Wednesday, May 16, 2012

ఊహా? కలా?? ఆశయమా???

 "ఊహా?కలా?" మా మావా గారు, మా ఏడేళ్ళ అబ్బాయిని పక్క గదిలో టీవీ దగ్గర కూర్చుని చూస్తున్న మా మామగారు  అడుగు తున్నారు. నేను వంటింట్లోంచి ఆయన వైపు తొంగి చూసాను. ఆయన మోహంలో కొంటె తనం కనిపిస్తోంది. ఆయన కళ్ళల్లో వాడి మీద ప్రేమ, కించిత్ గర్వం కూడా చూడొచ్చు. ఒక నిముషం వాడిని అలాంటి ప్రశ్న ఎందుకు వేసారో అర్ధం కాలేదు. టీవీ లో ఒక డ్యూయెట్ పాట వస్తోంది. దాని గురించి ఆయన వాడిని అడుగుతున్నారు. వాడు, "అబ్బా ఇది కల కాదండీ, వూహ" అని విసుగ్గా చెప్పాడు. వాడు విసుగు, మావయ్య గారి మోహంలో ఆనందం చూసి నాకు కూడా నవ్వు వచ్చింది. " కల అనుకున్నానురా" అన్నారు, నా వైపు చూసి నవ్వుతూ. ఏడేళ్ళ పిల్లాడికి కలకి వూహ కి తేడా ఏమిటి తెలిసిందో మరి. నాకైతే చాలా కాలం వరకూ ఆ రెండింటికీ తేడా వుందని ఆలోచించ లేదు. అసలు నాకు కొంచం బాగా అర్ధం అయిన మొదటి సినిమా లవకుశ. అంతకు మునుపు చాలా సినిమాలు చూసా. కానీ ఏదో అందరూ చూస్తున్నారు కనుక నేనూ చూడాలి అంతే, అంతకన్నా పెద్దగా ఏమీ తెలియదు. 
జగదేక వీరుడూ అతిలోక సుందరి చూసారా? అందులో శ్రీదేవి, చిరంజీవి మాంచి పాట   పాడి డాన్సు చేస్తారు.  పాట అంతా అయ్యేసరికి పోలీసు ఇన్స్పెక్టర్ ఏరా ఏమి చేస్తున్నావు అని కానీ స్టేబుల్ ని అడుగుతాడు. కొండలలోకీ కోనల లోకీ  ఎక్కడికో వెళ్ళిపోయాను అంటే,అక్కడి నుంచి దూకి చావు అంటాడు. అంటే, ఆ శ్రీదేవి చిరంజీవుల పాట కానీ స్టేబుల్ తాలూకు వూహ అన్నమాట.  అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఈ పెద్ద పెద్ద నేతలు "It is my dream",  " I have dreams, or "I too have dreams" అంటారు. కానీ వాళ్ళు చెప్పేది  కలా? ఊహా? అంటే ఆ దేశం వుద్దరించేయ్యడం నిద్రపోతున్నప్పుడు వచ్చిన కలా? లేక ఏదో చేసెయ్యాలని ఆశయమా? లేక ఏదో చేసేస్తున్నట్టు ఊహా? 
రోజూ నిద్రపోతున్నప్పుడు బోలెడు కలలు వస్తాయి. నాకైతే ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు కొండ మెట్లూ.. ఎప్పుడూ అవే కలలు. ఇక ఊహలంటారా.. నేను ఝమాఝామా సముద్రం లో చేప లాగా ఈదేస్తున్నట్టు, ఆకాశం లో రెక్కల సహాయంతో ఎగురుతున్నాట్టూ ఇలాంటివే వస్తాయి. నాకైతే  ఈదడం రాదు , ఇటు ఎగరలేనని మీకూ తెలుసు. ఈత నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదనుకోండి, కానీ ఈ జన్మలో ఎగర లేను కదా. ఆకాశం లో ఎగురుతున్న పక్షులు చూసినప్పుడు కొంచం సేపు కుళ్ళు వస్తుంది, వాటిలా నేను ఎగర లేకపోతున్నానని. ఎగర గలిగితే, హాయిగా నెలకో సారి ఇండియా వెళ్లి వచ్చేదాన్నిగా. వీసా బాధ వుండదు. ఫ్లైట్ చార్జెస్ వుండవు. అయితే, నేను ఎగర గలిగితే  , అమెరికా రావలిసిన అవసరమూ వుండదేమో.. అది వేరే ఆలోచించ దగ్గ విషయం. నాకు సినిమాల్లో అందరి పాత్ర కన్నా నారదుని  పాత్ర చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన, హాయిగా పాటలు పాడుకుంటూ మేఘాలలో తిరిగుతూ ఉంటాడు కాదా. అందుకు. నాకూ అలానే పాటలు పాడుకుంటూ, మేఘాలలో నడుచుకుని వెళ్లాలని వుంటుంది. ఒక సారి తిరుపతి కొండ మీద మేఘం మధ్యన వున్నాను.కానీ ఊహించినంత గొప్పగా అనిపించలేదు. పైగా చలేసి చచ్చాను అది వేరే విషయం లేండి. ఒక్కొక్క సారి విమానం లో ఎగురుతూ, మేఘలలోంచి వెళ్తూ వుంటే, కిటికీలలోంచి చూసి, నారదుణ్ణి తలచుకుని ఏదో ఉన్నంతలోనే, దేముడు నా కోరిక ఇలా తీర్చేడు కదా అనుకుంటూ ఉంటా. 
జీవితం అంతా నేను ఊహల్లోనే బ్రతికా. నా ఉద్దేశం లో అందరూ ఊహిస్తారేమో. చిన్నప్పుడు 'నేను పెద్దయ్యాకా" అంటూ ఎన్నో ఊహిస్తాము కదా. ఆఖరికి , నిజం చెప్పాలంటే, ఆఖరికి  కాదు, తిండి చాలా ముఖ్యం కనుక, ముందుగా వంట చెయ్యడం కూడా బాగా చెయ్యాలని ఊహిస్తూనే మొదలెడ తాము. ఆ తరవాత, అనుకున్నట్టు కాకుండా వేరేగా తగలడుతూ వుంటుంది. అలానే, కొన్ని తినుబండారాలు చూడడానికి చాలా బాగున్నట్టు వుంటాయి, కానీ నోట్లో పెట్టుకోలేము. 
చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం బాగా అలవాటు నాకు. అంటే ఏదో రామాయణ౦, మహాభారతం అవీకావు. అంటే  శంకర్ బొమ్మల రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం అవీకూడా చదివేననుకోండి. ఇప్పటికీ నాకు శంకర్ బొమ్మల పుస్తకాలు ఇష్టమే.   చిన్నప్పుడు చందమామా, బాలమిత్ర లే కాకుండా,  బోలెడు కథల పుస్తకాలు చదివేదాన్ని.  ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, యువ లాంటివి కూడా చదివేదాన్ని. లైబ్రరీ లో వుండే తెలుగు పుస్తకాలన్నీ చదివేసేదాన్ని.  క్లాసు పుస్తకాలు కూడా, కానీ కొనగానే, తెలుగు పుస్తకం ముందు నుంచి చివర దాకా చదివేసేదాన్ని. ముఖ్యం గా నాన్ నాన్ డిటైల్ డ్ పుస్తకాలు ముందుగా చదివేసే దాన్ని.    ఏ పుస్తకం చదివినా, అందులో ముఖ్య పాత్రే కాకుండా, మిగతా పాత్రలలో కూడా నన్ను నేను ఊహించుకుని, నేనైతే అలాంటి పరిస్థితులలో ఏమి చేసి వుండే దాన్ని అని ఊహిస్తూ వుండే దాన్ని.  అయితే దానివలన ఏదో వుద్దరించానని చెప్పడం లేదు. ఏదో కాలక్షేపం అంతే! పుస్తకాలు చదవడం వలన ఊహా పరిధి పెరుగుతుందని నా అభిప్రాయం. అలా అని ఊహా పరిధి పెరగడానికి నేను పుస్తకాలు చదవలేదు. చదవడం నా అలవాటు  అనుకో వచ్చు. 
 నేను చాలా చిన్న దాన్నిగా వున్నప్పుడు, చైనా యుద్ధం వచ్చింది. అప్పటికి చైనా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ వాళ్ళని సినిమా లలో చూపించే రాక్షసుల లా గా ఊహించేదాన్ని.నల్లగా,  బలంగా, పెద్ద పెద్ద కోరలతో, నెత్తిమీద కొమ్ములతో,... ఈ పాటికి అర్ధం అయి వుంటుంది నేను ఎలా ఊహించానో. ముందే చెప్పాగా, అప్పుడు చిన్న పిల్లనని. ఆ తరవాత న్యూస్ పేపర్ లలో చూసాను చైనా వాళ్ళు ఎలా ఉంటారో. , మా ఆయన ఉద్యోగ ధర్మమా అని చైనా కూడా వెళ్ళగలిగాను.  అప్పటికి నాకు తుపాకీలు టాంకులు అవీ తెలియవు. చైనా వాళ్ళ యుద్ధం అంటే, మన వాళ్ళూ, చైనా వాళ్ళతో కలిసి  కత్తి యుద్దలేవో చేస్తారేమో అనుకునే దాన్ని. చెప్పొద్దూ, నాకూ కత్తి సాము నేర్చుకోవాలనే కోరిక కూడా వుండేది. బాగా కత్తిని తిప్పుతూ శత్రువుల్ని వోడించి నట్టు ఊహించుకునే దాన్ని, ఒక్కసారి కలలు కూడా వచ్చేవి కానీ కొంచం జడుసుకునేదాన్ని. అయినా కూడా  ఎలా అయినా సైన్యంలో చేరాలనే కోరిక వుండేది. ఝాన్సీ లక్ష్మి లాగా యుద్ధం చెయ్యాలని, దేశం కోసం ప్రాణం ఇచ్చేసినా దేశాన్ని కాపాడాలని ఎన్నో ఊహించేదాన్ని.. కానీ ఎప్పుడూ  నాదేశం వదిలి వస్తానని, నేను కల కనలేదు, ఊహించానూ లేదు.  అయితే మరి కాస్త పెద్దయ్యాకా అంటే కాలేజీ జీవితం లో ప్రవేశించాకా తెలిసింది, జీవితమే ఒక పెద్ద యుద్దరంగం అనీ, ప్రతి రోజూ యుద్దమే అని. 
దేశ భక్తి గీతాలు వింటూ వుంటే మనసంతా వుద్రకం తో ఊగి పోయేది. శ్రీ శ్రీ గారి ' ఏవి తల్లీ, నిరుడు కురిసిన హిమ సమూహము లేవి తల్లీ " అనే ఎవరైనా పడితే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసేవి.ఈ దేశరక్షణ పిచ్చిలో స్కూల్ లో N.C.C  లో కూడా చేరా. నాలుగేసి గంటలు ఎండలో నిలబడి కళ్ళు తిరిగడం, గ్రౌండ్ చుట్టూ, లెఫ్ట్, రైట్ అంటూ గంటల తరబడి నడిపించడం, ఆఖరున ఓ బ్రెడ్ ముక్క పెట్టడమే   కానీ, యుద్ధం లో పంపించే సూచనలు ఏమీ కనిపించలేదు.  ఏడాది అయ్యాకా, ఒక సర్టిఫికేట్ మా మొహాన పడేసారు. అప్పటికే ఈ కత్తి  యుద్దాలు లేవని కొంచం తెలిసిందనుకోండి.కొంచం పెద్దయ్యాకా, ఈ యుద్దాలు నా వల్ల కాదని, నేను చేద్దామనుకున్నా ఇంట్లో వాళ్ళ నన్ను పంపడానికి సమ్మతించరనీ తెలిసిపోయింది. సమాజానికి సేవ చెయ్యాలని చాలా ఊహించుకున్నా. అస్సలు పెళ్ళే చేసుకో కూడదని, బాగా చదువుకుని సంఘ సేవ చేస్తున్నట్టు చాలా చాలా ఊహించాసా.
 అన్నయ్యా, నేనూ చిన్నప్పుడు ఇంటిముందు ఏటి ఇసక జల్లించగా వచ్చిన చిన్న రాళ్ళ కుప్పలోంచి ఒక్కొక్క రాయి తీసి, ఒకటి శివ లింగం లా వుంది అంటే, మరొకటి పాకుతున్న కృష్ణుడు లాగా వుందని, మరొకటి తల్లీ పిల్లల్లాగా, వినాయకుడి రూపంలోనూ.. ఇలా ఎన్నో ఊహించే వాళ్ళం. అలానే, ఆకాశం లో మబ్బుల్ని చూసి అవి ప్రతీ నిముషం మారే ఆకారాలు చూస్తూ, ఏనుగుల గుంపులాగా, హనుమంతుని లా, చెట్టు చాటునుంచి దాంకుని రాధ ని విసిగిస్తున్న   కృష్ణు ని  లా ఒకటేమిటి.. ఎన్నోన్నో ఊహలు.  అదేమిటో సైంధవుడి లా మా అన్న నా ఆశయాలన్నింటికీ  అడ్డు పడే వాడు. నాకు పదిహేనవ ఏడు వచ్చినది మొదలు దీనికి పెళ్లి చేసేయ్యందో అంటూ మొర పెట్టే వాడు. అయితే వాడి గోల విన్న వాడు ఎవరూ లేరనుకోండి. మా వాళ్ళంతా నన్ను చదివించే ఉద్దేశం లోనే వుండే వారు. తమాషా ఏమిటంటే, అస్సలు పెళ్లి గురించి ఎప్పుడూ ఊహించలేదు. కలలు కనలేదు. నా భర్త ఎలా వుండాలీ అని ఊహించలేదు. చాలా మంది పదహారేళ్ళ వయసు వచ్చిన దగ్గరనుంచీ, తనను చేసుకో బోయే వాడు ఎలా వుండాలి, డాక్టరు లేక ఇంజనీరు కావాలి, ఆరడుగులు పొడుగు ఉండాలనీ, అందగాడై వుండాలీ, ఇలా ఏవేవో ఊహిస్తూ ఉంటారని అంటారు. ఆ తరువాత దొరికిన వాడే శ్రీరామ చంద్రుడో, కృష్ణ పరమాత్ముడు గానో ఊహించు కుంటూ అడ్జస్ట్ అయిపోతారనుకోండి. నాకసలు పెళ్లి గురించిన ఆలోచనలు ఎప్పుడూ లేవు. బహుశా అది నేను చేసిన తప్పేమో తెలియదు. ఇంట్లో వాళ్ళు ఎవరినో కట్టబెడతారు, అది వాళ్ళ డిపార్టుమెంటు. అనవసరం గా నా బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం అనుకునే దాన్ని. మనం ఊహించిన వాడు మనకి ఎలానూ రాడు. ఒకవేళ నేను ఊహించిన లాంటి వాడు కనిపించినా, వాడు ఊహించినట్టు నేను ఉండకపోవచ్చు. అప్పుడు చాలా మనసుకి కలత. అందుకే, చచ్చినా ప్రేమ వివాహం చేసుకో కూడదని అనుకున్నా. కానీ అనుకున్నవన్నీ  జరగాలని రూలేమీ లేదుగా. నా ఉద్దేశం లో కావాలని ఎవరూ ప్రేమించారు. మనకు రాసిపెట్టిన వాళ్ళని మన కుటుంబం వాళ్ళు కలవక  ముందే మనం కలిసే మనుకోండి, అప్పుడు ఈ ప్రేమ జబ్బు ఉద్భవిస్తుందనుకుంటా.  పైగా మనం ఊహించినది జరగక పోతే చాలా డిసప్పోయింట్ మెంట్ - అదే నిరాశ. పెళ్లి ఎలా చేసుకున్నాము అనేది పెద్ద చెప్పుకో దగ్గ విషయం కాదు. ఎందుకంటే ఏ రాయయినా ఒకటే పళ్ళు ఊడగోట్టు కోవడానికి . పెళ్ళయ్యాకా ఎలా జీవితం మలుపు తిరిగింది అనేది ఆలోచించ విషయం. పెళ్ళయ్యాకా, ఆ జీవితం గురించి ఎప్పుడూ ఊహించలేదు కనుక డిసప్పాయింట్ మెంట్ అనే పదానికి తావు లేక పోయింది. ఊహాతీతం గా విదేశాలన్నీ తిరిగే అవకాశం వచ్చింది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, అబ్బ మన దేశం ఎప్పుడు పోతామా అనే వుండేది. మన దేశం రాగానే స్వేచ్చగా స్వాతంత్రంగా వున్నట్టు అనిపించేది. వీసా బాధలు పాస్ పోర్ట్ బాధ  ఇలాంటివి ఏవీ లేకుండా మనకి ఇష్టమైన చోట తిరగొచ్చుగా మరి. మనం దేనికి దూరమౌతామో అదే మనకి కావాలని పిస్తుంది. దగ్గర గా వున్నప్పుడు దాని విలువ తెలియదు. తల్లి అయినా సరే.. 
అమెరికాకి వచ్చినప్పుడు ఇక్కడ వుండి పోవాలని రాలేదు. మరి ఏ ముహూర్తం లో బయలు దేరామో తెలియదు. ఇక్కడే స్థిర పడి పోయాము. ఈ హ్యూస్టన్  నగరం లో చాలా మంది మనదేశం వాళ్ళు ఉండబట్టి కొంచం ఇండియా లోనే వున్నట్టు ఉంటుందనుకోండి.  ఈ సాఫ్ట్  వేర్ ధర్మమా  అని ఇండి యన్స్ అందులో ముఖ్యం గా తెలుగువాళ్ళు ఈ అమెరికాలో ఎక్కువైపోయారు. డాలస్ లో ఆర్లింగ్టన్ ని ఆర్లింగ పురం అని పిలుస్తున్నట్టు వినికిడి. షుగర్ ల్యాండ్ లో టెల్ ఫేర్ అంతా తెలుగు వాళ్ళే ఎక్కువ.  అమెరికాలో ఆంద్ర రాష్ట్రం రావాలని, వస్తే ఎలా ఉంటుందా అని ఒక నిముషం ఊహించా. కానీ ఎందుకో భయం వేసింది. ఇక్కడ కూడా తెలంగాణా, రాయలసీమ కోస్తా అంటూ కొట్టుకున్నట్టుగా ముందుగా ఒక వూహ. అక్కడితో ఆపేసా..
ఊహలు ముదిరితే కలలు గా వచ్చే అవకాశం వుందనుకుంటా. అందుకే ఈ నేతలందరూ " My Dream " అంటూ ఉండవచ్చు. అదే, ప్రేమా పిచ్చీ ఒకటే.. లాగా అన్నమాట. ప్రేమ ముదిరితే పిచ్చి గా మారుతుంది. ఊహలు మంచివి గా ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. ఊహల పర్యవసానం గా మనం చేసే పనులూ సక్రమమైనవి అవ్వాలని అసలు రూలు లేదు. జరిగేది జరక్క మానదు. ఇంతకీ నేను ఇప్పుడు ఏమి ఊహిస్తున్నానంటారా... ఏమీ లేదు.. మీరు నా బ్లాగ్ చదువుతారా లేదా? చదివి మీరు నన్ను ఏమని తిట్టుకుంటారు. మీరేమనుకుంటే నాకేం. ఏదో రోజు యద్దనపూడి, మల్లాది గారంతటి దాన్ని కాక పోతానా.. వాళ్ళు నా ఆటో గ్రాఫ్ తీసుకుందుకి లైన్ కడతారేమో అని.  ఊహే కదా,  ఫ్రీ కదా.. మీరూ కానీండి ఆలస్యం ఎందుకు?    :)

5 comments:

  1. అయ్యబాబోయ్! ఏంటండీ ఈ పొస్టులో ఊహ గురించి ఇంత క్లాస్ పీకారు.చైనా యుద్దంలో రాక్షసుల గురించి మీ ఊహ సూపర్బ్.మీ ఆటోగ్రాఫ్ కోసం వెయిటింగ్.ఇక్కడ క్యూ చాలా పెద్దగా ఉందండీ (ఊహలో)
    :):)

    ReplyDelete
  2. అద్భుతంగా వ్రాశారు....

    ReplyDelete
  3. చెల్లెమ్మా, నాలుగు బ్లాగుల సరుకు ఒక్క బ్లాగులోనే గుప్పించేసినట్టుంది !!

    ReplyDelete
  4. :) Thanks all for your nice comments and encouraging me.

    ReplyDelete