Saturday, April 21, 2012

రెండు కళ్ళూ నాలుగైనాయి....


రెండు కళ్ళూ నాలుగైనాయి....

అదే.. నాకు తెలుసు, "నాలుగు కాళ్ళూ రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి" .ఆ  పాట నాకూ ఇష్టమే. .. కానీ ఈ కంప్యూటర్ లూ టీ వీ లు వచ్చాకా మనిషికి వుండే రెండు కళ్ళూ చాలక, కళ్ళ అద్దాలు చిన్న వయసులోనే వచ్చేసి నాలుగవుతున్నాయన్నమాట. మా అబ్బాయి పుట్టినప్పుడే ఆంద్రా లో టీ వీ వచ్చింది. అప్పటికే నాకు కళ్ళద్దాలు వున్నాయి అది వేరే విషయం అనుకోండి.
ఇప్పుడు నా సమస్యేమిటంటే, కళ్ళద్దాలు, రెండు కళ్ళూ వున్నా చూడగలిగేది ఒక స్క్రీనే కదా..

మనం కేబుల్ పెట్టి ౦చుకున్నామనుకోండి, వాళ్ళు మనకో  ముప్ఫయ్యో వందో చానల్స్ ఇస్తాడు.. కానీ, మనం ఒక సారి ఒక చానలే చూడ గలుగుతాము. మరో టీ వీ వుంటే, మరొక చానల్ మన ఇంట్లో మరో సభ్యుడు చూసుకోవచ్చానుకోండి. అయితే, నాకు నచ్చే రెండు  సీరియల్స్ ఒకే సమయంలో రెండు చానల్స్ లో వస్తూ వుంటే, ఎలా చూడాలో నాకైతే అర్ధం కావడం లేదు. ఇంటర్నెట్ లో  మరో చానల్ లో వచ్చిన సీరియల్ ఏ యు ట్యూబ్ లోనో చూడొచ్చు. ఏమైనా అంటే ప్రయారిటీ అంటారు.. అది చూసుకోవాలిట. ప్రయారిటీ  అనగానే నీకు పిల్లలు ముఖ్యమా, మొగుడు ముఖ్యమా.. పుట్టిల్లు ముఖ్యమా, అత్తవారిల్లు ముఖ్యమా.. ఇలా వెధవ ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అలానే, సీరియల్స్ లో ఏది నీకు ఎక్కువ ఇష్టం? అబ్బో.. చాలా గడ్డు సమస్య.. అక్కడ అత్తగారిని కోడలు అన్నం లో విషం కలిపి చంపుతుందా, లేక అత్త గారు కోడల్ని గ్యాస్ స్టవ్ ఆక్సిడెంట్ లో చంపుతుందా తేలాలి కదా . మరో చానల్లో  పాపం పేద పిల్ల, ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితి , ఎన్నో కష్టాలు పడుతూ వుంటుంది. తల్ల్కి క్షయ, తండ్రికి కాన్సెర్ , కాళ్లు లేని చెల్లి, కళ్ళు లేని తమ్ముడూ, పాపం చాలా కష్టాలు . కానీ ఆ హీరోయిన్ కి కట్టే, జరీ బుటాలు, నగిషీలు కుట్టిన జార్జిట్ చీరలు, వాటికి మాచింగ్ గా మాంచి రక రకాల రంగులతో మిలా మిలా మెరిసిపోయే నగలూ ఎంత బాగుంటాయో.. మరి.. వీటిల్లో ఏది చూడాలి అని ఎంచుకోవాలంటే.. కొంచం కష్టమైనా పనే. అర మీటర్ గుడ్డ తో స్కర్ట్, పావు మీటర్ బనీను తో కాలేజీ లో చదివే అమ్మాయి పెళ్లి కాగానే ఆరుగాజాల చీర తో ప్రత్యక్షం అయిపోతుంది. తమాషాగా ఉండదూ మరి? అందుకే ఏదీ మిస్ అవ్వాలని  వుండదు.

అప్పుడనిపిస్తుంది ,  నాలుగు కళ్ళు రెండు తలకాయలు వుంటే ఎంత బాగుండునో కదా అని.. బ్రహ్మకి నాలుగు తలలు వుంటాయిట.. అలా మనకీ వుంటే బాగుంటుందా.. ఒక వేళ అలా వుంటే, నెలకి  హెయిర్ కటింగ్ కి, తదితరమైన  ఖర్చులు పెరుగుతాయనుకోండి.. కానీ జస్ట్ ఒక సారి ఆలోచించి చూడండి. ఇక రావణాసురిని గురించి తెలియనిది ఎవరికీ? కానీ రావణాసురునికి పది తల లైతే వున్నాయి కానీ చేతులు రెండే ఉన్నాయనుకుంటా. బ్రహ్మ కి నాలుగు చేతులా రెండేనా? ఈ సారి ఏదైనా సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ మధ్య రామాయణం, భారతాలు లాంటివి కూడా టీ వీ లో వస్తున్నాయి కదా.. వాటిల్లో నైనా చూడాలి. చదువుదామంటే  రామాయణ మహా భారతాలలో ఇలాంటి వివరణలు ఉండకపోవచ్చు.  విష్ణు మూర్తికి కూడా నాలుగు చేతులు వున్నట్టు చూపించినా, రెండు మాత్రమే ఉపయోగిస్తూ, మిగతావి ఉత్తుత్తినే సామాన్లు మోస్తున్నట్టు చూపిస్తారు. ఈ మధ్య ఒక టీ వీ ఏ డ్ లో  ఒక అమ్మాయికి ఆరో ఎనిమిదో చేతులు పెట్టి, ఇంట్లో కుటుంబానికి, ఒకరికి ఇడ్లీ, మరొకరికి ఉప్మా, ఒకరికి దోసె చేస్తున్నట్టు చూపించారు. మిగతా చేతులతో, అలమారుల్లోంచి సామాన్లు తీస్తూ, నుదుటి  మీద పడిన ముంగురులు కూడా సవరించినట్టు, చాలా బాగా తీసారు. అదిగో, అది చూసినప్పటినుంచి, ఇదుగో ఇలాంటి వెర్రి మొర్రి ఆలోచనలు అన్నీ పుట్టుకుని వస్తున్నాయి. నాకుమాత్రం అలాంటి ఆలోచన వచ్చిన వాడి శ్రుజనాత్మక శక్తి కి  జోహార్లు చెప్పక తప్పడం లేదు.

నాకు నా ఆఫీసు లో రెండు కంప్యూటర్ లు రెండు మోనిటర్లూ వున్నాయి. కానీ రెండూ ఒకే సారి చూడడానికి అవదు కదా. బుర్ర అటూ ఇటూ తిప్పి ఒక దాని తరవాత ఒకటి చూడవలసిందే. చెరో కన్నుతోనూ, చెరో మోని టరూ చూడలేను కదా,   అలానే, రెండు కంపూటర్లు వున్నా, కీ బోర్డు లు కూడా రెండు వున్నాయి. ఒకే సారి రెండింటి మీదా పని చెయ్యలేను, కానీ అప్పుడప్పుడు అవసరం పడుతుంది. ఒక కంప్యూటర్ లోంచి ఏదైనా డేటా అప్ లోడ్ చేస్తూ వుంటే, మిగతా పనులు, అంటే సాహితి గ్రూప్ కి మెయిల్ పెట్టడమో, స్వంత బ్లాగ్ రాసుకోవడమో కాదు, అవుట్ లుక్ మెయిల్స్ చెక్ చేసి రిప్లై లు పంపడం, మిగతా కాన్ఫిగరేషన్ చెయ్యడమో, లేక టెస్టింగ్ చెయ్యడమో, డి బగ్  చెయ్యడమో,  ఇలాంటి ఆఫీసు పనులే, చేసుకోవచ్చన్నమాట.  అంటే  ఒక సారి ఒక కంప్యూటర్ వాడితే, మరో సారి మరొక కంప్యూటర్ వాడాలి. ఒక్క డేటా అప్ లోడ్ అప్పుడు తప్ప. అలా డేటా అప్ లోడ్ చేస్తున్నప్పుడు మిగతా పనులు అడ్డుకు పోతాయి. కంప్యూటర్ స్లో అయి పోతుంది. అందుకే ఈ తంటా.
సామర్ధ్యం ఎక్కువ చూపించాలని రెండేసి మోని టర్లూ రెండేసి కంప్యూటర్లూ కంపెనీ  వాళ్లిచ్చినంత మాత్రానా, అవి వాడడానికి రెండేసి బుర్రలూ, నాలుగు చేతులూ,  ఎనిమిది కళ్ళూ లేవుకదా. వాడ వలసినవి సరిగ్గా వాడితే చాలు. అసలు నాకు తెలియక అడుగుతానూ, అసలే ఎకానమీ బాగోలేదు. చాలా మంది ఉద్యోగాలు లేక ఏడుస్తూ వుంటే, వున్న నలుగురి మనుషులతో పది మంది పని చేయి౦చాలనా   ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ఈ కంపనీ వాళ్ళకి తెలివి తేటలు ఎక్కువ.. మనల్ని సడన్ గా టీం లీడో, ప్రాజెక్ట్ మానేజరో చేసేస్తారు. మనం ఆ పేర్లు చెప్పుకుని ఆనందిచడమే. అంటే మనకి ఎక్కువ పని అంట గట్టడం అన్నమాట.. అలా అని జీతాలు మాత్రం పెంచరు..

అవునూ విష్ణుమూర్తికి నాలుగు చేతులు వున్నాయి కానీ కాళ్ళు రెండే వుంటాయి,  తల కూడా ఒకటే వుంటుంది కదా. ఇలా ఆలోచిస్తూ రాత్రి పదకొండు దాకా టీ వీ చూసి పడుకునే ముందు దేముణ్ణి ప్రార్ధించాను, "దేముడా, నాకు మరో రెండు చేతులూ, మరో బుర్రా మంచివి, బాగా కనిపించేవి రెండు కళ్ళూ ప్రసాదించు తండ్రీ" అని.

ఎవేవో పిచ్చి కలలు.

" వెర్రి బాగుల దానా, ఇప్పటికే ఆడవాళ్ళంతా అటు ఆఫీసు పని, ఇటు ఇంట్లో పని చేసుకో లేక చస్తున్నారు. మీ అయన నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గరనుంచి ఒక రిమోట్ కంట్రోలు లాగా నిన్ను వాడుతున్నాడు. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? రెండు చానల్స్ ఒక సారి చూడవచ్చని మురిసి పోతున్నావుగానీ, ఇప్పుడు చూస్తున్న ఒక్క చానల్ చూడడానికీ నీకు సమయం లేకుండా, రెండింతలు పనిచెయ్యాల్సి వస్తుందేమో ఆలోచించావా"... ఎవరో నా చెవుల్లో మెల్లగా చెబుతున్నారు..
ఎవరో నా మోహం దగ్గరగా గుర్రు గుర్రు మంటున్నారు.. తడి తడి గా నా బుగ్గల మీద అనిపించింది.. మీసాలు కిత కితలు పెడుతున్నాయి.
సడన్ గా మెలుకవ వచ్చింది... అలారం గోలతో... కళ్ళు తెరిచాను, మా పెంపుడు పిల్లి నా మొహంలోకి చూసి మియావ్ అంది..


4 comments:

  1. నాకు కూడా సేం డౌట్ అండి.బ్రహ్మకి నాలుగు చేతులా రెండేనా?అని.అలాగే మనిషికి బాగా కనిపించేవి మరో రెండు కళ్ళు,మరో రెండు చేతులూ, మరో బుర్ర ఉంటే బావుండు.పొస్ట్ చాలా బావుంది.

    ReplyDelete
  2. అదెల్లాగండీ!! మల్టీ టాస్కింగు మనకందరికీ అలవాటే గదా?ఒక్క మెదడు రెండు లేక మూడయ్యిందనాల?

    ReplyDelete