Friday, June 23, 2017

ఆక్రోశవాణి

ఆక్రోశవాణి 

ఈ మధ్య ఆకాశవాణి లో వార్తలు చదివే వక్త రచయిత అయిన ప్రయాగ రామకృష్ణ గారి రాక ఎంతో ఆనందం కలిగించింది. మాటే మంత్రము అనే విషయం మీద ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఆ మీటింగ్ కి పది నిముషాల ముందు ఆయన గొంతుక కార్ లో రేడియో లో వినడం మరి కాస్త  థ్రిల్ ని ఇచ్చింది , . నిజం చెప్పొద్దూ, పొద్దున్నే భక్తి రంజని ఒక్కటే వినేదాన్ని అందుకేనేమో ఈ మాత్రం భక్తి అనే బీజం నాలో నాటుకుందేమో! బాలాంతరపు రజని కాంత్ గారికి సహస్రకోటి ప్రణామములు.  వార్తలు ఒక్క ఎలక్షన్ టైం లోనే వినేదాన్ని. మిగతా రోజుల్లో ఎక్కువగా వినేది శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ మాత్రమే. ఆ విషయం ఆయనతో చెప్పలేదు.  బాగోదు కదా! ఆ అన్నట్టు క్రికెట్ కామెంటరీ వినేదాన్ని. 

ఇప్పుడు క్రికెట్ చూడడం కూడా లేదు. ఇంటరెస్ట్ లేక కాదు, బిపి పెరిగిపోతోందని. 

ఆకాశవాణి.. అందరికీ తెలిసినదే ఆకాశవాణి. అయితే ఆకాశవాణి అనగానే మనకు మనసులో మెదిలేది రేడియో.
అసలు నిజంగా ఆకాశవాణి అంటే ఎవరు? ఆడా ? మగా?
 నారాయణుడి సమాచారాలు అందజేయడానికి నారదుడు ఉందనే ఉన్నాడుగా, మళ్ళీ ఈ ఆకాశవాణి ని ఎందుకు వాడ వలసి వచ్చిందో. కంసుడు కి నారదుడు డైరెక్ట్ గా వఛ్చి చెప్పొచ్ఛుగా, మధ్యలో ఈ ఆకాశవాణి ఎందుకో? 
ఈ మధ్య మళ్ళీ టోరీ రేడియో అప్పుడప్పుడు వింటూ వున్నా. విని విని అదీ విస్తుగొస్తోంది; 

టీవీ వచ్చాకా రేడియో వినడం తగ్గిపోయింది. కళ్ళు గుడ్డి అయిపోయినా పొద్దున్న లేచింది మొదలు ఇంచుమించు అర్ధరాత్రి దాకా టీవీ ఆన్ చేసే ఉంటోంది. 
టీవీ సైజు కూడా రోజు రోజుకీ పెద్దది అయిపొయింది. పడకగది కి ఒక టీవీ. బట్టలు మార్చుకుందామంటే, టీవీ ముందు మార్చుకుందుకు ఆ వ్యక్తులు మన గదిలోనే ఉన్నారేమో అనే ఫీలింగ్ వలన కొంచం  ఆలోచించ వలసి వస్తోంది. 

ఇక అందులోని ప్రోగ్రామ్స్ చూద్దామా అంటే.. 

భక్తి ప్రోగ్రామ్స్ అనేసరికి, ప్రవచనాలు మొదలవుతాయి. చెప్పొద్దూ నాకు ప్రవచనాలు విని విని, చెవులు చిల్లులు పడ్డాయి. 
ఆవుపేడ తో అలికి, ముగ్గుపెట్టి, కలశం పెట్టి పూజ చెయ్యండి. అప్పుడు లక్ష్మి దేవి వరం ఇస్తుంది. అయితే, ఆవుపేడతో అలాకాకపోతే, అమ్మవారు వస్తుందని నమ్మకం లేదుట. 
ఇప్పుడు పూజ ముఖ్యమో, ఆవుపేడ ముఖ్యమో తెలియడం లేదు. 

రుక్మిణి దేవి కృష్ణుణ్ణి చూసి సిగ్గుపడిందిట. ఈ కాలం ఆడవాళ్ళకి సిగ్గే లేదు  అంటాడొక మహానుభావుడు. మగవాళ్ళూ ఒక్క నిముషం ఆలోచించండి. మీ భార్య ఆఫీస్ కి వెళ్లి, తన తోడి ఉద్యోగస్తులముందో, తన సూపర్ వైజర్ రో సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నట్టు. .. బాగోలేదు కదా. సిగ్గు పడడానికి కూడా సమయం సందర్భం ఉండాలేమో!

వాళ్ళు రామాయణ మహాభారతం లో చెప్పాలనుకున్నదేదో చెప్పి పోక, మధ్యలో సామాన్య జీవనం గడుపుతున్న మనమీద ఈ అనవసర కామెంట్స్ ఎందుకు చేస్తారో అర్ధం కాదు. కట్టు బొట్టు తీరు గురించి కూడా ఏవో వ్యాఖ్యానాలు చేస్తూనే వుంటారు. దేశ, కాలమాన పరిస్తుతుల వలన వేష భాషలు మార్చుకోవలసి వస్తుందని ఎందుకు అనుకోరో?
 

 సీరియల్స్ మాటకి వస్తే , ఇక వాళ్ళు ధరించే నగలు, వేసుకునే బట్టలు చూస్తే వికారం పుట్టుకు వస్తుంది. ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు తెలుగు సీరియల్స్ చూసే మహాభాగ్యం కలిగింది. చాలా మటుకు హిందీ సీరియల్స్ డబ్బింగులు, మిగిలినవి మూడు డైలాగులు ఆరు ఎక్స్ప్రెషన్స్, అరవై  అడ్వైర్ టైజ్ మెంట్స్

ఈ హిందీ సీరియల్ లో ఒకే జంట సీరియల్ అయ్యేలోగా ఓ నాలుగు అయిదు సార్లు పెళ్ళి చేసుకుంటారు, ఎంత బుర్ర పగలకొట్టుకున్నా ఎందుకో అర్ధం అవడం లేదు. పెళ్లి అయ్యాకా అపార్ధాలతో ఆరునెలలు కాపురం చేసి,  హీరో ని చంపేసి, పది రోజులు తిరగ కుండానే  హీరోయిన్  ని మరొకడికి ఇఛ్చిపెళ్ళి చేసేస్తూ వుంటారు. కొండొకచో, ఆ మొదటి మొగుడు బతికి తిరిగి వచ్ఛేస్తూ ఉంటాడు. ఒక పెళ్లి కొడుకు దొరకడం కష్టమైనా ఈ రోజుల్లో అందరేసి రెండో మొగుళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరికేస్తారో తెలియదు. 


Zee TV లో ఈ మధ్య కొత్త సీరియల్ వస్తోంది పరమ అవతార్ శ్రీ కృష్ణ అని. 
ఈ మధ్య  క్రియేటివిటీ ఎక్కువైపోయింది కదా! ఇంగ్లీష్ సినిమా'మమ్మీ' లో ధూళి లోంచి భూతం వచ్చినట్టు, ఈ సీరియల్ లో కంసుడు రధం నడుపుతూ ఉంటే మబ్బుల్లోంచి ఆకాశవాణి మాట్లాడింది. మామూలు గా ఆకాశవాణి అంటే ఒక దేవతలా అనిపిస్తుంది, అలాంటిది, వీళ్ళ అనిమేషన్ మండ, కంసుడి కన్నా ఆకాశవాణే భయంకరం గా వుంది. 
ఎంతమంది టీవీ చూస్తున్నారో తెలియదు గానీ , కొన్ని తమాషాలు కనిపిస్తూ ఉంటాయి. నేను అన్నీ హిందీ ఛానెల్స్ చూస్తూ ఉంటా. ఒకదాని నుంచి మరొకటి మారుస్తూ ఉంటా. ఒక సీరియల్ లో ఒక హీరో కి బుర్రకి కట్టు ఉంటే, మరో ఛానల్ లో కూడా మరొకడికి కట్టువుంటుంది. ఇక్కడ వీడికి ఆక్సిడెంట్ అయితే, మరో ఛానల్ లో వాడికీ ఆక్సిడెంట్ అయిపోతుంది. వీడు గతం మర్చిపోతే, రెండో ఛానల్ లో వాడు కూడా గతం  మర్చిపోతూ ఉంటాడు. ఒకడే రచయిత రెండు సీరియల్స్  రాస్తున్నాడేమో అని అనుమానం వస్తుంది  మరో కొంతసేపు చూస్తే, నన్ను నేనే మరిచిపోతానేమో !

ఇంతకీ నేనేమి చెప్తున్నా?

గుర్తుకు వచ్చాకా మళ్ళీ కలుద్దాం. Sunday, May 10, 2015

“పెళ్ళంటే…..”


"రేపొద్దున్న మనం ఓ పెళ్ళికి వెళ్ళాలి" అన్న శ్రీధర్ని ఆశ్చర్యంగా చూసి, "పుష్యమాసం లో పెళ్ళి చేసుకుంటున్న ఆ ఘనులు ఎవరు" అంది జానకి.

“ఏదో జాతకం ప్రకారం వెంటనే పెళ్ళి జరగాలని ఇండియా నుంచి పెళ్ళి కొడుకు తల్లి ఫోన్ చేసిందిట” బదులిచ్చాడు శ్రీధర్.
"రిజిస్టర్ పెళ్ళిట. డౌన్ టౌన్ లో కోర్ట్ లో పెళ్లి. మనం సాక్షి సంతకాల కనుకుంటా” ." వాళ్ళెవరో నాకు తెలియదు, నేను సాక్షి సంతకం పెట్టడం ఏమిటి నాన్ సెన్స్" అంది జానకి
అనగానే శ్రీధర్  "ఎవర్నీ పిలవడం లేదు. మనమే వెళ్ళాలి. అసలు అమెరికాలో మనకి మాత్రం ఎవరున్నారు? గంట వెళ్లి వచ్చేస్తే సరి  పోతుంది బెట్టు చెయ్యకుఅన్నాడు.

 "ఇంతకీ ఎవరు వాళ్ళు, నీకెక్కడ దొరికేరు" ? అడిగింది విసుగ్గా
"క్రిందటి ఆదివారం ఒక రాంగ్ నెంబర్ వాడితో రెండు గంటలు  మాట్లాడాను అని కోప్పడ్డావు కదా, వాడే వీడు, పాపం చిన్నప్పుడే ప్రేమించు కున్నారుట. ఏవో కుటుంబం గొడవల వాళ్ళ వయసులో పెళ్లి చేసుకో లేక పోయారుఇప్పుడు అనుకోకుండా ఇక్కడ అమెరికా లో కలిసారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు". 

"అంటే వాళ్ళిద్దరికి  ఎంత వయసు ఉంటుం దేమిటి ?"  వింతగా చూస్తూ అడిగింది
"నలభై నలభై అయిదు ఉంటాయేమో
"ఇన్నాళ్ళూ  ఇద్దరు పెళ్లి కాకుండా వుండిపోయారా"  ఆశ్చర్యం గానూ, కుతూహలం గానూ  అడిగింది
"అమ్మాయికి పెళ్లి అయింది, కాని భర్త పోయాడనుకుంటా  ." 
ఒక్కసారి మనసంతా అదోలా అయిపొయింది జానకికి. పోనీలే పాపం, విధం గా కలిసి వస్తోంది ఇద్దరికీ అనుకుంది. పెళ్ళికి వెళ్ళడానికి వప్పుకుంది

జానకి కొంచం అలోచించింది. “కోర్టు పెళ్లి కదా, అందులోనూ అమెరికా లో, చూడీదార్  వేసుకురానా? మరీ ప్యాంటు షర్టు వేసుకుంటే బాగోదేమో ? సూట్ వేసుకుంటే మరీ ఆఫీసు కి వెళ్లి నట్టు ఉంటుందేమో” తనలో తాను ఆలోచించు కుంటూ పైకే అడిగింది
"నీకేమైనా మతి పోయిందా. నిక్షేపం గా పట్టు చీర కట్టుకో " చిన్న చిరాకు ప్రదర్శిస్తూ
"పట్టుచీరా ?" కొంచం చిరాగ్గా మొహం పెట్టుకుంటూ " పెళ్లి నాకు కాదు " అంది. 
"కాక పోవచ్చు, అయినా అన్ని చీరలున్నాయి, కట్టుకుందుకు అవకాశమే వుండదు అంటావుగా, చీర కట్టుకో” అన్నాడు పెంకిగా
అయినా వూళ్ళోపెళ్ళి అయితే కుక్కలకి హడావిడి అన్నట్టు అనబోయి, అలా అంటే తనకి తానే కుక్కతో పోల్చుకున్నట్టు వుంటుందని మానేసింది.
పట్టు చీర కట్టుకోవడం, అందులోను చలిలో, ఆపైన పెద్ద జాకెట్ వేసుకోవాలి, మెడ చుట్టూ స్కార్ఫ్ చుట్టుకోవాలి, లేకపోతే రెండు నెలలు గొంతుపట్టేస్తుంది. గంట పెళ్ళికి ఇంట ఆర్భాటం ఎందుకో, పైగా ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్ళికి. పైగా చీర కట్టుకోవాలి అంటే, అది ఒక సారి ప్రెస్ చెయ్యాలి. మాచింగ్ జాకెట్ వెతికే సరికే గంట పడుతుంది. పట్టు చీర చాలా అరుదుగా కట్టుకుంటా మేమో, జాకెట్లు ఇరుకై పోవచ్చు. ఒక్కొక్కసారి కుట్లు విప్పుకోవలసిన పరిస్తుతి కుడా ఉండొచ్చు. ఏదో సాకు చెప్పి ఎగ్గొట్ట డానికి ఆలోచించ సాగింది. పెళ్ళికి వెళ్లడమైనా మానేయాలి, లేదా కనీసం చీర కట్టడం అయినా మానేయాలి. అంటే, శ్రీవారికి ప్రేమ లేఖ సినిమాలో చెప్పినట్టు , అసలు ఏమీ కట్టుకోకుండా అనికాదు, చీర మాత్రం కట్టుకోకుండా చూడీ దార్ వేసుకోవాలని అనుకుంది
పెళ్లి అనగానే, తనకి తెలియ కుండానే కూని రాగం తియ్యడం మొదలు పెట్టింది.
“పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు….. .. ఆఆఆ  అబ్బ ఎంత అద్భుతం గా రాశాడు  మహాను భావుడు  అనుకుంది 
మధ్యాహ్నం భోజనాలు చేశాకా శ్రీధర్ పడుకున్నాడు. ఆదివారం, సోఫాలో కుర్చుని పాత ఆల్బం తీసి చూడడం మొదలు పెట్టింది. అందులో అన్నయ్య పెళ్లి, అక్కయ్య పెళ్లి, తన కజిన్స్ ఫోటోలు, చూస్తూ కొన్ని పెళ్లి ఫోటోలు చూస్తూ వుంటే బోలెడు పాత జ్ఞాపకాలు మనసులో మెదిలాయి

 ఎన్నో పెళ్ళిళ్ళకి  వెళ్ళింది ఇండియా లో వున్నప్పుడు. అమెరికా వచ్చాకా కుడా కొన్ని పెళ్ళిళ్ళకి  వెళ్ళింది. గుళ్ళల్లో కళ్యాణ మండపం లోను నాలుగు పెళ్ళిళ్ళ కి వెళ్తే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పెళ్లి కుడా వెళ్ళింది. ఫైవ్ స్టార్ హోటల్ లో పెళ్ళిలో అగ్నిహోత్రం పెట్ట కూడదు కనుక, వాళ్ళు ఒక మండుతున్నట్టు కనిపించే ఒక నాలుగు ప్లాస్టిక్ కాగితాలు గాలికి ఎగురుతూ వుంటే, ఒక బల్బ్ లైట్ పడి మంటలా భ్రమ కలిగించే ఏర్పాటు చేసారు. దాని చుట్టూ తిరిగి దంపతులు సప్తపది చేసారు. అది తలచు కుని జానకి నవ్వుకుంది. ఇంతకీ అగ్ని సాక్షి గా పెళ్లి జరిగినట్టా కాదా ? ఒక వేళ అగ్నిసాక్షి గా పెళ్ళి అయినా, అవసరమైతే అగ్ని వచ్చి సాక్ష్యం చెప్పడుగా.  

ఇక టి వి ఆన్ చేస్తే ఏదో ఒక ఛానల్ లో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతూనే వుంటుంది.  పైగా, రోజుకీ బలవంతపు పెళ్ళిళ్ళు, హీరోయిన్ కి ఇష్టం లేని పెళ్ళిళ్ళు, తల్లి తండ్రులని ఎదిరించి చేసుకునే పెళ్ళిళ్ళు, రక రకాల పెళ్ళిళ్ళు
 పెళ్లి అంటే ముందుగా గుర్తు వచ్చేది తన పుట్టింటి వారి స్వంత వూరిలో హడావిడి. పెళ్లి నిశ్చయించ గానే ముహూర్తం పెట్టిన వెంటనే ముందుగా  పసుపు నాలుగు మూలలా రాసిన  కార్డు ఉత్తరాలు వెళ్ళేవి. కాస్త దగ్గర బంధువులు నెల రోజులు ముందుగా వచ్చేసి, పెళ్లి అయిన తరువాత నెలకి తిరిగి వెళ్ళేవారు. ఇలా ముందు వచ్చిన బంధువులతో కలిసి చుట్టు పక్కల వున్నవాళ్ళు కుడా కలిసి అన్ని పనులన్నీ చేసేవారు. ఊరంతా ఒక కుటుంబం లా వుండేది. వసుధైక కుటుంబ కం అంటే ఇలానే ఉంటుందా అన్నట్టు వుండేదిరాట ముహూర్తం   అవగానే బోలెడు తాటాకులు ఎడ్ల బండి మీద తెచ్చి పందిరి వేసే వారు. మామిడి తోరణాలు, పచ్చి తాటాకు వాసనలు తమాషా గా వుండేది. పందిరి వేసిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవారు . పసుపు, కారం, అరిసెలు, చక్కిలాలు లాంటి వాటికి  చెయ్యడానికి బియ్యం దంపించడం, అప్పడాల పిండి విసరడం, అప్పడాలు వత్తడం, బూడిద  గుమ్మడి కాయలతోను, పేలాలతోను, పిండితోనూ, సగ్గుబియ్యం తోనూ వడియాలు పెట్టడం ,    తాటాకు పందిళ్ళు, మామిడి ఆకుల తోరణాలు, రంగు కాగితాలు రక రకాల ఆకారలో కత్తిరించి తామే స్వయం గా కళ్యాణ మండపం అలంకరించే వారు. ప్రతీ పూట దిగుతున్న బంధువులని "రండి రండి, అన్నయ్య గారు రాలేదేం, సెలవు దొరక లేదా,  " అని ఆప్యాయం గా పలక రింపులు, "మా రెండో దాని పెళ్లి కి అలా చేస్తే ఊరుకోం, మీ అబ్బాయి పెళ్ళికి మేము రావాలా వద్దా" అంటూ దబాయింపులు, ఆప్యాయం గా వీపు మీద చెయ్యి వేసి లోపలి తీసుకుని వెళ్ళడాలు. కాలం లో వీపు మీద చెయ్యి వేస్తే వెంటనేదోస్తానా’ అనెయ్యడమే వెనక ముందు ఆలోచించకుండా

అలా అలా కాలం మారి కళ్యాణ మండపం పెళ్ళిళ్ళు వచ్చేశాయి. కాంట్రాక్టు వాళ్ళు వెలిశారు
పెళ్ళంటే పందిళ్ళు లేవు. షామియానా లు వెలిసాయి. నెలరోజులు ముందు నుంచి ఎవరు రాకుండా ఫోన్ కాల్ చేసి, ముహూర్తం నిశ్చయం అవగానే చెబుతామని పెళ్ళికి వారం ముందు పెళ్లి కార్డు పంపితే వూళ్ళో వున్న వాళ్ళు,  వచ్చేవాళ్ళు వస్తారు, దూరం నుంచి వచ్చే వాళ్ళు రైల్ రిజర్వేషన్ దొరికితే వచ్చే యోగం వుంటే వస్తారు. డైరెక్ట్ గా కళ్యాణ మండపం కి వచ్చి పెళ్లి చూసేసి, తిరుగు ప్రయాణం చేసే రోజులు వచ్చాయి
పెళ్లి అనగానే ముందు గుర్తొచ్చేది భోజనాలు. "పప్పన్నం ఎప్పుడు పెడతావే పిల్లా " అంటే, "ఎప్పుడైనా వచ్చేయండి, మా అమ్మ రోజూ పప్పు చేస్తుంది" అనడం కాదని అప్పట్లో అందరి ఆడ పిల్లలకీ తెలుసు. పప్పన్నం పెట్టడమంటే పెళ్లి అనే కదా.  పప్పు, వంకాయ, బంగాళా దుంపల ముద్ద కూర, గుమ్మడి కాయ, ములక్కాడలు,  చిలగడ దుంపలు, ఆనపకాయ ముక్కలతో దప్పళం , నెలరోజులు ముందుగా వచ్చిన బంధువులు చేసిన అప్పడాలు వడియాలు, కందిపొడి, దోస ఆవకాయ , పులిహార, బూరెలు అందులో కన్నం పెట్టుకునే తప్పుడు పోసే, వేసే కాదు, కమ్మని నెయ్యి, పొయ్యి మీద కుండలో ఎర్రగా కాచిన పాలతో తోడూ పెట్టిన పెరుగు, ఇవీ పెళ్లి భోజనం అంటే గుర్తు వచ్చే వంటలు. ఇక లడ్డూలు, మడత కాజాలుఅరిసెలు మామూలే అనుకోండి. పందిళ్ళ కాలం నుంచి కళ్యాణ మండపం  పెళ్లిళ్ళు  వచ్చేసరికి బిరియాని లు, గులాబ్ జాములు, డబల్ మీటా, ఐస్ క్రీమ్ లు మొదలయ్యాయి. ఆంధ్ర రాష్ట్రం లో అన్ని రకాల వంటలు, అన్ని టిఫిన్లు చేసేసి, ఏమి తిన్నావో తెలియ కూడా గుర్తులేనన్ని ఐటమ్స్ తో భోజనాలు పెట్టేస్తున్నారుఇప్పుడిప్పుడే ఫోన్ కాల్ తోనో, ఇంటర్నెట్ ఈమెయిలు పిలుపులు మొదలు అయ్యాయి మెల్ల గా  కోర్టు పెళ్ళిళ్ళకి పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు  పెడతారనుకుంటా.
తన చిన్నప్పుడు అమ్మమ్మ రుక్మిణి కళ్యాణం చదువుకో తల్లీ మంచి మొగుడు వస్తాడు అనేదిఅయితే నిజం గానే చదివింది జానకి. తీరా చదివాకా ఇది చదవమని పెద్దలు ఎందుకు చెప్తారా అని ఆలోచిస్తే, నచ్చినవాడు దొరికినప్పుడు ఇంట్లోవాళ్ళని కాదని ఎదిరించైనా పారిపొమ్మనా ? అని సందేహం రావడం కూడా జరిగిందిమనసులో సన్నగా నవ్వు కుంది

ఒక సారి క్లోసేట్ లోకి వెళ్లి, అందులో మంచివి, ఉన్నవాటిల్లో డాబుగా కనిపిస్తున్న గులాబీ రంగుది, పాలపిట్ట రంగుది, ఆరంజ్ రంగుది బయటకి తీసి అడ్డం ముందు నుంచుని ఒక్కొక్క డ్రెస్ హేన్గేర్ తోటే పెట్టుకుని చూసి, పాలపిట్ట రంగుది  వేసుకుందుకు నిశ్చయించు కుంది
సాయంకాలం అయింది. కుకీస్ తింటూ  టీ తాగుతూ వుంటే, ఫోన్ రింగ్ అయింది. శ్రీధర్ చిన్నప్పటి స్నేహితురాలు లలిత న్యూ జెర్సీ నుంచి  ఫోన్ చేసింది. పాపం, ప్రతీ వారం గంటయినా మాట్లాడ కుండా వుండదు. జానకి కి కుడా బాగా తెలియడం వలన బాగానే కబుర్లు చెప్పు కుంటూ వుంటారు. వంటలు వార్పులు, ఆరోగ్యాలు, మందులు మాకులు, ఆరోగ్య సూత్రాలు చర్చించుకుంటూ వుంటారు
లలిత తో చెప్పాడు శ్రీధర్ రేపు తాము వెళ్ళ  బోతున్న పెళ్లి గురించి. అక్కడితో ఆగ కుండా
"లలితా, నువ్వే చెప్పు పెళ్ళికి పట్టు చీర కట్టుకోమంటే కాదు పొమ్మంటోంది జానకి " అంటూ ఫోన్ జానకి చేతిలో పెట్టాడు
" అదేంటి జానకి, లేకపోతే ఎలాగా కట్టుకోము, బోలెడు వున్నాయి గా, అయినా మీ  ఆయన  నిన్ను పట్టు చీరలో చూడాలని కోరిక గా ఉందేమో " అంటూ వేళాకోళం ఆడింది
"అలా కాదు లలితా అదేదో కోర్టు పెళ్ళిట, తీరా నేను పట్టు చీర కట్టుకుని వెళ్లి, పెళ్లి కూతురు జీన్స్ ప్యాంటు వేసుకొస్తే నేను సిగ్గుపడి చావాలి" అంది జానకి
"మరేం పర్వాలేదు, నీ ఆనందం కోసం మీ ఆయన కోసం కట్టుకో" అని ఆర్డర్ వేసింది పకపకా నవ్వుతూ. పైగా పెళ్లి  ఫోటోలు చక్కగా వస్తాయి అంది
సాధారణం గా ఇలాంటివి పట్టించుకోడు శ్రీధర్. సారి ఎందుకో   పట్టు పట్టేడు సరే తప్పే దేముంది అనుకుంది. ఉన్నవాటిల్లో సింపుల్ గా ఉన్న చీర ఎంచుకుంది మర్నాటికి

మర్నాడు పెళ్లి మీద పెద్దగా ఇంటరెస్ట్  లేకపోవడం వలన టి వి ఆన్ చేసి చానల్స్ మార్చి మార్చి చూస్తోంది జానకి. ఒక ఛానల్ లో మాధవన్ మొహం కనిపించింది. వెంటనే ఛానల్ కి ఫిక్స్ అయి చూడడం మొదలు పెట్టింది . "తను వెడ్స్ మను" సినిమా. కోర్టు పెళ్లి సీన్ వచ్చింది.  సంతకాలు పెట్టడానికి పెన్ను కావాలన్నాడు రిజిస్ట్రార్. ఎవరి దగ్గరా పెన్ను లేదన్నారు. కంగనా, మాధవన్ వైపు అనుమానం గా చూసింది. పెన్ను వున్నా లేదని అబద్దం చెబుతున్నాడని. మాధవన్ దగ్గర పెన్ను నిజం గానే వుంది, కానీ అబద్దం చెబుతున్నాడు, ఎందుకంటే, తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి మరొ కరితో, అందులోను, ఒక రౌడి వెధవతో అవుతూ వుంటే,   హీరో మాత్రం పెన్ను ఇవ్వగలడు? పెన్ను లేక పెళ్లి ఆగి పోయింది. తరవాత అవకాసం చూసుకుని కంగనాని  మాధవన్ పెళ్ళాడే శాడు. సినిమా అయిపోయింది
ఎందుకైనా మంచిదని, రాస్తున్న పెన్నులు రెండు  చెక్ చేసి తన బాగ్ లో పడేసుకుంది. తీర రేపు పొద్దున్న పెళ్ళిలో అవసరం పడుతుందేమో ననిసాక్షి  సంతకాలు పెట్టాలి కదా మరి.
ఇలాంటి పెళ్లి ఎప్పుడు వెళ్ళలేదు. అమెరికా లో రెండు మూడు పెళ్ళిళ్ళకి వెళ్ళింది , వాళ్ళంతా చాలా  బాగా చేసారు. ఇండియా పెళ్లిళ్లకు తీసిపోకుండా, పూతరేకులు కూడా వడ్డించి చక్కని భోజనం పెట్టి రిటర్న్ గిఫ్ట్ లు కూడా ఇచ్చారు. పెద్దరికంగా పిలిచారు, మనస్పూర్తిగా వెళ్లి వచ్చేస్తే పోయింది అనుకుంది.  అసలు కోర్టు పెళ్లి నిజంగా  చూడడం మొదటి సారి. కొంచం కుతూహలంగానే వుంది జనకకి కూడా
శ్రీధర్ హడావిడి అంతా ఇంతా కాదు. స్వంత పెళ్ళికి కుడా ఇంత  హడావిడి పడిన గుర్తు లేదు. నాలుగు సూట్స్ తీసి ఒకటి తరవాత ఒకటి ట్రై చేసి, లోపలి షర్ట్స్ ఒక అరా డజన్, నాలుగు టై లు, మార్చి మార్చి చూసుకుని, అందులో తనకి నచ్చినవి ఎంచుకుని, షూస్  స్వయం గా పోలిష్ చేసుకుని, బాత్ రూం లో రెండు గంటలు వుంది మీసం ట్రిమ్  చేసుకుని, తల రక రకాలు గా దువ్వి, మొత్తానికి ఎలాగయితేనేం తయారయ్యాడు. ముందు రోజు నే వెళ్లి కార్ వాష్ చేయించుకుని వచ్చాడు." పెళ్లి వాళ్ళకి మనది కాదు అని వ్యగ్యం గా" జానకి.  అయితే మాత్రం ఏబ్రాసి వాళ్ళలా వుండాలేమిటి? " అని తిరిగి సమాధానం ఇచ్చాడు
                                   
మర్నాడు ఎలా అయితేనే పూజ పునస్కారం పూర్తీ చేసుకుని పట్టు చీర కట్టుకుని, మెడలో ఎప్పుడూ వుండే మంగళ సూత్రాల గొలుసు కాకుండా, నల్లపూసల గొలుసు వేసుకుంది. రెండు చేతులకి నాలుగేసి జతల బంగారు గాజులు వేసుకుందివీలయినంత సింపుల్ గాతయారయింది, అయినా కొట్టొచ్చినట్టు  కనిపిస్తున్నట్టు అనిపించింది.  అయినా అమెరికా లో కోర్టు లో వేలెత్తి చూపించినట్టు వుంటుందని తనకి తెలుసు.   గుడో , గోపురమో అయితే , తనలా చీర కట్టుకునే వాళ్ళు చాల మంది వుంటారు, కనుక ఫరవాలేదు. కానీ తప్పదు. ఇద్దరు కార్ స్టార్ట్ చేసి బయలు దేరారు. పావు గంటలో కోర్టు చేరుకున్నారు . హాయ్ అంటూ ఎదురొచ్చారు ఒకజంట. కొంచం వయసు  వున్నవాళ్లైనా, చూడ ముచ్చట గా వున్నారు. అబ్బాయి టి షర్టు, జీన్స్ ప్యాంటు వేసుకుని వున్నాడు, అమ్మాయి, వెలిసి పోయినట్టు వున్నా తెలుపు గులాబీ రంగు మధ్యన వున్న కళ్ళీ లాల్చీ, చూడీదార్ వేసుకుంది. జుట్టు నెత్తి మీదకి  లాగి కింద నుంచి మీదకి ఒక క్లిప్ పెట్టింది. సగంజుట్టు ఏమీ చెయ్యకుండా వదిలేసింది. నిద్ర లోంచి లేచి వచ్చి నట్టు అనిపించింది, పెళ్లి కూతురు. మూతికి మాత్రం ఎర్రగా లిప్ స్టిక్ వేసేసుకుంది. బెంగాలీ అమ్మాయి కాబోలు అనుకుంది మనసులో జానకి ఎవరైనా చుస్తే, పెళ్లి వాళ్ళకా, తమకేనా అన్నట్టు అనిపించింది జానకికి. శ్రీధర్ ని ఒక మొత్తు మొత్తాలని పించింది.

కార్ పార్కింగ్ దొరకడం కష్టం అయింది. డౌన్ టౌన్ కదా. అదృష్టం కొద్దీ త్వరగానే దొరికింది. కోర్టు లోకి వెళ్ళగానే అక్కడ సెక్యూరిటీ లోంచి వెళ్ళాలి . మొత్తం మంగళ సూత్రాల దగ్గరినించి తీసి బౌల్ లో వెయ్య వలసి వచ్చింది. జానకి కి అయితే వళ్ళు మండింది. "పెళ్లి వాళ్ళది అయితే పనిష్మెంట్ నాకా" అనుకుంది. లోపలి వెళ్ళారు.  ఒక  హాలు లోకి వెళ్తూ వుంటే ఒకావిడ అడ్డుపడింది. " డు యు హావ్ అప్పాయింట్మెంట్ " అంటూ.  " ఎస్, ఫర్ మ్యారేజ్" అని చెప్పాడు పెళ్ళికొడుకు. " అలానా, మీలో  జంటకి పెళ్లి" అని అడిగింది ఇంగ్లీష్ లో రెండు  జంట లనీ పరిశీలించి చూస్తూ . సిగ్గుతో చచ్చిపోయినట్టయింది జానకి కి. కొరకొరా  భర్త వైపు చూసింది. ఇంటికి పదండి మీ పని చెబుతా అనుకుంది మనసులో.   శ్రీధర్ మొహం పక్కకి తిప్పుకుని చిన్నగా నవ్వుకున్నాడుజానకి ని ఏడిపించడం అంటే మరి శ్రీధర్ కి చాలా సరదానిజం చెప్పాలంటే తనకి కూడా కొంచం ఇబ్బంది కరంగానే వుంది. అయినా బింకంగా మొహం పెట్టుకుని వున్నాడు, కెమెరా సద్దుకుంటూ ఫోటోలు తియ్యడానికి బిజీ గా వున్నట్టు ఫోజు కొట్టుకుంటూ

ఒక తెల్లవాడు జడ్జ్ వచ్చాడుహెల్లోఅనుకుంటూ. సూట్ వేసుకుని చాలా బాగున్నాడు. ఇంగ్లీష్ సినిమాలో జేమ్స్ బాండ్ లా వున్నాడు. చేతిలో ఒక కాగితం పట్టుకుని వచ్చేడు, జానకి ఎందుకైనా మంచిదని, పెన్నులు వున్నాయో లేదో అని బాగ్ లో చెయ్యి పెట్టి తడిమి చూసింది . పెట్టిన చోటే చేతికి తగలడం లో అమ్మయ్య అనుకుంది. కోర్ట్ రూం లోకి  తీసుకుని వెళ్ళాడు జడ్జ్. అతని వెనకే నలుగురమూ నడిచేము. చీకటి గా వుంది కోర్ట్ రూం. లైట్ వేస్తె బాగుండును అనుకుంది జానకి. శ్రీధర్ కెమెరా తో ఫోటో చేస్తాడు కనుక తన ఆండ్రాయిడ్ ఫోన్ లో వీడియో తీస్తే బాగుంటుందని అనుకున్ది. ఒక వైపు నుంచి శ్రీధర్ ఫోటోలు తీస్తూ వుంటే, తానూ ఫోన్ ఆన్ చేసి, కెమెరా బటన్ నొక్కి దానిలో వీడియో ఆన్ చేసుకుని రికార్డింగ్ ఆన్ చేసే సరికి సగం పెళ్లి అయిపోయినట్టుంది, పెళ్ళికూతురు " డు " అంది. " ప్రొనౌన్స్  యు బొత్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్" అని, చేతిలో వున్నా కాగితం వాళ్ళ చేతిలో పెట్టి, మూడో అంతస్తులో నూట నాలుగో రూం లో ఇది ఇవ్వండి మీకు సర్టిఫికేట్ ఇస్తారు , మీరింక వెళ్ళొచ్చు  అని చెప్పాడు. జానకి అయోమయం గా చూడసాగింది. సాక్షి సంతకాల సంగతి ఏమిటి అని మనసులో అనుమానం వచ్చింది. నాకెందుకులే అనికుంది. నూట నాలుగో రూం కి వెళ్ళడానికి లిఫ్ట్ లోకి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు మొదటి సరిగా మాట్లాడింది . '”మీకు తెలుసా , అసలు  ఇవాళ నాకు కోర్ట్ కి రావడానికి కుదరదు అనుకున్నా, ఒక వేళ కుదరక పొతే ఎలా అని అడిగాను. నువ్వు రాకపోయినా ఫరవాలేదు, ఒక అఫ్ఫెడివిట్ ఇచ్చేస్తే, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తామని చెప్పారు, నాకైతే నేను లేకుండానే నా పెళ్లి అంటే నమ్మలేకపోయా” అని ఇంగ్లీష్ లో అంది.
వింత గా చూసింది జానకి. శ్రీధర్ కుడా అదివిని షాక్ అయ్యాడు. "నిజంగా?" అని అడిగాడు
"నిజంగానే" అన్నాడు పెళ్ళికొడుకు
అదేమిటి అలా కుడా పెళ్లి అయిపోతుందా? అసలు లాస్ వేగాస్ లో పెళ్లి ళ్ళే వింతగా వుంటాయి. ఫ్రెండ్స్ సీరియల్ లో తాగేసి, రాస్, రేచెల్ పెళ్లి చేసేసు కుంటారు , అదే వింతగా వుంది అంటే ఇది మరీ విడ్డూరం గా వుంది అనుకున్నారు

 పూర్వ కాలం రాజులు కత్తులు పంపితే కంకణం కట్టి పెళ్ళి చేసుకునే వారుట. నేను ఇవాళ   చూసిన  పెళ్లి దానికేమీ తీసిపోదు అనుకుంది జానకి. దండలు మార్చుకోవడం లేదు, బాజా భజంత్రీలు లేవు,  మంగళ సూత్రం లేదు, ఉత్తరభారతదేశం వాళ్ళలా పాపిట్లో సింధూరం నింపడం లేదు, సాక్షి సంతకం లేదు కనీసం దండలు కూడా మార్చుకోకుండా అయిపోయింది పెళ్ళి. వుంగరాలు మాత్రం మార్చుకున్నారువాళ్ళిద్దరూ సుఖంగా వుండాలని మనసారా దీవించింది మనసులోనే

జానకికి బుర్రలో ఒక వెర్రి ప్రశ్న  వెలిసిందిఆడం ఈవ్ కి పెళ్లి చేసుకున్నారా? చిన్నగా నవ్వుకుంది.

అదంతా అయిపోయాకా, " యామ్ స్టార్వింగ్" అంది పెళ్ళికూతురు . అమ్మయ్య ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లి తినొచ్చు అనుకుంది జానకి. పెళ్లి భోజనం లా కాక పోయిన కనీసం నాలుగు రకాలు వుంటాయి బఫే తీసుకుంటే అనుకుంది. చైనీస్ కి వెళ్దామా, ఏదైనా అమెరికన్ రెస్టారెంట్ కి, లేక థాయ్ రెస్టారెంట్ కి వెళ్దామా,  అని అడిగారు.  ఒక్కసారి ఆకలి చచ్చిపోయింది జానకి కిశాఖాహారి అని  తన మీద బోలెడు జాలిపడి  పోయి డౌన్ టౌన్ లో వున్న ఒక ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తే అక్కడ నలుగురు తలో  దోసె తిని బయట పడ్డారు. ఏదోలే, సాండ్ విచ్ కన్నా నయం అనుకుంది.

ఇంటికి బయలు దేరుతూ వుంటే, కార్ స్టీరియో లోంచి వస్తోంది పాట " పెళ్ళంటే పందిళ్ళు ...."


*** టెక్సాస్ లా ప్రకారం వధు వరులలో ఒక్కళ్ళు వుంటే చాలుట. ఒకరు  అఫ్ఫెడవిట్  సంతకం  పెట్టే స్తే, రెండో వాళ్ళు కోర్ట్ కి వెళ్తే  పెళ్లి జరిగిపోతుందిట

                                    ***************************************