Friday, June 23, 2017

ఆక్రోశవాణి

ఆక్రోశవాణి 

ఈ మధ్య ఆకాశవాణి లో వార్తలు చదివే వక్త రచయిత అయిన ప్రయాగ రామకృష్ణ గారి రాక ఎంతో ఆనందం కలిగించింది. మాటే మంత్రము అనే విషయం మీద ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఆ మీటింగ్ కి పది నిముషాల ముందు ఆయన గొంతుక కార్ లో రేడియో లో వినడం మరి కాస్త  థ్రిల్ ని ఇచ్చింది , . నిజం చెప్పొద్దూ, పొద్దున్నే భక్తి రంజని ఒక్కటే వినేదాన్ని అందుకేనేమో ఈ మాత్రం భక్తి అనే బీజం నాలో నాటుకుందేమో! బాలాంతరపు రజని కాంత్ గారికి సహస్రకోటి ప్రణామములు.  వార్తలు ఒక్క ఎలక్షన్ టైం లోనే వినేదాన్ని. మిగతా రోజుల్లో ఎక్కువగా వినేది శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ మాత్రమే. ఆ విషయం ఆయనతో చెప్పలేదు.  బాగోదు కదా! ఆ అన్నట్టు క్రికెట్ కామెంటరీ వినేదాన్ని. 

ఇప్పుడు క్రికెట్ చూడడం కూడా లేదు. ఇంటరెస్ట్ లేక కాదు, బిపి పెరిగిపోతోందని. 

ఆకాశవాణి.. అందరికీ తెలిసినదే ఆకాశవాణి. అయితే ఆకాశవాణి అనగానే మనకు మనసులో మెదిలేది రేడియో.
అసలు నిజంగా ఆకాశవాణి అంటే ఎవరు? ఆడా ? మగా?
 నారాయణుడి సమాచారాలు అందజేయడానికి నారదుడు ఉందనే ఉన్నాడుగా, మళ్ళీ ఈ ఆకాశవాణి ని ఎందుకు వాడ వలసి వచ్చిందో. కంసుడు కి నారదుడు డైరెక్ట్ గా వఛ్చి చెప్పొచ్ఛుగా, మధ్యలో ఈ ఆకాశవాణి ఎందుకో? 
ఈ మధ్య మళ్ళీ టోరీ రేడియో అప్పుడప్పుడు వింటూ వున్నా. విని విని అదీ విస్తుగొస్తోంది; 

టీవీ వచ్చాకా రేడియో వినడం తగ్గిపోయింది. కళ్ళు గుడ్డి అయిపోయినా పొద్దున్న లేచింది మొదలు ఇంచుమించు అర్ధరాత్రి దాకా టీవీ ఆన్ చేసే ఉంటోంది. 
టీవీ సైజు కూడా రోజు రోజుకీ పెద్దది అయిపొయింది. పడకగది కి ఒక టీవీ. బట్టలు మార్చుకుందామంటే, టీవీ ముందు మార్చుకుందుకు ఆ వ్యక్తులు మన గదిలోనే ఉన్నారేమో అనే ఫీలింగ్ వలన కొంచం  ఆలోచించ వలసి వస్తోంది. 

ఇక అందులోని ప్రోగ్రామ్స్ చూద్దామా అంటే.. 

భక్తి ప్రోగ్రామ్స్ అనేసరికి, ప్రవచనాలు మొదలవుతాయి. చెప్పొద్దూ నాకు ప్రవచనాలు విని విని, చెవులు చిల్లులు పడ్డాయి. 
ఆవుపేడ తో అలికి, ముగ్గుపెట్టి, కలశం పెట్టి పూజ చెయ్యండి. అప్పుడు లక్ష్మి దేవి వరం ఇస్తుంది. అయితే, ఆవుపేడతో అలాకాకపోతే, అమ్మవారు వస్తుందని నమ్మకం లేదుట. 
ఇప్పుడు పూజ ముఖ్యమో, ఆవుపేడ ముఖ్యమో తెలియడం లేదు. 

రుక్మిణి దేవి కృష్ణుణ్ణి చూసి సిగ్గుపడిందిట. ఈ కాలం ఆడవాళ్ళకి సిగ్గే లేదు  అంటాడొక మహానుభావుడు. మగవాళ్ళూ ఒక్క నిముషం ఆలోచించండి. మీ భార్య ఆఫీస్ కి వెళ్లి, తన తోడి ఉద్యోగస్తులముందో, తన సూపర్ వైజర్ రో సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నట్టు. .. బాగోలేదు కదా. సిగ్గు పడడానికి కూడా సమయం సందర్భం ఉండాలేమో!

వాళ్ళు రామాయణ మహాభారతం లో చెప్పాలనుకున్నదేదో చెప్పి పోక, మధ్యలో సామాన్య జీవనం గడుపుతున్న మనమీద ఈ అనవసర కామెంట్స్ ఎందుకు చేస్తారో అర్ధం కాదు. కట్టు బొట్టు తీరు గురించి కూడా ఏవో వ్యాఖ్యానాలు చేస్తూనే వుంటారు. దేశ, కాలమాన పరిస్తుతుల వలన వేష భాషలు మార్చుకోవలసి వస్తుందని ఎందుకు అనుకోరో?
 

 సీరియల్స్ మాటకి వస్తే , ఇక వాళ్ళు ధరించే నగలు, వేసుకునే బట్టలు చూస్తే వికారం పుట్టుకు వస్తుంది. ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు తెలుగు సీరియల్స్ చూసే మహాభాగ్యం కలిగింది. చాలా మటుకు హిందీ సీరియల్స్ డబ్బింగులు, మిగిలినవి మూడు డైలాగులు ఆరు ఎక్స్ప్రెషన్స్, అరవై  అడ్వైర్ టైజ్ మెంట్స్

ఈ హిందీ సీరియల్ లో ఒకే జంట సీరియల్ అయ్యేలోగా ఓ నాలుగు అయిదు సార్లు పెళ్ళి చేసుకుంటారు, ఎంత బుర్ర పగలకొట్టుకున్నా ఎందుకో అర్ధం అవడం లేదు. పెళ్లి అయ్యాకా అపార్ధాలతో ఆరునెలలు కాపురం చేసి,  హీరో ని చంపేసి, పది రోజులు తిరగ కుండానే  హీరోయిన్  ని మరొకడికి ఇఛ్చిపెళ్ళి చేసేస్తూ వుంటారు. కొండొకచో, ఆ మొదటి మొగుడు బతికి తిరిగి వచ్ఛేస్తూ ఉంటాడు. ఒక పెళ్లి కొడుకు దొరకడం కష్టమైనా ఈ రోజుల్లో అందరేసి రెండో మొగుళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరికేస్తారో తెలియదు. 


Zee TV లో ఈ మధ్య కొత్త సీరియల్ వస్తోంది పరమ అవతార్ శ్రీ కృష్ణ అని. 
ఈ మధ్య  క్రియేటివిటీ ఎక్కువైపోయింది కదా! ఇంగ్లీష్ సినిమా'మమ్మీ' లో ధూళి లోంచి భూతం వచ్చినట్టు, ఈ సీరియల్ లో కంసుడు రధం నడుపుతూ ఉంటే మబ్బుల్లోంచి ఆకాశవాణి మాట్లాడింది. మామూలు గా ఆకాశవాణి అంటే ఒక దేవతలా అనిపిస్తుంది, అలాంటిది, వీళ్ళ అనిమేషన్ మండ, కంసుడి కన్నా ఆకాశవాణే భయంకరం గా వుంది. 
ఎంతమంది టీవీ చూస్తున్నారో తెలియదు గానీ , కొన్ని తమాషాలు కనిపిస్తూ ఉంటాయి. నేను అన్నీ హిందీ ఛానెల్స్ చూస్తూ ఉంటా. ఒకదాని నుంచి మరొకటి మారుస్తూ ఉంటా. ఒక సీరియల్ లో ఒక హీరో కి బుర్రకి కట్టు ఉంటే, మరో ఛానల్ లో కూడా మరొకడికి కట్టువుంటుంది. ఇక్కడ వీడికి ఆక్సిడెంట్ అయితే, మరో ఛానల్ లో వాడికీ ఆక్సిడెంట్ అయిపోతుంది. వీడు గతం మర్చిపోతే, రెండో ఛానల్ లో వాడు కూడా గతం  మర్చిపోతూ ఉంటాడు. ఒకడే రచయిత రెండు సీరియల్స్  రాస్తున్నాడేమో అని అనుమానం వస్తుంది  మరో కొంతసేపు చూస్తే, నన్ను నేనే మరిచిపోతానేమో !

ఇంతకీ నేనేమి చెప్తున్నా?

గుర్తుకు వచ్చాకా మళ్ళీ కలుద్దాం.