మా స్వంత వూరు వెళ్ళినప్పుడు పాత ఉత్తరాల తీగలో ఒక వుత్తరం దొరికింది. అది మీ అందరితో పంచుకోవాలని రాస్తున్నా . కొత్తగా పట్టణం లో కాపురం పెట్టిన మా బంధువు తల్లికి రాసిన పోస్ట్ కార్డు వుత్తరం ఇలా సాగింది.
మహాలక్ష్మి సమానురాలైన అమ్మకి నమస్కరించి కమల వ్రాయునది.
ఇక్కడ మేమంతా క్షేమం. మీరు అంతా క్షేమమని తలుస్తాను. నువ్వు రాసిన వుత్తరం అందింది.
నాన్నగారికి వంట్లో బాగాలేదని
రాసావు. ఇప్పుడు ఎలావుంది? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. రోజూ బి పి మాత్రలు మర్చి పోకుండా వేసుకోమని చెప్పు. షుగర్ కూడా చూపించుకోమని చెప్పు. నువ్వుకూడా రోజూ బలానికి ఏమైనా టానిక్ వాడడం మంచిదేమో . నాన్నగారిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పు. మామ్మకి, తాతగారికీ నమస్కారాలని చెప్పు.
తమ్ముణ్ణి బాగా చదువు కో మన్నానని చెప్పు. వాడు డాక్టరో ఇంజనీరో అవ్వాలని నా కోరిక అని చెప్పు. సెలవుల్లో నా దగ్గరికి వాడిని పదిరోజులు వుండేటట్టు పంపు.
నేను బయలు దేరి నప్పుడు నువ్వు నా కిచ్చిన సాంబార్ పౌడర్ అయిపోయింది. నేను చేసి చూసాను . కానీ నువ్వు చేసిన పొడి తో చేసినట్టు లేదని మీ అల్లుడుగారు అంటున్నారు. త్వరలో సంబారు పొడి పంపు .ఆ చేత్తోనే, మసాలా కారం కూడా చేసి పంపు . నువ్వు చెప్పిన పాళ్ళ తోనే చేసినా, కుదిరి చావడం లేదు. నువ్వు ఇచ్చిన అరిసెలు చుట్టు పక్కల వాళ్ళందరికీ పంచేసాను . అన్నీ అయిపోయాక మీ అల్లుడు గారు అరిసె పెట్టమన్నారు .
వీలైనప్పుడు చేయించి పంపు . పక్కింటి సుబ్బమ్మ గారు బాగా చేస్తారు కదా. ఆవిడ చేత చేయించి పంపు . సుబ్బమ్మగారిని అడిగానని చెప్పు. వాళ్ళమ్మాయి కమల పండక్కి వస్తుంది అన్నారు . వచ్చిందా? వస్తే అడిగినట్లు చెప్పు.
ఎదురింటి కామాక్షి పిన్నిగారు చక్కిలాలు బాగా చేస్తారు కదా. ఆవిడని ఆవిడ పిండి వంటలని రోజూ తలుచు కుంటు న్నానని చెప్పు. వీలైతే ఆవిడతో చక్కిలాలూ, జంతికలూ చేయించి పంపు.
కొబ్బరికాయలు దింపారా. నూనె తీస్తే వట్టివేళ్ళు
, కర్చూరాలు వేసి చేస్తావు కదా, అలా చేసి పంపు. కొబ్బరి ముక్కలు ఎండలో వేసేము బెల్లంతో లస్కోరా చేసి పంపు. మీ అల్లుడుగారికి చాలా ఇష్టం.
చింతపండు పిక్కలు తీయిస్తున్నానన్నావు, తియ్యడం అయిపోతే అదికూడా పంపు.
వీళ్ళు వాళ్ళు పెట్టిన జాకెట్టు గుడ్డలు ఒక ఆది జాకెట్టు వదిలేసి వచ్చాను. మన టైలర్ నారాయణ కి ఇచ్చి కుట్టించి పంపు. నారాయణ ని , వాడి పెళ్ళాన్ని అడిగానని చెప్పు.
వినాయకుడి గుడి పూజారి గారు బాగున్నారా? ఆయనకీ నమస్కారాలు అని చెప్పు. నా పేరునా మీ అల్లుడి గారి పేరునా నిత్యం అర్చన చేయ్యమన్నానని చెప్పు .
ఇక్కడకి వచ్చాకా షాంపూ కి జుట్టు ఊడి పోతోంది. కుంకుడు కాయలు గుండగా దంపించి పంపు . మళ్ళీ కొట్టుకోవడం ఇక్కడ ఇబ్బంది . సున్నుపిండి నలుగు పెట్టుకుందుకు పంపు . అచేత్తోనే మినప సున్నుండలు కూడా చేయించి పంపు. నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా . పని అమ్మాయి రాములు వస్తోందా? దానికి నేను మళ్ళీ సారి వచ్చినప్పుడు చీర ఇస్తానని చెప్పు.
కందిపొడి కూడా అయిపోవస్తోంది. మిల్లులో ఆడిస్తే మసాలా వాసనా వచ్చేస్తోంది.
కాస్త విసిరించి పంపు.
మీ అల్లుడుగారు వచ్చే టైము అయింది. మిగతా విషయాలు తరువాతి ఉత్తరంలో రాస్తాను.
ఇట్లు ప్రేమతో,
కమల.
Lovely. Variety ga undi. Inkaa ilanti viseshalu unte cheppu. Mail pampu...
ReplyDelete-Devi Prasad.
Your reply is even more lovely Devi Prasad.. :)
Delete