Friday, June 24, 2011

అమెరికాలో ఆవకాయ

అమెరికాలో ఆవకాయ ఏమిటి అనుకుంటున్నారా ? అంటే, నేను అమెరికా వచ్చాకా ఆవకాయ పెట్టడం గురించి చెప్పాలని నా ఉద్దేశం . వచ్చిన కొత్తలో అమెరికన్ గ్రోసరీ షాపులే కాక ఇండియన్ గ్రోసరీ కూడా ఉంటాయని ఒక నెలలోనే తెలిసిపోయింది
నాకు . అప్పటికే ఐస్ క్రీంలు, ఫ్రూట్ జ్యూస్లూ సరదాలు తీరిపోయి, నాలుక చచ్చిపోవడం తో , ప్రియా వాళ్ళ గోంగూర పచ్చడి , ఆవకాయా వగైరాలు అర డజను రకాల పచ్చళ్ళు కొనేసుకున్నా. కొన్నాళ్ళు పోయాకా , ఆ ఆవకాయ ఏదో నేను ఎందుకు పెట్ట కూడదు అనిపించింది.

ఎండా కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి . మండే ఎండల్లో మనసుకు నచ్చేవి మల్లెపువ్వులు, మామిడిపళ్ళు. అదేలెండి , వాటితో బాటు కొత్త ఆవకాయ.


కిందటేడాది ఏమయిందంటే, హాంగ్ కాంగ్ మార్కెట్ కి ముందు వెళ్ళా, అక్కడ కార్ పార్క్ చెయ్యడానికి తల ప్రాణం తోకకి వచ్చింది. అమెరికా ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది అందరూ అంటున్నారు కానీ, ఈ చైనీస్ మార్కెట్ కి వస్తే, కొంచం అది అబద్దమేమో అని పిస్తుంది. సగం చైనా అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. అంటే నాకు చైనా, జపాను, వియత్న మీస్ వగైరా చుట్టుపక్కల దేశాల మనుషులంతా ఒక లాగే కనిపిస్తారు. అదే, పాకిస్తాను, బంగ్లా దేశ్, నేపాలు, శ్రీలంక దేశాల వాళ్ళు ఒక్కలా వున్నట్టు. బాస్కెట్ దొరకడం కూడా కొంచం కష్టం అయింది. మెల్లగా లోపలి వెళ్లాను. బాస్కెట్ పక్కన పెట్టి, కూరలు ఎంచుతున్నా.. ఈ లోగా ఒక చైనీస్ ఆమె ఒకరు నా వైపు చూసి , నవ్వుతూ ' కీ కాం ఛీ.. " అంటూ ఏదో అడిగింది. ఆవిడ ఏమందో నాకైతే అర్ధ౦ కాలేదు. ఏమంటే ఏమి అర్ధం చేసుకుంటుందేమో నని, ఏడవలేక నవ్వి నట్టు నవ్వాను. మరో సారి నా వైపు చూసి మళ్ళీ.. 'చింగ్ చాంగ్ యు యా" అంటూ అనేసి నా బాస్కెట్ కాస్తా పట్టుకుని పోయింది. నేను వెర్రి మొహం వేసుకుని, మళ్ళీ బయటికి వెళ్లి, మరో బాస్కెట్ వెతుక్కుని వచ్చా.. ఈ సారి ఎవరైనా దగ్గరికి వచ్చినా, వాళ్ళ మొహం లోకి చూడ దలుచుకో లేదు. అమెరికన్ సువర్ణ రేఖ మామిడి కాయలు లాంటివి కనిపించగానే, కొంచం నొక్కి చూసా. అవి పండినట్టు కనిపించలేదు. గట్టిగానే వున్నాయి. మరి ఆలోచించకుండా ఓ డజన్ మామిడి కాయలు తీసేసుకున్నా. కాయలైతే కొన్నా కానీ, అవి తరగడం ఒక పెద్ద గండం . ఇంటిలో వున్న నాలుగు కత్తులు, ఒక సుత్తి పట్టుకుని కూర్చున్నా. మరేమీ చెయ్యను? నా దగ్గర కత్తిపీట లేదు. ఒక వేళ వున్నా, చాకుతో తరగడం అలవాటు వున్న నాకు, కట్టి పీత తో అలవాటు లేక ఎప్పుడూ చెయ్యి కోసేసుకుంటా .. సుత్తి ఎందుకంటే, చాకుతో టెంక ఈజీ గా తరగ బడదుగా అందుకన్నమాట..

ఒక మామిడి కాయని తరిగా. మామిడి కాయ పయిన ఆకుపచ్చ చిన్న ఎరుపు రంగులతో గట్టిగానే వుంది కానీ తొక్క లోపల ముక్క పసుపు పచ్చగా వుంది. కొంచం అనుమానం వచ్చి చిన్న ముక్క రుచి చూసా. తియ్యగా పంచదార లాగా వుంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇండియాలో అయితే, పండిన సువర్ణ రేఖ కూడా కొంచం టెంక దగ్గర పుల్లగానే వుంటుంది కదా. మరొకాయ కూడా కోసి, రుచి చూసి, ఇక లాభం లేదని మిగతా కాయలు పండ బెట్టడానికి, పక్కకు పెట్టేసా.
మరో రెండు రోజులు పోయాకా, వీలు చూసుకుని, ఇండియా గ్రోసురీస్ కి వెళ్లి, అక్కడ పుల్ల మామిడి కాయలు కావాలంటే , కొన్ని చచ్చు పుచ్చులు గా వున్న మామిడి కాయలు చూపించాడు. అనుమానంగానే చూసా. ఎందుకంటే, అమెరికాలో అనీ హైబ్రిడ్ లాగానే వుంటాయి. చివరికి చీమ దోమతో సహా.. , వున్న వాటిల్లో మంచివి ఎంచి ఓ డజను కొని ఇంటికి పట్టుకుని వెళ్లి , ఆవకాయ పెట్టా . చెప్పొద్దూ బాగానే కుదిరింది . టొమాటో పచ్చడి , నిమ్మకాయ ఊరగాయ ఎప్పుడూ మైక్రో వేవ్ సహాయం తో చేసేస్తూ వుందేనాకు, ఈ ఆవకాయ పెట్టడం లో ఎక్స్పర్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అయితే నాకు తెలుసు ఆవకాయ పెట్టడం, ప్రతీ ఏడాది ఒక పెద్ద కొత్త ప్రయోగం లాగానే వుంటుంది.,

నా చిన్నప్పుడు మా వూళ్ళో , పల్లెటూళ్ళో , కనీసం రెండు వందల కాయలు ఆవకాయ పెట్టేవారు. కాయ పళం గా కొన్ని , వెల్లుల్లి ఆవకాయ , వెల్లుల్లి లేకుండా ఇంగువతో శనివారం తినడానికి కొన్ని కాయలు, ఎండు ఆవకాయ, బెల్లం ఆవకాయ, పనసపొట్టు ఆవకాయ , సెనగలు ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి. ఒకటేమిటి, ఎన్నెన్నో రకాలు పెట్టేవారు. అప్పటిలో ఆ రోహిణి కార్తెలు మండు టెండ లలో ఎలెక్ట్రి సిటి లేని ఆ పల్లెటూళ్ళల్లో , వాళ్ళు రోళ్ళల్లో మిరపకాయలు దంపించి, ఆ కరం జల్లించి, ఆవగుండా ఉప్పూ కూడా దంపించి ఆవకాయ పెట్టే వారు. ఎన్ని అవస్తలు పడి పెట్టివుంటారో, ఇప్పుడు మా పిన్నులు ఇద్దరి మీదా చాలా జాలిగా అనిపిస్తుంది . . .

అయితే ఆవకాయ పెట్టడం అమెరికా అయినా , ఇండియా అయినా, ప్రావీణ్యం అనేది వుండదు అని నా అభిప్రాయం. అది ఆ సీజన్లో లో మనకు దొరికే మామిడి కాయల మీద ఆధార పడి వుంటుంది అనిపిస్తుంది . ఎందుకంటే …. ఈ ఊరగాయలు పెట్టడం లో మాంచి నిపుణిరాలిగా పేరు పొందింది మా అక్క. అని మా కుటుంబ సభ్యులంతా భావిస్తాము అయితే, అక్క పెట్టేస్తే తినేయడమే కానీ, ఏమి అవస్తలు పడుతోందో అప్పట్లో తెలియదు. నా పెళ్లి అయిన కొత్తల్లో, మా అక్క మా అత్తగారింటికి ఆవకాయ సీసా పట్టుకుని మేము భోజనాలు వడ్డించుకునే సమయానికి వచ్చింది. అప్పుడే కంచాలు పెడుతున్నా.. అక్కని కూడా భోజనానికి కూర్చోమన్నాము. లేదు, ఇప్పుడే తిని వచ్చా అని చెప్పింది. ఆవకాయ సీసా తీసుకుని, అందరికి తలో చంచా వడ్డించా .. ఆవకాయ అన్నం తింటూ వుంటే చెప్పొద్దూ , మా అమ్మమ్మగారు చెప్పినట్టు , స్వర్గానికి ఒక మెట్టు తక్కువగా అనిపించింది ( ఆ ఒక్క ఆఖరి మెట్టూ ఎక్కేస్తే దిగడం కష్టమేమోనని ).
చాలా రుచిగా వుంది. వెంటనే మా అత్తగారు నాకు సౌ౦జ్న చేసారు , పెన్నూ పుస్తకం తెమ్మని . సరే నేను పట్టుకుని వెళ్ళా.
అక్కని చూసి మా అత్తగారు , ‘"ఏమిటో నండి నాకు ఎప్పుడూ ఆవకాయకి కొలతలు మర్చిపోతాను . మీరు కొంచం చెబితే నేను ఆవకాయ పాళ్ళు రాసుకుంటాను " అని మా అత్తగారు , కళ్ళజోడు సారి చేసుకుంటూ క్లాసు లో పిల్లలు నోట్స్ రాసుకునే విధానం లో కూర్చున్నారు.

మా అక్క కొంచం సిగ్గు పడింది . "నేనా ? అని .. ఒక నిముషం ఆగి, పాతిక మామిడికాయలు కొన్నాను, అందులో, ఓ రెండు పప్పుకి, పచ్చడికి అత్తెపెట్టాసాను. మూడు పావులు కారం మూఫు పావులు ఆవ గుండా రెండు పావులు ఉప్పు పోసాను , ఇప్పట్లో టాబుల్ సాల్ట్ కదా , వుఉప్పు ఎక్కువ అవుతుందేమో నని తక్కువ పోసాను, . అర కిలో నూని పొసా . మూడు రోజుల తరవాత, అడుగునుంచి కలిపి చూస్తే , ఊట కొంచం తక్కువ వుందని అనిపించి, మళ్ళీ బజారు కి వెళ్లి, మరో ఆరు మామిడికాయలు కొని ముక్కాలి తరిగి కలిపా . తరవాత , ఊట బాగా పల్చగా అనిపించి, కొంచం కారం గుండా ఆవగుండా కలిపి చూసా . అన్నం లో కొంచం పిండి కలిపి చూస్తే , కొంచం వుప్పుతగ్గినట్టు అనిపించి, మరో అర గ్లాసు పోశా ..మళ్ళీ ఎందుకైనా మంచిదని మరో రెండు గ్లాసులు నూని పోశా ఇదిగో , ఇవాళ పదో రోజు. బాగానే వుంది అనిపించి, మీ కోసం కొంచం పట్టుకుని వచ్చా .. అంటూ ముగించింది .

మొత్తానికి మా అత్తగారికి , నోట్స్ ఎలా రాసుకోవాలో తెలియలేదు. అంటే, ఆవిడకు ఆవకాయ పెట్టడం రాదనీ కాదు. ప్రతీ సారి ఆవిడ కూడా, ఓ వంద మామిడి కాయలు తెప్పించి, ఇలానే, ఉప్పులూ, కారాలూ కలుపుతూ మళ్ళీ ముక్కలు తరుగుతూ, అది కుదిరేదాకా , కుస్తీలు పడుతూ వుంటారు పైగా బెల్లం ఆవకాయ కోసం తొమ్మిది రోజులు ఊర పెట్టడం , తొమ్మిది రోజులు ఎండబెట్టడం జరుగుతూ వుంటుంది. పది పదిహేను రోజులు కష్ట పడ్డా, కుటుంబం అంతా ఏడాది పాటు తింటూ వుంటే అదో తృప్తి. ఆవకాయ ఈ సంవత్సరం వద్దులే అనుకోలేము. ఖర్మ గాలి ఏ సంవత్సరమైన పెట్టుకోక పోతే , ఎవరిన్తికైనా భోజనానికి వెళ్తే, .. ముందు గా వేయిన్చుకునేది ఆవకాయే. ఎందుకో దానికోసం అంత మోహం వాచిపోయేటట్టు బాధపడుతూ ఉంటాము ఎంత డాక్టర్లు మొత్తుకుంటున్నా, ఆవకాయ మాత్రం మానం కదా. .
నెల రోజులుగా ఆవకాయ పెట్టాలని తెగ అనుకుంటున్నా. రోజూ వుద్యోగం వలన కుదరనే కుదరదు, శని ఆది వారాలలో పార్టీలు , బట్టలు వుతుక్కోవడాలు ఇల్లు సద్దుకోవడం లాంటి పనులతో అస్సలు కుదరదు. ఎలాగో వీలు చేసుకుని కూరలు కోనేటప్పుడే , మామిడి కాయలు మర్చిపోకుండా తేవాలని గత నెల రోజులుగా అనుకుంటున్నా .
ఈ సంవత్సరం మానేద్దమనే అనుకున్నా . ఇంతలో మా అయన స్నేహితులు మీ అందరికి పరిచయస్తులు అయిన వేద గారు ఆయన రాసిన ఈ కింద పద్యాన్ని పంపారు ..

జిహ్వకు తగలకనే భయ
విహ్వలురై పోవునట్టి భీరులు కారోయ్
వహ్వా యని లొట్టలతో
ఆహ్వానము లిత్తురాంధ్రు లావకాయకున్

ఇక చదివేక .. ఇక ఆగ లేక... ఇదుగో ఇవాళే మామిడి కాయల వేటలో వెళ్తున్నా ..…

2 comments:

  1. Its an amazing blog. Inta detailed ga telugulo amazing.
    I dnt have words to express. After long time i read
    Such a nice blog in telugu.

    By the way i got a project in wipro, finally after
    Two months iam occupied. Wish u all the best for ur avakay.

    Do send some snaps of ur avakay

    ReplyDelete
  2. Good, detailed post. You have a lot of patience.

    madhuri.

    ReplyDelete