Friday, December 24, 2010

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి!

'అబ్భ! మా అమ్మ వంట తిన్నట్టుంది' ' అబ్భ! మా అమ్మ ఎంత బాగా వండుతుందో!!
ఇలాంటి మాటలు తరుచు చాలా మంది మగవాళ్ళు మంచి రుచి కరమైన భోజనం చేసినప్పుడల్లా అంటూ వుంటారు. అవును ఎవరి అమ్మ వంట వాళ్లకు నచ్చుతుంది. ఎందుకు నచ్చదూ? కని పెంచిన తల్లికి, పిల్లలు ఏది ఇష్టంగా తింటున్నారో, ఏది తినడం లేదో రోజూ చూసి, దానికి తగ్గట్టు ఆమె తన వంట పద్ధతుల్ని మార్చుకుంటుంది. తన ఇష్ట అయిష్టాలని పక్కకి పెట్టి, పిల్లలకి కావలిసినవి వండి పెడుతుంది.


అయితే మధ్య వయసు వచ్చేసరికి తల్లికో, తండ్రికో లేక ఇద్దరికీనో బి పి లేక డయాబెటిస్ లాంటి జబ్బులు వచ్చేసరికి, కొంచం ఉప్పు తగ్గించి, ఉప్పుతో బాటు కాస్త పులుపు, కారం కూడా తగ్గించడంతో, కొంచం రుచులు తగ్గుతాయి. దానితో, పిల్లలు మళ్ళీ, తల్లి వంట మీద కొంచం విసుక్కోవడం మొదలు పెడతారు. ఆడ పిల్లనయితే, "నోరు మూసుకుని తిను, పెళ్లి అయ్యాకా, మీ అత్తవారింటికి వెళ్లి కావలిసినట్టు చేసుకుని తిను" అనో, మగ పిల్లాడినయితే , "నేనూ చూస్తాను, రేపు నీ పెళ్ళాం వస్తే ఎంతబాగా చేసి పెడుతుందో " అని విసుర్లు వుంటూనే ఉంటాము. ఎప్పటికైనా అమ్మ వంట అమ్మవంటే. పెళ్లి అయ్యాకా, పుట్టింటికి వెళ్ళాకా, మళ్ళీ మనకోసం, ఆమె వండి వడ్డించితే, నాకు ఇలా కుదరదు ఎందుకో అని అనిపిస్తూ వుంటుంది ఆడ పిల్లలకి.


పెళ్లి కాక మునుపు, నేను ఎప్పుడూ వడ్డించినది తినడమే కానీ, బాగుంది బాగోలేదు అని చెప్పడం ఎప్పుడూ లేదు. అది ఎలా చేసారో అనే కుతూహలం కూడా వుండేది కాదు. నేను వంటింట్లోకి మాత్రం ఒక్క భోజనం చెయ్యడానికి మాత్రం వెళ్ళేదాన్ని. అప్పట్లో గ్రై౦డర్ మా ఇంట్లో లేదు. కనుక రుబ్బు రోలు రోజూ వాడ వలసి వచ్చేది. నేను కాలేజీ కి వెళ్ళక ఇంట్లో వుంటే, ఏదైనా రుబ్బురోలు పని వుంటే నాకు అంటగట్టేవారు. ఎలా కావలిస్తే అలా రుబ్బెయ్యడమే కానీ, దానితో ఎమిటి చెస్తారు అని కూడా అడిగేదాన్ని కాదు. ప్రెజర్ కుక్కర్స్ కొత్తగా వచ్చిన రోజులు. మా అమ్మగారు, కుక్కర్ పెడుతూ ఒకసారి పైకి అనుకున్నారు , 'ఆహా ఎవరు కనిపెట్టాడో కానీ ఈ కుక్కరు, మహానుభావుడికి, రోజూ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోవచ్చు' అని. అప్పుడే, నాకు పెసరట్ల కోసం నాన బెట్టిన ఒక కే జి పెసర పప్పు రుబ్బ డానికి ఇచ్చింది అమ్మ. అది విన్న నేను రుబ్బుతూ అన్నా " ఈ రుబ్బురోలు కనిబెట్టిన వాడు ఎవడో తెలిస్తే, ఈ పొత్రంతో వాడి బుర్ర బద్దలు కొట్టేదాన్ని అన్నా నవ్వుతూ. మా అమ్మ కూడా పక పకా నవ్వేసింది.

వంట అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. నా ఉద్దేశం లో అప్పట్లో అది పెద్ద విద్యా ఏమీ కాదు. అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు నేను వండవలసిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు, నేను ఏమీ కష్ట పడినట్టు అనిపించలేదు. చాలా ఈజీ గానే అనిపించింది. పైగా చాలా రుచిగా కూడా కుదిరింది. నా వంట తిన్న ఒకరిద్దరు మా కజిన్స్ అచ్చం మా అమ్మ వంటలాగానే వుండి, జీన్స్ లోంచి వంట వచ్చేస్తుందేమో అని కామెంట్ చేసినట్టు కూడా గుర్తు. అదే నా మనసులో వుండి పోయింది..కానీ, మా అమ్మకీ, అన్నయ్యకి, నన్ను పెళ్లి చేసుకున్నవాడు నాకు వంట రాదనీ వదిలేస్తాడేమో నని నని హడిలి చస్తూ వుండేవారు. నిజంగానే వదిలేస్తా డేమో, ఎందుకైనా మంచిది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, వుద్యోగం చేసుకుని బ్రతక వచ్చు అని , మరి కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకున్నా. నన్ను పెళ్లి చేసుకుంటానని మా ఆయన మా అమ్మని అడగడానికి వెళ్తే, మా అమ్మ, ముందుగానే, మా అమ్మాయికి వంట రాదు అని చెప్పేసింది. అసలు సంగతి, ఆయన మా అమ్మకి నచ్చలేదు లేండి. కానీ ఆయన, మీ అమ్మాయి కి వంట మనిషిని పెట్టేస్తా అన్నారు,పైగా తివాసీల మీద నడిపిస్తా మీ అమ్మాయిని అని చెప్పారు.. అయితే ,అమెరికాకి వచ్చాకా తెలిసింది, ఇక్కడ అపార్ట్ మెంట్ లో కూడా తివాసీలు ఉంటాయని. మా అమ్మ అది గుర్తుకు తెచ్చుకుని ఇప్పటికీ మురిసిపోతూ వుంటుంది.

పెళ్లి అయ్యాకా, అత్తవారింటిలో వంట పని రోజూ తగిలింది. చాలా ఇష్టంగానే వండేదాన్ని. నిజంగానే, బాగా కుదిరేది. మా అత్తగారు రోజూ ఏమి చెయ్యాలో, ఎవరెవరికి ఎలా చేస్తే ఇష్టమో చెప్పేవారు. అందుకని నాకు చాలా ఈజీ గానే వుండేది. అప్పటికీ కొన్ని కొన్ని మరపు రాని విషయాలు కొన్ని వున్నాయి. మా వాళ్ళంతా "గుత్తివంకాయ కూర చాలా బాగా చేసావు అని నన్ను పొగిడితే , వెంటనే మా అత్తగారు, "ఆ వంకాయలు నేనే ఎంచి ఎంచి కొన్నాను, అందుకే అంత బాగుంది అనే వారు".
"అయితే వుండండి, రోజూ కూరలు కొనేది మీరే కదా, ఈ సారి మళ్ళీ ఇలానే వుండుతాను" అని కొంటెగా జవాబిచ్చేదాన్ని. ' హమ్మో, ఏ ఉప్పో కారమో దండిగా వేసేయ్యకు " అని నవ్వేసేవారు. ఇలా వంట నేను ఎంతబాగా చేసినా, ఎంతో కొంత క్రెడిట్ మా అత్తగారికి వెళ్ళవలసిందే. అప్పటికీ , నేను పెట్టే సంబారు కి మాత్రం ఒక స్పెషల్ సర్టిఫికేట్ సంపాదించుకో గలిగాను. మా పుట్టింటి వాళ్ళు ఎక్కువ మా అత్తవారింటికి రాకపోవడం వలన, నేను కూడా ఎక్కువ పుట్టింటికి వెళ్ళడం తక్కువ అవడం వలన, వెళ్ళినప్పుడు, నాకు బోలెడు మర్యాదలు చేస్తూ, మా వదినలు వండి పెట్టడం వలన, ఇప్పటికీ నాకు వంట రాదేమో ననే అనుమానం మా పుట్టింటి వాళ్లకి మాత్రం లేకపోలేదు.

ఒక సారి మా స్నేహితుని ఇంటికి భోజనానికి వెళ్ళాము. వాడు భలేగా మాట్లాడుతాడు. అంతా కాసేపు కబుర్లు అయ్యాకా భోజనానికి కూర్చున్నాము. "ఆహా ఓహో ఎంత బాగా చేసేవే కూర, చాలా తమాషాగా లేదూ???, అబ్బ ఈ పులుసు ఏమిటో చాలా అద్భుతం గా చేసావు ", అంటూ ప్రతీ వంటకాన్నీ పొగుడు కుంటూ తిన్నాడు మా స్నేహితుడు. నిజమే, వాడి భార్య చేసిన దొండ కాయ కూర తమాషాగానే వుంది మరి, కొన్ని ముక్కలు మాడి పోతే, కొన్ని ముక్కలు ఉడికి , కొన్ని ఉడక్క, ఉప్పు కషాయం లా వుండి చాలా విచిత్రం గా వుంది. ఇక పులుసు కూడా అలానే చచ్చింది, అది చారో, పులోసో తేల్చుకో లేక పోయాము. చూడ డానికి పల్చగా నీళ్ళల్లా వుండి, అదులో రెండు వంకాయ ముక్కలు, రెండు ఆనపకాయ ముక్కలు రెండు బెండ కాయ ముక్కలూ వున్నాయి. అవి బాగా మెత్తగా వుడికేయి, బహుశా కుక్కర్ లో పెట్టినట్టు వుంది. మజ్జిగ అన్నం తో కొంచం తిని, వెంటనే బయటి కి పోయి, హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసి కడుపు నింపుకున్నాం. మా ఆయన నేను ఎంత బాగా వండినా ఒక్క రోజు కూడా బాగుందని చెప్పే వారు కాదు. భార్య వంటని పొగిడితే లక్ష్మి దేవి కి కోపం వస్తుందని మా అత్తగారు రోజూ చెబుతూ వుండే వారు. బహుశా అందుకే అయి వుంటుంది. నేను మాత్రం ఈ సారి ఊరుకో లేదు. మీ స్నేహితుణ్ణి చూసి కొంచం పొగడడం నేర్చుకో అని చెప్పా.. "అలా దొంగ పొగడ్తలు నీకు కావాలా" అని ఆయన అడిగితే, ఏమి చెప్పాలో తెలియలేదు.. "అంటే నేను అంత దరిద్రం గా వండుతానా" అని ఎదురు ప్రశ్న వేసా.

కొన్నాళ్ళయ్యాకా మేము అమెరికా వచ్చాము. మా చిన్న నాటి ఫ్రెండ్స్ ఇంట్లో వున్న నాలుగు రోజుల్లో ఒక సారి సంబారు పెట్టా. అబ్బా, ఇలా కానీ సంబారుతో అమెరికా అంతా నా పేరుతో చైన్ రెస్టా రెంట్స్ తెరవచ్చు అని మా ఫ్రెండ్స్ అనేసారు. దానితో నా ఆత్మ విశ్వాసం లెవెల్ పెరిగి పోయింది. నేను చాలా గొప్పగా వంట చేస్తానని అనేసుకున్నా.

మాకు అమెరికాలో మొదటి స్నేహితులు, అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కాకుండా, కొత్త వాళ్ళు ఆఫ్రో అమెరికన్స్. వాళ్ళలో ఒకడు మా ఇంటికి తరచూ వచ్చేవాడు. వాడి పేరు నెల్సన్ . ఒక రోజు నెల్సన్ మేము భోజనం చేసే సమయం లో వచ్చాడు. వుమ్మడి కుటుంబం లోంచి రావడం వలన, కొంచం కొంచం వండడం వచ్చేది కాదు. పప్పు పులుసు అవీ పెడితే, కొంచం పెద్ద గిన్నె తోనే పెట్టేదాన్ని. ఆరోజు, మా ఆయన, నెల్సన్ తో, పప్పు పులుసు బాగుంది, తిన కూడదూ అని అనడిగాడు. అంతే, అన్నంతో తింటాడేమో అని , కంచం తీసుకుని వచ్చా. ఏ లోగా, మీ అందరి భోజనం అయిందా అని అడిగాడు, అయిపోయింది అని కంచం లో కొంచం కూర వేసి, అన్నం వెయ్య బోతూ ఉండాగా, నెల్సన్, పులుసు గిన్ని ఎత్తిపట్టుకుని, మొత్తం పులుసు అంతా, మాయ బజార్ లో ఘటోత్కచుడి లాగా, అడుగున ఒక గరిటెదు మిగిల్చి మిగతాదంతా గడ గడా తాగేసాడు. నా కళ్ళతో నేనే నమ్మ లేక పోయా.. వాడు ఆకలితో మాడు తున్నాడా, లేక వీడికి రుచులతో పని లేదా, నిజం గానే ఆఫ్రో అమెరికన్ కి నేను పెట్టిన పప్పు పులుసు నచ్చిందా అర్ధం కాలేదు. ఇంతలో మా అయన వాడిని ఐస్ క్రీం తింటావా అని అడిగాడు. వాడు వెంటనే ' ఎస్' ఆన్నాడు, నేను చిన్న బౌల్ తీసి ఇండియా మోడల్ లో ఒక చిన్న గరిటెడు ఐస్ క్రీం వేసి, అందులో ఒక చంచా వేసా. వాడు నా వైపు వాడు ఒక సారి చూసి, చంచా తీసుకుని, ఐస్ క్రీం డబ్బా లాక్కుని, మొత్తం డబ్బా చూస్తూ ఉండగానే, ఖాళీ చేసేసాడు. వీడు మనిషా? బకాసురుడా? అనుకుని, ఏడవలేక నవ్వుతూ, 'నచ్చిందా' అని అడిగాము... 'ఇట్స్ ఒకే " అన్నాడు. ఆ తరవాత మా ఆయనకి చెప్పేసా ఇలా అడ్డ దిడ్డంగా వాడిని పిలవకు అని గాఠ్ఠిగా చెప్పేసా.

మరి కొన్నాళ్ళయ్యాకా, నెల్సన్ గాడి ఫ్రెండ్ ఏరన్ వచ్చాడు మా ఇంటికి. చెప్పొద్దూ వాడు మాకు చాలా సాయం చేసాడు. ఈ దేశం వచ్చినప్పుడు మాకు ఇల్లు వెదికి పెట్టడం, స్కూల్ లో మా అబ్బాయిని జాయిన్ చెయ్యడం లాంటి విషయాల్లో చాలా సహాయం చేసాడు. ఒక రోజు ఏరన్ ఎక్కడి కో వెళ్తూ మమ్మల్ని పలక రించడానికి వచ్చాడు. మాంచి మూడ్ లో వున్నట్టున్నాడు. చేతిలో ఒక బీరు బాటిల్ పట్టుకుని మరీ వచ్చాడు. మా యాన చాలా సంతోష పడి పోయి, వాడికి తినడానికి ఏమైనా పెట్ట మన్నాడు. ఆరోజు, మార్గ శిర లక్ష్మి వారం. నేను చక్ర పొంగలి చేశా. వెంటనే, ఒక బౌల్ లో వేసి పట్టుకుని వచ్చా. వాడు అదేమిటి అని అడిగాడు. నేను 'రైస్ పుడ్డింగ్ " అని చెప్పా, అలా అయితే అర్ధం అవుతుంది కదా అని. వాడు వద్దు అన్నాడు. అసలే తాగి వున్నాడు, అంది మీద స్వీట్ తింటే ఎలా? కానీ ఆయన బలవంతం పెట్టాడు. దానితో వాడు, పోనీ కదా అని ఒక చంచా నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుని వాష్ రూం కి వెళ్లి భళ్ళున వాంతి చేసుకున్నాడు. పాపం తాగి వున్నాడు కదా, అని పోనీలే అని వాడి ముందు నుంచి వెంటనే అది తీసేసా. కానీ వాడు మాత్రం ఊరుకో లేదు. అందులో ఏమిటి వేసావు అని అడిగాడు. నేను చెప్పా, బియ్యం, పెసర పప్పు, పంచదార, నెయ్యి, ఏలక పొడి అన్నీ చెప్పా, అదేమీ కాదు, ఇంకా ఏదో వేసావు అన్నాడు. చాలా సేపు అర్ధం కాలేదు. కొంచం సేపు పోయాకా గుర్తుకు వచ్చింది. అందులో పచ్చ కర్పూరం వేసా నని. మా అయన తో చెప్తే, దానిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో తెలియలేదు. రవి, అది ఒక కార్బన్ పదార్ధం అని, అది సువాసన గా ఉంటుందని, అలా ఏదో వర్ణించి చెప్పగానే, వాడు, పరిగెత్తుకుని వెళ్లి, మళ్ళీ కక్కి పోసాడు. ఆయన వర్ణన తో వాడి కి అర్ధం అయిందేమిటంటే, మేము దానిలో నేఫ్తలిన్ బాల్స్ వేశామని అనుకున్నాడు. అది అర్ధం చేసుకుని, నవ్వలేక చచ్చాము. కాదని చెప్పి, ఇంట్లో వున్న పచ్చ కర్పూరం వాడికి చూపించి నేఫ్తలిన్ బాల్స్ కూడా చూపించి, అది వేరు ఇది వేరు అని వప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది.

అప్పటి నుంచి, ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే, నాకైతే భయం.
కొందరు తెలుగు వాళ్ళు వచ్చి నా వంట తిన లేక , వున్నన్నాళ్ళూ హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని తిన్న రోజులు కూడా వున్నాయి. వాళ్లకి నాలుక చిల్లు పడే అంత పులుపు తినడం అలవాటు. నేను వండే కమ్మని వంట వాళ్లకు నచ్చలేదు. పార్టీ లకి వెళ్లి నప్పుడు కూడా, కొందరు, నాకు నచ్చని వంటను పొగుడు కుంటూ తినడం, నాకు నచ్చినది, వాళ్ళకు నచ్చక పోవడం.. ఇవన్నీ చూస్తూ వుంటే, అప్పుడు బాగా అర్ధం అయింది.. పుర్రెకో బుద్ధి, జిహ్వ కో రుచి అని.

Thursday, August 19, 2010

పేరు గొప్ప వూరు .....

పేరు గొప్ప వూరు .......

ఊహ ఎప్పుడూ నిజం కన్నా అందంగా వుంటుంది. ఊహలకు హద్దులు వుండవు. దేని గురించి అయినా ముందుగా వింటే, దాని గురించిన వూహలు నిజాన్ని అధిగమించి వుండి, తీరా నిజాన్ని చూసే సరికి మన ఎక్స్ పెక్టేషన్స్ కి చాలా దూరం గా వుండి చాలా డిసప్పాయింట్ మెంట్ కలుగు తుంది.

రెండు వేల కన్నా తక్కువ జనాభా వున్న పల్లెటూళ్ళో పుట్టాను నేను. మా నాన్న గారి ఉద్యోగ రీత్యా, ట్రాన్స్ ఫర్స్ వలన ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండకుండా తిరుగుతూ వుండేవాళ్ళం. చివరికి మా చదువు రీత్యా, మా అన్నయ్యని నన్నూ విశాఖ పట్నం లో ఉంచారు. నాకు చాలా ఇంచుమించు పెళ్లి అయ్యేవరకూ కూడా తెలిసిన పెద్ద వూరు విశాఖపట్నమే. ఒక సారి హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. కానీ రెండు మూడు రోజుల కంటే అక్కడ ఉండక పోవడం వలన, అంత పెద్దగా ఏ అభిప్రాయం ఏర్పరుచుకోలేదు. హైదరాబాద్ మాత్రం చాలా పెద్ద సిటీ. దానిని ఎవరూ కాదనలేరు.
నేను హై స్కూల్ లో చదివినప్పుడు మా క్లాసు లో కొందరు విజయనగరం నుంచి వచ్చిన అమ్మాయిలు వుండేవారు. వాళ్ళు విశాఖపట్నం రావడం వలన వారు జీవితంలో ఏదో కోల్పోయినట్లు మాట్లాడేవారు. విజయనగరం పేరు చెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఒకరకమైన ఆనందం, కించిత్ గర్వం కూడా కనిపించేది. నాకైతే చెప్పొద్దూ, విజయనగర సామ్రాజ్యం చరిత్ర చదివి వున్నానేమో కొంచం అసూయ కలిగేది. విశాఖపట్నం దగ్గరి విజయనగరం, హంపి విజయనగరం వేరు వేరు అని అప్పట్లో నాకు తెలియదు. పైగా వాళ్ళు రాజుగారి కోట గురించి కూడా చెప్పేవారు. పెద్దయ్యాకా, వుద్యోగం చేసి, డబ్బులు బాగా సంపాదించి ఆ విజయనగరం చూడాలని చాలా అనుకునేదాన్ని. కొన్నాళ్ళకి ఆ విషయం మర్చిపోయా, మా అన్నయ్యకి విజయనగరం లో స్టేట్ బ్యాంకు లో కోట బ్రాంచ్ లో వుద్యోగం వచ్చేదాకా. అప్పుడు చిన్న ఆశ మొదలయింది. ఎలాగైనా విజయనగరం చూడొచ్చని.

మా అన్నయ్య, సోమవారం జాయిన్ అయ్యి, శనివారం వచ్చేసాడు. వస్తూనే, "హమ్మో, నాకు దోమతెర ఒకటి అర్జెంటు గా కావాలి. అక్కడ విజయ నగరం అందరికి బోద కాళ్ళు. మరో నెల తిరక్కుండానే, నా కాళ్ళు కూడా అలా అయిపోతాయని భయం వేస్తోంది" అని చెప్పాడు. వాడు అసలే సున్నితం. ఎప్పుడూ ఏ వో పత్యాలు చేస్తూనే ఉంటాడు. మా అమ్మమ్మ వాడిని 'నిత్య బాలింత' అని వేళా కోళం చేస్తూ వుండేది.
శనివారం సాయకాలమే, బజారుకి వెళ్లి వెంటనే ఒక దోమ తేరా, కొన్ని మస్కిటో కోయిల్స్ కొని పట్టుకుని వచ్చాము.
"కోట ఎలా వుంటుంది రా" అని చాలా కుతూహలం గా అడిగాను. అందులో విమెన్స్ కాలేజీ వుంది.
"ఒకసారి వచ్చి చూడు నీకే తెలుస్తుంది , అదొక పెద్ద పల్లెటూరు " అన్నాడు విసుగ్గా. వీడొకడు. చిన్నప్పటినుంచి అంటే. నేను చిన్నదాన్ని అయినా, అమ్మ నాన్న గార్లకు దూరంగా వున్నా ఎంతో ధైర్యంగా వుండేదాన్ని. వాడు బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చేసుకునే వాడు. ఇప్పుడూ మమ్మల్ని వదలి ఉండలేక అలా అంటున్నాడేమో అనుకున్నా. మరో రెండు వారాలు పోయాకా నేను అమ్మ వెళ్ళాము, ఆ మహా నగరాన్ని చూడ దానికి. వెళ్ళాకా తెలిసింది అది నిజంగానే పెద్ద పల్లెటూరని.
ఇక పెళ్లి అయ్యాకా అంటారా, మా ఆయన పదేళ్ళు వచ్చేవరకూ ఆ విజయనగరం మహా పట్టణం లో ఉన్నారుట. రిటైర్ మెంట్ వయసు వస్తున్నా, ఇప్పటికీ ఆ విజయనగరం కబుర్లే. ఆ తరువాత విశాఖ పట్నం లో పాతిక సంవత్సరాలున్నా, ఈ నాటికీ ఆ విజయనగరం గొప్పదనం ఇప్పటికీ వింటూ నా చెవులు చిల్లులు పడుతూ వుంటాయి.

మా ఆయన విజయనగరం లో వున్నప్ప్దుడు ఒక సారి మంత్రి, బ్రహ్మనంద రెడ్డి గారు, వస్తున్నారని విని, ఎంతో కుతూహలంగా, చక్కగా తయారయి, ఎండలో మాడుకుంటూ వెళ్ళి నాలుగు గంటలు ఎదురుచూసి వచ్చారుట. మా అత్తగారు, కాలికి దెబ్బ తగిలింది, వెళ్ళొద్దు అంటే వినకుండా వెళ్ళారుట. తిరిగి వచ్చి, వాడేమి మంత్రి, చి చీ, ఒక కత్తి లేదు, కిరీటం పెట్టుకోలేదు, అనేసి ఆడుకుందుకు వెళ్ళిపోయారుట.

ఇక విజయనగరం ఘోష ఇలా వుండగా, మా ఆయన మేనత్త గారి వూరు కాకినాడ. వారి అబ్బాయి మా ఆడబడుచు మొగుడు. ఇక వీరింటి నుంచి ఎవరు మా ఇంటికి వచ్చినా కాకినాడ గురించి వర్ణనలు. మా నాన్నగారు కాకి నాడ కాలేజీ లో చదువుకున్నారు. కొంచం కాకినాడ కళలల గురించి చాలా గొప్ప గానే విన్నాను. అక్కడి వంకాయలు కాస్త ఉప్పు కారం చల్లి, స్టవ్ దూరం నుంచి చూపించి తినెయ్య వచ్చుట. అంత బాగుంటాయట. అక్కడ బాబాయి హోటల్ లో పెసరట్టు, వేడి వేడి ఇడ్లీలు, అల్లం పచ్చడి తినక పోతే, జీవితం వేస్ట్ ట. అలానే, బుట్ట భోజనం ట.. అదేమిటో నాకైతే అంతుపట్ట లేదు. కాకి నాడ కాజాలు ఎలానూ ఫేమస్ కదా.. నాకు తెలిసి ఆడవాళ్ళ గొంతుతో పాడే బాబ్జి మాత్రం బాగా తెలుసు. ఎలా అయినా, రిటైర్ అయ్యాకా, ఆ కాకినాడ లో సెటిల్ అయిపోతే బాగుంటుందని ఒక డెసిషన్ కి వచ్చాశా. అదే మాట, ఒక సారి మా అమ్మతో అంటే, ఫకాలున నవ్వింది. ఒకసారైనా వెళ్ళావా అని అడిగింది. లేదన్నాను. మరి వెళ్ళకుండానే అలా ఎలా అనుకుంటున్నావు అని అడిగింది. " ఏమో అమ్మా అందరూ చెప్పే విధానం చూస్తే అలా అనిపించింది" అన్నా. ఒకసారి వెళ్లిరా అంది.
మరో మూడు నెలల్లోనే కాకినాడ వెళ్ళే అదృష్టం పట్టేసింది. మా ఆయన, నేను మా అబ్బాయిని తీసుకుని కార్ లో వెళ్ళాము. డ్రైవర్ కి ఈ వూళ్ళన్నీ బాగా తిరిగిన వాడు. అందుకే మేము కొత్త వూళ్ళో పెద్దగా అవస్థ పడనవసరం లేదు. ఆ వూళ్ళో వున్న పెద్ద హోటల్ లో దిగాము. నా దృష్టిలో పెద్దది కాదు. ఆవూళ్ళో అదే పెద్దదని చెప్పారు. మానస సరోవర్ ట. నాకైతే, అదే ఒక పెద్ద డిస ప్పాయింట్ మెంట్. నేను అప్పటికే, చాలా దేశాలు తిరిగేసాను. ముంబాయి, కలకత్తా లే కాకుండా, యూరప్, ఫార్ ఈస్టర్న్ దేశాలు, చుట్టు ప్రక్కన కొలంబో, బంగ్లాదేశ్ లాంటి చాలా ప్రాంతాలు తిరిగాను. మా డ్రైవర్ రాత్రి పూట కళ్ళు కనిపించవు. వాడికి అప్పటికే ఎనభై ఏళ్ళు ఉంటాయేమో. కానీ మా ఆయనకి వాడంటే చాలా గురి. నాకైతే వాడికి కళ్ళు సరిగా కనిపించ వని భయం. అంతె కాదు, ఏ వూరు వెళ్ళినా, వాడికి ఆ వూళ్ళో ఓ ఫ్యామిలీ వుందని రాత్రి అయ్యేసరికి వెళ్లి పోతూ ఉండేవాడు. అందుకని తొందరగా పనులు కానిచ్చి, సాయకాలం అయిదు గంటలకి వూరు చూడ డానికి బయలు దేరాము. వూరులో మంచి బజారు చూపించామన్నాము. వాడు, మనం ఉన్నదే బజారు అన్నాడు. సరే అంటా తిప్పి చూపించామన్నాము. మరో పడి నిముషాల్లో వూరు చివరకి వచ్చేసాము అన్నాడు. ఒకే, రెండోవ వైపు చూపించు అన్నాము. వాడు పక్క వీధిలోకి తిప్పి, ఇది గుడి వీధి అన్నాడు. ఓహో అలానా అన్నము. మరో పావు గంటలో వూరు రెండవ చివరకి తీసుకుని వెళ్ళాడు. అంతే ఇంక అంత కంటే చూడడానికి ఈ వూళ్ళో ఏమీ లేదన్నాడు. వాడు దొంగ వెధవ, చూపించడానికి బద్ధకిస్తున్నాడు అనుకున్నాము. సరేలే, వాడిని పంపేసి, మేమే కారు డ్రైవ్ చేసుకుని తిరగడం మొదలు పెట్టాము. ఎంత తిరిగినా, "అబ్భా" అని పించే విషయం మాకేమీ కనిపించలేదు. భోజనం ఒక హోటల్ లో తిన్నాము. అదీ అంతంత మాత్రమే. ఇంక అక్కడ చూడడానికి సముద్రమే వుంది కదా.. పైగా మా అయన వచ్చిన పనే షిప్పింగ్ పని. కాలిఫోర్నియా అఫ్ ది ఈస్ట్ అని పేరు పడ్డ విశాఖపట్నం నుంచి వచ్చిన నాకు కాకినాడ సముద్రం లో అందాలేమి ఎక్కువగా కనిపించలేదు. ఇక బాబాయ్ హోటల్ కి వెళ్ళాము. అదొక రేకుల షెడ్ అంతే.. టిఫిన్స్ రుచిగానే వున్నాయి. విషయం, అవి తినక పోతే జీవితం వేస్ట్ అని మాత్రం అనిపించలేదు. అంతకన్నా నేను బాగానే చేస్తాను అనిపించింది. పని అయిపోయాకా, విశాఖపట్నం వెళ్ళిపోతూ, మధ్యలో నా పుట్టింటికి వెళ్లి, మా అమ్మతో చెప్పా కాకినాడ వెళ్లి వస్తున్నామని. 'ఆహా, చూసావా? మీ రిటైర్ మెంట్ అక్కడేనా అని అడిగింది పకపకా నవ్వుతూ మా అమ్మ. నేనూ నవ్వేసాను..

ఈ కాకినాడ, విజయనగరం గొప్పలు, ఇన్నాళ్ళైనా, ఎక్కడో ఒకచోట ఈ రోజుకీ వింటూనే వున్నా. నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే అమెరికా లో గత నలభై సంవత్సరాలుగానో, అంతకన్నా ఎక్కువగానే ఉంటూ కూడా, ఇంకా విజయ నగరం, కాకినాడ అంటూ కబుర్లు చెబుతూ వుండడం. ఇన్ని కబుర్లు చెప్పే వాళ్ళు ఎవ్వరూ కూడా అమెరికా వదిలి ఆ కాకినాడో , విజయ నగరమో వెళ్ళే ఉద్దేశం మాత్రం వుండదు. చెప్పే వాడికి వినే వాడు లోకువ అన్నట్టు, ఆ వూరి గొప్పలు మాత్రం చెప్పుకు పోతూ వుంటారు. మా ఆయన కూడా అలాంటి వాళ్ళలో ఒకరు.

నేను పుట్టింది చాలా పల్లెటూరు అవడం వలనో ఏమో, ఎప్పుడూ మా వూరి గురించి నేను గొప్పగా అనుకోలేదు. ఎవరికీ అసలు నేను ఎక్కడ పుట్టానో కూడా చెప్పవలసిన అవసరం పడలేదు. పైగా విశాఖపట్నం లోనే, నా చదువంతా జరగడం వలన, పెళ్లి అయ్యాకా కూడా ఎక్కువ కాలం అక్కడే వుండడం వలన, మా వూరు విశాఖపట్నం అనే చెబుతా.

నేను యునివర్సిటీ లో చదివేటప్పుడు చాల మంది నా క్లాసు మేట్ అమ్మాయిలంతా విజయవాడ వాళ్ళు. విజయవాడ గురించి కూడా నేను తక్కువేమీ వినలేదు. విజయవాడ కనక దుర్గ దర్శనం కోసం వెళ్లి విజయవాడ కూడా చూసా. అలానే, నేను కాలేజీ లెక్చరర్ గా పని చేస్తూ ఏదో ట్రైనింగ్ కి అని గుంటూరు వెళ్లాను. ఇవన్నీ చూసాకా నాకు ఇప్పుడు ఎవరైనా, ఏ వూరి గురించి గొప్పగా చెప్పినా, వెళ్లి చూడాలనే ఇచ్చ కలగడం లేదు. కారణం వేరే చెప్పక్కర లేదుగా..

రెండేళ్ళ క్రితం ఒక విషయం జరిగింది. నాకు లాస్ అ౦జెలెస్ లో డౌన్ టౌన్ లో ప్రాజెక్ట్ వచ్చింది. నాతో చాలామంది ఇండియా నుంచి ప్రోగ్రామర్స్ అక్కడ పని చేస్తున్నారు. వాళ్ళంద రిలోనూ పెద్దవాడు, నాకన్నా నాలుగు అయిదేళ్ళు చిన్న వాడు ఒక డు వున్నాడు. నేను ఆరోజు సంక్రాంతి అవడం వలన, వెళ్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పాను. అందరికన్నా పెద్దవాడు నా దగ్గరికి వచ్చి, వట్టినే అలా చెప్పెయ్యడ మేమిటి , పొంగలి చేసి పెట్టి అప్పుడు చెప్పాలి అన్నాడు.
"నేను ఇక్కడ హోటల్ లో ఉంటున్నాను, కావలిస్తే, మా హ్యూస్టన్ లో మా ఇంటికి రండి అప్పుడు చేసి పెడతా అన్నాను నవ్వుతూ. స్టవ్ మీద కాదు, కుంపటి మీద చెయ్యాలి పొంగలి, అసలు మీకు కుంపటి అంటే ఏమిటో తెలుసా?" అని అడిగాడు.
"ఎందుకు తెలియదు, మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియక పోవచ్చు" అన్నా.
" మా అమ్మగారికి ఎప్పుడూ నేనే కుంపటి వెలిగించేవాడిని, నేను చాలా పల్లె టూల్లో పుట్టాను ఆలాంటి వూరు పేరు మీరు అసలు విని కూడా వుండరు" అన్నాడు.
"నేనూ అలానే చాలా పల్లెటూల్లోనే పుట్టాను, ఇంతకీ మీరు ఏ వూళ్ళో పుట్టేరేమిటి" అని అడిగాను.
"మాకవర పాలెం" అన్నాడు గర్వంగా, నేను ఆ పేరు ఎప్పుడూ విని ఉండనని పూర్తి నమ్మకంతో.
నా చెవుల విన్నా నేనే నమ్మలేక పోయా. ఎందుకంటే నేను పుట్టిందీ అదే వూరు. అలా చెబితే నమ్మలేక పోయాడు. నేను ఆ వూరు ఎక్కడ వుంటుందో చెప్పి , మా నాన్న గారు ఆ వూరి హెడ్ మాస్టర్ గా పని చేసేవారని చెప్పా. ఆ వూరి గ్రామ కారణం అతని మేనమామ అని అతను చెప్పాడు. హోటల్ రూం కి వెళ్లి, ఇండియా ఫోన్ చేసి ఆ విషయం మా అమ్మ, అన్నయ్యలతో చెప్పా. వాళ్ళు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నల పెళ్ళికి నన్నూ తీసుకుని వెళ్ళారని చెప్పారు. నేను అప్పుడు మూడేళ్ళ పిల్లనిట.

ప్రపంచం ఎంత చిన్నది? ఎంత ఆశ్చర్యం. ఎక్కడ మారు మూల పల్లెటూళ్ళో పుట్టిన నేను, ఆ అబ్బాయి అన్నేళ్ల తరువాత అమెరికాలో లాస్ ఏంజెలెస్ లో కలవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

నాకు ఏ వూరు వెళ్ళినా ఎన్నాళ్ళో వుండ బుద్ధి కాదు. విశాఖపట్నం వెళ్లి పోవాలనే వుంటుంది. అక్కడ ఏమిటి గొప్ప అంటే ఏమీ లేకపోవచ్చు. పైగా ఏడాదికి రెండు నెలలే చల్లగా వుండి, ఎప్పుడూ ఉక్క , చెమటలు కారుతూ వుంటుంది. అయినా, ఆ వూళ్ళో చాలా కాలం వుండడం వలన, ఆ కొండలు, ఆ సముద్రం, ఆ అందాలు మళ్ళీ కాలిఫోర్నియా లోనే కనిపించాయి. .
ప్రస్తుతానికి నా కొడుకూ, మా ఆయనా ఎక్కడ వుంటే అదే స్వర్గం గా అనుకుంటున్నా. చిన్నాప్పుడు చదువుకునే రోజుల్లో, ' ఏ వూరు ఏ వలస పిల్లా నీది' పాట అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది. .
మన ఇల్లు పూరిల్లు అయినా మనకి ఎంతో బాగుంటుంది కదా. ఎంత ఫైవ్ స్టార్ హోటల్ లో అయినా రెండు మూడు రోజులు ఉండగలము. కానీ ఎప్పుడూ అక్కడే ఉండిపోవాలని వుండదు. అలానే, మన తల్లి తండ్రులు మామూలు వ్యక్తులే అయినా, మనకు వాళ్ళంటే నే ప్రేమ వుంటుంది కానీ, డబ్బు పవర్ వుండి కదా అని, ఎవడినో తల్లి తండ్రుల్లాగా భావించలేము కదా.. అలానే, మన౦ పెరిగిన ఊరంటే, మనకి ప్రేమ ఉంటుందని తెలుసుకున్నా.
ఆయన ప్రస్తుతానికి ఫోన్ లో మాట్లాడు తున్నారు.. విజయనగరం జారుడు బండ, గంట స్తంభం గురించి, అగ్రహారం వీధి పక్క నే వున్న రైలు పట్టాల గురించి .. భగవంతుడు కూడా మార్చలేడు ఆయన్ని.
అన్ని దేశాలు తిరిగాకా, నాకు చాలా నచ్చిన ప్రదేశం కాలిఫోర్నియా లో సముద్ర తీరా ప్రాంతాలు. విశాఖపట్నం అందాలే కాదు, చల్లని వాతావరణం కూడా. రంగు రంగుల ఇల్లు, అందమైన భవనాలు.. అందమైన మనుషులు.

Monday, July 19, 2010

నీ కొండకు నీవే రప్పించుకో !

ఇందుగలడందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూసిన, అందందే గలడు, దానావాగ్రిణి వింటే.
ఎంత అందంగా, ఎంత సులభంగా,చెప్పెసాడో కదా ప్రహ్లాదుడు? ఎక్కడ బడితే, అక్కడే దొరుకుతున్న ఆ దేముని కోసం, మనం ఇంట్లోనే కూర్చుని ప్రార్ధించు కో వచ్చు కదా? ఈ మధ్య మురళి గారి తేటగీతి లో "పుణ్యం కావాలా, ఐతే" ( http://tetageeti.wordpress.com/2010/07/16/punyam_kaavaalaa/) చదివేకా, నా జీవితంలోని ఈ అనుభవం గురించి రాయాలని మరీ మరీ అనిపించింది.
ఒకసారి మా అబ్బాయికి హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ రెండు ఇచ్చాకా, మూడవ ఇంజెక్షన్ కి మరొక నెల టైం వుంది కదా, అని ఈ లోగా, తిరుపతి దర్శనం చేసుకుని రావచ్చని నేను, మా ఆయన, బాబుతో బయలు దేరాము
.
ఎప్పటి లాగానే, మమ్మల్ని వైకుంఠం దగ్గర వదిలెసి, యెవరో పరిచయం లేని యాత్రికులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ, వారికి దారి చూపిస్తూ, ఉచిత సలహాలు ఇస్తూ, తను తప్పిపోయి మేమేదో తప్పిపోయి నట్టు మమ్మల్ని వెదుక్కుంటూ కల్యణ కట్ట దగ్గర తేలేరు. అక్కడ, ఆయన ఒక వ్యక్తి వాంతులు చేసుకుంటూ కనిపించాడు. ఈయన, మా సంగతి పూర్తిగా మరచిపోయి, ఆ వ్యక్తిని గమనించి, అతని ఆరోగ్య పరిస్థితి కొంచం సీరియస్ గా అనిపించి, గబగబా, దగ్గరనే వున్న కొందరు వ్యక్తుల సహాయంతో, అశ్వని హాస్పిటల్ కి ఫోన్ చేసి, అంబులెన్సు తెప్పించారు. ఆ హాస్పిటల్ వాళ్ళు మా ఆయన్ని కూడా ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. ఒక గంట అక్కడ వుండి, అతనికి ప్రాణ భయం లేదని నిర్ధరించుకున్న తరవాత, తిరిగి, మాకోసం వెదకడం మొదలు పెట్టారు. మేము ధర్మ దర్శనం కోసం "వైకుంఠం" వెళ్లి ఉంటామని గుర్తుకు వచ్చి, ఎలానో ఓలాగ మమ్మల్ని చేరుకున్నారు,

"హమ్మయ్య వచ్చేసారా" అని గాభరా పడుతున్న నన్ను చూసి, జరిగింది చెప్పారు. "పోనీ లెండి, మంచిపనే చేసారు" అని క్యూ కాంప్లెక్స్ లో చేరాము. అక్కడ ఓ నాలుగు గంటలు ఆ జైలు లో కూర్చున్నాము. .. (భక్తులు క్షమించాలి, జైలు అన్నందుకు. అవి నాకు జైళ్ల లాగే కనిపిస్తాయి. ఒక రకంగా, మనం పూర్వం చేసిన పాపాలకి, ఆ విధంగా దేముడు మనకి ఒక రకంగా శిక్ష వేసి, పాపాలు తగ్గిస్తున్నా డేమో అని పిస్తుంది. అందుకే నేమో, మన పాప భారం కొంచం తగ్గి, దేముడు మనకి కొంచం పుణ్యం ఇస్తాడు.) అంత సేపూ అటు ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న మా బాబు సడన్ గా, నా దగ్గరికి వచ్చి నా వళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. వళ్ళు కాలిపోతోంది. చాలా జ్వరం వచ్చేసింది. నా బాగ్ తీసి, పారాసెట్ మాల్ టాబ్లెట్ ఒకటి వేసాను. ఎంతకీ జ్వరం తగ్గలేదు. ఎందుకో అనుమానం వచ్చి వాడి కళ్ళు విప్పి చూసాను. కళ్ళు పచ్చగా వున్నాయి. ఆయనకి చూపించి, ఇదేమిటి, మనం రెండు హెపిటైటిస్ బి ఇంజేక్షన్స్ ఇచ్చాము కదా, అయినా కళ్ళు ఎందుకు పచ్చగా ఉన్నాయేమిటి అని అడిగాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఆయన వెంటనే, పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. నాలుగు గంటలు కూర్చున్నాము కదా, మరి రెండు మూడు గంటల్లో వెళ్లి దర్శనం అయిపోతుంది వుండండి, అదే తగ్గి పోతుంది అంటూ చుట్టూ పక్కల వాళ్ళు సలహా ఇచ్చారు. మా అయన, మమ్మల్ని కాంప్లెక్స్ లో బంధించిన అక్కడి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పారు. వాళ్ళు, ఫరవాలేదు. "మీరు వెళ్ళండి. మేము మీకు స్పెషల్ గా దర్శనం ఇప్పిస్తాము" అని చెప్పారు.
మేము వెంటనే, కాంప్లెక్స్ లోంచి వెళ్లి పోయి అశ్వని హాస్పిటల్ కి వెళ్ళాము. వాళ్ళు మా అబ్బాయిని చెక్ చేసి, " పిల్లవాడికి బాగోలేదు. కొండ మీద వుండకండి, వెంటనే వెళ్ళిపోండి అని చెప్పి, దర్శనం అయిందా అని అడిగాడు. ఇంటికి వెళ్లిపోతాము, మాకు దర్శనం అక్కర లేదు అని చెప్పాము. కానీ, ఆ డాక్టర్ " అలా చెయ్యకండి.. తరవాత, మీకు మనసులో చాలా పీకుతూ వుండి పోతుంది. కనుక స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి" అన్నాడు". వైకుంఠం దగ్గరకు వెళ్ళగానే, మమ్మల్ని బయటికి వదిలిన వ్యక్తి మమ్మల్ని గుర్తుపట్టి, లోపలికి డైరెక్ట్ గా వెళ్తున్న వాళ్ళలో కలిపి గుడి లోనికి పంపాడు.. మేము స్వామి వారి దర్శనం చేసుకుని, వెంటనే, కొండదిగి విశాఖపట్నం చేరుకున్నాము. భగవంతుని దయవల్ల మా వాడు కూడా బాగానే వున్నాడు.
కానీ, మనస్సులో అనుకున్నాను.. నా భర్త కానీ, నా కొడుకు కాని, ఒక పెద్ద పదవి లోకి వెళ్లి, మాకు తిరుపతిలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు జరిగితేనే కానీ మళ్ళీ తిరుపతి వెళ్ల కూడదు అని నా మనస్సులో అనిపించేసింది. అంతే ఆయన వుండడం పెద్ద పదవి లోనే వున్నారు, ఎటొచ్చీ గవర్నమెంట్ లో కాదు ప్రైవేటు సెక్టార్ లో. . అలానే, ఆయనకి కూడా, "నీ కొండకు నీవే రప్పించుకో , నేను ప్రయత్నం చెయ్యను" అని మనస్సులో గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.
ఇది జరిగి రెండు నెలలు కాలేదు, మా దగ్గర బంధువులలో ఒకరు, ప్రొమోషన్ వచ్చి తిరుపతి వేసినట్టు, మంచి దర్శనం ఇప్పిస్తాను రండి అని పిలిచారు. ఆరోజు రాత్రివరకు, నేను మా ఆయన, తిరుపతి గురించి మేమిద్దరం మనసులో అనుకున్నా మాటల గురించి చెప్పుకోనేలేదు. ఆయన అలా పిలవగానే, " హమ్మో దేముడు మనల్ని పిలుస్తున్నాడు" అని అనుకున్నాముకానీ మళ్ళీ మా పంతానికి పోయాము. వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. ఇంతలోనే, మా ఆయన స్నేహితుడు మద్రాస్ (చెన్నై) లో కాన్సెర్ ట్రీట్మెంట్ కి వెళ్లి కోమాలో వున్నట్టు ఒక వార్త వచ్చింది. అంతే కాదు, చాలా ఏళ్ళ క్రితం, మా పక్కింట్లో వుండి వెళ్ళిన తమిళ్ ఫ్యామిలీ ఒకరు విశాఖపట్నం ఏదో పని మీద వచ్చి, నన్ను, మా వారినీ చెన్నై రమ్మని పిలిచారు. అలానే వస్తాములెండి అనేసాము. అలా కాదని, మా ముగ్గురికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసారు వాళ్ళ డబ్బులతోనే. వాళ్ళతోనే మమ్మల్నీ తీసుకుని వెళ్ళారు. అక్కడకి వెళ్ళాకా, మా ఆయనతో కావలిసిన కొన్ని సలహాలు తీసుకుని, వాళ్లకి తిరుపతి మొక్కు ఉందనీ, వాళ్ళు ఒక వాన్ తీసుకుని వెళ్తున్నామని, మమ్మల్ని కూడా ఆ వాన్ లో తీసుకుని వెళ్ళారు. మేము రామని ఎంత చెప్పినా వినకుండా, వాన్ ఖాళీగా వుందని, తప్పకుండా రావాలని, బలవంతం గా, అలా అనే కన్నా చాలా బ్రతిమలాడి తీసుకుని వెళ్ళారు. అంతగా బ్రతిమలాడుతుంటే వెళ్ళకుండా ఎలా వుంటాము? పులిహోర దద్దోజనం ప్యాక్ చేసి పిక్నిక్ లా బయలు దేరాము.
దారిలో మా బంధువు గురించి గుర్తుకు వచ్చి మా ఆయన ఒకసారి ఫోన్ బూత్ దగ్గర ఆపి ఆయనకి ఫోన్ చెస్తే, మా కోసం ఒక మనిషిని మాతో పంపుతానని చెప్పారు. మేము అతనిని చాలా తేలిగ్గా తీసుకున్నాము. డ్రైవర్ మమ్మల్ని అలిపిరి దగ్గర దింపేసి కొండ మీదకి వాన్ పట్టుకుని వెళ్ళాడు. మేము కొండ మీదకి నడుచుకుని వెళ్ళాము. అక్కడ చేరుకున్నాకా, మా దూరపు బంధువు ఏర్పాటు చేసిన కాటేజ్ దగ్గరికి మేము వాన్ లో వెళ్ళిపోయాము. అ కాటేజ్ లో మూడు బెడ్ రూంస్ వున్నాయి. చక్కని ఫర్నిచర్ తో ఒక శిఖరాగ్రం పైన వుంది. తరవాత తెలిసిన విషయం ఎమిటంటే, అది కేవలం డెప్యూటీ చైర్మన్ కి ఇష్టమైన కాటేజ్ ట. కాటేజ్ లో వాళ్ళు కుర్చీలో కూర్చుని చూస్తే తిరుపతి అంత ఒక సముద్రం లో నగరం లా కనిపిస్తుంది.
మా ఆయన మాత్రం, పాద ధూళి దర్హ్సనం అంటూ బయలు దేరారు. ఈలోగా,ఆయన కోసం మా బంధువు పంపిన ఒక వ్యక్తి ఆయనని తిన్నగా గుడిలోనికి తీసుకుని వెళ్ళాడు.. ఆయనను లోనికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి గురించి చెప్పక పోతే, ఈ రాసిన దంతా వ్యర్ధమే. అతనొక ముస్లిం మతస్తుడు. అతను పుట్టినప్పటి నుంచి తిరుపతిలోనే ఉన్నాడుట. అతనికి సుప్రభాతం తో పాటు, గోవింద నామాలు, విష్ణు సహస్ర నామం వంటివి చాలా వచ్చుట. దారి పొడుగునా, వెంకటేశ్వర వైభవాన్ని ఆయనకి వర్ణించి చెప్పాడుట. దగ్గర వుండి, దర్శనం తో బాటు ప్రత్యేక హారతి ఇప్పించి, ఆయనని కాటేజ్ దగ్గర వదిలి వెళ్ళాడు. మర్నాడు పొద్దున్నే, వాళ్ళందరితో, అంగ ప్రదక్షిణ చేసి, మళ్ళీ ప్రత్యేక దర్శనం చేసుకుని మా 'అరవ' స్నేహితులతో చెన్నై తిరిగి వెళ్ళాము.

ఇది జరిగి పన్నెండు ఏళ్ళు అయింది. ఆ తరువాత మరో నెలకే అమెరికా వచ్చేసాము. తిరిగి తిరుపతి కాదు కదా, ఇండియా కూడా వెళ్ళలేదు. దేముడు ఆ విధంగా మాకు బుద్ధి చెప్పాడా అనిపిస్తుంది నాకు.
దేముని మహిమని అలా పరీక్షించినందుకు రోజూ క్షమించమని 'పడా పడా " చెంపలు వాయిన్చుకోవడం తప్ప ఏమి చెయ్యగలను? మీనాక్షి టెంపుల్ కి వెళ్ళినా, న్యూ జెర్సీ లో బ్రిడ్జి వాటర్ టెంపుల్ కి వెళ్ళినా, తిరుపతి వెళ్లినట్టు ఫీల్ అవుతూ ఉంటా.
“ఇందుగల డందు లేడని సందేహము వలదు,.. అనుకుంటూ, నా ఇంట్లోనే దేముని విగ్రహాలు చూసుకుని మురిసి పోతున్నా, అంతకన్నా చేసేదేముంది?

“నీ కొండకు నీవే రప్పించుకో అని సవాలు విసిరిన నాకు, బలవంతంగా, నా ప్రమేయం ఎటువంటిదీ లేకుండా, నా ఖర్చులెకుండా, నా ప్రయత్నం లేకుండా, ఇంత అద్భుతమైన కాటేజీ ఇచ్చి ఇటువంటి దర్శనం ఇచ్చి,నన్ను తరింప జేసెవు కదా స్వామీ “ అని మా వారికి వళ్ళంతా జలదరించి కళ్ళు చెమర్చేయి.

************************************************************

దిగువున వున్న బాలమురళీ కృష్ణ గారి గురించి ఈనాడు పేపర్ లో ఆగష్టు 28 2010 పడిన వార్త. నేను జూలై 19 2010 న బ్లాగులో రాసాను.

Sunday, July 4, 2010

సిని "మా లోకం"

నాకు తెలుసు, సినిమా అనగానే అందరికీ కుతూహలమే మరి. ఏ దేశంలోనైన చవగ్గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా కాక మరేమిటి వుంటుంది చెప్పండి. అందరికీ అందుబాటులో వుండే ఎంటర్ టైన్మెంట్. మరి దాని గురించి కొద్దిగా మాట్లాడాలని అనిపించింది.
చిన్నప్పుడు రోజూ సినిమాకి తీసుకుని వెళ్ళమని గొడవ చేసేదాన్నో ఏమో, మా చిన్నాన్న గారి అబ్బాయి నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళే వాడుట. చిన్న వూరు కావడం వలన, వాడి ఫ్రెండ్ సినిమా హాల్ మేనేజర్ వలనా, రోజూ ఓ గంట సేపు సినిమా చూసాకా, నేను నిద్రపోతే వాడు మళ్ళీ నన్ను మోసుకుని తెచ్చి పడుకో పెట్టేవాడుట. మరి నేను ఎందుకు అల్లరి పెట్టేదాన్నో తెలియదు కాని, నాకు బాగా అర్ధం అయిన సినిమా లవకుశ. నాకు పదేళ్ళు వున్నప్పుడు వచ్చి వుంటుంది. ఆ తరవాతే, కొంచం సినిమా అంతే ఏమిటో తెలిసింది. చదువని చెప్పి మా వాళ్ళు నా సినిమాలు తగ్గించేసారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు ప్రతీ సారీ ఒక సినిమా చూడ నిచ్చేవారు. అంతే. అంటే ఎడాదికి మూడు సినిమాలు మాత్రమే. ఈ లోగా సినిమాలు బంద్. వేసవి సెలవుల్లో తాతగారి వూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ సినిమా హాలు లేక పోవడం వలన, చూడడానికి కుదేరేది కాదు.

చాలా కాలం వరకూ, ఏ సినిమా అయినా బాగున్నట్టే అనిపించేది. అమ్మ వాళ్ళు, ఈ సినిమా బాగుంది ఆ సినిమా బాగోలేదు అంటే, ఏమిటో చాలా కాలం అర్ధం కాలేదు నాకు. నా మటుకు నాకు అన్ని సినిమాలూ బాగున్నట్టే అనిపించేది చాలా కాలం వరకూ.
ఆదుర్తి సుబ్బారావు సినిమాలూ బాగుంటాయి అనే వారు. అప్పట్లో నాకైతే విఠలాచార్య సినిమాలు చాలా నచ్చేవి. మనుషులు చిలకలుగానో, కుక్కలు గానో మారి పోవడం అదీ చాలా ఇష్టం గా వుండేది. మంగమ్మ శపథం , శ్రీ కృష్ణ పాండవీయం లాంటి సినిమాలు చాలా నచ్చేవి. చెప్పాలంటే, చూసే ఏడాదికి మూడు సినిమాలు మరువలేనివిగా అనిపించేవి.

ఇక కాలేజీ లెవెల్ కి వచ్చాకా, నా సినిమాలు గురించి పెద్దగా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అన్నయ్య కి వుద్యోగం వచ్చేయడం తో, నాకు సినిమాలకి డబ్బులు బాగానే ఇచ్చేవాడు. అప్పటినుంచి కొంచం ఎక్కువ అయ్యాయి సినిమాలు. తెలుగు కన్నా ఫ్రెండ్స్ తో హిందీ సినిమాలు చూడడం మొదలుపెట్టా. ఇప్పటి నా భర్త, అప్పుడు మా స్నేహితుడిగా వుండేవారు. నాకు హిందీ రాదని, నా పక్కన కూర్చుని, నాకు తెలియని చోట చెబుతానని అనేవారు. సరే ననే దాన్ని. నాకు చాలా డైలాగ్స్ అర్ధం అయ్యేవి. ఎక్కడైనా ఏదైనా పదం అర్ధం కాక, అడిగితే, "ఏమో, నాకూ తెలియదు" అనేవారు సేరియాస్ గా మొహం పెట్టుకుని. పెళ్ళయ్యాకా మరో సమస్య ఎదురయింది నాకు. ఆయన సినిమా చూస్తున్నంత సేపూ కెమెరా ఎక్కడ వుంటుంది, లైట్ బాయ్ ఎక్కడ ఉంటాడు, హీరో హీరోయిన్లు ఏకాంతంలో మాంచి రసవత్తరంగా పాట పాడుతూ వుంటే, వాళ్ళ ముందు ఎంత మంది టెక్నీషియన్లు ఉంటారో, నాకు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ వుంటారు, మొత్తం సినిమా మీద ఇంట్రెస్ట్ చచ్చేటట్టు. చిన్నప్పుడు సినిమాల్లో ట్రాజిడీలు చూస్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసేవి. కళ్ళు మిటకరిస్తూ, ఎటో చూస్తున్నాట్టు నటిస్తూ ఎవరూ చూడ కుండా కళ్ళు తుడుచు కునే దాన్ని. సినిమా హాల్లో సౌండ్ చాలా ఎక్కువగా అనిపించి చెవుల్లో వేళ్ళు పెట్టుకునేదాన్ని. దెయ్యం సినిమాలు చూస్తే, చాలా రోజులు భయంకరమైన కలలు వచ్చి, జడుసుకునే దాన్ని. నిద్దట్లోనే హనుమాన్ చాలీసా చదువుకునేదాన్ని. టీ వీ వచ్చాకా, కొంచం ఇమ్మ్యున్ అయ్యానో ఏమో మరి, అలాంటి సున్నితమైన భావాలు చచ్చిపోయాయనుకుంటా. ఇప్పుడు కళ్ళమ్మట నీళ్ళు రావడం లేదు. పైగా పక్కనుంచి ఆయన కామెంటరీ కూడా వుంటుంది కదా.

నాకు బాపు గారంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, బాపు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు వుంటారు అని అనుకుంటున్నారు కదూ. ఆయన బొమ్మలు చాలా ఇష్టం కానీ, ఆయన సినిమా ముగింపులు నచ్చేవి కావు. ఆఖరి సీన్ లో వెనకనుంచి పోలీసులు రావడం, గాభరా గాభరాగా విలన్ తాను చేసిన అన్ని వెధవ పనులూ చెప్పెయ్యడం, హీరో హీరోయిన్ లో గోడ పక్కనుంచి వినేసి అపార్ధాలు పోయి కలుసు కోవడం.. ఏమిటో.. అసంతృప్తి గా వుండేది. సినిమా అంతా ఒకెత్తుగా వుంటే, ఆ ఎండింగ్ అంతా తేలి పోయినట్టు అనిపించేది. 'ముత్యాలముగ్గు' కానీండి, లేక 'పెళ్లి పుస్తకం' కానీండి.. ఇక 'సుందర కాండ' అయితే, ఒక ఇంగ్లీష్ సినిమాకి (What a girl wants) మక్కీకి మక్కీ కాక పోయినా, అదిమాత్రం కాపీ. చాలా సినిమాలు మాత్రం నచ్చేవి. విశ్వనాథ్ గారి సినిమాలు చాలా నచ్చేవి, కానీ చాలా మటుకు దు:ఖాంతాలే.

చిన్న మావయ్య పెద్ద మావయ్యకి తెలియకుండా మాకు, అంటే నాకు మా అన్నయ్యకీ ఇంగ్లీష్ సినిమాలు చూపించేవాడు. మాకు అర్ధం కాక పోయినా వెళ్ళడం మానేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటి ఇంగ్లీష్ సినిమాలు చూడడం గొప్ప, రెండవది, ఇవి నా సంవత్సరానికీ మూడు సినిమా కోటా లోంచి కాదు. అందుకే, అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నమాట. 'Hatari', ' A man from Rio', Gold finger', Tora Tora Tora' లాంటివి చూపించాడు. నిజం చెప్పొద్దూ, ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అమెరికా కి వచ్చిన రెండు మూడేళ్ళ తరవాత ఇంగ్లీష్ సినిమాలు ప్రతి డైలాగూ అర్ధం అవడం మొదలయింది. ఈ లోగా, కేబుల్ పెట్టుకోకుండా, ఇంగ్లీష్ టీ వి చూడడం వలన అని అనుకుంటున్నా. ఏదైతేనేం , ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒకే స్థాయిలో ఆనందించ గలుగుతున్నాము.
ఒకసారి ఏమయింది అంటే, మా అయన, చాలా కాలం దేశాంతరం వెళ్లి, వస్తూ, ముంబాయ్ ఆఫీసు పని పూర్తి చేసుకుని, ట్రైన్ దిగి విశాఖ పట్నం లో తెల్లవారు ఝామున ట్రైన్ దిగి, ఆటో దొరక్క, రిక్షా ఎక్కి వస్తూ, ఆ రిక్షా వాడిని, " ఏమోయ్, వూళ్ళో మంచి సినిమాలు ఏమున్నాయి? " అని అడిగారు.
"మాంచి సినిమా వుంది బాబు. శంకరా భరణం తరవాత అలాంటి సినిమా" అన్నాడు రిక్షావాడు.
"ఓహో, ఏమిటా సినిమా" అన్నారు.
వాడు తడుముకో కుండా " కె డి నంబర్ వన్" అన్నాడు.
మా ఆయనకి తల దిమ్మెక్కి పోయింది. ఒక్క సారి జ్ఞానోదయం అయింది. అవును.. ఎందుకు కాకూడదూ? రెండు సినిమాలకీ వసూళ్లు బహుశా ఒకటే అయి వుంటాయి కదా మరి. అనుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సినిమా లోనూ ఏదో ఒక మంచి చూడ డానికి ప్రయత్నించడం మొదలు పెట్టాము. ఆలీ, బ్రహ్మానందం హీరో లు గా వేసిన సినిమాలు కూడా నచ్చేయ్యడం మొదలు పెట్టాయి.
అంతే కాదు, ఎస్ ఎస్ ఎల్ సి లో స్కూల్ లో ఫస్ట్ వచ్చిన మా బంధువుల్లో ఒకనికి ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్ పోటీలలో పియు సి పరీక్షలు పోగుట్టుకున్న వారిని కూడా చూసాము. కొందరు సినిమా హీరోలకి అభిమాన సంఘాలు కూడా ఉంటాయని చాలా రోజుల వరకూ నాకైతే తెలియదు. నిజం చెప్పొద్దూ, మా ఆయనకి కొంచం ఎన్ టీ ఆర్ ఫ్యాన్. మిగతా వాళ్ళు ఇతర నటుల పేరు చెబితే చాలు, ఆయనకి ఇప్పటికీ ఉద్రేక౦ వస్తుంది వాగ్యుద్దానికి దిగి పోతారు. మా అక్క కొడుకు చిన్నప్పుడు "ఎన్ టీ ఆర్ వద్దిల్లారి ' అనే వాడు, వర్ధిల్లాలి అందడం పలకక. ఈ వయస్సులో కూడా ఈ తగవులు పోలేదు. ఈ మధ్యనే ఒక సినీ నటుడు ' కృష్ణ అభిమాని, తెలియ చేసిన కొత్త విషయం ఏమిటంటే, కృష్ణ ఎందుకు ప్రతీ ఏటా అన్నేసి సినిమాలలో నటిస్తారు అని అడిగితే, చాలా మందికి ఉద్యోగావకాశాలు కలిగించాలని అని చెప్పాడుట. నిజమే కదా. ఆయన నటించక పొతే, మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు?
కేబుల్ టీ వీ లో రోజుకు మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సినిమా అంతే ఇంట్రెస్ట్ చచ్చి పోయింది. అయినా ఏదో డ్యూటి లాగా చూసేస్తున్నా. నేను టీ వీ లో పాత సినిమాలు చూస్తూ వుంటే, మా అబ్బాయి వచ్చి అబ్బా బ్లాక్ అండ్ వైట్ సినిమా వా అంటూ మరో గదిలోకి వెళ్లి పోతాడు. వాడికేమి తెలుసు ఆ సినిమాల విలువ అనుకుంటూ ఉంటా.
భగవద్ గీతలో సుఖ దుఖాలకి అతీతం గా వున్నట్టు, అన్ని సినిమాలని ఒకే విధంగా చూడాలని చాలా ప్రయత్నించా.. కానీ కుదరడం లేదు. అలా అని మంచి డైరెక్టర్ అని సినిమాలు ఎంచుకోవడం మొదలు పెట్టా. అలా అని ఈ మధ్య మణిరత్నం 'రావణ్' చూసి పడా పడా చెంపలు వాయి౦చుకున్నా.

అయినా ఒక విషయం మాత్రం బాగా అర్ధం అయింది. వెనకటికి ఒకడు, కొందరు బంధువులు వచ్చి ఆనంద పెడతారు, కొందరు వెళ్లి ఆనంద పెడతారు అని. కొన్ని సినిమాలు, హాలులో చూసి ఆనందిస్తాము. కొన్ని, హాలు లోంచి పైకి వచ్చాసాకా ఆనందిస్తాము "బతుకు జీవుడా, వెధవ సినిమా అయిపోయింది" అని. వెనకటికి ఒకడు ఇరుకు బూట్లు వేసుకుని రోజూ ఆఫీసు కి వచ్చేవాడుట. ఒక మిత్రుడు, వాడిని చాలా రోజులు, నానా అవస్థా పడడం చూసి, 'ఎందుకురా అలా బాధ పడుతున్నావు, కొత్త బూట్లు కొనుక్కో వచ్చుగా ? " అని అడిగేడుట, దానికి వాడు, అవి ఇచ్చినప్పుడు ఇచ్చే ఆనందం నా బాధలనీ మర్చి పోయేటట్టు చేస్తుంది' అన్నాడుట. నిజం చెప్పొద్దూ, రావణ్ సినిమా చూసాకా అలానే అనిపించింది. ఈ మధ్య టీ సి ఏ వాళ్ళు ఫ్రీగా "ప్రస్థానం" చూపించారు. కాసేపు సినిమాలో కూర్చుంటే, మమ్మల్ని కూడా ఏ కత్తో పెట్టి చంపేస్తారేమో అనిపించింది. సినిమా బాగోలేదని అనలేము. కానీ ఆ రక్తపాతాలు చూసి, ఆనందించడానికి మనం అంత సాడిష్టులమా అని అనిపిస్తోంది. ఆ రక్తపాతాలు నాకైతే చూడడం కొంచం కష్టం గానే ఉంటోంది.
అంతెందుకూ, డిస్నీ వాళ్ళ టాం అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతూ వుంటే, ఇది కూడా సాడిజం లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి కాదా, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే అదే కదా మరి?

ఒకసారి ఏమయిందంటే, మా వేసవుల్లో తాత గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక లారి పక్కనే వున్న టౌన్ కి వెళ్తున్నట్టు తెలిసింది. ప్రతీ వారం అది సరుకులు పట్టుకుని మా తాతగారి వూరు వచ్చేది. పూర్తిగా మూసివుంటుంది. మేము వెళ్ళి మమ్మల్ని కూడా ఆ వూరు తీసుకుని వెళ్ళమని అడిగాము. వాడు వెంటనే వొప్పుకున్నాడు. తాతగారు బాగా పలుకు బడి వున్నవారు కదా. కానీ ఆయన పొలానికి వెళ్ళిపోయారు. ఇంట్లో అమ్మమ్మ,అత్తయ్యలు, మామయ్యలు వాళ్ళ పిల్లలు పదిహేను మందిమి తయారయ్యాము. తాతగారి పర్మిషన్ కావాలి.మీరు వంట చేసెయ్యండి, మేము తాత గారిని అడిగి వస్తామని నేను, నా కజిన్ రత్నాన్ని వెంట పెట్టుకుని పొలానికి బయలు దేరాను. తూనీగల్లా పరిగెత్తి, మనసులో గాలిలో ఎగురుతూ పొలానికి చేరుకున్నాము. తాతగారు, పాలిగాపులతో దగ్గరుండి, మొక్కలకి గొప్పులు తవ్వించడం, కలుపులు తీయించడం లాంటి పనులు చేయిస్తున్నారు. మేము వెళ్ళి "తాతయ్యా, లారి వాడు తీసుకుని వెళ్తున్నాడు, ప్లీజ్, సినిమాకి పంపవా అని గారాలు పోయాము. ఏ కళ నున్నాడో, వెంటనే వప్పేసుకున్నాడు. వెంటనే పరిగెట్టుకుని పారిపోయాము, మళ్ళీ మనసు మార్చేసుకుంటాడేమో నని భయంతో. మేము వెళ్ళిన మరో పది నిముషలకే లారీ ఎక్కి వెళ్ళిపోయాము. దసరా బుల్లోడు కాక మరో సినిమా చూసి, రాత్రికి ఆ వూళ్ళోనే వుద్యోగం చేస్తున్న మా దూరపు బంధువుల ఇంట్లో పడుకుని మర్నాడు తాత గారి ఇంటికి చేరుకున్నాము. తాతగారు చాలా కోపంగా కనిపించారు. మింగలేక కక్కలేకా వున్నట్టు కనిపించారు. కారణం ఎమిటో మాకు అర్ధం కాలేదు. తరవాత తెలిసిందేమిటంటే, నేను, రత్నం మాత్రమే సినిమా కి వెళ్తున్నామని అనుకున్నారు ఆయన. ఆయన పెర్మిషన్ ఇచ్చింది మా ఇద్దరికేట. ఏదయితేనేమి, అందరం అలా లారీలో వెళ్ళడం, ఆ రోజు మేము పట్టుకుని వెళ్ళిన చింతకాయ పచ్చడి, పప్పుపులుసు అన్నం రుచి ఇంకా నా మనస్సులో మెదులుతూనే వుంటుంది. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ వుంటాము.

Tuesday, June 15, 2010

సిగ్నల్ లాస్ట్ - మేక్ ఏ యు టర్న్

ఇండియా నుంచి కొత్తగా అమెరికా వచ్చిన మా మేనల్లుడిని తీసుకుని బ్రిడ్జ్ వాటర్ హిందూ గుడికి వెళ్తున్నప్పుడు దారి తప్పి గుండ్రం గుండ్రంగా తిరుగుతున్నపుడు, ఏమిటీ “బఫ్ఫరింగా” అని నవ్వుతూ అడిగాడు మా మేనల్లుడు. బఫరింగ్ అంటే, ఇంటర్నెట్ లో ఏదైనా లింక్ నొక్కితే, గుండ్రం గుండ్రంగా తిరుగుతూ వుంటుంది కదా, అది. మా కంప్యూటర్ ఇంజనీర్ మేనల్లుడు మొదట సారిగా ఆ పదాన్ని వాడాడు మా ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు. అప్పటి నుంచీ ఎప్పుడైనా, దారి తప్పితే, బఫ్ఫరింగ్ అని నవ్వుకుంటూ వుంటాము.

మా ఆయన అర్జునుడు అంత గొప్పవారు కాదు కానీ, ఒక రకంగా సవ్యసాచి. అంటే, రెండు చేతులూ వాడుతున్నప్పుడు రెండింటిని ఒకే సామర్ధ్యంతో వాడగలరు, ఒక్క రాయడం తప్ప. మెకానికల్ ఇంజనీర్ గా  వుండిఆ టూల్స్ రెండు చేతులతో ఒకే విధంగా వాడ గలగడం, అదృష్టమే. ఒక వేళ స్పూన్ కానీ, ఫోర్క్ కానీ ఉపయోగిస్తే, రెండు చేతులూ ఆయనకీ ప్రాబ్లం వుండదు. అసలు విషయం, ఆయనకీ కుడి ఎడమ కన్ఫ్యూజన్ వుంది. రెండు చేతులూ ఒకే సామర్ధ్యం వుండడం వలన, కుడి అని చెబితే ఎడమ వైపు తిరగడం, ఎడమ అంటే కుడి వైపు తిరగడం, చాలా రెగ్యులర్ గా చేసే వారు. ఒక్క రాయడం, అన్నం తినడం లాంటివి తప్ప, ఎప్పుడూ ప్రోబ్లమే. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నేను ఎప్పుడూ నేవిగేటర్ గా వుంటాను. ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళ్లి నప్పుడు ముందు గానే ఇంటర్ నెట్ లోంచి డైరెక్షన్స్ తీసుకుని, నేను నేవిగేట్ చేస్తూ వుంటే, ఆయన డ్రైవ్ చేస్తారన్నమాట. అదిగో అప్పుడు మొదలవుతుంది ఈ బఫరింగ్. పైగా ఆయనకీ కొంచం పరధ్యానం కూడానూ, అంటే అబ్సేంట్ మైండెడ్ ప్రొఫెసర్ అన్న మాట. ఇంటి నుంచి బయలు దేరాకా, సగం దూరం వెళ్ళాకా "ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి" అని అడుగుతారు. అంటే, నాకు గుండెల్లో రాయి పడుతుంది.

ఒక హై వే తీసుకుని వెళ్తుంటే, ఇక ఎక్జిట్ వస్తోంది అంటే టైం కి ఎడమ పక్క రోడ్ మీద వుంది పోతారు. నాలుగు అయిదు మైళ్ళు ముందే చెప్పినా వినిపించుకోరు. ఒక్కొక్కసారి తిన్నగా వెళ్ళ వలసినప్పుడు, కుడి వైపు వున్న రోడ్ మీద వుండిపోయి. అది ఒక్కొక్క సారి ఎక్జిట్ అయిపోయి, మళ్ళీ హై వే జాయిన్ అవ్వడానికి గుండ్రం గుండ్రంగా తిరగవలసి వస్తుంది. టెక్సాస్ లో విషయం పరవాలేదు. ఫీడర్ పక్కనే వుంది, ఒక అరమైలు లో తిరిగి హై వే ఎక్కేయ్యవచ్చు. కానీ న్యూ జెర్సీ లాంటి చోట, ఆ ఎక్జిట్లు గుండ్రం గుండ్రంగా తిరిగి ఎక్కడికో పట్టుకు పోతాయి. తిరిగి హై వే ఎక్కడానికి ఒకటి రెండు గంటలు వెదుక్కోవలసి వస్తుంది. అది మరి బఫరింగ్ కాక ఏమిటి? ఉద్యోగ రీత్యా చాలా తిరగ వలసి వస్తుంది. మాకు తిరగడం కూడా సరదాయే ననుకోండి.
అయితే చాలా చాలా తమాషాలు ఎదురు అవుతూ వుంటాయి మాకు. కాలిఫోర్నియా స్టేట్ లో ఫ్రీవే జాయిన్ అవ్వాలంటే, అక్కడ వుండే బాణం గుర్తు భూమిలోకి చూపిస్తూ వుండేది. అంటే, గొయ్యి తీసి అందులోకి దూరాలా అన్నట్టు వుంటుంది. మిగతా చాలా స్టేట్స్ లో ఆకాశం లోకి వుండేది. ఆ బాణం గుర్తు చూసి కొంచం సేపు, ఆగి, అలోచించి జాయిన్ అవుతూ వుండేవాళ్ళం. కాక పోయినా ఏముంది, ఎక్జిట్లు వుంటాయి కదా..
న్యూ జెర్సీ లో, పరామాస్ అనే వూళ్ళో ఒక సారి మూడు నెలలు ఉండవలసి వచ్చింది. ఒక హోటల్ లో వుండేవాళ్ళం. మా ఆఫీసు పక్కనే బిల్డింగ్ లో వుండేది. రెండవ పక్కన ఒక మాల్ లో ఫుడ్ కోర్ట్ వుండేది. రోజూ అక్కడికి వెళ్లి తినవలసి వచ్చేది. ఆ హోటల్ కి కొన్ని వందల అడుగులలోనే, ఒక హై వే వుండేది. దానికి ఆవతలి వైపు పిజ్జా హట్ బోర్డ్ కనిపించేది. అక్కడికి వెళ్ళ లంటే, కార్ తీసి ఒక అయిదు మైళ్ళు వెళ్లి చుట్టూరా తిరిగి, పిజ్జా కోసం అరగంట ఆగి, మళ్ళీ అయిదు మైళ్ళు తిరిగి రావలసి వచ్చేది. అదీ, ఎక్జిట్ మిస్ అవ్వకుండా వుంటేనే. పిజ్జా హట్ వాడికి ఆర్డర్ ఇచ్చి రూం కి తెచ్చుకుందుకు ప్రయత్నించాము. కానీ, ఈ హోటల్ కి అయితే మేము రాము అని ఖచ్చితంగా చెప్పేసే వారు. ఆఖరున, మూడు నెలలు తరవాత, మేము వెళ్లి పోయే టప్పుడు తెలిసింది, మేమున్న హోటల్ పక్కన మాల్ లోంచి ఆ పిజ్జా హట్ కి వెళ్ళడానికి దగ్గర దోవ వున్నట్టు.

మా అబ్బాయి కి కొంచం ఓపిక తక్కువ. చిన్నవాడు కదా.. చాలా మంది పిల్లలు కన్నా పరవాలేదు. ప్రతీ సారీ దారి తప్పినప్పుడు వాడు, "ఒక జి పి యస్ కొన కూడదూ? ఈ బాధలు వుండవు కదా" అని విసుక్కుంటూ ఉంటాడు. నేను కూడా ఆయనకి చెప్పడం మొదలు పెట్టాను, ఎలా అయినా ఒకటి కొనమని. "ఒక వేళ దారి తప్పితే మాత్రం ఏమయింది, కొత్త కొత్త ప్రదేశాలని చూసే అవకాసం వస్తుంది కదా, మనం ఏ పరిస్థుతల లో ఎక్కడ ఎలా ఉన్నామో అది ఆనందిచడం తెలియాలి" అంటూ ఆయన ఫిలాసఫీలు మొదలు పెడతారు. దానితో మేమిద్దరం నోరు మూసుకుంటూ ఉంటాము. చివరికి ఒక సారి రేడియో షాక్ లో చవగ్గా జి పి యస్ వస్తోందని కొనేసాము.

ఇక మాకు చాలా ధైర్యం వచ్చేసింది. ఇక ప్రపంచం లో మమ్మల్ని ఎవ్వరూ జయించా లేరని అనిపించేసింది. ఇక పక్కన గ్రోసెరీ కి వెళ్ళినా, ప్రతీ వారం వెళ్ళే గుడికైనా, అంటే పక్కన ఒక మైలు దూరం లో వున్నా జి పి యస్ వాడడం మొదలు పెట్టాము. అసలు సంగతి దానికి ఎంత పరిజ్ఞానం వుందో చూడడానికి. ఒక్కక్క సారి కావాలని కొంచం ముందుకు వెళ్ళిపోవడం, 'మేక్ ఏ యు టర్న్, మేక్ ఏ యు టర్న్" అని అది అంటూ వుంటే, 'షట్అప్ " అని మేము దానిని ముద్దు ముద్దుగా తిట్టడం లాంటివి జరిగాయి. అసలు సంగతేమిటంటే, హ్యూస్టన్ లో చాలా సంవత్స రాలుగా వుండడం వలన ఊరంతా బాగానే తెలుసు. కనుక బాగానే వుండేది.
మా కష్టాలు గట్టు ఎక్కేయి అనుకున్నాము.. అంటే ఇంక "నో మోర్ బఫరింగ్" అన్న మాట.
నిజం అనుకుంటున్నారా? అయితే.. ఇది చదవండి.

హ్యూస్టన్ చుట్టూ పక్కల వున్న వూళ్ళన్నీ హ్యూస్టన్ గానే అనుకుంటాము. అంటే షుగర్ ల్యాండ్, మిస్సోరి సిటీ, కేటి, వుడ్ లేన్డ్స్ వగైరా అన్నీ.. షుగర్ ల్యాండ్ అంతా ఎక్కువ మన భారతీయులే, అందులో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా. అయితే అక్కడ సూపర్ సేట్యురేట్ అయిపోయాకా అంతా కేటి లో విస్తరించడం మొదలు పెట్టారు. నెలకి ఒకరో ఇద్దరో, 'కేటి లో ఇల్లు కొనుక్కున్నాము, గృహ ప్రవేశానికి తప్పకుండా రావాలి" అని పిలవడం మొదలయింది. తెలిసి తెలియని వాళ్ళ ఇంటికి ఎలాగా వెళ్ళాం, కానీ తప్పని సరివి నెలకి ఒకటి తగులుతోంది ఈ మధ్య. కొందరు, ఏదో ప్రత్యేక మైన పూజ, సత్యన్నారాయణ పూజ, సహస్ర శివ లింగ అర్చనా, అని చెప్పేసరికి, కొంచం దేముడు అంటే భక్తి మాట ఎలా వున్నా, భయం వుంటుంది కదా. కనుక వెళ్ళక తప్పడం లేదు. మా ఆయన గురుంచి ముందే చెప్పానుకదా.. ఎక్కడి కి వెళ్ళినా ఈ బఫరింగ్ వలన ఒక గంట ఆలస్యంగా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఆ బాధ లేదు అని అనుకున్నాము. అయితే, కేటి కి వెళ్తే, మా అభిప్రాయం తప్పని తెలిసింది.
కేటి కొత్తగా డెవెలప్ అవుతోంది కదా, అందుకని మ్యాప్ లో లేని చోటికి, కొత్త ఇల్లు కడుతున్న ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రోడ్లు కొత్తవి. అందుకని, ఒక్కొక్కసారి ఇంటర్నెట్ మ్యాప్ లోనే దొరికేవి కాదు వాళ్ళు చెప్పే చిరునామాలు, ఇక జి పి యస్ కి ఏమిటి దొరుకుతుంది? అప్పటికీ పిలిచినా వాళ్ళని ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళే వాళ్ళం. పూజలో వుండి వాళ్ళు ఎవరికో ఫోన్ అప్ప చెప్పితే, మన గతి అంతే.
ఒకసారి, ఇలానే ఒక డాక్టర్ కుటుంబం మమ్మల్ని 'హౌస్ వార్మింగ్" అంటూ పార్టీ కి పిలిచారు. మేము గిఫ్ట్ కూడా కొందామని, ఒక రెండు గంటలు ముందే బయలు దేరాము. దారిలో గిఫ్ట్ కొని, కార్ లోకి ఎక్కాము. అలవాటు ప్రకారం ముందుగానే ఇంటర్ నెట్ లో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ తీసుకుని రాసుకున్నాను. కానీ, వీళ్ళు చెప్పినా వీధి పేరు దొరక లేదు. అందుకే, వాళ్ళని అడిగి, ఇంచు మించుగా, ఎలా వెళ్ళాలో నెట్ లో మ్యాప్ ద్వారా చూసుకున్నా. అది మర్చి పోకుండా, నాలుగు సార్లు ఎలా వుందో ఆ మాప్ ని వల్లె వేసుకున్నా. మా అబ్బాయి ఎందుకైనా మంచిదని డాక్టర్ గారి అడ్రస్ జి పి యస్ లో ఫీడ్ చెయ్యడానికి ప్రయత్నించాడు. కానీ, వాడి వల్ల కాలేదు. ఆ అడ్రస్ అందులో లేదు. అయినా కూడా, కనీసం ఎక్కడ మనం ఉన్నామో తెలుసుకో వచ్చు అని పట్టుకున్నాడు.
మేము గిఫ్ట్ పట్టుకున్నాకా, వెస్ట్ హైమర్ రోడ్ మీద వెళ్ళడం మొదలు పెట్టాము. వెస్ట్ పార్క్ టోల్వే మీద వెళ్ళడానికి మాకు ఈజీ పాస్ లేదు. డబ్బులు కట్టే య్యొచ్చు అంటే పరవాలేదు. కానీ మేము ఎక్కువ ఆ రోడ్ వాడం. అందువలన, మాకు ఈ జీ పాస్ తీసుకోలేదు. మెల్లగా, వెళ్ళవలసిన ఎక్జిట్ కి చేరుకున్నాము. అక్కడనుంచి మ్యాప్ ప్రకారం కుడి వైపు తిరిగి మూడు మైళ్ళు వెళ్ళాకా కేటి గాస్టన్ రోడ్ మీద వెళ్ళాలి. వెళ్ళాకా సింకో రాంచ్ రోడ్ వస్తుంది. అది దాటి, మరో రెండు మైళ్ళు తిన్నగా వెళ్తే, వాళ్ళ ఇల్లు లాస్ట్ న, ఒక ఎడం పక్కన తిరగ గానే దొరకాలి. ఉత్సాహంగా, మొదటిసారి ఎలాంటి అవస్థా పడకుండా, టైం కి వెళ్తున్నాము అని ఆనందం కలిగింది.

అనుకున్నది అనుకున్నట్టు జరగితే, ఇది మా జీవితం ఎలా అవుతుంది. అది మరపురాని సంఘటన కూడా అవదు.
కేటి గాస్టన్ రోడ్ మీద సింకో రాంచ్ వరకు వెళ్ళాము. అది తిన్నగా కంటిన్యూ అయింది. నా మెదడులో ఉంచుకున్న చిత్రం ప్రకారం, కొంచం కుడి పక్కకి వెళితే, అది మళ్ళీ కేటి గాస్టన్ పేరుతోనే, వెళ్ళాలి. దాని మీద రెండు మైళ్ళు వెళ్ళాలి. కానీ, ఈ రోడ్ తిన్నగా వెళ్తోంది. చిన్న అనుమానం మనసులో వచ్చింది. మా ఆయనతో అంటే, 'నీ మొహం, ఈ రోడ్ తిన్నగా వెళ్తూ వుంటే, కుడి పక్కకి వెళ్ళాలి అంటా వేంటి? నాతో వుండి, వుండి, నువ్వు కూడా నాలానే తయారు అవుతున్నావు" అన్నారు. నేను "ఎందుకైనా మంచిది, ఇక్కడ 'షల్ గ్యాస్ స్టేషన్' లో కనుక్కోకూడదా" అన్నాను. " నీకు చాదస్తం అని వినకుండా, ఆ రోడ్ మీద తిన్నగా పోనిచ్చారు. తీరా ఆ రోడ్ పావు మెయిల్ వెళ్లి రెండు గా చీలిపోయింది. కుడి పక్కన, అంతా చీకటి గానూ, ఏవీ ఇళ్ళూ అవి లేక ఖాళీగా వుండి. అయినా కుడి పక్క వెళ్లి, ఒక మెయిల్ వెళ్తే, అక్కడ రోడ్ డెడ్ ఎండ్ అయిపోయింది. దానితో యు టర్న్ తీసుకుని, మళ్ళీ కొనసాగించాము. కనీసం ఇప్పుడైనా వెనక్కి వెళ్లి, సింకో రాంచ్ మీద నేను చెప్పాను కదా, కుడిపక్క కి తిప్పమని అని గొడవ పెట్టాను. ఆయన వినకుండా, తిన్నగా.. అంటే ఇందాకా కుడిపక్క తిరిగాము కదా, ఇప్పుడు కేటి గాస్టన్ కి ఎడమ పక్క వైపు వున్న రోడ్ మీదకి వెళ్ళాము. అక్కడ చాలా ఇల్లు వున్నాయి కానీ, మాకు కావలిసిన యక్కా రోడ్ దొరక లేదు.
"నేను ముందే చెప్పానా, మ్యాప్ ప్రకారం, కుడి పక్కకి తిరగాలి" అని చెప్పా. నేను నేవిగేటర్ ని కదా. నాకు నా మీద నాకు చాలా నమ్మకం మరి.
దానితో మళ్ళీ తిరిగి షల్ గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. నా మ్యాప్ ప్రకారం, మరో పావు మెయిల్ లోనే ఎడమ పక్క ఒక రోడ్ కేటి గాస్టన్ పేరుతోనే వుండాలి. కానీ, మూడు, నాలుగు మైళ్ళు వెళ్ళినా, ఒక్క రోడ్ రాలేదు. రెండు బ్రిడ్జి లు కూడా దాటాము. అయినా, ఆ పేరు రోడ్ రాలేదు. దానితో , మెల్లీ యు టర్న్ తీసుకున్నాము. మళ్ళీ షల్ గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చా. ఇక లాభం లేదని, అక్కడ గ్యాస్ పోయించుకుంటున్న ఒక భారతీయుడు కనిపించాడు. అతనిని సలహా అడిగాము. అతను వెంటనే, సింకో రాంచ్ మీద ఎడమ వైపు తిరిగి మూడు మైళ్ళు వెళ్తే స్ప్రింగ్ గ్రీన్ రోడ్ వస్తుంది, దాని మీద కుడి పక్క తిరిగి, మరేదో రోడ్ మీద ఎడమ పక్క తిరిగితే మేము అడుగుతున్నా యక్కా రోడ్ వస్తుందని చెప్పాడు. కానీ నేను ఓటమి అంత తొందరగా వప్పుకోనుగా. అందుకే అతనిని అడిగాను, అదేమిటి, మ్యాప్ లో ఇటువైపు రాసేరు అని. అతను, ఇక్కడ కొత్తగా డెవలప్ అవుతోంది కదా, రోజూ రోడ్స్ డైవెర్ట్ చేసేస్తున్నారు అని చెప్పాడు. బ్రతుకు జీవుడా అని, తిరిగి బయలు దేరాము.
సరే ఎలా అయితేనే, వల్ల ఇంటికి మరో పావు గంట లో చేరుకున్నాము. దారిలో, మరో కేటి గాస్టన్ రోడ్ దొరికింది. అది కూడా, ఒక అరమైలు వెళ్లి ఆగి పోయినట్టు బోర్డ్లు కనిపించాయి. కానీ అతను నమ్మకం కుదిరేటట్టు చెప్పడం తో , అతను చెప్పినట్టు వెళ్ళాము.
కార్ పార్క్ చేసి లోపాలకి వెళ్ళాము. మాలానే చాలా మంది అవస్థ పడ్డట్టు తరవాత తెలిసింది. అంతటితో కథ అయిపోయింది అనుకుంటున్నారా.. అబ్బే లేదు.

వ్రతం తరువాత, గుజరాతీ వాళ్ళు చెప్పినట్టు, భజన్, భోజన్ రెండూ పూర్తీ అయ్యాయి. ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా మరి. మన ఇంటికి మనమే వెళ్ళలేమా అనుకున్నా. అయితే, జరిగిందేమిటంటే, ఈ అమెరికాలో, ఎందుకు అలా కడతారో తెలియదు కానీ, ప్రతీ కోలనీ ఒక పద్మ వ్యూహం లా కడుతూ వుంటారు. ఆ వ్యూహం లోంచి బయటికి రావడం అంత సులభం కాదు, మీకు బాగా ఆ కోలనీ తెలిస్తే తప్ప. అందులో మేము.. మాకా దారి తెలియదు. ఆ ప్రాంతం కొత్త, అదా కొత్త కోలనీ. అవన్నీ ఎలా వున్నా మా దగ్గర జి పి యస్ వుంది కదా. ఆ ధైర్యం తోనే ఆ మాత్రం వెళ్ళలేమా అనుకున్నాము.

నేను ఆయనతో, "ఇందాకా, కుడి వైపునుంచి వచ్చాము, కనుక యు టర్న్ తీసు కోండి" అన్నా.
ఏమీ అఖ్కర లేదు, పక్క రోడ్ మీద కుడి పక్క తిరుగుతా అన్నారు. "ఎందుకూ జి పి యస్ ఉందిగా" అన్నాడు మా వాడు. వెంటనే ఆన్ చేసి మా ఇంటి అడ్రస్, హోం కోసం నొక్కాడు. జి పి యస్, "సిగ్నల్ లాస్ట్, సిగ్నల్ లాస్ట్" అని చెప్పడం మొదలు పెట్టింది. "కాసేపు నోరు మూసుకోవే" అని ముద్దుగా కసిరాను.
చూస్తూ చూస్తూ ఉండగానే, అక్కడే నాలుగు చక్కర్లు కొట్టేరు. మళ్ళీ దారి తప్పేము. అసలు ఆ పద్మ వ్యూహం లోంచి ఎలా బయట పడాలో తెలియ లేదు. సింకో రాంచ్ దాకా వెళ్తే, మేము ఇంటికి వెళ్లి పోగలము. కానీఅక్కడి కి ఎలా వెళ్ళాలో తెలియలేదు. అక్కడ అక్కడే తిరుగుతూ అరగంట గడిచింది. ఈ లోగా, ఒక సారి సిగ్నల్ లాస్ట్ అనీ, మరో సారి మేక్ ఎ యు టర్న్ అనీ అరుస్తోంది జి పి యస్.
ఈ లోగా ఒక వింత జరిగింది. మమ్మల్ని ఎవరో వెంటాడుతున్నట్టు అనిపించింది. కొంచం మా ఆయన కార్ స్లో చేసారు. వెనుక నున్నా వాళ్ళు ఒక చెయ్యి ఊపి ముదుకు వెళ్లి మెల్లగా వెళ్ళ సాగారు. చేతితో వెంట రమ్మని చిన్నగా సైగ కూడా చేసారు. మాకు అర్ధం అయింది. మేము తప్పి పోయినట్టు, ఆ గృహ ప్రవేశానికి వచ్చిన ఒకరికి తెలిసి పోయి వుంటుంది. మాకు సహాయం చేసి, మాకు రోడ్ చూపించడానికి ఆ భగవంతుడు మాకోసం పంపిన దేవ దూత అనుకున్నాము. అతని వెంట వెళ్ళడం మొదలు పెట్టాము. ఆ కార్ లో మరొక వ్యక్తీ కూడా వున్నట్టు గ్రహించాము. కానీ చీకటిలో ఎవరు వున్నారో సరిగ్గా తెలియలేదు. కొంపదీసి వేరే జాతి వాళ్ళు మూలకి పట్టుకెళ్ళి తన్నారు కదా అన్నాను భయం భయం గా. లేదులే, భారతీయుల్లగానే వున్నారు అన్నారు ఆయన. ఆ కార్ ఒక ఇంటి ముందు ఆగింది. దూరం నుంచే కార్ గరాజ్ తెరిచారు. "ఇదేమిటి, వీళ్ళు ఇంటికి పట్టుకెళ్తున్నారు? " అన్నాను. మా ఇద్దరికీ నవ్వు వచ్చింది. వాళ్ళు భారతీయులే. కార్ దిగి గరాజ్ పైకి వచ్చి, నడుం మీద చేతులు వేసుకుని, మా కోసం ఎదురు చూడ సాగారు. పక్కకి కార్ ఆపి, మేము కార్ దిగాము. కనీసం ,వాళ్ళని దారి అడగ వచ్చని. వాళ్ళు మమ్మల్ని చూసి నివ్వెర పోయారు. మేము మెల్లగా వెళ్లి, మేము తప్పి పోయామని, వాళ్ళని దారి అడగ దానికి వచ్చామని చెబితే, పక పకా నవ్వ సాగారు. విషయం ఏమిటంటే, వాళ్ళు ఎవరినో, డిన్నర్ కి పిలిచారట. రావలిసిన వాళ్ళు తప్పి పోయి, అక్కడే తిరుగు తున్నారుట. వాళ్ళని కలిసి దగ్గర వుండి తీసుకుని వద్దమనుకుని బయలు దేరారుట. మేము వెతుక్కుంటున్నట్టు కనిపించగానే, వాళ్ళ స్నేహితులే అనుకుని, వారి వెంట తీసుకుని వెళ్ళారు. వారు నవ్వేసి, మాకు ఎలా వెళ్ళాలో చెబితే, మరో పడి నిముషాలలో, సింకో రాంచ్ మీదకు చేరుకున్నాము.
అక్కడినుంచి.. మా అంతట మేము ఇల్లు చేరుకొని, ' ఈ సారి కేటి లో ఎవరైనా పిలిస్తే నేను రాను' అని గట్టిగా మా ఆయనకి చెప్పేసా.. కానీ .. నిన్ననే ఒక పిలుపు వచ్చింది.. కేటి లోనే ఎవరో ఇల్లు కొనుక్కున్నారని.. తప్పదు... వెళ్ళాలి మరి.. సంఘ జీవులం కదా మరి.

Monday, June 14, 2010

అన్వేషణ -సెర్చ్ ఇంజిన్

ఈ జీవిత పరమార్ధం ఏమిటి? భగవంతుడు అనే వాడు వున్నాడా? అసలు ఈ సృష్టి రహస్యం ఏమిటి ఇలాంటి సత్యాన్వేషణ అనుకుంటున్నారా? అబ్బే, అదేమీ కాదు.
పొద్దున్న లేచిన మొదలు ఏదో ఒకటి వెతుక్కో వడం అన్నమాట. అంతే, పొద్దున్నే, నిద్ర కళ్ళతో బ్రష్ టూత్ పేస్ట్ దగ్గరనుండి, లేక కళ్ళజోడు, రాత్రి పడుకునే టప్పుడు చదువు దామను కున్న మగజైన్ దాకా.. వెతుక్కోవడం.
నేను చిన్నప్పటి నుంచి అన్నీ చాలా బాగా ఆర్గా నైజెడ్ గా పెట్టుకునే దాన్ని. అందువలన, నాకు కావలిసిన అన్ని వస్తువులూ, నిద్రలో కూడా కళ్ళు మూసుకుని తీసుకునేటట్టు అన్నీ పెట్టు కునేదాన్ని. విషయం, అప్పుడు, నాకు తప్ప, ఇంట్లో అందరికీ ప్రాబ్లం వుండేది. అమ్మకి ఇంట్లో కావలిసిన వస్తువులు ఏమీ కనిపించేవి కావు. అంతే.. కళ్ళు కనిపించడం కాదు.. చీర నచ్చినది దొరికితే, మాచింగ్ జాకెట్ దొరికేది కాదు. వంటిట్లో ఉప్మా చేద్దామంటే, గోధుమ నూక దొరికేది కాదు. స్టవ్ వెలిగిదామంటే, అగ్గిపెట్టె కనిపించేది కాదు, లేదా లైటర్ కనిపించేది కాదు. ఇలా ఒకటి కాదు. రోజంతా వేదుకులాటే. నాన్న గారికి ఎప్పటివో న్యూస్ పేపర్ లు కావాలని అడిగేవారు. అందులో ఆయనకీ కావలిసిన ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ కావాలి అని. న్యూస్ పేపర్లు అన్నీ ఒక వరుసలో దొరికేవి కావు. దొరికినా, కావలిసిన పేజీ దొరికేది కాదు.
అయితే మరో విషయం ఎమిటంటే నా వస్తువులు అన్నీ సరిగ్గా పెట్టుకుంటాను కదా, అందుకని మిగతా ఇంట్లో వాళ్ళంతా, నేను ఖాళీ గానే వున్నాను కదా అని అన్నీ నన్ను వెదకమనే వారు.
అన్నయ్యకి కాలేజీ టైం కి పెన్ దొరికేది కాదు. బయటికి వెళ్ళడానికి, చెప్పుల్లో ఒక చెప్పు దొరికేది కాదు. అప్పట్లో డ్రెస్సింగ్ టేబుల్ వుండేది కాదు. దువ్వెన్న అడ్డం వెనకనే పెట్టే వాళ్ళం. ఆఫీసు కి తయారు అవుతుంటే, తల దువ్వుకుందుకు దువ్వెన్న దొరికేది కాదు. వాడికి చాలా కోపం వచ్చేది. "ఇలా కాదు, ఈ సరి ఓ డజను దువ్వెన్నలు తెచ్చి ఇల్లంతా జల్లేస్తాను అప్పుడు ఎక్కడ చూసినా దువ్వెన్నే కనిపిస్తుంది " అని అరిచే వాడు. చిన్నన్నయ్య కిసుక్కుని నవ్వి, ' ఒకటి కొనుక్కుని జేబులో పెట్టుకో' అని గొణిగే వాడు. అక్క తల దువ్వుకుని ఎక్కడో పెట్టేసేది. ఇంటిల్లిపాదిమి వెదికితే, ఇంత జుట్టుతో, ఏ మంచం వెనకో మూల కిటికీ దగ్గరో కనిపించేది. నానా తిట్లూ తిట్టుకుంటూ అది శుభ్రం చేసుకుని, తల దువ్వుకునే వాడు.
"నా పెళ్లి అయ్యాకా, నా ఇల్లు చక్క గా పెట్టుకోవాలి. ఏ వస్తువూ వెతుక్కునే పరిస్థితి వుందా కూడదు. అసలు అలాంటి పరిస్థితి రాదు".. అనుకునే దాన్ని. నాకేమి తెలుసు అప్పుడు, నా ఇల్లు అంతే, నేను ఒక్కర్తినే కాదు, అత్త వారింట్లో చాలా మంది ఉంటారని..
పరీక్ష కి వెళ్ళే ముందు హాల్ టికెట్ కనిపించదు. అది అందరికీ మామూలే. చాలా జాగ్రత్త గా దాచి, ఆఖరు నిముషం లో ఎక్కడ పెట్టేమో మర్చి పోయేవాళ్ళం.
నేను ఏరి కోరి చేసుకున్న నా భర్త ఏమీ వెతుక్కోరు. అసలు అతనికి అలాంటి అవసరం వుండదు. ఎందుకంటే, రిమోట్ కంట్రోల్ లాగా నేనున్నాను కదా.. ఏమి కావలిసినా, గట్టిగా నన్ను కేకేస్తారు. అంతే, తన డ్యూటీ అయిపోయినట్టే. మిగతా భాద్యత నాది. పోనీ, తాను ఎక్కడైనా ఒక చోట ఆనవాలుగా పెడతాడా అంతే, అదీ లేదు. కట్టుకునే గుడ్డలు దగ్గర నుంచి, సాక్స్, టై, షూస్ అన్నీ వేడుక్కోవలిసిందే. సాధ్యమైనంత వరకూ చాలా ఆర్గానిజేడ్ గానే పెట్టేస్తాను. కానీ, సడన్ గా మా ఆయనకీ నాకు సాయం చెయ్యాలని బుద్ధి పుట్టి, ఇల్లు సద్డడం మొదలు పెడతారు. నేను వంటలోనో, బాత్ రూంలోనో బిజీ గా వున్నప్పుడు, అలాంటి బుద్ధి పుడుతుంది. మరో గంటకి ఇల్లు చాలా ఖాళీ గానూ విశాలంగానూ అనిపిస్తుంది. చెప్పొద్దూ చాలా బాగా సర్దుతారు. మనసుకి చాలా ఆనందం గా వుంటుంది. అదిగో.. అప్పుడు మొదలవుతుంది అసలు ప్రాబ్లం. ఫ్రిజ్, సోఫా, టి వి, మంచాలూ లాంటివి తప్ప, ఇంట్లో కావలిసిన మిగతావి ఒక్క వస్తువు కనిపించదు. రోజూ వేసుకునే మందులు, నేను పెట్టుకునే వాచ్ దాగ్గర నుంచి, తువ్వాళ్ళూ, నేను చదివే పుస్తకాలు, కత్తెరలు, పెన్నులు, ఒకటేమిటి.. మాకు ఇంకా ఏ వస్తువు కావలిసినా, మళ్ళీ ఇల్లు మారితే గాని దొరక కుండా చేసేస్తారు.
ఆయన వుద్యోగ రీత్యా టూర్ వెళ్ళినప్పుడు, సడన్ గా ఫోన్ చేసి, ఫలానా ఫైల్ లో ఎదో కాగితం కావాలి అది తీసి వుంచు అని గభరా గభరాగా చెప్పే వారు. సరే నా పని పూర్తి చేసుకుని, ఆయన చెప్పిన ఫైల్ చూస్తే ఆయనకి కావలిసిన 'ఫలానా' కాగితం వుండేది కాదు. ఓపిగా మిగతా ఫైల్స్, ఇంట్లొ వున్న అన్ని అలమారాలూ వెదికేదాన్ని. కానీ చచ్చినా దొరికేది కాదు. రోజంతా వెదుకుతూనే వుండేదాన్ని. ఆయన వచ్చేవరకూ మనస్సు స్థిమితం గా వుండేది కాదు. తీరా వచ్చాకా భయపడుతూ, ఆ కాగితం దొరక లేదని బిక్క మొహం వేసి చెబితే, 'ఏ కాగితం?" అని ఓ పది నిముషాలు అలోచించి.. "ఒహ్ అదా, అంత పెద్ద అవసరం లేదులే" అనే వారు. నాకు ఎదైనా పట్టుకుని ఒక్కటి మొత్తాలని అనిపించేది.
ఇక మా వాడు.. 'అమ్మా'' అని ఓకే పొలికేక పెడుతూ ఉంటాడు. ఏమిటి అంతే, నా కళ్ళ జోడు కనిపించడం లేదు అంటాడు. కళ్ళజోడు మాత్రం ఎవరిది వాళ్ళు వేడుక్కోలేరు కదా.. మరొకళ్ళు వెదకాల్సిందే. ఇక అప్పుడు నేను డిటెక్టివ్ ఏజెంట్ లాగా, " ఆఖరు సారిగా ఎప్పుడు పెట్టుకున్నావు, ఆ తరవాత ఎక్క డెక్కడికి వెళ్లావు. స్నానం చేసావా? బాత్ రూం లోకి వెళ్ళినప్పుడు పెట్టు కున్నావా?" ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ వుంటే, వాడు విసుక్కు పోతూ ఉంటాడు. వాడి ఐ పాడ్ స్పీకెర్స్, పెన్ డ్రైవ్స్, పుస్తకాలూ.. ఒకటేమిటి, తెల్లవారి లేచి పడుకునేదాకా అన్నీ వెదికి ఇవ్వ వలసిందే.
పప్పులు అన్నింటికీ స్టీల్ డబ్బాలు వున్నాయి. ఏ డబ్బాలో ఏ పప్పు వుంటుందో కనిపించవు. కానీ, ఒక ఆర్డర్ లో పెట్టుకునే దాన్ని. మొదటిది కందిపప్పు, రెండోది మినప్పప్పు, మూడోది సెనగ పప్పు... ఇలా అన్నా మాట. వంట గబా గబా చేసేద్దామని తొందరలో, కొలత గ్లాస్ తీసుకుని కండి పప్పు డబ్బా తీస్తే, తీరా అందులో ఏ సెనగ పప్పో వుండేది. ఇప్పుడు కంది పప్పు ఎక్కడ వుందో వెతుక్కోవడం అన్నమాట. ఒక ఆరు డబ్బాల మూతలు చూసాకా, ఏడో డబ్బాలో దొరికేది. నాకు చచ్చినా అర్ధం అయ్యేది కాదు అందులోకి ఎలా వెళ్లిందో. మా అత్తగారు, కంది పప్పు కొంచమే వుంది కదా అని, ఆ కంది పప్పు మరో చిన్న డబ్బాలో పోసి, కొత్తగా తెచ్చిన సెనగ పప్పు ఎక్కువ వుంది కదా అని కంది పప్పు డబ్బాలో పోసేవారు.. గ్రైండర్ బ్లేడ్స్ దొరికేవి కావు. జంతికిల గొట్టం లోపల వుండే బిళ్ళలు కనిపించేవి కావు. అవన్నీ జాగ్రత్తగా తుడిచి మా అత్తగారు జాగ్రత్తగా దాచేవారు. ఎక్కడ పెట్టారో మర్చి పోయేవారు. కుక్కర్ లో ఒక ప్రత్యేక మైన అన్నం గిన్నె వుండేది అందరికీ సరిపడే అన్నం వుడికేటట్టుగా. దానికి సరిపడా ఒక్కటే మూత వుండేది. మిగతావి కుక్కర్ కన్నా పెద్దవి లెదా, అన్నం గిన్నె కన్నా చిన్నవి అవడం తో, ఆ మూత జాగ్రత్తగా దాచేదాన్ని. కానీ కుక్కర్ పెట్టేవేళకి దొరికేది కాదు. ఒక గంట ఇల్లంతా వెదికేక, అత్తయ్య గారిని అడిగితే, 'మా బాత్ రూం లో చూడు ' అనే వారు. తీరా చూసాకా అక్కడ దొరికేది. మా అత్తగారు సున్నిపిండి వేసుకుని పట్టుకెళ్ళానని చెప్పేవారు. అన్ని పళ్ళేలు వున్నప్పుడు, ఆ పళ్ళెం లోనే సున్ని పిండి వేసుకోవాలా అని నవ్వుతూ అడిగేదాన్ని. కొంచం సేపు ఇల్లంతా తిరిగితే ఎక్సెర్ సైజ్ అవుతుంది అని నన్ను వేళాకోళం చేసేవారు.అదీ సంగతి.. చెప్పొచ్చేదేమిటంటే, ఆ వెదుకుళ్ళాటలు తప్పేవి కావు.
ఇక అమెరికా కి వచ్చేకా, చాలా మటుకు వెతుకుళ్ళు మొదట్లో తగ్గాయి. కొత్తలో మరీ ఎక్కువ సామాను వుండదు కదా.. అందుకన్నమాట. తరవాత తరవాత మళ్ళీ కొత్త వెదు కుళ్ళు. కరంటు, టెలిఫోన్ బిల్లు లు కడదామంటే, మరి ఎక్కడ పెట్టేసేవల్లమో ఒక పట్టాన దొరికేవి కావు. ఫోన్ లు చెయ్యడానికి ఫోన్ నంబర్లు దొరకేవి కావు. బిల్స్ మైల్ చెయ్యడానికి తెచ్చిన స్తాంప్స్ దొరికేవి కావు.
సాఫ్ట్ వేరు లో కొంచం ప్రవేశం వచ్చాకా, ఎక్సెల్ లో కొన్ని కొన్ని విషయాలు నోట్ చేసుకునేదాన్ని. అప్పటికీ, ఎక్కడ ఏ ఫైల్ దాచోనో, గుర్తు పెట్టు కుందుకి, అది వెతికే పద్దతి తెలియడానికి కొంత కాలం పట్టింది. హమ్మయ్య, కంప్యూటర్ వచ్చాక కొంచం బాగానే వుంది అనేసరికి నా ప్రాణానికి విష్టా విడుదల అయింది. మా ఆయన కొత్త కంప్యూటర్ కొనుక్కుని, రెండురోజులు అందులో వున్న అన్ని ఫీచర్స్ గురించి తెగ చెప్పి, ఎగిరి గంతేసి, డాన్సులు చేసి, నన్ను ఉడికించ దానికి ప్రయత్నించారు. ఇన్ బిల్ట్ వెబ్ కాం తో చూడడానికి చాలా బాగుంది. మూడో రోజున నా మొహాన పడేసారు ఆ విష్టాతో పడలేక. విష్టా లో బేసిక్ ఎడిట్, కాపీ, పేస్టు కూడా ఎక్కడ వుంటాయో వెతుక్కునే పరిస్థితి వచ్చింది. నాకు ఆయన కన్నా కొంచం ఓపిక ఎక్కువ కనుక, ఓపిగ్గా నేర్చుకోవడం మొదలు పెట్టా. కొన్నాళ్ళకి అలవాటు పడ్డాను. కానీ మళ్ళీ కంప్యూటర్ మొదటి నుంచి నేర్చుకున్నట్టే అనిపించింది.
నాకు కంప్యూటర్ లో చాలా ఇష్టమైనవి సెర్చ్ ఇంజిన్స్. హాయిగా ఏది కావాలో అది టైపు చేసి వెతుక్కోవచ్చు. అబ్భ, అలాంటి సౌకర్యం ఇంట్లో కూడా, ఇంట్లో వస్తువులు వెతుక్కుందుకి వీలుగా, ఏదైనా పరికరం కనుక్కుంటే బాగుండును.

ఇంట్లో అవసరమైనప్పుడు స్క్రూ డ్రైవర్, నట్లూ, బోల్టులూ,సుత్తి ఒకటేమిటి, ఎవరికి ఏమి కావలసి వచ్చినా ముందుగా వెదకడానికి పిలిచేది నన్నే.
పొద్దున్న లేచిన మొదలు, రాత్రి పడుకునే వరకూ ఎదో ఒకటి వెతుక్కోవడమే.
'అమ్మా' అని గావు కేక పెడుతున్నాడు మా అబ్బాయి.. ఏమి చెయ్యను?ఈ ఇంట్లో అందరికీ రిమోట్ కంట్రోల్, సెర్చ్ ఇంజిన్ నేనే కదా మరి..

ప్యాస్సెంజెర్ ట్రైన్లో ప్రయాణం.

ప్యాస్సెంజెర్ ట్రైన్లో ప్రయాణం.
చాలామంది ప్రయాణం అంటే విసుక్కుంటూ వుంటారు. నాకుమాత్రం భలే సరదా. చిన్నప్పుడు ఎప్పుడు బస్సు లోనే ప్రయాణం చేసేవాళ్ళం. నా చదువు పూర్తయ్యాకా, వుద్యోగంలో చేరేక, నా ట్రైన్ ప్రయాణాలు మొదలయ్యాయి. ఇప్పుడు నేను చెప్పబోయె ప్యాస్సెంజెర్ ప్రయాణం చాలా కాలం క్రితం జరిగిందిలెండి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. అప్పటికి ఆంధ్రాలో టివి యే రాలేదు. గవర్న్మెంట్ కాలేజీ లో జూనియర్ లెక్చురెర్ గా పని చెస్తూవుండే దాన్ని. మేము విశాఖపట్నం లో వుండేవాళ్ళం. దగ్గరగా వున్న యలమంచిలో నాకు పోస్టింగ్ వచ్చింది. రోజూ పొద్దున్నే ఎనిమిది గంటలకి సింహాద్రిఎక్స్ ప్రెస్స్ ఎక్కి, సయంకాలం అదె ట్రైన్ లో వెనక్కి తిరిగి వచ్చేదాన్ని. ఆ ట్రైన్ విశాఖపట్నం రాజమండ్రి మధ్యన షట్ట్ ల్ ట్రైన్. తరవాత ఆ ట్రైన్ ని విజయవాడ, గుంటురు దాక మార్చినట్టు గుర్తు. ట్రైన్ ప్రయాణమైతే అసలు ప్రయాణం చెసినట్టు వుండదు. భలే కాలక్షేపం కూడా. ఫెద్ద కిటికీలు, విశాలంగా కూర్చోవచ్చు. బాత్ రూం సౌకర్యం వుంటుంది. కట్టుకున్న చీర నలిగిపోదు. ముప్పయ్ నిముషాల్లో అనకాపల్లి చేరితే, మరో ఇరవై అయిదు నిముషాల్లో యలమంచిలిలో దిగేదాన్ని. ఫది గంటలకల్లా కాల్లేజ్ చేరుకునేదాన్ని. పెద్ద అలసటగా కూడ వుండేదికాదు.
పొద్దున్నే లేచి, బాక్స్ లో కూర అన్నం, మజ్జిగ అన్నం పాక్ చేసుకుని వెళ్ళేదాన్ని. రైల్వే స్టేషన్ కి బస్ మీద పది నిముషలలో వెళ్ళొచ్చు. లేదా, రిక్షా లో కూడ వెళ్ళొచ్చు. ఒక మైల్, మైలున్నర దూరం వుంటుంది. కాల్లేజ్ లో పాఠాలు చెప్పడం కన్నా, ఏ ట్రైన్ ప్రయాణం చాలా ఎక్సైటింగ్ గా వుండేది నాకు. రోజు కొంతమంది నాతొ అదే ట్రైన్లొ ప్రయాణం చేసేవారు. మా కాల్లేజ్ లోనె పని చేస్తున్న బోటని లెక్చురెర్ సత్యన్నారయణ గారు, మా కాల్లేజ్ లైబ్రేరియన్ వెంకటేష్, అదే వూళ్ళొ ఎదో గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్న మరో నలుగురు వుద్యోగస్తులు అంతా ఒకె కంపార్ట్మెంట్ లో వెళ్ళేవాళ్ళం. ఫ్రతి నెలా మంథ్లీ పాస్ తీసుకునేవాళ్ళం. రెగ్యులర్ పాస్సెంజెర్స్ ఏ ట్రైన్లోనైన ఎక్కొచ్చు. రొజూ వాళ్ళందరి కబుర్లు వింటూ వుంటే న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరమే వుండేది కాదు.
యలమంచిలి స్టేషన్ నుంచి ఓక పది నిముషాలు నడిస్తే, కాల్లేజ్ లొ వుండేవాళ్ళం. కొంతమంది స్తూడెంట్స్ అనకాపల్లి నుంచి వచ్చేవారు. అక్కడ సీట్ రానివాళ్ళు యలమంచిలి కాల్లేజ్ లో చేరేవాళ్ళు. యలమంచిలి కాల్లేజ్ హాకీ టీం కి ప్రసిద్ధి. రోజూ ట్రైన్లో ఎక్కే వాళ్ళ హడావిడి, వెళ్ళొస్తానమ్మా.. అలాగే, వెళ్ళగానే వుత్తరం రాయి, అందరిని అడిగేనని చెప్పు.. బాగా చదువుకో.. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి.. సామాన్లు జాగ్రత్త… ఇలాంటి సంభాషణలతో పాటు, కాఫీ.. కాఫి,చాయ్.. చాయ్.. ‘విశాఖపట్నం నుండి రాజమండ్రి పోవు… . సింహాద్రిఎక్స్ ప్రెస్స్. మూడవ నంబరు ప్లాట్ ఫాం నుంచి బయలుదెరుటకు సిద్ధముగా వున్నది.. లాంటి అనౌన్స్ మెంట్స్…. చాలా మందికి విసుగ్గా అనిపించినా, నాకు మాత్రం శ్రవణానదం గా వుంటాయి. వేరు శనగలు అమ్మేవాడు, సమోసాలు అమ్మేవాడు, కీరా ముక్కలు అమ్మేవాడు.. కంపర్ట్ మెంట్లు కూడా హడావిడిగా వుంటాయి. పొద్దున్నే ట్రైన్లో అంతమంది వుండరులెండి.. నాకు మాత్రం ట్రైన్ ప్రయాణం ఎంత ఇష్టమో చెప్పలేను.
ఒకసారి ఎమైందో తెలుసా?
రోజులాగే ఆ రోజూ కాల్లేజి కి వెళ్ళేను. కాల్లేజ్ అయిపొయాకా సాయంత్రం స్తేషన్ కి వచ్చాను. కొందరు స్టూడెంట్స్, బోటని లెక్చురెర్ గారు, అంతా బెంచ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరో పావుగంటలో ట్రైన్ రావాలి. నా కోసం కొందరు స్టూడెంట్స్ జాగా చేస్తే కూర్చున్నా. ట్రైన్ వచ్చే సూచనలేమి కనిపించలేదు. అయిదు పదిహేను కి రావలి. ఆరున్నర వరకు వచ్చేస్తోందని ఎదురు చూసాము. అనౌన్స్ మెంట్ కూదా లేదు. చిన్న స్టేషన్. పెద్దగా హడావిడి కూడ వుండదు. ఎదురుగా కొండలు, పక్కనే పొలాలు.. పచ్చగా.. చూడడానికి అందం గానె వుంటుంది… కాని ఎంతసేపని అనందిస్తాము? . సరే సంగతేమితో కనుక్కోమని, ఒక స్తూడెంట్ ని స్టేషన్ మాస్టర్ దగ్గరకి పంపాము.ఎక్కదో ఏదొ ప్రొబ్లెం ట, ట్రైన్ లేట్. మేము చూస్తూ వుండగానే, కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఝామ్మని వెళ్ళిపొయింది. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఇలాంటి చిన్న స్టేషన్స్ లో ఆగదు. ఏమిచేద్దామురా దేముడా అని..అందరం గాభరా పడసాగేము.
రాత్రి ఎనిమిది అయింది. ఈ లోగా.. చిన్నప్పుడు చదువుకున్న పాటలా ఛుక్ చుక్ రైల్ వచ్చింది… దూరం దూరం జరగండి అన్నట్టు ఒక ట్రైన్ వచ్చింది . ఆది మేమనుకున్నట్టు సింహద్రి ఎక్స్ ప్రెస్ కాదు . అది ఒక ప్యాసెంజర్ ట్రైన్. కూరగాయల వాళ్ళు, చేపల బుట్టల వాళ్ళు.. చాలా మంది రోజూ చిన్న చిన్న వ్యాపారస్తులు అందులో చిన్న చిన్న వూళ్ళనుంచి ప్రయణం చేస్తారు. చాలా కిక్కిరిసి వుంది. అందులో చాలా ట్రైన్స్ రాలేదెమో , మరీ కిట కిటలాడుతోంది . నాతో వున్నవాళ్ళు అందరూ ఎక్కేసారు. ఎక్కాలా, వద్దా.. అని ఆలోచిస్తున్నా. స్టేషన్ మాస్తర్ మరో గంత వరకు సింహద్రి ఎక్స్ ప్రెస్ రాదు అన్నాడు. అందరు నన్ను చూసి, మేడం గారు, ఒక్కరే వుండిపొతారు. మీరు ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూసే లోపల, మేమంతా వైజాగ్ వెళ్ళిపోతాము, రండి ఎక్కండి అని తొందర పెట్టారు. ఈ లోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. నేను ఒక్కదాన్ని అక్కడ వుండిపోవడం ఇష్టం లేక, వాళ్ళతో ఎక్కేసాను. ట్రైన్ వానపాములా మెల్లగా కదిలింది. చచ్చామురా దేముడా కాని ఇది వైజాగ్ వరకు ఇలాగే వెళ్తుందా అనుకుంటున్న సమయం లో, మెల్లగా వేగం పుంజుకుంది. ఛల్లగా గాలి కూడ వీస్తోంది
ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అబ్భ ఇంటికి వెళ్ళగానే, అన్నయ్య సుత్తి వినాలి. నేను ముందే చెప్పాను, దీనికిపెళ్ళి చేసేయండి ఆసలు దీనికి చదువులు వుద్యోగాలు ఎందుకు .. అంటూ మొదలెడతాడు. నాన్నగారు మంచి వారు. ఆయనకి నా మీద చాల నమ్మకం, ప్రేమ. అన్నయ్య కన్న నేనే స్మార్ట్ అని ఆయన అభిప్రాయం.. పాపం అమ్మ. ఈ పాటికి , ఆ వెంకటేశ్వరుడికి రెండో మూడో కొబ్బరికాయలు మొక్కుకునే వుంటుంది.ఫర్వాలేదులే. ఇంకెంత, ఓ గంటలో ఇంట్లో వుంటా. తప్పు నాది కాదు , రైల్వే డెపార్ట్ మెంట్ ది ఇలా వున్నాయి నా ఆలోచనలు. ఇంతలో ట్రైన్ స్లో అయినట్టు అనిపించింది. అనిపించడమేమిటి నా మొహం, స్లో గా ఆగింది. అప్పుడే అనకాపల్లి వచ్చేసిందా? అరే, ఎక్స్ ప్రెస్ కన్నా పాసంజెర్ ట్రైన్ బాగుందే అనుకున్నా. కాని తెలిసిందేమిటంటే ఆ వచ్చింది నరసింగపల్లి స్టేషన్ అని. అక్కడ పాసెంజెర్ కి అఫీషియల్ స్టాప్. ఇదేమిటి, ఇదో వూరు వున్నట్టే నాకు తెలియదు అన్నాను. అంతా నన్ను చూసినవ్వేరు. కంగారు పడకండి. తొందరగానే బయలుదేరుతుంది అన్నారు. కొంతమంది మనుషులు, కొన్ని బుట్టలు, కొన్ని బస్తాలు దిగాయి. కూర్చుందుకి చోటుదొరికింది . బతుకు జీవుడా అని కూర్చున్నాము. అంతకన్న చేసేదేముంది లెండి. ఒక పది నిముషాలు అఫీషియల్ స్టాప్ మరో పదిహేను నిముషాలు అన్ అఫీషియల్ స్తాప్ తరవాత ట్రైన్ కదిలింది. అమ్మయ్య అనుకున్నా.. మరో పది నిముషాలు కాకుండానే మళ్ళీ ఆగింది. కసింకోట స్టేషన్ ట. ఓహో, ఇదొకటి వుంది కదూ అనుకున్నా. బస్ లో వచ్చేటప్పుడు ఈ స్టాప్ సంగతి తెలుసు లెండి. అక్కడ ఒక పావుగంట ఆగింది.
మరో పావుగంట తరవాత అనకాపల్లి చేరుకున్నాము . అక్కడ ట్రైన్ అరగంట ఆగింది. ఈలోగా మేము రోజు వెళ్ళే సింహాద్రి ఎక్స్ ప్రెస్ మరో పది నిముషాలలో వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వినిపించింది. నేను వెంటనే అక్కడ దిగిపోతానని చెప్పాను. ఈలోగా మా ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వాళ్ళంతా, నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టారు. మేడం గారూ రేపొద్దున్న, ఇదే అనకపల్లి లో మిమ్మల్ని కలుస్తాము. మేమంతా ఇవాళ ఈ పాసంజర్లో వెళ్ళిపోతాము. మీరు మాత్రం ఇక్కడే వుండంది అని. నాకు ఒక్కదాన్ని వుండడానికి భయం వెసింది. ఇక దిగే ప్రయత్నం మానుకుని, లేచిన దాన్ని మ ళ్ళీ కూర్చున్నా. కదులుతున్న ప్యాసంజరు లోంచి ఒకరిద్దరు మాత్రం ఆఖరి నిముషం లో దిగేసారు.
ప్యాసంజరు బయలు దెరింది. మరో పావుగంటకి మ ళ్ళీ కధ మొదలు. పూర్తిగా కూడా వేగం అను కోలేదు. మ ళ్ళీ స్లో అయి, ఆగిపొయింది. దువ్వాడ స్టేషన్ ట. అక్కడ అంతా దువ్వాడ గురించి చెప్పడం మొదలెట్టారు. ఫ్యూచర్ లో వైజగ్ బదులుగా దువ్వాడ మైన్ స్టేషన్ గా మారుతుందని, చాలా డవలప్ అవుతుందని, స్థలాలు కొనుక్కుంటే, చాలా లాభం వస్తుందని, అక్కడే రేడియొ స్టేషన్ కూడా వుందని. ఇలా ఎన్నో కబుర్లు. ఈలోగా మా ట్రైన్ కదల లేదు కాని సింహద్రి ఎక్స్ ప్రెస్ మాకళ్ళ ఎదురుగానే వెళ్ళిపోయింది. నాకు ఏడుపు వచ్చింది. కాని వాళ్ళందరి ముందు ఏడవలేను కదా?
ఆతర్వాత ఏమయిందంటారా? ఏముంది.. గోపాలపట్నం , మర్రిపాలెం అఫిషియల్ స్టాప్స్, కంచరపాలెం అన్ అఫిషియల్ స్టాప్ లతో , మరో రెండు గంటల తరవాత, మెల్లగా.. రాత్రి (రాత్రి అనాలో పొద్దున్న అనాలో?) ఒంటిగంటన్నరకి మెల్లగా వైజాగ్ స్టేషన్ పాసెంజరు చేరుకుంది. సిటి బస్సులు లేక, రిక్షా దొరక్క, చీకటిలో, ఒక్కదాన్ని ఇంటికి నడుచుకుని చేరుకున్నా .. ఇంట్లో అంతాలేచి, నాగురించి ఎలా కనుక్కోవాలా అని సతమతమౌతు, నిద్ర పోకుండా అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇక ఏముంది.. మిగతాది మామూలే.. దీనికి పెళ్ళి చేసేయండి.. అంటూ అన్నయ్య.. వెంకటేశ్వరా అంటు అమ్మ, అక్కా, నాతో ఆంజనెయస్వామి గుళ్ళో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యాలే.. అంతు బిక్క మొహం వేసుకుని చూస్తున్న చెల్లెలు… మళ్ళీ మర్నాడు.. మామూలే.

Monday, May 31, 2010

ఏనుగమ్మ ఏనుగు

న్యూయార్క్ లైఫ్ ఆడ్ వస్తోంది టి వి లో. ఒక పిల్లవాడు ఏనుగు ఆడ్ అది. చూడ దానికి బాగానే వుంది. కానీ, అది ఎంత వరకు ప్రాక్టి కల్? ఇండియాలో ఎంతమంది దగ్గర ఏనుగులు వున్నాయి?
అసలు పదేళ్ళ క్రితం, ఇండియా అనగానే, ఏనుగులు పై సవారి, పాములాట, గారడీ, ఇవే తెలుగు అమెరికా వాళ్ళకి. ఇలాంటి ఆడ్స్ చూస్తె, వాళ్ళు ఇంకా మనం అలానే వున్నమనుకుంటారో ఏమిటో. నాకు తెలిసి, ఒక ఏనుగు తిరుపతి గుడి దగ్గర, మరో రెండో మూడో సర్కస్ లోనూ, కలకత్తా ముంబయి, విశాఖపట్నం జూలలో చూసాను. వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. కేరళలోనూ, కర్ణాటక లోనూ ఉంటాయేమో? అదీ, మరీ ఇంటికొకటి వుండదు కదా..
ఏనుగు అనగానే, నా జీవితంలో జరిగిన మరో సంఘటన గుర్తుకు వస్తుంది.
ఒకసారి, అంతే చాలా సంవత్సరాల క్రితం, వియత్నాం లో నేనూ, మావారు, మా అబ్బాయితో బయట తిరగడానికి వెళ్ళాము. అక్కడ మార్కెట్లో బాగా తిరిగాము. అసలు నేను బయటకి వెళ్ళగానే, నా చుట్టూ ఒక గుంపు ఏర్పడుతూ వుండేది. నేను బయటికి వెళ్ళినప్పుడు చూడీ దార్ వేసుకునేదాన్ని. అమెరికాకు రాక మునుపు పాంట్స్, షర్ట్స్ వేసుకోవడం మొదలు కాలేదు. నా డ్రెస్ మాత్రమె కాకుండా, నేను పెట్టుకునే మూడు వజ్రాల ముక్కుపుడక వాళ్ళని ఎక్కువగా ఆకర్షిస్తూ వుండేది. కారణం ఏదైనా, మా వెనక ఒక గుంపు వెంట తిరుగుతూ వుండేది. తిరిగినంత సేపు తిరిగి, ఒక మంచి రెస్టారెంట్లో భోజనం కోసం వెళ్ళాము. అక్కడ, వియత్నాం యుద్ధం వలనో ఏమో, ఎక్కడ చూసినా, ఆడవాళ్లే ఎక్కువ వుండే వారు. మేము వెళ్ళిన రెస్టారంట్ లో కూడా, సెర్వ్ చేసే వాళ్ళుఅంతా ఆడ వాళ్ళే. వాల్లెవారికి సరి అయిన ఇంగ్లీష్ రాదు. చదువుకునే రోజుల్లో అనుకునే దాన్ని, ఇంగ్లీష్ బాగా వస్తే, ప్రపంచం లో ఎవరితోనైనా, మాట్లాడ వచ్చని. కానీ అది నిజం కాదని అన్ని దేశాలూ తిరిగితే కానీ తెలియలేదు.
మా ఆయన, ఎప్పుడూ బ్రోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతారు అలాంటి చోట. "ఫుడ్, ఈట్, వాట్? అంటూ " నాకైతే, ఆయన అలా మాట్లాడుతూ వుంటే చాలా నవ్వు వస్తుంది. ముందు "సరిగ్గా మాట్లాడొచ్చుగా, అర్ధం కాక పొతే, అప్పుడు ఆ అవస్థ పడొచ్చు , వాళ్లకి ఇంగ్లీష్ వస్తే, మీకు రాదనుకుంటారు" అంటా. ఆయన, ఫర్వాలేదు, అనుకోనీ, ఏమిటి ఇప్పుడు వచ్చే నష్టం అని నవ్వేస్తారు. ..
సరే వచ్చిన ఆడ సర్వర్ తో ఏమేమి వున్నాయని బ్రోకెన్ ఇంగ్లీష్ లో అడిగారు. అదేదో ఒక్కటి కూడా అర్ధం కానీ పేర్లు చెప్పింది. సరే, మల్లాది గారి రెండు రెళ్ళు ఆరు నవలలో లాగా మా పరిస్థితి ఏర్పడింది. మా ఆయన, మెల్లగా మేను కార్డు తీసుకుని, అందులో 'ఫ్రైడ్ రైస్' లాంటి ది ఆర్డర్ ఇచ్చారు. నాకేమో ఆరోజు శనివారం. నేను అన్నం తినను. నాకోసం, ఏది ఆర్డర్ ఇవ్వాలో అర్ధం కాలేదు. ఇంకేమిటి వున్నాయి?
"ఫిష్?" అని అడిగింది..
"నో ఫిష్" అన్నాను.
"ఎగ్?"
"నో ఎగ్."
చికెన్?
"నో నో, నో చికెన్, నో మీట్ , ఓన్లీ వేజేటబుల్స్ " అని చెప్పా.
నా వైపు ఒక సారి కింద నుంచి మీద దాకా చూసి 'పోటాటోస్" అని అడిగింది.
ఇదెక్కడి గోలరా అనుకుని.. 'పోటా టోస్ ఓ కే " అని చెప్పా,
లోపలి వెళ్లి, బంగాళా దుంపలు ఫ్రై చేసి ఉప్పు మిరియాలు జల్లి పట్టుకుని వచ్చింది.
బ్రతుకు జీవుడా, ఏదో ఒకటి, కడుపు నింపుకుందుకు అనుకుని, తినసాగాను.
ఆ సర్వర్ కి ఇంకా ఆశ్చర్యం నుంచి బయట పడలేదు అక్కడే నుంచుని చూస్తోంది నావైపు.
మా ఆయన నవ్వుతూ , "ఏమిటి అలా చూస్తున్నావు" అని అడిగారు దాన్ని.
అది ' నో మీట్, నో చికెన్, దెన్, హౌ strong? అని అడిగింది.
ఆయన సమాధానం ఇచ్చే లోగా, నేనెంతో తెలివి తేటలు వుపయోగించి దానికి ' వేజె టేరియన్ భోజనం గురించి దానికి జ్ఞానోపదేశం చెయ్యడానికి నిర్ణయించుకున్నా.
'సీ, ఎలేఫన్ట్స్ ఈట్ నో మీట్, ఓన్లీ గ్రాస్, లీవ్స్ అండ్ వెజ్ టబ్ల్స్ , స్టిల్ వెరీ strong: అని చెప్పా గొప్పగా"
వెంటనే, మరి కాస్త ఆశ్చర్యం తో.. 'ఓహో.. యు ఈట్ ఏలే ఫెంట్స్!" (Oho, you eat elephants!)
ఇక నా పరిస్థితి మీతో వివరంగా చెప్పక్కర లేదనుకుంటా.

Saturday, May 29, 2010

అమ్మమ్మ

అమ్మమ్మ- జ్ఞాపకాలు

అమ్మమ్మ ని తలుచుకోని రోజు వుండదేమో. అందరికీ ఇలాంటి అమ్మమ్మ ఉండొచ్చు. ప్రతీ వ్యక్తీ జీవితం లోనూ గ్రాండ్ పేరెంట్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని నా గట్టి నమ్మకం. అమ్మమ్మని మనవలంతా అమ్మమ్మా అనే పిలిచే వారు. అంటే, మావయ్య కొడుకులు కూడా, నానమ్మా అని కాక , అమ్మమ్మా అనే పిలిచే వారు. చాలా కాలం పెద్ద మావయ్య ఇంట్లో వుండేది, అప్పుడప్పుడు, అంతే ఏడాదికి ఒక సారి, చిన్న మావయ్య ఇంటికి వచ్చేది. వచ్చినప్పుడు పాకుండలు తొక్కుడు పచ్చడి, చేగోడీలు తెచ్చేది. నేను చదువుకోసమని మా మావయ్య ఇంట్లో వుండేదాన్ని. పాకుండలు ఎవరూ చేసేవారు కాదు, ఒక్క అమ్మమ్మ వచ్చినప్పుడే తినే వాళ్ళం. అందుకేనేమో, అమ్మమ్మ అనగానే ముందు గుర్తుకు వచ్చేది పాకుండలు. పాకుండలు అంటే , చలిమిడి ని చిన్న చిన్న ఉండలు చేసి నూనెలో వేయిస్తారు కదా.. అవన్నమాట. చాలా బాగా వంట చేసేదిట అమ్మమ్మ. మాకు జ్ఞానం వచ్చేసరికి, అమ్మమ్మకి కనపడడం మానేసింది. కనిపించదు అంతే అస్సలు కనిపించక పోవడం కాదు. మసక మసక గా కనిపించేదన్నమాట.
అమ్మమ్మ కళ్ళు ఆపరేషన్ చేయించారు. మరి చేస్తున్నప్పుడు ఆ డాకర్లు ఏమి మాట్లాడు కున్నారో ఏమో తెలియదు. ఆమెని ఒక రోజంతా మాట్లాడ వద్దని చెప్పారు. అమ్మమ్మని వార్డ్ లోకి తీసుకు రాగానే, అమ్మమ్మ అక్క చెయ్యి కోసం చెయ్యి జాపిందిట. అక్క చెయ్యి అందించాగానే, చేతి మీద ' కన్ను పోయింది' అని రాసిందిట. అక్క ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్య పోయింది. పాపం ఆ కన్ను నిజంగానే కనిపించలేదు.
ఎనమండుగురు పిల్లలు పుట్టేకా, తాతగారు, నలభయ్ ఏళ్లకే పోయారు. వంద ఎకరాలు పొలం, పెద్ద ఇల్లు వున్నా, ఆ కాలంలో , ఆ భూమి అమ్ముకుంటూ పిల్లలు అందరిని పెద్ద చేసింది అమ్మమ్మ. కొంత వయసు వచ్చాకా, అన్నదమ్ములు ఒకర్ని వొకరు చది వించుకున్నారు. అప్పటినుంచి అమ్మమ్మ అందరికి, ఇద్దర్ని కంటే కనకండి, మా కాలం లో ఇలాంటి సౌకర్యాలు లేవు.. అని బాధ పడుతూ వుండేది. అలా ఫ్యామిలీ ప్లాన్నింగ్ ప్రచారం మాకందరికీ చేసేది..

అమ్మమ్మ- గాన భ్రమర

తిండి మాట కేమి గాని, మా అమ్మమ్మ ప్రత్యేకత ఆమె పాడే పాటలు. తెల్లవారు ఝామున మూడు గంటలకి మా అమ్మమ్మకి మెలుకవ వచ్చేస్తుంది. లేస్తూనే, "కేశవ అని నిన్ను వాసిగా భక్తులు వర్ణించు చున్నారు మేలుకో " అంటూ లేచేది. రోజంతా రామదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు ఏవేవో భక్తి గీతాలు రోజంతా పాడుతూ వుండేది. ఆమె కార్యక్రమాన్ని బట్టి, మనం గడియారం కరెక్ట్ చేసుకో వచ్చు. రేడియో లో పొద్దున్నే వచ్చే భక్తి రంజని పాటలు అన్నీ పాడుతూ వుండేది. పెద్ద మావయ్య విజయవాడ లో వుండే వాడు. చిన్న మావయ్య విశాఖపట్నం లో వుండడం వలన, ఇక్కడకి వచ్చినప్పుడు ఇక్కడి రేడియో స్టేషన్ భక్తి రంజని లో పాటలు నేర్చుకునేది. ఒక బల్ల చెక్క మీద పెద్ద పెద్ద అక్షరాలు సుద్దముక్కతో రాయించుకుని , నేర్చుకునేది. ఆ వయస్సులో, అంత అవసరమా అని అనిపించినా, ఆమె శ్రద్ధ చూసి మాకే సిగ్గు వేసేది. అమ్మమ్మ నాకు కూడా ఒక పాట నేర్పించింది. 'ఏమీ సేతురా లింగా' అని మంగళం పల్లి బాల మురళి కృష్ణ గారు పాడిన తత్వం. విషయం, ఆయన ఒకటో కాలం లో పాడితే, మా అమ్మమ్మ నాలుగో కాలం లో నేర్పించింది నాకు. చాలా కాలం తరవాత , ఒరిజినల్ పాట విని నాకు చాలా నవ్వు వచ్చింది. చిన్నమవయ్యకి తొందరగా నిద్ర పట్టేది కాదు. లేవడం కొంచం లేట్ గా లేచేవాడు. రాత్రి పన్నెండు గంటలకి మెల్లగా నిద్ర పట్టింది అనుకుంటూ ఉండగానే, మరో మూడు గంటల్లోనే, అమ్మమ్మ మేలుకొలుపులు మొదలయ్యేవి. "అబ్బా.. ఏమిటమ్మా" అని విసుక్కేనేవాడు. " అయ్యో! లేపేసేనా" అని బాధపడుతూ,గొంతుకని మంద్ర స్వరానికి మార్చి, పాడుతూ వుండేది. అయిదున్నర, ఆరు అవుతూ వుండగా మా అక్క ( మావయ్య భార్య) కాఫీ కలిపి అమ్మమ్మకి ఇచ్చేది. అది తాగేసి, ఒక గిన్నె పట్టుకుని, ఇంటి ముంది వున్న చిన్న తోటలోకి వెళ్లి, గిన్నె నిండా పూలు కోసేది. అవి మామూలు పూలుకావు . ప్రతి పువ్వులోని, ప్రతి రెక్క, కాడ, దానిలో ని మకరందం, పుప్పొడి సువాసన 'రామ' నామతో నిండి ఉంటాయని నా అభిప్రాయం. అమ్మమ్మ ఆ పూలను తడుముకుంటూ, జాగ్రత్తగా, ప్రతి పువ్వునీ తాకుతూ, రామ నామాన్ని జపిస్తూ ఆ పూలు కోసేది. రోజంతా చాలా సమయం రామనామ జపం లోనూ, రాముని మీద పాటలు పాడు కుంటూ వుండేది. మా అన్నయ్య, ఆమెకి ' గాన భ్రమర ' అని పిలిచేవాడు. భ్రమరం ఝుం ఝుం కారంలా తోటలో పాడుతూ పూలు కోసేది.

అమ్మమ్మకి ఆరాధ్య దైవం రాముడు అని చెప్పక్కరలేదుగా. ఎవరు చీర కొని ఇచ్చినా పెట్టెలో దాచుకునేది. వెంటనే కట్టుకునేది కాదు. ఒక్క చీర అయినా శ్రీరామ నవమి నాటికి దాచుకునేది. తాతగారు పోయాకా, శ్రీరామ నవమి ఒక్క రోజునే, పండుగ చేసుకునేది. అది ఒక పండుగ కాదు ఆవిడ దృష్టిలో అదొక్కటే పండుగ. అమ్మమ్మకి ఇష్టమైన రంగు పింక్ అనుకుంటా, నిజం చెప్పాలంటే, గన్నేరు పువ్వురంగేమో.. అమ్మమ్మని ఏ రంగు చీర కావాలని అడిగితే, వెంటనే, ఉల్లిపాయ రంగు అనేది. తెలుపు ఎరుపు కలనేత రంగు ఎక్కువ ఇష్టం గా కట్టుకునేది. తెల్లవారేసరికి ఆరుబయట దండేనికి మూడు చీరలు ఆరబెట్టి ఉండేవి. పొద్దున్నే, ఒక సరి స్నానం చేసి చీర మారిస్తే, భోజనం అయ్యాక, మరో చీర కట్టుకునేది. సాయకాలం, స్నానం చేసి మూడో సారి చీర మార్చుకునేది. అమ్మమ్మ పోయిన రోజు కూడా, మూడు చీరలూ దండేనికి ఆరేసి వున్నాయి. ఇక ఆవిడ రవికలు. ప్రపంచంలో ఏ టైలరూ ఆవిడకి కావలిసినట్టు కుట్టేవారు కాదు. అందుకే, అక్కనే కుట్ట మనేది అక్క బాగానే కుట్టేది. కానీ, అమ్మమ్మకి వెంటనే బాగున్నట్టు అనిపించేది కాదు. "క్రిందటి సారి కుట్టినది బాగుందే, ఈ సారి సరిగ్గా కుదరలేదు ' అనేది. అక్క చిన్న పుచ్చుకునేది. కానీ ఏమీ అనేది కాదు. నా దగ్గర విసుక్కునేది. క్రిందటి సారీ నేనే కుట్టాను. అప్పుడూ ఇలానే అంది కోపంగా. నాకు నవ్వు వచ్చేది. అమ్మమ్మ ఆది ఇచ్చిన జాకెట్టు అక్క క్రితం కుట్టిందే.మాకు బాగా తెలుసు, మళ్ళీ సారి కుట్టినప్పుడు ఇలానే అంటుంది, "క్రితం సారి బాగా కుదిరిందే, ఈ సారి సరిగా కుదర లేదు" అని.

అలా అని అమ్మకి మిగతా ప్రపంచం తెలియదు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అమ్మమ్మ మాట్లాడని ఇంటర్ నేషనల్ విషయాలు ఉండేవి కాదు. కెన్నెడీ మరణ మయితెనేమిటి , ఇందిరా గాంధీ గురించి విషయం నేమిటి, అన్ని విషయాలూ, మాట్లాడేది, మేమంతా టీ వి న్యూస్ చూస్తూ వుంటే, తానూ వినేది. వింటూ, పాత విషయాలు చర్చిస్తూ వుండేది. అమ్మమ్మా, నువ్వు చదువుకుని వుంటే, ఇందిరా గాంధీ కి సెక్రటరీ గా పంపే వాళ్ళం అని అంతా అనేవాళ్ళం. అమ్మమ్మ నవ్వేసేది. 'మా నాన్న గారు పెళ్ళయిన కొత్తలో , మా అమ్మగారి తో అనే వారుట, "మీ ఇంట్లో లాయరు మీ నాన్నగారా, మీ అమ్మగారా" అని. ఈ విషయం తరచూ మా అమ్మ చెబుతూ వుంటుంది మాకు. మా తాత గారు లాయర్ లెండి.
అక్క అమ్మమ్మకి తొందరగా భోజనం పెట్టేది. ఆ భోజనం చేస్తూ, తన తాత ముత్తాతలు, మేనత్తలు, మేన మామలు, వాళ్ళ ఇష్ట అయిష్టాలు గురించి మాట్లాడుతూ, అక్క వంటని పొగుడుతూ భోజనం చేసేది. 'అమ్మమ్మా, వాళ్ళందరిని భోజనం దగ్గర రోజూ తలుచుకుంటావు, ఎందుకు?" అని ఒక సారి అమ్మ అడిగింది. " ఏం? తలుచుకో కూడదా" అని అమ్మమ్మ అడిగితే, జవాబు ఏమని చెప్పగలదు అమ్మ? నేను వండే వంటల గురించి అమ్మతో మాట్లాడి నప్పుడు, మా అమ్మ ఆశ్చర్యంగా, "అమ్మమ్మ అలా చేసేదే, నీకెలా తెలుసు?" అని అమ్మ ఆశ్చర్య పోతూ వుంటుంది. మరి ఆ పోలికలు నాకు ఎలా వచ్చేయో?
అమ్మమ్మ భోజనం చేసి కొంత సేపు పడుకునేది. ఈ లోగా మేమంతా భోజనాలు చేసే వాళ్ళం. మా భోజనాలు అయ్యేసరికి, అమ్మమ్మ నిద్ర తీరిపోయేది. ఆ తరవాత అమ్మ భోజనం చేసి పడుకుంటే, మరో పది నిముషాలకే ' ఏమే, నిద్రపోతున్నావా" అని, భుజం మీద గట్టిగా ఒకటేసేది. అంతే, ఎంత నిద్రలో వున్న వాళ్ళైనా లేచి పోవలసినదే. మా అమ్మ తిట్టుకునేది, మాకైతే నవ్వు వచ్చేది.
రోజూ అమ్మమ్మ , నేను యూనివర్సిటీ కి వెళ్ళేటప్పుడు “అమ్మా, చెల్లయీ బడికి టైం అయిందా అని అడిగేది. యూనివర్సిటీని బడి అంటే చాలా నవ్వొచ్చేది. అవును అమ్మమ్మా అనేదాన్ని. తయారయిన నన్ను చూసి ఎవడో రాజకుమారుడు ఎగరేసుకు పోతాడు అనేది. నా పెళ్లి రవితో కుదేరేకా అన్నాను అమ్మమ్మతో "అయ్యో అమ్మమ్మ, రవి చాలా సన్నంగా ఉంటాడు, నన్ను ఎగరవేయ లేడు" అని. అలా అనగానే, అమ్మతో సహా అంతా నవ్వేసారు.

అమ్మమ్మ- ఇంగ్లీష్!

నాకు తెలిసి అమ్మమ్మ మూడో క్లాస్ వరకు చదివింది. నేను చదివినప్పుడు అయిదవ తరగతి వరకు ఒక్క తెలుగు మాత్రమే వుండేది. హిందీ, ఇంగ్లీష్ మేము ఆరవ తరగతి నుంచి మొదలయ్యేది. అమ్మ టెన్త్ వరకు చదివింది. అప్పుడే పెళ్లి చేసేసారు . ఎస్ ఎస్ ఎల్ సి కి వెళ్ళలేదు. అందుకే అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదనీ మా అందరి అభిప్రాయం. ఒక రోజు, మా మావయ్య కొడుకు పరీక్షలకి చదువుతున్నాడు. గట్టిగా చదవకుండా, లోపల లోపలే చదువుతున్నాడు. ఈ లోగా మా అమ్మమ్మ ఏవో పాటలు పాడు కుంటోంది. వాడికి కొంచం డిస్టర్ బెన్స్ గా అనిపించి "అమ్మమ్మా నేను చదువుకుంటున్నాను, ప్లీజ్ మెల్లగా పాడుకో" అన్నాడు. వెంటనే అమ్మమ్మ, "ఏమిటి చదువు తున్నావు? చూడనీ ", అని పుస్తకం లాక్కుంది. వాడు, “అమ్మమ్మా, నేను ఇంగ్లీష్ చదువుతున్నాను, నీకేమి అర్ధం అవుతుంది?" అని విసుక్కున్నాడు. "నాకు ఇంగ్లీష్ రాకపోవడ మేమిటి? " లేడీస్ అండ్ జంటిల్ మాన్, ప్లీజ్ లేండ్ మీ యువర్ ఇయర్స్, మై సిస్టర్ ఈస్ గోయింగ్ టు డెలివ ర్ ఏ స్పీచ్ ఆన్ ... " అంటూ గడ గడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తూ వుంటే చుట్టూ పక్కల అన్ని గదుల్లోంచి అందరం, పరిగెత్తుకుని వచ్చేసాము. అమ్మమ్మ ఇంగ్లీష్ లో మాట్లడడమా అని చాలా విస్తు పోయాము. మమ్మల్ని అందరిని చూసి అమ్మమ్మ ఒక్క సారి పక పకా నవ్వేసి సిగ్గు పడి పోయింది. 'అమ్మమ్మా' నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అంతా ఒకటే ఆశ్చర్యం. తానూ మూడో క్లాసు లో వున్నప్పుడు ఒక నాటకం వేసిందిట. అది తన డైలాగుట. ఒక వేళ ఆ ఒక్క డైలాగు ఎంత బట్టీ పట్టినా ఇన్ని సంవత్సరాల తరవాత కూడా, ఎలా గుర్తు పెట్టుకుందో, మాకైతే అర్ధం కాలేదు. కనీసం డెభై, ఎనభై సంవత్సరాలైనా అయి వుండొచ్చు. క్రిందటి సంవత్సరం చదివిన చదువు, వేసవి సెలవుల్లోనే మర్చి పోతున్న మాకు , అది ఒక గొప్ప గుణపాఠం., మరపురాని అనుభూతి.

అమ్మమ్మని బిపి చెక్ చెయ్యడానికి, అప్పుడప్పుడు ఎమైన చిన్న చిన్న అనారోగ్యానికి మందుల కోసం, డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళేవాళ్ళం . ఆ డాక్టర్ చిన్నవాడైతే, “వీడు కొత్తగా పరీక్ష పాస్ అయి వుంటాడు, అసలు సబ్జెక్ట్ వచ్చో రాదో” అనేది. అలా అంటొంది కదా అని ఎవరైనా ముసలి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే " వీడు సబ్జెక్ట్ మరిచి పోయి వుంటాడు,” అనేది. ఆమెకు తగ్గ డాక్టర్ని వెదికి పట్టుకునే సరికి మా తల ప్రాణం తోకకి వచ్చేది.

మా అమ్మమ్మ తొంభై రెండు సంవత్సరాలు బ్రతికింది. ఎప్పుడు చావు గురించి ఏదైనా టాపిక్ వస్తే, "నాకు చావంటే భయం లేదు కానీ, మిమ్మల్ని అందరిని విడిచి వెళ్లాలని వుండదే" అనేది. ఒక్క రోజు కూడా మంచం పట్టకుండా, తిరుగుతూ తిరుగుతూ ప్రాణం వదిలేసింది. కానీ, మా అందరికి, అమ్మమని తలుచుకోని రోజు వుండదేమో. ఏ భక్తి పాట విన్నా, ఎక్కడ రామనామము విన్నా, పూలు చూసినా ..అమ్మమ్మ గుర్తురాకుండా వుండదు. మా జీవితాల్లో ఎప్పుడూ జీవించి వుంటుంది..

Monday, April 19, 2010

ప్రేమ లేఖ

చేతిలోని ఇన్లాండ్ లెటర్ ని వెనక్కి ముందుకి తిప్పి చూసింది సుజాత. అడ్రస్ మరొక సారి జాగ్రత్తగా చూసింది. తనకే ఆ వుత్తరం. వచ్చిన అడ్రస్ చూసింది. వచ్చింది కొవ్వలి నుంచి. అసలు ఈ భూ ప్రపంచం లో అలాంటి వూరు ఒకటి వుందనే తెలియదు తనకి. అక్కడనుంచి ఎవడు లవ్ లెటర్ రాసాడా అని ఎంత బుర్ర పగల కొట్టుకున్నా తట్టలేదు ఆమెకు. అది మామూలు ప్రేమ లేఖ కాదు. అది ఒక జవాబు లాగా వుంది. అందుకే ఇంత ఆలోచించ వలసి వస్తోంది. తన జీవితంలో ఎవడికీ ఇప్పటికోచ్చి ప్రేమ లేఖ రాయవలసిన అవసరం పడలేదు. అంత ప్రేమించదగ్గ వ్యక్తులు ఎవరూ తారసపడలేదు. పైగా తన తల్లి తండ్రులు తనకోసం ఒక డాక్టర్ నో, ఇంజనీర్ నో వెదికి తెస్తారని తనకు తెలుసు. కనుక ఆ డిపార్టుమెంటు తనది కాదు. అంటే పెళ్ళికొడుకు సెలక్షన్ లో తనకి అంత అవస్థ పడనవసరం లేదు. తనకు అసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఇంకా ఏది డిగ్రీ సెకండ్ ఇయర్ కదా.
ఇంతకీ ఈ వుత్తరం రాసిన వెధవ ఎవడయి వుంటాడు అని ఆలో చించింది. పిచ్చి గీతల్లాంటి రాత, కనీసం అందమైన హ్యాండ్ రైటింగ్ కూడా కాదు. మరొక సారి చదివింది. “ ప్రియతమా, నీవు రాసిన ప్రేమ లేఖ అందింది. జీవితం మీద విరక్తి తో చచ్చిపోవాలనుకున్న నాకు నీ వుత్తరం నాకు అమృతంలా పని చేసింది. ఏమి చెయ్యను, నెల రోజులుగా టైఫాయిడ్ జ్వరం తో బాధ పడుతున్నాను. నీ వుత్తరం అందగానే వెంటనే రెక్కలు కట్టుకుని వచ్చేయాలని వుంది. ఇలా మొదలు పెట్టి, కొంచం కూడా ఖాళీ లేకుండా, మొత్తం ఇన్లాండ్ లెటర్ అం తా రాసాడు. అవాకులు చవాకులు చాలా రాసాడు. ఎవడో వెధవ, కనిపిస్తే చెప్పిచ్చుకుని కొట్టాలని అనిపించింది. తనకి ప్రేమలేఖలు చాలా మంది రాసారు, కానీ ఇలా మాత్రం కాదు. " టైఫాయిడ్ ట , చావు వెధవా, చస్తున్న వాడికి మళ్లీ ప్రేమొకటి. " అనుకుంది. మధ్యన , నేను వాడికి ప్రేమ లేఖ రాయడా మేమిటి? బోడి వెధవా " అంటూ నోటికొచ్చిన తిట్లు మనసులోనే తిట్టుకుంది. కసిగా ఆ వుత్తరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపే సింది.
కాలేజి వేసవి కాలం సెలవులు. ఈ సెలవుల్లో బోరుకోడుతూ వున్న రోజుల్లో ఈ పిచ్చి వుత్తరం. పోనీలే ఓ పావుగంట కాలక్షేపం అనుకుంది. కనపడనీ వెధవకి గడ్డి పెట్టాలి అనుకుంది.
కాలేజీ తెరిచే టైం కి ఆ వుత్తరం విషయం పూర్తిగా మర్చిపోయింది. తెరిచిన వారం రోజులు తరువాత, లంచ్ టైం లో ఆడిటోరియం వైపు నడుస్తున్న తన వెనుక నుంచి 'సుజాతా' అని పిలిస్తే, ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది. ఎవరో కుర్రాడు, ఎప్పు డో చూసిన మొహమే. ఎవడా వీడు, నన్ను పిలుస్తున్నాడు అని, 'ఎస్, ఎందుకు పిలిచారు' అని అడిగింది. నత్తి నత్తి గా నేను అన్నాడు.. “నువ్వేలే , ఎవరు నువ్వు” అంది.. కొంచం దెబ్బ తిన్నట్టు మొహం పెట్టాడు, “నీ వుత్తరానికి జవాబు రాసా కదా, మళ్ళీ జవాబు రాయలేదేమి” అని అడిగాడు. వెంటనే బుర్రకి తట్టింది ఆ ప్రేమ లేఖ రాసిన ఘనుడు వీడేనని. అవకాసం వదులుకో లేదు సుజాత.” నీ వూరేదో తెలియదు, నీ అడ్రస్ నాకు ఎలా వస్తుందనుకున్నావు? నీకు నేను ప్రేమలేఖ రాయడమేమిటి నాన్ సెన్స్..అసలు నువ్వెవడివో నాకు తెలియదు. నీకు అసలు బుర్రవుందా? నీ మొహం కూడా నేనెప్పుడూ చూడలేదు, ఇలాంటి వెధవ వేషాలు వేసేవంటే, మా అంకుల్ పోలీసు కమీషనర్, మూయించేస్తాను జాగ్రత్త" అంటూ గుక్క తిప్పుకోకుండా తిట్టడం మొదలు పెట్టింది. దెబ్బ తిన్నట్టు చూసేడు. ' హల్లో, నా దగ్గర నువ్వు రాసిన ప్రేమ లేఖ వుంది." అన్నాడు. "అసలు నువ్వెవరో తెలియక పొతే నేను నీకు ప్రేమలేఖ రాయడం ఏమిటి? నీకేమైనా పిచ్చా " అంది సుజాత. " రేపు నీ వుత్తరం పట్టుకు వస్తా" అంటూ బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
దూరంగా, పడి పడి నవ్వుతూ ఇద్దరు నవ్వుతూ కనిపించారు. వెంటనే అర్ధం అయింది సుజాతకి. వాళ్ళు ఇద్దరు, తన వీధిలో ఒక రూం లో అద్దెకు వుంటూ చదువుతున్న కుర్రాళ్ళు. వీడు వాళ్ళ రూం మేట్. బహుశా వీడేదో తనని ప్రేమిస్తున్నట్టు చెబితే, వాడిని ఏడిపించడానికి వాళ్ళిద్దరూ చేసిన వెధవ పని అని. వీడు తన క్లాసు మాటే, తెలుగు మీడియం వాడని, లాంగ్వేజ్ క్లాస్సేస్ లో అప్పుడప్పుడు ఒకే క్లాసు లో కూర్చునే వాళ్ళమని తరవాత గుర్తుకు వచ్చింది.
మర్నాడు వాడు వుత్తరం ఏదైనా పట్టుకుని వస్తాడేమో నని చూసింది సుజాత, కాని తనకి తెలుసు, ఆ కుర్రలిద్దరు వాడికి ఈ పాటికి చెప్పే వుంటారని.

భావి రచయిత

అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు ఏడుగురు వేట కి వెళ్లి ఏడు చేపలు పట్టేరు, అందులో ఒక చేప ఎండలేదు. ఇలా చెప్పసాగింది అరుణ తన నాలుగేళ్ల కొడుకు రఘు కి. వాడు ఆ కధ చాలా సర్లే విన్నాడు. కాని వాడికి రోజు పడుకునే ముందు అమ్మతో కధలు చెప్పించుకోవడం అలవాటు. విన్నకధైన మళ్లీ మళ్లీ వింటూ వుంటాడు. " నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే కుట్టనా" అంటూ కధ ముగించింది.
ఇక పడుకో నాన్నా అంది. అమ్మ నేను ఒక కధ చెబుతా అన్నాడు రఘు. అరుణ కి నవ్వు వచ్చింది.
వాడేమి మాట్లాడినా అరుణ విసుక్కోదు. వాడంటే పంచ ప్రాణాలు ఆమెకు. పైగా వాడు పుట్టేకా ఒకటిన్నర సంవత్సరాల వరకు వాడికి మాటలు రాలేదు. వాడు ' అమ్మా' అని ఎప్పటికైనా అంటాడా అని ఏంటో బాధపడుతూ వుండేది. వాడి తోటి పిల్లలంతా ' కాకి, పిల్లి, ఫ్యాన్' అంటూ ఎనిమిదవ నెలనుంచే మాట్లాడుతూ వుంటే, చాలా ఆలస్యంగా మాట్లాడుతూ వుండడం వలన, వాడేమి మాట్లాడినా అపురూపంగా వుంటుంది అరుణకి.
"సరే చెప్పు" అంది.
చెప్పడం మొదలు పెట్టాడు. ' అనగనగా ఒక రాజు వున్నాడు. ఆయనకి ఒక కొడుకు వున్నాడు. ఆ కొడుకు ఒక రోజు వేటకి వెళ్లి ఒక చేపని పట్టేడు." అంటూ మిగతా కధంతా మామూలే. ' నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా' అంటూ ముగించాడు.
అరుణకి నవ్వు వచ్చింది..అవును నిజమే కదా. ఏడుగురు కొడుకులు ఈ కాలంలో ఎవరికీ వుండడం లేదు. పైగా, ఎండని చేప ఒకటే కదా, కధ పూర్తి చెయ్యడానికీ ఒక చేప చాలు అని నవ్వుకుంటూ, ఈ నాలుగేళ్ల వాడికి ఈ కధని ఇలా తిరిగి చెప్పే విధానం చూసి ఆశ్చర్య పోయింది. ఒకటి, కధని పూర్తిగా అర్ధం చేసుకోవడం, రెండవది, అందులోని అనవసర విషయాలని తొలగించేసి ఒక విధం గా ఎడిట్ చేసి చెప్పడం. ఏమిటి పిల్లవాడు అని నవ్వుకుంది. కొంతసేపటికి బాబు నిద్రపోయాడు.
వార్తలవగానే బెడ్రూం కి వచ్చిన అరుణ భర్త రాజా కి ఈ కధ విషయం చెప్పింది. ఈ కాలం SMS యుగం. అందుకే వాడు షార్ట్ కట్ చేసేసాడు అంటూ నవ్వాడు రాజా.
మర్నాడు, అరుణ, రఘు కి మరో కధ చెప్పడం మొదలు పెట్టింది.
' ఒక వర్తకుడు కొన్ని టోపీలు తీసుకుని ఒక అడవిలోంచి వెళ్తున్నాడు. ఒక చోట చెట్టుకింద తానూ తెచ్చుకున్న రొట్టెలు తిని, నిద్ర పోయాడు. అంతలో కొన్ని కోతులు వచ్చి ఆ టోపీలని ఎత్తుకు పోయాయి."... చివరకి ఆ టోపీలన్ని మూట కట్టుకుని ఆ వర్తకుడు ' బ్రతుకు జీవుడా' అంటూ పారిపోయాడు, అంటూ ముగించింది. చప్పట్లు కొట్టాడు రఘు.
ఇప్పుడు నేనొక కధ చెపుతా అంటూ మొదలు పెట్టాడు. “ఒక వర్తకుడు వున్నాడు. వాడు కొన్ని చెప్పులు మూట కట్టుకుని అడవిలోకి వెళ్ళాడు”. తాను చెప్పిన కధే టోపీలని చెప్పులుగా మార్చి చెప్పేస్తూ వుంటే, నవ్వుతూ వింటున్న అరుణని చూసి , ' ఏమనుకున్నవోయ్ , మనకేమి ధోకా లేదు. వీడు ఒక గొప్ప రచయిత అయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అని పక పకా నవ్వాడు రాజా.

తూర్పు – పడమర

తూర్పు – పడమర
మా ఆయనకు ఎప్పుడూ విదేశలలోనే వుద్యోగం. నెలకొక దేశంలో వుండవలసి వచ్చేది. వీలైనప్పుడల్లా నన్నూ వెంట తీసుకుని వెళ్ళేవారు. మా అబ్బాయి స్కూల్ లో చేరే వరకు వచ్చిన అవకాశం వదులుకోవడం ఎందుకని వెళ్తూవుండేదాన్ని.
ఒకసారి వియత్నాం దేశం వెళ్ళవలసి వచ్చింది. అది చాలా పేద దేశం. మేము వెళ్ళిన ప్రాంతంలో జనాభా కూడా ఎక్కువే. చూస్తే చాలా బాధవేసింది. నేను, మా ఆయన, మా మూడేళ్ళ మా అబ్బాయి. నాలుగు రోజులు బాగానే గడిచేయి. కొత్తనీరు, కొత్త వాతావరణం. అందులోనూ మా అబ్బాయి చాలా నాజూకు. వాడికి వెంటనే జలుబు చేసింది. ఏవో దగ్గర వున్న జలుబు మందులు వేసాను. తగ్గినట్టే అనిపించింది కాని బాగా కఫం పెరిగిపోయింది. జ్వరం కూడా రావడం తో భయం కూడా వేసింది. వెంటనే ఆయనతో గొడవపెట్టడం మొదలు పెట్టాను.
మేముండే హోటల్ మానేజరుతో వెళ్ళి మాట్లాడేరు. మానేజరు హాస్పిటల్ దగ్గరే వుంది రిక్షాలో వెళ్ళవచ్చని చెప్పాడు.
సరేనని, ముగ్గురం డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి రెండు రిక్షాలు మాట్లాడుకున్నాము. అక్కడ ఒక రిక్షాలో ఒకరే కూర్చోగలుగుతాము. నేను మా అబ్బాయిని వళ్ళో కూర్చోబెట్టుకుని ఒక రిక్షా లో కూర్చుంటే మరో రిక్షాలో ఆయన కూర్చున్నారు. నేను ఎక్కిన రిక్షా వాడు కొంచెం వయసు మళ్ళిన వాడు. నిజం చెప్పలంటే వియత్నాంలో ఎవరి వయస్సు చెప్పడం చాల కష్టం. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే మనిషి దొరకడం కష్టం. కొన్ని ఇంగ్లీష్ పదాల సముదాయం తో మన బాధ వెళ్ళబుచ్చుకుంటే, నవ్వు మొహంతో వాళ్ళకి తోచిన సమాధానం వాళ్ళిస్తారు. నవ్వినా ఏడ్చినా వాళ్ళ మొహం ఒకలానే వుంటుంది, అది వేరే విషయం అనుకోండి. కాని సాధ్యమైనంత వరకు వాళ్ళు మనకి సాయం చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు. అదే విధంగా నేను ఎక్కిన రిక్షావాడు ఎక్కడికి వెళ్ళాలని అడిగినప్పుడు డాక్టర్ దగ్గరకి అని చెప్పాను, బాబుని చూపిస్తూ. వాడికి బాగానే అర్ధం అయింది. పది నిముషాలలో చేరుకున్నాము. చిల్డ్రెన్స్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు. వాడికి డాలర్లు ఇచ్చాము. చెప్పాలంటే ఇవ్వ వలసిన దానికంటే కొంచం ఎక్కువగానే ఇచ్చాము.

రిక్షావాడు రిక్షాని ఎవరికో అప్పచెప్పి మా వెనకనే నడవడం మొదలు పెట్టాడు. మా ఆయనకి కోపం వచ్చింది. వెనక్కి తిరిగి, డబ్బులిచ్చేము కదా ఇంకా ఎందుకు వెనకాల వస్తున్నావని అడిగేరు. మీకు సాయం చెయ్యడానికి అని జవాబు ఇచ్చాడు. నాతో ఆయన, వీడికి ఎక్కువ ఇచ్చాము కదా, ఆశ పెరిగింది అన్నారు. పోనీలెండి. తిరిగి ఎలాగు వెళ్ళాలి కదా అన్నాను. వాడిని పొమ్మన్నా వాడు వినిపించుకోలేదు. బోర్డులు చదువుకుంటూ వెళ్ళసాగేము. మాకన్నా రెండు అడుగులు ముందు నడవడం మొదలెట్టాడు. మాకు చిరాకు వేసింది. ఈలోగా ఒక గదిలో దూరాడు. తీరా చూస్తే అది ఆ హస్పిటల్ చీఫ్ ది.
ఇదేమిటి డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకుని వచ్చాడని అనుకుంటూ మొహమాటంగా, ఇబ్బందిగా చూస్తూ లోపల అడుగుపెట్టాము. లోపల డాక్టర్ చూడడానికి ఒక పదహారేళ్ళ పిల్లలాగ వుంది. కాని నిజంగానే చీఫ్ అని తరవాత తెలిసింది. మా ఆయన గొప్పగా ఇంగ్లిష్ లో మాట్లడ బోతే వెర్రి మొహం వేసి చూడసాగింది. ఇదేమిటి ఇలా చూస్తోందని మేము ఆశ్చర్య పోయి చూడసాగం. తెలిసిన విషయం ఎమిటంటే ఆవిడకి ఇంగ్లీష్ రాదు. రిక్షావాడు మాతో ఇంగ్లిష్ లో ప్రశ్నలు అడుగుతూ, డాక్టర్ తో వియత్నమీస్ లో చెప్పసాగేడు. డాక్టర్ మా అబ్బాయిని పరీక్షించి కొన్ని లాబ్ పరీక్షలు రాసింది. ఆరోజు శనివారం అవడం వలన మధాహ్నం పన్నెండు గంటలకి మూసేస్తారు. పన్నెండు అవడనికి ఒక పది నిముషాలు మాత్రమే వుంది. ఈ రిక్షా వాడు, గబ గబా నడుస్తూ, మమ్మల్ని, ఎక్స్ రే, రక్త పరీక్షలు తీయించడానికి తీసుకుని వెళ్ళాడు. శనివారం వలన, అందరు మూసేసినా, రిక్షావాడు అందరితో మాట్లాడి, మమ్మల్ని చూపించి, అందరిని, తలుపులు తెరిపించి పరీక్షలు చేయించాడు.
ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రోబ్లెం. ఎవరికి ఇంగ్లీష్ రాదు.
ఆ రోజు మాతో ఇంచుమించు మూడు గంటలు వుండి రిపోర్ట్ లు వచ్చేకా మళ్ళీ డాక్టర్ చేత మందులు రాయించేడు. అంతేకాదు మందులు కూడా దగ్గర వుండి మాకు ఇచ్చాడు. మమ్మల్ని రెండో రిక్షా పిలిచి మా హోటల్ దగ్గర దింపడానికి ఎక్కించు కున్నాడు. నేను ముందుగానే ఆయనికి చేప్పేను. వాడు అడిగిన డబ్బులు ఇచ్చెయ్యమని.
ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. వెంటనే జేబులోంచి ఒక వంద డాలర్ల నోటు తీసి వాడి చేతిలో పెట్టారు. వాడు అది తిరిగి చేతిలో పెట్టి మమ్మల్ని రిక్షాలో కూర్చో పెట్టి మా హోటల్ వైపు కాకుండా మరొక దిక్కుగా తొక్క సాగాడు. రెండవ రిక్షా కూడా అతని వెనక సాగింది. ఒక మైల్ దూరం తీసుకుని వెళ్ళ్తూంటే, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడా అని ఆశ్చర్యపోయి చూస్తూవుండగానే ఒక పెద్ద చర్చ్ ముందు రిక్షాలు రెండు ఆగేయి. అప్పుడు రిక్షావాడు వాడికి వచ్చిన ఇంగ్లీష్ లో మేము వాడికి ఇద్దామనుకున్న డబ్బు అక్కడ వున్న డొనేషన్ డబ్బాలో వేయమని చెప్పాడు. నాకైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేయి. వీడు మనిషా, దేముడా అని సందేహం వచ్చింది. దేముడంటే ఇరవయ్ తలకాయలు నలభయ్ చేతులతో వూహించుకునే నాకు ఈ రిక్షావాడి రూపంలో సాక్షాత్కరించినట్టు అనిపించింది. వాడి లోని మానవత్వానికి మా వళ్ళు జలదరించింది. చాలా ఆనందం వేసింది. నాలుగు రోజుల్లో మా వాడు కోల్కున్నాడు.
మరో పది రోజులకి ఆ దేశం విడిచి వచ్చేశాము. మరపురాని ఆ సంఘటన మాకు జీవితానికి మాకొక మార్గదర్శక మయింది. ఎవరికైనా సహాయం కావలిస్తే మా సాయశక్తులా ప్రయత్నిస్తూ వుంటాము.
మరో సారి చైనా వెళ్ళాము. అక్కడాకూడా హాస్పిటల్ పని పడింది. ఈసారి, మా ఆయన కింద పని చేసే వర్కర్ కి వంట్లో బాగోక, వెళ్ళ వలసి వచ్చింది. చాలా దూరం వలన టాక్సీలో వెళ్తున్నాము , వూరుకూడా చూడొచ్చు. మమ్మల్ని రమ్మంటే, నేను మా అబ్బాయిని తీసుకుని వెంట బయలుదేరాను. పొద్దున్న తొమ్మిది గంటలకి హాస్పిటల్ చేరుకున్నాము. నన్ను మా అబ్బాయిని, ఒకచోట కూర్చోమని చెప్పి, మా ఏజెంట్ వర్కర్ ని, మా ఆయనని వెరే బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్ళడు. రెండున్నర ఏళ్ళ మా అబ్బాయిని, ఏ వ్యాపకం లెకుండ అంతసేపు కూర్చోపెట్టడం ఎంత కష్టమో మీకు వేరే చెప్పక్కరలేదుగా. అయితే అక్కడ ఆరోజు జరిగిన విషయం ఏమిటో చెబుతా వినండి.

నేను కూర్చున్న చోటు ఒక వరండా లాగ వుంది. అదే రిసెప్షన్ లాగ వుపయోగ పడుతోంది. ఎంక్వైరీ అంటు అక్కడ లేదు. అటు ఇటు వచ్చే వళ్ళని చుస్తూ కాలం గడుపుతూ వున్నము. ఈలోగా మా అబ్బాయి అమ్మా టోయిలెట్ వెళ్ళాలి అన్నాడు. కొంచం సేపు ఓర్చుకోమని, నాన్నగారు వచ్చేస్తారు అని మరపించడానికి ప్రయత్నం చేసాను. అసలే కొంటె వెధవ. వూరుకుంటాడా? అల్లరి చేయడం మొదలు పెట్టాడు. సరే ఇక చేసేది ఎముంది? అయినా టాయిలెట్ కి వెళ్ళొద్దని చెఫ్ఫలేనుకదా?
అటుగా వెళ్తున్న ఒక చైనా వాడిని సైగ చేసి, మా వాడిని చూపిస్తూ టాయిలెట్ ఎక్కడ వుందో చూపించమని మర్యాదగా ఇంగ్లీష్ లో అడిగా. వాడు ఏమనుకున్నాడో ఎమో, నా వైపు మా అబ్బాయి వైపు మార్చి మార్చి చూసేడు. వెంటనే అక్కడనుంచి వెళ్ళీపోయాడు. నాకు అర్ధం అయింది, వాడికి నేను అడిగినది అర్ధం కాలేదని. మరొకరెవరైనా వస్తారెమోని చుస్తూకుర్చున్నా. మనకన్నా విభిన్నంగా వుండే మొహాలు అవి చుస్తూ పాపం మా వాడు కూడా ఎమిజరుగుతోందా అని చుస్తూ వూరుకున్నాడు. మరో పది నిముషాల తరవాత, ఇందాక మేము అడిగిన వ్యక్తి, మరో నలుగురుని వెంటపట్టుకుని అక్కడికి వచ్చాడు. వాళ్ళు, నావైపు ఏమిటి సంగతన్నట్లు చుసారు. నాకు అర్ధం అయింది. మొదటివాడు మాకు సహాయం చెయ్యడానికి అని విళ్ళని వెంటపెట్టుకుని వచ్చాడు. నాకు చాల ఆనందం వేసింది. ఆహా ప్రపంచంలో వ్యక్తులు అందరు ఎంతమంచి వాళ్ళు అని ఆశ్చర్యపోతూ, నేను టాయిలెట్, బాత్ రూం, లావెటోరి, అని నాకు తెలిసిన పర్యాయ పదాలు ఏకరువు పెట్టాను. వాళ్ళందరూ, ఒకళ్ళ మొహాలు ఒకడు చూసుకున్నారు. వాళ్ళ భాషలో ఏదో చాలా సీరియస్ గా నా వుద్దేశం లో వాదించుకున్నారు. వెంటనే అందరూ తలో వైపు వెళ్ళిపోయారు. నాకైతే ఎమి చెయ్యాలో అర్ధం కాలేదు. పాపం మా వాడు కూడా, జరుగుతున్న హడావిడి చూసి, కిక్కురుమనకుండా బుద్ధిగా కూర్చున్నాడు.
మరో పదినిముషాలు గడిచింది. వెళ్ళిన వాళ్ళంతా తలో నలుగురు చొప్పున పిలిస్తే నా చుట్టు ఓ పాతిక మంది పోగయ్యారు. అద్రృష్టం కొద్ది, వాళ్ళలో ఒకడికి టాయిలెట్ అంటే అర్ధం అయింది. వాడు నవ్వుతూ ఇరవయ్ అడుగుల దూరంలో వున్న టయిలెట్స్ చూపించాడు. నా వెనక ఘొల్లు మని నవ్వులు వినిపించాయి. ఆ పాతిక మంది, నాకు కావలసిన దేమిటో తెలుసుకుందుకని మా వెంటనే నడుస్తున్నారని నేను గ్రహించలేదు. నేను కూడా నవ్వు ఆపుకోలేక పోయాను. నాకు చాల అనందపరచిన విషయమేమిటంటే, నేను ఏదో సమస్యలో వున్నప్పుడు, నాకు సహాయం చెయ్యడానికి వాళ్ళు అంతమందిని పిలిచి, అది కనుక్కుని, నాకు సహాయం అందేవరకు వాళ్ళు చూపించిన ఆదరణ మరచిపోలేనిది. మీరి గమనించారో లేదో, వాళ్ళు ఎప్పుడూ చాలా సీరియస్ గా వుంటు, కొంప మునిగి పొయినట్టు వుండే మనుషులు నాకు అలా సహయం చెయ్యడాం నేను ఎప్పుడూ వూహించలేదు. ఇది మీకు చిన్న విషయంలాగా అనిపించ వచ్చు. కాని నాకు కాదు.
ఎందుకంటే...
మరొకసారి ఫ్రాన్స్ దేశం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మరో రకం అనుభవం గురించి చెప్పక పోతే అసలు నేను చెప్పవలసిన విషయం సగమే చెప్పినట్టనుకోండి. ఆయన తోడి ఇంజనియర్ గారి భార్య షాప్పింగ్ కి వెళ్తూవుంటే నన్నూ రమ్మని పిలిస్తే, సరేనని నేను వెళ్ళాను. మేము మా పిల్లలతో బయలు దేరాము.
ఆవిడకి కూడా మా అబ్బాయి వయసు కొడుకే వున్నాడు. వాడు బాగా బలంగా వుండెవడు. మావాడు అవడానికి అర్భకమే కాని విపరీతమైన అల్లరివాడు. ఒక నిముషం కింద వదిలితే చాలు ఇటు అటు పారిపోయేవాడు. వాడివెనక పరిగెట్టలేక ఎప్పుడు ఎత్తుకునే వుండేదాన్ని. ఇప్పుడు కూడా అలా అనే వాడిని ఎత్తుకునే షాప్పింగ్ కాంప్లెక్స్ లో తిరగడం మొదలు పెట్టాము. మా వాడిని ఎత్తుకోవడం చూసి, ఇదేదో మానవ సవారి బాగుందే అనుకున్నాడో, లేక, వీదికేదో రాజభోగం జరిగిపోతోంది. వాడికి జరగడం లేదనో, వాళ్ళబ్బాయి ఎత్తుకోమని ఏడుపు మొదలు పెట్టాడు. పాపం, కొంచం సేపు వాడిని మోసింది. తరవాత దింపడానికి ప్రయత్నించింది, కాని వాడు దిగడే. ఏదుపు మొహం వేసుకుని, నువ్వు మీ అబ్బాయిని దింపు, అప్పుడు ఇద్దరు కింద వుంటారు అని నన్ను అడిగింది. పాపం చెప్పొద్దూ, నాకు కూడా జాలి వేసింది. సరేలే అని నేను మా వాడిని దింపాను. ఫ్రాన్స్ పెర్ఫ్యూంస్ కి చాలా ప్రశిద్ది కదా అని అక్కడ వున్న బ్రాండ్స్ చూస్తూ, ఒక రెండంటే,రెండే నిముషాలు ఏమరిచాను. ఎందుకైనా మంచిదని, మా అబ్బాయి చెయ్యి పట్టుకుని వుండడం మంచిదనిపించింది. తీరా వెనక్కి తిరిగి చూస్తే వాడు లేడు. దగ్గర దగ్గరగా వున్న ఐల్స్ లోకి తొంగి చూస్తూ వాడి కోసం తిరిగేను. చాలా అభివౄద్ది చెందిన దేశం వలన కొంచం ధైర్యంగానే వున్నాను. లేకపోతే ఈ పాటికి ఏడుపు లంకించుకునేదాన్ని. స్వతహాగా ధైర్యవంతురాలినే అనుకోండి. కాని, మరీ చిన్నపిల్లాడు కదా. ఎక్కడికి పోతాడు, ఈ కాంప్లెక్స్ లోనే వుంటాడని ధైర్యం. కాని ఇలా తిరగడంలోనే అరగంట గడిచింది. వాడి జాడ లేదు. అక్కడ ఎక్కువ మంది లేరు. ఒకరిద్దరు సెక్యురిటి వాళ్ళు కూడా వున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి కనిపించడం లేదని చెప్పాను. వాళ్ళకి నేను చెప్పింది వినిపించినట్టు అనిపించలేదు. వాళ్ళు బొమ్మలేమోనని అనుమానం కూడా వచ్చింది. కాని వాళ్ళు మనుషులే. మిగతా ఫ్రెంచ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు.

అసలు ఎవరూ వినిపించుకునే ప్రయత్నం గాని, అర్ధం చేసుకునే ప్రయత్నం గాని ఎమీలేవు. సేల్స్ సేలెస్ గర్ల్స్ ని అడుగుదామని అనుకున్నా, ఎవరూ నేను మాత్లాడుతూ ఉంటే కనీసం మొహంలోకి కూడా చుడడంలేదు. జీవితంలో మొదటిసారి మరొక జాతిని తక్కువ చేసి చూడడం అంటే ఎమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఇక లాభం లేదని, మావాడి కోసం గట్టిగా అరవడం మొదలు పెట్టా. వెంటనే, సెక్యూరిటి వాళ్ళు పరిగెట్టుకుని నాదగ్గరకి వచ్చేరు. కాని, మళ్ళీ అదే ధోరణి. చూడబోతే నన్ను అరెష్టు చేయడనికి వచ్చినట్టుంది గాని నాకు సాయం చెయ్యడానికి వచ్చినట్టులేదు.
కానీ నా కొదుకుని నేను వదులుకోలేనుకదా. వాళ్ళ ఎదురుగానే గట్టిగా మా వాడిని పిలవడం మొదలు పెట్టా. ఇంతలో చిన్నగా కిల కిలా నవ్వులు వినిపించేయి. ఆ కిల కిలలు మావాడివని నాకు తెలుసు. పక్కనే వున్న ఎస్కులేటర్ మీదనుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి నాతో దొంగాట ఆడుతున్నాడు. బ్రతుకు జీవుడా అని పరిగెట్టుకుని వెళ్ళి వాడిని తెచ్చుకున్నా. ఇంటికెళ్ళేదాకా వాడిని దింపితే వట్టు. నాతో వచ్చిన ఆవిడ కూడా భయపడి పోయింది.
నాకు అర్ధం కాని విషయం ఎమిటంటే, వియత్నాం లో రిక్షా వాడికున్న మానవత్వం, సంస్కారం, అగ్ర జాతి దేశమైన ఫ్రాన్స్ దేశస్తుల్లో ఎందుకు లేదా అని అనిపించింది. అప్రాచ్యుల్లారా అని మా బామ్మ తిడుతూ వుండేది. నిజం గానే ప్రాచ్య అప్రాచ్య ప్రాంతాల ప్రభావం అక్కడ నివసించే వాళ్ళ మీద వుంటుందా అని అనిపించింది. ఇప్పటికి కూడా ఈ సంఘటనల గురించి తలుచూకున్నప్పుడు, భగవంతునికి ధన్యవాదాలు ఛెప్పుకుంటూ, ఇప్పటికీ ఆ రిక్షా వాడిని కూడా తలుచుకుంటానంటే మీరు నమ్ముతారనే అనుకుంటున్నా.