Tuesday, April 17, 2012

పతిదేవుని పరధ్యానం

పరధ్యానం అంటే కొంచం పదం బాగుంటుందని వాడా అంతే. నిజం చెప్పాలంటే మతి మరుపు అన్నమాట.
చాలా ఎక్కువ తెలివయిన వారికి మతి మరుపు కొంచం జాస్తిగా ఉంటుందని వినికిడి. పెద్ద తెలివి తేటలు లేవు కానీ, నాకూ మతి మరుపుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది, బహుశా తెలివి తేటలికి మతి మరుపుకి సంబంధం లేదని. ఏది ఏమైతేనేం, మా వారి కి మతిమరుపు చాలా ఎక్కువ. ఇది చాలా సెలె క్టివ్ మతి మరుపు. అన్ని విషయాలూ మర్చి పోరు. ఆయన టెన్త్ క్లాసు హాల్ టికెట్ నెంబర్ దగ్గర నుంచి మొదలు కొని, అన్ని పరీక్షల నెంబర్ , ఆయన ఎక్కినా మొదటి ఫ్లైట్ నెంబర్ దగ్గర నుంచి ఈ మద్య ఎక్కిన టాక్సీ నెంబర్ వరకూ అన్నీ నిద్దర్లో అడిగిన తడుము కోకుండా గడ గడా చెప్పేస్తారు. పాతికేళ్ళ క్రితం, మేము బీచ్ లో ఫలానా ఆదివారం ఏ విషయం మీద తగువు పడ్డామో కాళ్ళకు కట్టి నట్టు చెప్పేస్తారు. కానీ నేను ఆదివారం షాప్ కి వెళ్లి గ్రోసురీస్ తెద్దామని చెప్పిన విషయం గుర్తుండదు ఎందుకో మరి. అలానే, ఇంటికి కర్టెన్లు మారుద్దామని గత ఏడాదిగా మొత్తుకుంటున్నా విషయం కూడా గుర్తు వుండదు. "అవునా? కొందామన్నావా? ఎప్పుడూ" అని అమాయకం గా మోహం పెట్టి బోలెడు ఆశ్చర్య పడి పోతూ వుంటారు. అలా అని ఇలాంటి చిన్న చిన్న విషయాలని నేను పట్టించు కోననుకోండి . అదీ కాక ఇవన్నీ అందరి ఇళ్ళల్లోనూ సర్వ సాధారణం. కానీ కొన్ని మరపు రాని సంఘటనలు వున్నాయి.

ఎపిసోడ్ - 1

మా పెళ్ళయిన కొత్తల్లో కలకత్తా లో ఒక ఆరు నెలలు ఉండవలసి వచ్చింది. అసలే భాష రాని ప్రాంతం. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చినంత హిందీ కూడా రాదు. మేము ఒక తెలుగు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ లు గా వుండే వాళ్ళం. ఆ రోజుల్లో సినిమా కి వెళ్ళాలంటే రోజంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించేది. అందుకే వెళ్ళిన రోజునే రెండు మూడు సినిమాలు చూసేసి వచ్చే వాళ్ళం. ఒక రోజున నేను ఆయన, కలకత్తా బాగా తెలిసిన మేము అద్దెకుంటున్న వాళ్ళ అబ్బాయి ఒక పదమూడేళ్ళ వాడిని వెంట పెట్టుకుని వెళ్ళాము. ఆ కుర్రాడికి వూరు బాగా తెలుసు. వాడి పేరు శివ. ఖిద్దర్ పూర్ దగ్గర ట్రాం ఎక్కి ధర్మ తల్లా దగ్గర దిగాము. అక్కడ సరిగా గుర్తులేదు గానీ, జవహర్ లాల్ రోడ్డో ఏదో దాట వలసి వచ్చింది. మా ఆయన గజానికో అడుగు వేసేస్తూ, ఈగ లాగ జూమ్ అని రోడ్డు దాటేసారు. నేను శివ చెయ్యి పట్టుకుని, రోడ్డు అంతా ఖాళీ అయ్యేదాకా ఆగి మెల్లగా రోడ్డు దాటాను. నేను చెయ్యి పట్టుకోక పోతే, వాడు కూడా దాటేసే వాడేమో. ఇద్దరూ వెళ్లి పోతే, నా గతేమిటి? అందుకే వాడి చెయ్యి గట్టిగా పట్టుకున్నా. నిజం చెప్పాలంటే, బెంగాలీ వాళ్ళు చాలా సహాయ పరులు. భాష రాక పోయినా, వాళ్ళు ఆఫీసు కి వెళ్ళడం మానేసైనా మనల్ని మన గమ్యం చేరుస్తారు. ఆ సంగతి అప్పట్లో తెలియదు లెండి. మా ఆయనకి మతి మరుపు సంగతి కూడా తెలియదుగా మరి. అయినా నా జాగ్రత్తలో నేనున్నాననుకోండి. మేమిద్దరం రెండో వైపు చేరి మా ఆయన కోసం చూసాము. ఆయన కనిపించ లేదు. ఒక పది నిముషాలు ఎదురు చూసాము. ఎక్కడా కనిపించలేదు. కొంప దీసి మాకోసం మళ్ళీ అటువైపు వెళ్ళే రేమో అన్నాడు శివ. అమ్మో, కావిలిస్తే ఆయన్నే ఇటు రానీ, మనం మాత్రం వెళ్లొద్దు అన్నా. సరే అన్నాడు. మరో అయిదు నిముషాలు చూసి ఇక లాభం లేదు. మనం వెళదామనుకున్న సినిమా హాల్ కి వెళ్ళారేమో చూద్దామని బయలు దేరాము. పది నిముషాలలో నడిచి ఒక హాల్ కి వెళ్ళాము. అక్కడ అంతా వెదికాము ఆయన దొరక లేదు. మరో అయిదు నిముషాల దూరం లో మరో హాల్ కి వెళ్ళాము. అక్కడా దొరక లేదు. మూడవ హాల్ కి వెళ్ళాము. ఇవన్నీ మా అదృష్టం కొద్దీ దగ్గర దగ్గర గానే వున్నాయి. ఒక పక్క గాభరా. మరో పక్క ఆకలి. పెద్ద ఎండగా లేదు కానీ చాలా దాహం గా వుంది. ఇక ఎక్కడ వెదకాలో మాకు అర్ధం కాలేదు. ఇలా లాభం లేదని ఎక్కడ మేము రోడ్డు దాటేమో, అక్కడికే వెళ్లి నుంచున్నాము. అక్కడ మరో పావుగంట ఎదురు చూస్తూ నించున్నాము. కొంత సేపటికి ఆ ప్రక్కనే వున్న వెస్పా (బజాజ్) షో రూం లోంచి ఈ యన చిరునవ్వులు చిందిస్తూ ఈవతలికి వచ్చారు.
"ఎక్కడి కి పోయారు ఇంతసేపూ" అన్నాను గాభరాగా.
రోడ్డు దాటగానే, "ఈ షో రూం లో దూరా..మంచి వెస్పా కొత్త మోడల్ వచ్చింది. దాని డిటైల్స్ వింటూ వుంది పోయా.. మీ ఇద్దరూ నాతో వచ్చారన్న సంగతి మర్చిపోయా" .. అన్నారు.
చెప్పొద్దూ, నాకు రెండు మొత్తాలని అనిపించింది. మేమిద్దరమూ, పిచ్చి వాళ్ళల్లా రోడ్డు రోడ్డూ వెతుకుతూ వుంటే, హాయిగా, ఎయిర్ కండి షండు షో రూం లో స్కూటర్ చూస్తున్నానని చెపితే మీకైనా ఎలా వుంటుంది చెప్పండి.
శివ గాడు పకపకా నవ్వేసాడు. చిన్న కుర్రా డైనా పాపం మంచి వాడు. ఆ తరువాత రెస్టారెంట్ కి వెళ్లి కావలిసినవి తిని.. ఓ రెండో మూడో సినిమాలు చూసి రాత్రికి ఇల్లు జాగ్రత్తగా చేరుకునే వరకూ ఆయన చెయ్యి వదలకుండా పట్టుకున్నాను. అది వేరే సంగతి అనుకోండి.
ఎపిసోడ్ -2.

కలకత్తా నుంచి వచ్చేసాకా మరో సంఘటన జరిగింది.. ఈయన తో బాటు మరైన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరికీ రిజర్వేషన్ కావలిసి వచ్చినా మా ఆయన దగ్గరికి వచ్చేవారు. కలకత్తాలో పరీక్షలకి వెళ్ళేవారు, బొంబాయి వుద్యోగం కోసం వెళ్ళే వారూ, ఇలా వారానికి ఒకరికైనా రిజర్వేషన్ చేయించి, స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఆఖరి కంపార్ట్మెంట్ కనిపిస్తున్నంత దాకా చేతులు ఊపుతూ వుండే వారు.

కుటుంబం అంతా కలిసి ఆరు నెలలకి ఒకసారైనా తిరుపతి వెళ్తూ వుండే వాళ్ళం. అలానే ఒక సారి కుటుంబం అందరం తిరుపతి వెళ్ళాము. తిరిగి వస్తున్నప్పుడు, మద్రాస్ వెళ్లి (ఇప్పుడు చెన్నై అనుకోండి) అక్కడ విశాఖ పట్టణం వెళ్ళడానికి కలకత్తా మెయిల్ ఎక్కాము. తెల్లవారే సరికి విజయవాడ వచ్చాము. బహుశా పొద్దున్నే అయిదు అయి వుంటుంది. విజయ వాడ స్టేషన్ లో పొద్దున్నే వేడి వేడి ఇడ్లీలు బాగుంటాయని రైల్ దిగిపోయారు మా ఆయన మా మరిది తో కలిసి. ఎలాగా ఇంజను మార్చడం వలన అరగంట దాకా అక్కడ ఆగుతుంది, ఫరవాలేదు లే అనుకున్నాము. పావు గంటలో మా మరిది తిరిగి వచ్చాడు.
"అన్నయ్య ఏడిరా?" అని అత్తయ్యగారు అడిగారు.
"ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే, మాట్లాడుతున్నాడు" అన్నాడు.
అరగంట తరువాత ట్రైన్ కదిలి పోయింది పోయింది. మా ఆయన రాలేదు. కను చూపు మేర స్టేషన్ లో ఎక్కడా కనిపించ లేదు. అసలే ఫస్ట్ క్లాసు లో ఉన్నామేమో, అది ఇంచుమించు డ్రైవర్ పక్క కంపార్ట్ మెంట్ అనుకుంటా. అసలే మా అత్తగారికి చాలా భయం. ఇక అందరికీ గాభరా మొదలయింది. ఈయన ఎక్కడ ఉండి పోయారో తెలియదు. సాధారణం గా జేబులో ఎక్కువ డబ్బులు కూడా వుంచుకోరు. "అయ్యో ఇప్పుడెలాగా" అని అత్తయ్య గారు గాభరా పడి పోయారు. చైన్ లాగండి అంటూ మా మావగారి తో గొడవ పెట్టారు.
"అక్కర లేదు, మగవాడే కదా, వాడే వచ్చేస్తాడు." అన్నారు మా మావగారు ధీమాగా.
"టికెట్ ఉందా వాడి దగ్గర? " అని నన్ను అడిగారు అత్తయ్యగారు.
"లేదు నా పర్స్ లో ఉంది" అనను గతుక్కుమని, దిగులుగా.
"ఏమీ ఫర్వాలేదు.. నా కొడుకు వాడు, ఎలా అయినా వచ్చేస్తాడు, నా పేరు చెప్పుకుని" అని మళ్ళీ మా మావగారు ధీమాగా.
నాకు కూడా మా మావగారి మీద ఆయన పదవి మీదా నమ్మకం ఉంది కానీ, కొంచం భయం వేసింది. తెల్ల వారు ఝాము చీకటిలో, ఏమి జరిగిందో , తలుచు కుందుకి భయం వేసింది.
మెయిల్ చాలా స్పీడ్ గా వెళ్తోంది. మాకు గాభరా కూడా తగ్గలేదు. మరో అరగంటకి ఏలూరు స్టేషన్ లో అనుకుంటా ట్రైన్ ఆగింది. ఆగిన మూడు నిముషాలకి చిరు నవ్వులు చిందిస్తూ మా అయన, మా కంపార్ట్ మెంట్ దగ్గరికి వచ్చారు. బ్రతుకు జీవుడా అనుకున్నాము. ఆయన లోపలి రాగానే, మా అత్తగారు, మా కాబిన్ తలుపులు గడియ పెట్టేసారు, మళ్ళీ ఆయన దిగిపోకుండా. నాకైతే నవ్వు వచ్చింది, ఆయనేమైనా చిన్న పిల్లవాడా అని. అదే మాట అత్తయ్యగారితో అన్నాను. నావైపు చూసి నవ్వి, ఇంతకీ ఎక్కడికి పోయావు అని నిల దీసారు ఆయన్ని.
"మా సీనియర్ కనిపించాడు, వాడి తో మాట్లాడుతూ నించున్నాను. వాడు మాట్లాడుతూ వుండగా ట్రైన్ కదిలింది. నేను వాడికి అలవాటు ప్రకారం హ్యాపీ జర్నీ అని చెప్పేసి అక్కడ నుంచుని చేతులు ఊపుతున్నా. వాడు నాకేదో సైగలు చేస్తున్నాడు. కానీ నాకు వినిపించలేదు. గార్డ్ కంపార్ట్ మెంట్ వచ్చేసరికి నేను కూడా ఇదే ట్రైన్ ఎక్కాలి అని గుర్తుకు వచ్చింది. అప్పుడు అర్ధం అయింది మా సీనియర్ నాకు ట్రైన్ ఎక్కి ఏమిటి చెప్పాలని ట్రై చేసాడో. అప్పుడు గార్డ్ కంపార్ట్మెంట్ ఎక్కేసి, గార్డ్ తో కబుర్లు చెబుతూ కూచున్నా" .
అలా జరిగినప్పటినుంచి, ఆయన ట్రైన్ టికెట్ ఆయన దగ్గర, నాది నా దగ్గర వుంచడం మొదలు పెట్టా.

ఎపిసోడ్ - 3.

మరొకసారి ఏమి జరిగిందనుకున్నారు,
మా ఇంటిలో ఎప్పుడు చూసిన ఇల్లు గోడలు మార్చడమో, మరో రెండు గదులు పెంచడమో, మేడ మీద గదులు వేయడం, లేక పక్కనే వున్న మా ఆడబడుచు గారి స్థలం లో ఇల్లు కట్టడం, ఇలా ఎప్పుడూ ఏవో ఒక కట్టడం పనులు జరుగుతూ ఉండేవి. మా ఆయన చాలా సందడిగా తిరుగుతూ పనులు చూసుకునే వారు. హార్డ్ వేరు షాపులకి వెళ్లి క్వోటేషణ్ లు పట్టుకురావడం వాటిల్లో హడావిడిగా తిరిగే వారు. అప్పట్లో హెల్మెట్ తప్పకుండా వేసుకోవాలని కొన్నాళ్ళు రూలు కొత్తగా వచ్చింది. అప్పట్లో సంవత్సరం లో ఒక నేల పోలీసు వాళ్ళుహెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుని ఫైన్ వేసే వారు. మా ఆయన ఒక రోజు స్కూటర్ తీసుకుని, హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ మీద ఒక హార్డ్ వేరు షాపుకి వెళ్ళారు. చాలా సేపు పోయాకా, హెల్మెట్ చేతిలో పట్టుకుని ఒక ఫ్రెండ్ తో వచ్చారు. అతను విదేశాలలో చాలా కాలం వుండి వచ్చాడు ట. కొత్త కారు కొనుక్కున్నాడుట. ఏవేవో కబుర్లు చెప్పారు. అతని కారులో ఏమేమి ఫీచర్లు వున్నాయి వగైరా వగైరా చాలా చెప్పారు. అతను కాసేపు కూర్చుని, మేము చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి బయలు దేరాడు. మా ఆయన చక్కగా టా టా బై బైలు చెప్పారు. మేము కూడా కారు చూద్దామని వీధిలోకి వచ్చాము. కారు చాలా బాగుంది. ఇంతలో మా ఇంటిముందు ఉండ వలసిన స్కూటర్ లేదని నేను గ్రహించాను.
"మన స్కూటర్ ఏది?" అని ఆయన్ని అడిగా.
"స్కూటర్ ఏమిటి? నేను కారులో వచ్చా" అన్నారు గొప్పగా ఆయన.
"మీ స్నేహితుణ్ణి ఎక్కడ కలిసారు ?" అని అడిగా.
"పూర్ణా మార్కెట్ దగ్గర." అన్నారు చిరునవ్వుతో.
"మరి పూర్ణ మార్కెట్ కి ఎలా వెళ్ళారు?" అని అడిగా.
" స్కూటర్ మీద", అని నాలుక కరుచుకున్నారు.
"మరి స్కూటర్ ఏది? " అని అడిగా.
"పూర్ణ మార్కెట్ దగ్గర పెట్టి మర్చిపోయా, ఇదిగో మా ఫ్రెండ్ కనిపిస్తే, వాడితో కబుర్లు చెబుతూ కారులో వచ్చేసా" అన్నారు.
"చేతిలో హెల్మెట్ మాత్రం జాగ్రత్తగా పట్టుకు వచ్చేసారా?" అని అడిగా నవ్వుతూ.
"కనీసం హెల్మెట్ చూసైనా, మీ స్నేహితుడు కూడా స్కూటర్ గురించి అడగలేదా?" అని నవ్వా.
పాపం ఆయన స్నేహితుడు కూడా సిగ్గు పడి పోయి, ఫరవాలేదు లెండి, స్కూటర్ దగ్గర ది౦పేస్తా అని మళ్ళీ ఈయన్ని వెంటపెట్టుకుని పూర్ణా మార్కెట్ కి బయలు దేరారు.

ఎపిసోడ్ - 4.

మరొకసారి బొంబాయి మహానగరానికి వెళ్ళాము. అదే మొదటి సారి బొంబాయి వెళ్ళడం. ఇప్పుడది ముంబాయి గా మారింది. బంగాళా ఖాతం చూసినా ఏమీ అనిపించేది కాదు కానీ, అంతకు మించి వీ టీ, చర్చ్ గేటు చూస్తే కళ్ళు తిరిగేవి నాకు ఆ జన సముద్రం చూసి. మా స్నేహితులు కొందరు అంధేరీ లో వుండే వారు. మేము వి టీ కి దగ్గర హోటల్ లో వున్నాము. ఆయనా నేను చర్చ్ గేట్ కి వెళ్ళాము. అక్కడ అంధేరీ కి వెళ్ళడానికి రెండు టికెట్లు కొన్నారు. ముందు దాదర్ లో దిగి, సెంట్రల్ ప్లాట్ ఫారం కి మారి, అక్కడ మరో ట్రైన్ పట్టుకోవాలని నాకు చెప్పారు. నాకు సరిగ్గా అర్ధం కాక పోయినా, అలానే అని బుర్ర ఊపాను. ఎందుకు చెప్పడం, ఆయన చెయ్యి వదలను గా అని మనసులో అనుకున్నా. కలకత్తాలో జరిగిన అనుభవం మర్చిపోలేదుగా.
అప్పుడు మెల్లగా చెప్పారు. "ట్రైన్ చాలా రష్ గా వుంటుంది. ఆడవాళ్ళ కంపార్ట్ మెంట్ అయితే ఖాళీగా వుంటుంది, అందులో నువ్వు ఎక్కు, నేను మగవాళ్ళ దానిలో ఎక్కుతాను అన్నారు". గుండె గుభేలు మంది. పర్వాలేదు, "నేనూ మీతో వస్తాను అన్నా. ఈలోగానే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ఎక్కే జనం దిగే జనం చూసే సరికి గాభరా వచ్చింది. మేము ఎక్కడ ఎక్కాలా అని ఆలోచించే లోపే, అది కాస్తా వెళ్లి పోయింది. నేను వెర్రి మోహం తో చూసాను. ఆయన "మరేమీ ఫరవాలేదు. మరొకటి వస్తుంది. ఇప్పుడైనా ఆడ వాళ్ళ పెట్టెలో ఎక్కు. దాదర్ అనే స్టేషన్ లో దిగు. ఇక్కడి నుంచి అయిదోదో ఆరోదో " లెక్క చెప్పారు. ఒక్కొక్క స్టేషన్ పేరూ మూడు నాలుగు సార్లు చెప్పారు. అదేమైనా తెలిసిన ఊరా, ఆయన చెప్పిన ఒక్క స్టేషన్ పేరూ తెలియదు నాకు. దాదర్ , మూడే మూడు అక్షరాలు. నీకు తెలియక పోతే ఎవరినైనా అడుగు. పది నిముషాల్లో చేరిపోతాము, అని నాకు జాగ్రత్తలు చెపుతూ ఉండగానే మరో ట్రైన్ వచ్చింది. ఇది కొంచం ఖాళీ గానే వుంది. అయినా వినకుండా, నన్ను ఆడవాళ్ళ కంపార్ట్ మెంట్ లో ఎక్కించారు. సరే చేసే దేముంది ఎక్కి కూర్చున్నా. వెంటనే కదిలింది. చూస్తూ ఉండగానే కంపార్ట్ మెంట్ నిండి పోయింది. నేను చుట్టుపక్కల వున్న ఒక ఆవిడతో, దాదర్ లో నేను దిగాలని, వచ్చేముందు గానే కొంచం చెప్పమని ఇంగ్లీష్ లో చెప్పా. అందరూ నా మోహం చూసి, కొత్త దానినని పసిగట్టి, మరేం ఫరవాలేదు, కంగారు పడకు, నిన్ను ఎలానో ఆలా దింపే స్తామని నవ్వుతూ చెప్పారు. ఒక స్టేషన్ ముందుగానే దాదర్ నెక్స్ట్ స్టేషన్ అనీ, నన్ను కొంచం కొంచం గా ముందుకు తోసి డోర్ దగ్గరికి నన్ను చేర్చడానికి అందరూ కృషి చేసారు. చెప్పొద్దూ, నా కాళ్ళతో నడిచే పనే లేదు. తెలియకుండానే డోర్ దగ్గరికి చేరుకున్నా. దాదర్ వచ్చింది. కొన్ని క్షణాలు ఆగింది. ఆగగానే దిగేసి, ట్రైన్ కి కొంచం దూరం గా వచ్చి బాగా కనిపించేలా నించున్నాను. మా ఆయన మళ్ళీ నన్ను వెతుక్కో నవసరం లేకుండా. ట్రైన్ వెళ్ళింది. ప్లాట్ ఫారం మీద మనుషులు చాలా మంది వెళ్లి పోయారు.. మా ఆయన కనిపించలేదు. చచ్చేనురా దేముడా, ఈయన మళ్ళీ నన్ను మర్చిపోయి వేల్లిపినట్టున్నారు అనుకున్నా. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లు కూడా లేవుకదా. ఎలారా దేముడా అనుకున్నా. వెనక్కి వెళ్లినా హోటల్ కి సరిగ్గా చేరగాలనని నమ్మకం లేదు. అందులో బొంబాయి. చాలా భయం వేసింది. ఏమి చెయ్యాలో, ఎవరితో చెప్పాలో తెలియలేదు. కలకత్తాలో అయితే, కనీసం మా ఇంటివల్ల అబ్బాయైనా నా పక్కన వున్నాడు. వాడికి కలకత్తా అంతా బాగానే తెలుసు. ఇక్కడ ఎవరూ లేరు. దిక్కులు చూస్తూ, ఆయన వెనక్కి వస్తారేమోననే ఆశతో చూస్తూ నించున్నా. ఈ లోగా మరొక ట్రైన్ వచ్చింది. మరికాస్త జనం పోగయ్యారు. మరింత గోల.. ఈ జన సముద్రం లో ఈ యన ఉండడానికి అవకాశం లేదు కదా.. మేము ఎక్కినా ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈసారి దిగిన జనం కూడా హడావిడిగా చెల్లా చెదురై అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు చూసా ఆయన్ని. ఈ వచ్చిన రెండో ట్రైన్ లోంచి దిగి దొంగలా నావైపు చూస్తూ నవ్వుతూ నావైపు మెల్లగా నడుచుకుని వస్తున్నారు. నాకైతే అర్ధం కాలేదు.
" ముందు ట్రైన్ లో ఎక్కలేదా" అని అడిగా.
"ఎక్కాను, కానీ మర్చిపోయి దాదర్ కన్నా ఒక స్టేషన్ ముందు దిగిపోయా.. అమ్మ ఇది దిగలేదు అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ వుంటే, అక్కడ స్టేషన్ పేరు బోర్డ్ చూసా. మూడు అక్షరాలు కాకుండా చాలా పెద్ద పేరు కనిపించింది. 'ఎలి ఫిన్ స్టన్ రోడ్డు' అని. అప్పుడు అర్ధం అయింది ఒక స్టేషన్ ముందు దిగేసానని. అందుకే తరువాత ట్రైన్ పట్టుకుని వస్తున్నా" అన్నారు. బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక తమాషా చెయ్యాలా అని ఆయన మీద అరిచా... అరిచా అంతే.. కరవ లేను కదా.

7 comments:

  1. good job!!
    తమ పతి దేవుల పరద్యానం గురించి ఎక్కువ మంది భార్యల అభిప్రాయం ఇదే కామొసు!!అఫ్ కొర్స్, మీరు రీయల్ సంఘటనలు చెప్పారనుకొండి...మా ఇంట్లొ ఇదె ప్రాబ్లమ్ :-)!!!

    ReplyDelete
    Replies
    1. ఇవి కొన్ని నమూనాలు... అంతే. చెట్టంత మనిషిని, నన్ను మర్చిపోయి, స్కూటర్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో.

      Delete
  2. మీ వారి మతి మరుపుల కబుర్లతో బాగా నవ్వుకున్నాను; అయితే మీరెంత ఏడ్చుకునుంటారో కదా!
    బాగ రాశారు :)

    ReplyDelete
  3. లేదండీ. ఎప్పుడూ ఏడ్చుకోలేదు. అప్పటికప్పడు గాభరా పడ్డా తరవాత ఎప్పుడూ తలచుకుని నవ్వుకోవడమే.

    ReplyDelete
  4. తనను తాను మరచిపోయే వరకూ రాలేదు కాబట్టి ఫరవా లేదు నయ౦ అయిపోతు౦ది. నాలా౦టి ఒక మ౦చి డాక్టరు కి చూపి౦చ౦డి. ఆ! ఇ౦తకీ ప్రాబ్ల౦ ఏమిటన్నారు?

    ReplyDelete
    Replies
    1. వద్దండీ, వద్దు! పొరబాటున కూడా మీరు ఈ డాక్టర్ గారిదగ్గరికి వెళ్ళద్దు!! వెళితే ఆయన యొక్క గమ్మత్తయిన మత్తులో పడిపోతారు !!

      Delete
  5. superb! ఇంత మంచి హాస్యం ఒక్క బ్లాగ్ కి పరిమితం అయిపోడం బాగోలేదండి. కౌముది, సుజనరంజని లాటి అంతర్జాతీయ అంతర్జాలపత్రికలకి "columns" రూపంలో పంపించండి.

    ReplyDelete