నాకు తెలుసు, సినిమా అనగానే అందరికీ కుతూహలమే మరి. ఏ దేశంలోనైన చవగ్గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా కాక మరేమిటి వుంటుంది చెప్పండి. అందరికీ అందుబాటులో వుండే ఎంటర్ టైన్మెంట్. మరి దాని గురించి కొద్దిగా మాట్లాడాలని అనిపించింది.
చిన్నప్పుడు రోజూ సినిమాకి తీసుకుని వెళ్ళమని గొడవ చేసేదాన్నో ఏమో, మా చిన్నాన్న గారి అబ్బాయి నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళే వాడుట. చిన్న వూరు కావడం వలన, వాడి ఫ్రెండ్ సినిమా హాల్ మేనేజర్ వలనా, రోజూ ఓ గంట సేపు సినిమా చూసాకా, నేను నిద్రపోతే వాడు మళ్ళీ నన్ను మోసుకుని తెచ్చి పడుకో పెట్టేవాడుట. మరి నేను ఎందుకు అల్లరి పెట్టేదాన్నో తెలియదు కాని, నాకు బాగా అర్ధం అయిన సినిమా లవకుశ. నాకు పదేళ్ళు వున్నప్పుడు వచ్చి వుంటుంది. ఆ తరవాతే, కొంచం సినిమా అంతే ఏమిటో తెలిసింది. చదువని చెప్పి మా వాళ్ళు నా సినిమాలు తగ్గించేసారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు ప్రతీ సారీ ఒక సినిమా చూడ నిచ్చేవారు. అంతే. అంటే ఎడాదికి మూడు సినిమాలు మాత్రమే. ఈ లోగా సినిమాలు బంద్. వేసవి సెలవుల్లో తాతగారి వూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ సినిమా హాలు లేక పోవడం వలన, చూడడానికి కుదేరేది కాదు.
చాలా కాలం వరకూ, ఏ సినిమా అయినా బాగున్నట్టే అనిపించేది. అమ్మ వాళ్ళు, ఈ సినిమా బాగుంది ఆ సినిమా బాగోలేదు అంటే, ఏమిటో చాలా కాలం అర్ధం కాలేదు నాకు. నా మటుకు నాకు అన్ని సినిమాలూ బాగున్నట్టే అనిపించేది చాలా కాలం వరకూ.
ఆదుర్తి సుబ్బారావు సినిమాలూ బాగుంటాయి అనే వారు. అప్పట్లో నాకైతే విఠలాచార్య సినిమాలు చాలా నచ్చేవి. మనుషులు చిలకలుగానో, కుక్కలు గానో మారి పోవడం అదీ చాలా ఇష్టం గా వుండేది. మంగమ్మ శపథం , శ్రీ కృష్ణ పాండవీయం లాంటి సినిమాలు చాలా నచ్చేవి. చెప్పాలంటే, చూసే ఏడాదికి మూడు సినిమాలు మరువలేనివిగా అనిపించేవి.
ఇక కాలేజీ లెవెల్ కి వచ్చాకా, నా సినిమాలు గురించి పెద్దగా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అన్నయ్య కి వుద్యోగం వచ్చేయడం తో, నాకు సినిమాలకి డబ్బులు బాగానే ఇచ్చేవాడు. అప్పటినుంచి కొంచం ఎక్కువ అయ్యాయి సినిమాలు. తెలుగు కన్నా ఫ్రెండ్స్ తో హిందీ సినిమాలు చూడడం మొదలుపెట్టా. ఇప్పటి నా భర్త, అప్పుడు మా స్నేహితుడిగా వుండేవారు. నాకు హిందీ రాదని, నా పక్కన కూర్చుని, నాకు తెలియని చోట చెబుతానని అనేవారు. సరే ననే దాన్ని. నాకు చాలా డైలాగ్స్ అర్ధం అయ్యేవి. ఎక్కడైనా ఏదైనా పదం అర్ధం కాక, అడిగితే, "ఏమో, నాకూ తెలియదు" అనేవారు సేరియాస్ గా మొహం పెట్టుకుని. పెళ్ళయ్యాకా మరో సమస్య ఎదురయింది నాకు. ఆయన సినిమా చూస్తున్నంత సేపూ కెమెరా ఎక్కడ వుంటుంది, లైట్ బాయ్ ఎక్కడ ఉంటాడు, హీరో హీరోయిన్లు ఏకాంతంలో మాంచి రసవత్తరంగా పాట పాడుతూ వుంటే, వాళ్ళ ముందు ఎంత మంది టెక్నీషియన్లు ఉంటారో, నాకు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ వుంటారు, మొత్తం సినిమా మీద ఇంట్రెస్ట్ చచ్చేటట్టు. చిన్నప్పుడు సినిమాల్లో ట్రాజిడీలు చూస్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసేవి. కళ్ళు మిటకరిస్తూ, ఎటో చూస్తున్నాట్టు నటిస్తూ ఎవరూ చూడ కుండా కళ్ళు తుడుచు కునే దాన్ని. సినిమా హాల్లో సౌండ్ చాలా ఎక్కువగా అనిపించి చెవుల్లో వేళ్ళు పెట్టుకునేదాన్ని. దెయ్యం సినిమాలు చూస్తే, చాలా రోజులు భయంకరమైన కలలు వచ్చి, జడుసుకునే దాన్ని. నిద్దట్లోనే హనుమాన్ చాలీసా చదువుకునేదాన్ని. టీ వీ వచ్చాకా, కొంచం ఇమ్మ్యున్ అయ్యానో ఏమో మరి, అలాంటి సున్నితమైన భావాలు చచ్చిపోయాయనుకుంటా. ఇప్పుడు కళ్ళమ్మట నీళ్ళు రావడం లేదు. పైగా పక్కనుంచి ఆయన కామెంటరీ కూడా వుంటుంది కదా.
నాకు బాపు గారంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, బాపు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు వుంటారు అని అనుకుంటున్నారు కదూ. ఆయన బొమ్మలు చాలా ఇష్టం కానీ, ఆయన సినిమా ముగింపులు నచ్చేవి కావు. ఆఖరి సీన్ లో వెనకనుంచి పోలీసులు రావడం, గాభరా గాభరాగా విలన్ తాను చేసిన అన్ని వెధవ పనులూ చెప్పెయ్యడం, హీరో హీరోయిన్ లో గోడ పక్కనుంచి వినేసి అపార్ధాలు పోయి కలుసు కోవడం.. ఏమిటో.. అసంతృప్తి గా వుండేది. సినిమా అంతా ఒకెత్తుగా వుంటే, ఆ ఎండింగ్ అంతా తేలి పోయినట్టు అనిపించేది. 'ముత్యాలముగ్గు' కానీండి, లేక 'పెళ్లి పుస్తకం' కానీండి.. ఇక 'సుందర కాండ' అయితే, ఒక ఇంగ్లీష్ సినిమాకి (What a girl wants) మక్కీకి మక్కీ కాక పోయినా, అదిమాత్రం కాపీ. చాలా సినిమాలు మాత్రం నచ్చేవి. విశ్వనాథ్ గారి సినిమాలు చాలా నచ్చేవి, కానీ చాలా మటుకు దు:ఖాంతాలే.
చిన్న మావయ్య పెద్ద మావయ్యకి తెలియకుండా మాకు, అంటే నాకు మా అన్నయ్యకీ ఇంగ్లీష్ సినిమాలు చూపించేవాడు. మాకు అర్ధం కాక పోయినా వెళ్ళడం మానేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటి ఇంగ్లీష్ సినిమాలు చూడడం గొప్ప, రెండవది, ఇవి నా సంవత్సరానికీ మూడు సినిమా కోటా లోంచి కాదు. అందుకే, అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నమాట. 'Hatari', ' A man from Rio', Gold finger', Tora Tora Tora' లాంటివి చూపించాడు. నిజం చెప్పొద్దూ, ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అమెరికా కి వచ్చిన రెండు మూడేళ్ళ తరవాత ఇంగ్లీష్ సినిమాలు ప్రతి డైలాగూ అర్ధం అవడం మొదలయింది. ఈ లోగా, కేబుల్ పెట్టుకోకుండా, ఇంగ్లీష్ టీ వి చూడడం వలన అని అనుకుంటున్నా. ఏదైతేనేం , ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒకే స్థాయిలో ఆనందించ గలుగుతున్నాము.
ఒకసారి ఏమయింది అంటే, మా అయన, చాలా కాలం దేశాంతరం వెళ్లి, వస్తూ, ముంబాయ్ ఆఫీసు పని పూర్తి చేసుకుని, ట్రైన్ దిగి విశాఖ పట్నం లో తెల్లవారు ఝామున ట్రైన్ దిగి, ఆటో దొరక్క, రిక్షా ఎక్కి వస్తూ, ఆ రిక్షా వాడిని, " ఏమోయ్, వూళ్ళో మంచి సినిమాలు ఏమున్నాయి? " అని అడిగారు.
"మాంచి సినిమా వుంది బాబు. శంకరా భరణం తరవాత అలాంటి సినిమా" అన్నాడు రిక్షావాడు.
"ఓహో, ఏమిటా సినిమా" అన్నారు.
వాడు తడుముకో కుండా " కె డి నంబర్ వన్" అన్నాడు.
మా ఆయనకి తల దిమ్మెక్కి పోయింది. ఒక్క సారి జ్ఞానోదయం అయింది. అవును.. ఎందుకు కాకూడదూ? రెండు సినిమాలకీ వసూళ్లు బహుశా ఒకటే అయి వుంటాయి కదా మరి. అనుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సినిమా లోనూ ఏదో ఒక మంచి చూడ డానికి ప్రయత్నించడం మొదలు పెట్టాము. ఆలీ, బ్రహ్మానందం హీరో లు గా వేసిన సినిమాలు కూడా నచ్చేయ్యడం మొదలు పెట్టాయి.
అంతే కాదు, ఎస్ ఎస్ ఎల్ సి లో స్కూల్ లో ఫస్ట్ వచ్చిన మా బంధువుల్లో ఒకనికి ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్ పోటీలలో పియు సి పరీక్షలు పోగుట్టుకున్న వారిని కూడా చూసాము. కొందరు సినిమా హీరోలకి అభిమాన సంఘాలు కూడా ఉంటాయని చాలా రోజుల వరకూ నాకైతే తెలియదు. నిజం చెప్పొద్దూ, మా ఆయనకి కొంచం ఎన్ టీ ఆర్ ఫ్యాన్. మిగతా వాళ్ళు ఇతర నటుల పేరు చెబితే చాలు, ఆయనకి ఇప్పటికీ ఉద్రేక౦ వస్తుంది వాగ్యుద్దానికి దిగి పోతారు. మా అక్క కొడుకు చిన్నప్పుడు "ఎన్ టీ ఆర్ వద్దిల్లారి ' అనే వాడు, వర్ధిల్లాలి అందడం పలకక. ఈ వయస్సులో కూడా ఈ తగవులు పోలేదు. ఈ మధ్యనే ఒక సినీ నటుడు ' కృష్ణ అభిమాని, తెలియ చేసిన కొత్త విషయం ఏమిటంటే, కృష్ణ ఎందుకు ప్రతీ ఏటా అన్నేసి సినిమాలలో నటిస్తారు అని అడిగితే, చాలా మందికి ఉద్యోగావకాశాలు కలిగించాలని అని చెప్పాడుట. నిజమే కదా. ఆయన నటించక పొతే, మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు?
కేబుల్ టీ వీ లో రోజుకు మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సినిమా అంతే ఇంట్రెస్ట్ చచ్చి పోయింది. అయినా ఏదో డ్యూటి లాగా చూసేస్తున్నా. నేను టీ వీ లో పాత సినిమాలు చూస్తూ వుంటే, మా అబ్బాయి వచ్చి అబ్బా బ్లాక్ అండ్ వైట్ సినిమా వా అంటూ మరో గదిలోకి వెళ్లి పోతాడు. వాడికేమి తెలుసు ఆ సినిమాల విలువ అనుకుంటూ ఉంటా.
భగవద్ గీతలో సుఖ దుఖాలకి అతీతం గా వున్నట్టు, అన్ని సినిమాలని ఒకే విధంగా చూడాలని చాలా ప్రయత్నించా.. కానీ కుదరడం లేదు. అలా అని మంచి డైరెక్టర్ అని సినిమాలు ఎంచుకోవడం మొదలు పెట్టా. అలా అని ఈ మధ్య మణిరత్నం 'రావణ్' చూసి పడా పడా చెంపలు వాయి౦చుకున్నా.
అయినా ఒక విషయం మాత్రం బాగా అర్ధం అయింది. వెనకటికి ఒకడు, కొందరు బంధువులు వచ్చి ఆనంద పెడతారు, కొందరు వెళ్లి ఆనంద పెడతారు అని. కొన్ని సినిమాలు, హాలులో చూసి ఆనందిస్తాము. కొన్ని, హాలు లోంచి పైకి వచ్చాసాకా ఆనందిస్తాము "బతుకు జీవుడా, వెధవ సినిమా అయిపోయింది" అని. వెనకటికి ఒకడు ఇరుకు బూట్లు వేసుకుని రోజూ ఆఫీసు కి వచ్చేవాడుట. ఒక మిత్రుడు, వాడిని చాలా రోజులు, నానా అవస్థా పడడం చూసి, 'ఎందుకురా అలా బాధ పడుతున్నావు, కొత్త బూట్లు కొనుక్కో వచ్చుగా ? " అని అడిగేడుట, దానికి వాడు, అవి ఇచ్చినప్పుడు ఇచ్చే ఆనందం నా బాధలనీ మర్చి పోయేటట్టు చేస్తుంది' అన్నాడుట. నిజం చెప్పొద్దూ, రావణ్ సినిమా చూసాకా అలానే అనిపించింది. ఈ మధ్య టీ సి ఏ వాళ్ళు ఫ్రీగా "ప్రస్థానం" చూపించారు. కాసేపు సినిమాలో కూర్చుంటే, మమ్మల్ని కూడా ఏ కత్తో పెట్టి చంపేస్తారేమో అనిపించింది. సినిమా బాగోలేదని అనలేము. కానీ ఆ రక్తపాతాలు చూసి, ఆనందించడానికి మనం అంత సాడిష్టులమా అని అనిపిస్తోంది. ఆ రక్తపాతాలు నాకైతే చూడడం కొంచం కష్టం గానే ఉంటోంది.
అంతెందుకూ, డిస్నీ వాళ్ళ టాం అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతూ వుంటే, ఇది కూడా సాడిజం లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి కాదా, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే అదే కదా మరి?
ఒకసారి ఏమయిందంటే, మా వేసవుల్లో తాత గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక లారి పక్కనే వున్న టౌన్ కి వెళ్తున్నట్టు తెలిసింది. ప్రతీ వారం అది సరుకులు పట్టుకుని మా తాతగారి వూరు వచ్చేది. పూర్తిగా మూసివుంటుంది. మేము వెళ్ళి మమ్మల్ని కూడా ఆ వూరు తీసుకుని వెళ్ళమని అడిగాము. వాడు వెంటనే వొప్పుకున్నాడు. తాతగారు బాగా పలుకు బడి వున్నవారు కదా. కానీ ఆయన పొలానికి వెళ్ళిపోయారు. ఇంట్లో అమ్మమ్మ,అత్తయ్యలు, మామయ్యలు వాళ్ళ పిల్లలు పదిహేను మందిమి తయారయ్యాము. తాతగారి పర్మిషన్ కావాలి.మీరు వంట చేసెయ్యండి, మేము తాత గారిని అడిగి వస్తామని నేను, నా కజిన్ రత్నాన్ని వెంట పెట్టుకుని పొలానికి బయలు దేరాను. తూనీగల్లా పరిగెత్తి, మనసులో గాలిలో ఎగురుతూ పొలానికి చేరుకున్నాము. తాతగారు, పాలిగాపులతో దగ్గరుండి, మొక్కలకి గొప్పులు తవ్వించడం, కలుపులు తీయించడం లాంటి పనులు చేయిస్తున్నారు. మేము వెళ్ళి "తాతయ్యా, లారి వాడు తీసుకుని వెళ్తున్నాడు, ప్లీజ్, సినిమాకి పంపవా అని గారాలు పోయాము. ఏ కళ నున్నాడో, వెంటనే వప్పేసుకున్నాడు. వెంటనే పరిగెట్టుకుని పారిపోయాము, మళ్ళీ మనసు మార్చేసుకుంటాడేమో నని భయంతో. మేము వెళ్ళిన మరో పది నిముషలకే లారీ ఎక్కి వెళ్ళిపోయాము. దసరా బుల్లోడు కాక మరో సినిమా చూసి, రాత్రికి ఆ వూళ్ళోనే వుద్యోగం చేస్తున్న మా దూరపు బంధువుల ఇంట్లో పడుకుని మర్నాడు తాత గారి ఇంటికి చేరుకున్నాము. తాతగారు చాలా కోపంగా కనిపించారు. మింగలేక కక్కలేకా వున్నట్టు కనిపించారు. కారణం ఎమిటో మాకు అర్ధం కాలేదు. తరవాత తెలిసిందేమిటంటే, నేను, రత్నం మాత్రమే సినిమా కి వెళ్తున్నామని అనుకున్నారు ఆయన. ఆయన పెర్మిషన్ ఇచ్చింది మా ఇద్దరికేట. ఏదయితేనేమి, అందరం అలా లారీలో వెళ్ళడం, ఆ రోజు మేము పట్టుకుని వెళ్ళిన చింతకాయ పచ్చడి, పప్పుపులుసు అన్నం రుచి ఇంకా నా మనస్సులో మెదులుతూనే వుంటుంది. ఇప్పటికీ ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ వుంటాము.
No comments:
Post a Comment