టుకుని, భక్తీ గా ప్రసాదం తిని, లాటరీ టికెట్ కొంటే వెంటనే లాటరీ రావలి. దేముడు అంటే మనకి రిమోట్ కంట్రోల్ లా అందుబాటులో వుండాలి. మన కోరికలు తీర్చక పొతే ఇక భగవంతుడు ఎందుకు? ఒక వేళ దేముడు అనేవాడు వున్నా, సరిగ్గా ప్రోగ్రాం రాయడం రాని వాడు రాసిన ప్రోగ్రాం లాగా, అవక తవక గా అందరినీ సృష్టించే సి ఇక ఏమి చెయ్యాలో తెలియని వాడిలా మాయం అయిపోతే ఎలా? అంటూ అవకతవక ఆరుగ్యుమెంట్ మొదలు పెదతారు. అయితే, ఈయన వాదనలు విన్న వాళ్ళు, నా వైపు జాలి చూపు పారేసినాకొక 'భారత శ్రీ ',  'అమెరికా రత్న'   వంటి బిరుదు ప్రదానం చేసి( ఈయనతో ఇన్నాళ్ళు వేగినందుకు ) వెళ్తూ వుంటారుమా ఆయన మేనకోడలు ఆయన్ని దొంగ నాస్తికుడు అంటూ వుంటుంది.

 ఒకసారి ఏమయిందో తెలుసామా ఆయన ఒక బిల్డింగ్  లోకి ఒక వ్యక్తి పెద్ద డబ్బా మోసుకు వెళ్తూ వుంటే అతనికి సాయం చేసేరుట . వ్యక్తి  ఒక  క్రిస్టియన్  ఫాదర్ అవడం తో ఆటను సంతోషించి మా ఆయనను బిడ్డా  నీకు ఏమైనా ప్రొబ్లెమ్స్ వుంటే చెప్పు నేను తీరుస్తాను అన్నాడుట, పాతాళ భైరవిలో గిరిజ, నరుడా ఏమి నీ కోరిక అని వెంట పెట్టినట్టు. వెంటనే, అవును స్వామీ, నాకు చాలా పెద్ద ప్రాబ్లం వుంది అన్నారుట ఈయన. వెంటనే, నా వెంట రా అని పక్కనే వున్న ఒక చర్చ్ గదిలోకి తీసుకుని వెళ్లి ముందు మతం తీసుకో, తరువాత నీ కష్టాలన్నీ తీరుస్తానని అన్నాడుట ఫాదర్. మా ఆయన,  ఫ్రీ యే కదా, అంతే కాదు క్రిస్టమస్ కి కేక్ లు తినొచ్చు, పైగా గిఫ్ట్ లు కూడా వస్తాయి,  అని కిక్కురు మనకుండా ఏమి చేస్తారో నని చూస్తూ నుంచున్నారుట. ఫాదర్ వెంటనే రెండు చేతులూ పట్టుకుని, ఫాదర్ అంటూ ఏవేవో నాలుగు కబుర్లు చెప్పేసి, మధ్యలో జాన్ అబ్రహం అన్నారుట. ఓహో జాన్ అబ్రహం సినిమా చూపిస్తారా అని అడిగితే , కాదు రోజు నుంచి నీ పేరు జాన్ అబ్రహాం అని చెప్పారుట . ఈయన, ఇదేదో బాగానే వుందే అనుకున్నారుట .   చర్చిగది లోకి మరో నలుగురు మెంబర్లు కూడా వచ్చారుట . అప్పుడు అడిగారుట  ఇంతకీ ఏమిటి నాయనా నీ కష్టాలు, మీ ఆవిడ నిన్ను వదిలేసిందా అని.   ఛా అదేమీ కాదన్నరుట. మరేమిటీ తాగుడికి బానిస అయ్యావా అన్నారుట , అదేమీ కాదన్నరుట.  డ్రగ్స్ అలవాటుందా? అని అడిగారుట. లేదు అని బిక్క మొహం వేసుకుని చూస్తూ వుంటే, ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి నాయనా అని అడిగారుట. నాకు నిజం చెప్పడం పెద్ద దురలవాటు, అది చాలా ప్రాబ్లం  వుంది అన్నారుట. ఆహా,  గాంధీ మహాత్ముడు తరవాత నీ  లాంటి వ్యక్తీ మళ్ళీ పుట్టాడన్నమాట, అని తెగ సంబరపడి  పోయి, ప్రతీ ఆదివారం మాచర్చి కి రావాలి. దేముడు నిన్ను కరుణిస్తాడు. అని పిలిచేరుట . మీరు నా ప్రాబ్లం సరిగ్గా అర్ధం చేసుకో లేదు. ఉదాహరణకి మీలో ఎవరైనా, ఏదైనా తప్పుడు పని చేసినా, చర్చి ఫండ్స్ ఫండ్స్ ఏమైనా అవకతవకలు చేసినా, నాకు తెలిస్తే అందరికీ  చెబుతాను. నన్ను ఎవరూ ఆపలేరు . అనగానే,వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, సరే నాయనా, మరేమీ పరవాలేదు మేము చర్చి కొత్త స్థలానికి మారుస్తున్నాము, కొత్త అడ్రస్ నీకు ఫోన్ చేసి చెబుతాము అని ఈయన్ని పంపేశారు .  అయితే ఆరోజు కార్తీక సోమవారం అవడం తో పొద్దున్న నుంచీ ఉపవాసం వున్న నేను పులిహార, చక్రపొంగలి చేసి మహా నైవేద్యం పెట్టి ఈయన కోసం ఎదురు చూ స్తే, తీరా ఇంటికి వచ్చింది సూర్యం కాదు, జాన్ అబ్రహం కదా మరి. క్రిస్టియన్ వాడికి నేను హిందూ నైవేద్యం పెట్టాను పొమ్మన్నాను. తరువాత, మా భోజనాలు చెయ్యడానికి ఒక గంట  పట్టిందనుకోండి. ఎంతైనా భారత స్త్రీ ని కదా... ఆకలితో నక నక లాడుతున్న పతికి పెట్టకుండా తినలేను కదా. రోజుకీ చర్చి వాళ్ళు ఫోన్ చేస్తారేమో నని మా ఆయన చాలా ఎదురు చూస్తూ వున్నారు.  నాకైతే వాళ్ళు చెయ్యరని ఆరోజే అర్ధం అయింది.అదేమిటండీ   ముక్కోటి హిందూ దేవతలూ మీకు చాలలేదా? మళ్ళీ క్రిస్టియన్ మతం ఎందుకు మధ్యలో అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా?  మనం కోతిలో  హనుమంతుడిని చూస్తాము, చేపలో మీనావతారం, ఆఖరికి పందిలో కూడా వరాహావతారం విష్ణుమూర్తిని చూస్తామే, సాటి మనిషిలోన దేముణ్ణి ఎందుకు చూడలేక పోతున్నాము?  ఇన్ని కోట్లమంది పూజిస్తున్న జీసస్ మాత్రం దేముడు కాదని మనం ఎందుకు  అనాలి? అలానే అల్లా కూడా భగవంతుని మరో రూపం అయి ఉండొచ్చుగా. మతాలూ కాదు ముఖ్యం మనిషికి కావలిసింది మానవత్వం . గుర్తుందా, ఒకసారి మనం డౌన్ టౌన్ లో కారు  టైర్ ఫ్లాట్ అయితే, మనం అడగ కుండానే, ఒక పాకిస్తానీ కుటుంబం వచ్చి మన టైర్ మార్చారు. భగవంతుడు రూపం లో అక్కడికి వచ్చాడు. మన మతం కాదని మనం పోమ్మనగలమా? మతం ముఖ్యం కాదు, మనిషి కి శీలం ముఖ్యమ్. గుణ గణాలు ముఖ్యం.  నిజమే ననిపించింది . అందుకే ఆయనతో చర్చి కి వెళ్తాను . అలానే, ముంబాయి లో హాజి ఆలి కి కూడా వెళ్తాను. భగవంతుని అన్ని రూపాలలోనూ స్వీకరిస్తాను .దేముని పూజ చెయ్యాలా, లేక సమయం లో ఒక వ్యక్తికి సాయపడాలా అంటే మా అయన సాయం చెయ్యడమే పూజగా భావిస్తారు. చెప్పొద్దూ నాకూ  ఆయన మతమే కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన మతం ఏమిటా? పులిహార పెడితే హిందూ, కేక్ పెడితే క్రిస్టియన్, బిరియాని పెడితే తురక మతం.

అదే మన అప్ప దాసు మతమే ... ఆవకాయ మన అందరిదీ, గోంగూర పచ్చడీ మనదేలే…
  
గీతాఇప్పుడైనాఅర్ధం అయిందా నువ్వు ఎంత సుఖపడు తున్నావో?
ఉంటా మరి. మళ్ళీ వీలైనప్పుడు కలుద్దాం

ప్రేమతో
నీ స్నేహితురాలు