Saturday, April 21, 2012

రెండు కళ్ళూ నాలుగైనాయి....


రెండు కళ్ళూ నాలుగైనాయి....

అదే.. నాకు తెలుసు, "నాలుగు కాళ్ళూ రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి" .ఆ  పాట నాకూ ఇష్టమే. .. కానీ ఈ కంప్యూటర్ లూ టీ వీ లు వచ్చాకా మనిషికి వుండే రెండు కళ్ళూ చాలక, కళ్ళ అద్దాలు చిన్న వయసులోనే వచ్చేసి నాలుగవుతున్నాయన్నమాట. మా అబ్బాయి పుట్టినప్పుడే ఆంద్రా లో టీ వీ వచ్చింది. అప్పటికే నాకు కళ్ళద్దాలు వున్నాయి అది వేరే విషయం అనుకోండి.
ఇప్పుడు నా సమస్యేమిటంటే, కళ్ళద్దాలు, రెండు కళ్ళూ వున్నా చూడగలిగేది ఒక స్క్రీనే కదా..

మనం కేబుల్ పెట్టి ౦చుకున్నామనుకోండి, వాళ్ళు మనకో  ముప్ఫయ్యో వందో చానల్స్ ఇస్తాడు.. కానీ, మనం ఒక సారి ఒక చానలే చూడ గలుగుతాము. మరో టీ వీ వుంటే, మరొక చానల్ మన ఇంట్లో మరో సభ్యుడు చూసుకోవచ్చానుకోండి. అయితే, నాకు నచ్చే రెండు  సీరియల్స్ ఒకే సమయంలో రెండు చానల్స్ లో వస్తూ వుంటే, ఎలా చూడాలో నాకైతే అర్ధం కావడం లేదు. ఇంటర్నెట్ లో  మరో చానల్ లో వచ్చిన సీరియల్ ఏ యు ట్యూబ్ లోనో చూడొచ్చు. ఏమైనా అంటే ప్రయారిటీ అంటారు.. అది చూసుకోవాలిట. ప్రయారిటీ  అనగానే నీకు పిల్లలు ముఖ్యమా, మొగుడు ముఖ్యమా.. పుట్టిల్లు ముఖ్యమా, అత్తవారిల్లు ముఖ్యమా.. ఇలా వెధవ ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అలానే, సీరియల్స్ లో ఏది నీకు ఎక్కువ ఇష్టం? అబ్బో.. చాలా గడ్డు సమస్య.. అక్కడ అత్తగారిని కోడలు అన్నం లో విషం కలిపి చంపుతుందా, లేక అత్త గారు కోడల్ని గ్యాస్ స్టవ్ ఆక్సిడెంట్ లో చంపుతుందా తేలాలి కదా . మరో చానల్లో  పాపం పేద పిల్ల, ఒక పూట తినడానికి తిండి లేని పరిస్థితి , ఎన్నో కష్టాలు పడుతూ వుంటుంది. తల్ల్కి క్షయ, తండ్రికి కాన్సెర్ , కాళ్లు లేని చెల్లి, కళ్ళు లేని తమ్ముడూ, పాపం చాలా కష్టాలు . కానీ ఆ హీరోయిన్ కి కట్టే, జరీ బుటాలు, నగిషీలు కుట్టిన జార్జిట్ చీరలు, వాటికి మాచింగ్ గా మాంచి రక రకాల రంగులతో మిలా మిలా మెరిసిపోయే నగలూ ఎంత బాగుంటాయో.. మరి.. వీటిల్లో ఏది చూడాలి అని ఎంచుకోవాలంటే.. కొంచం కష్టమైనా పనే. అర మీటర్ గుడ్డ తో స్కర్ట్, పావు మీటర్ బనీను తో కాలేజీ లో చదివే అమ్మాయి పెళ్లి కాగానే ఆరుగాజాల చీర తో ప్రత్యక్షం అయిపోతుంది. తమాషాగా ఉండదూ మరి? అందుకే ఏదీ మిస్ అవ్వాలని  వుండదు.

అప్పుడనిపిస్తుంది ,  నాలుగు కళ్ళు రెండు తలకాయలు వుంటే ఎంత బాగుండునో కదా అని.. బ్రహ్మకి నాలుగు తలలు వుంటాయిట.. అలా మనకీ వుంటే బాగుంటుందా.. ఒక వేళ అలా వుంటే, నెలకి  హెయిర్ కటింగ్ కి, తదితరమైన  ఖర్చులు పెరుగుతాయనుకోండి.. కానీ జస్ట్ ఒక సారి ఆలోచించి చూడండి. ఇక రావణాసురిని గురించి తెలియనిది ఎవరికీ? కానీ రావణాసురునికి పది తల లైతే వున్నాయి కానీ చేతులు రెండే ఉన్నాయనుకుంటా. బ్రహ్మ కి నాలుగు చేతులా రెండేనా? ఈ సారి ఏదైనా సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఈ మధ్య రామాయణం, భారతాలు లాంటివి కూడా టీ వీ లో వస్తున్నాయి కదా.. వాటిల్లో నైనా చూడాలి. చదువుదామంటే  రామాయణ మహా భారతాలలో ఇలాంటి వివరణలు ఉండకపోవచ్చు.  విష్ణు మూర్తికి కూడా నాలుగు చేతులు వున్నట్టు చూపించినా, రెండు మాత్రమే ఉపయోగిస్తూ, మిగతావి ఉత్తుత్తినే సామాన్లు మోస్తున్నట్టు చూపిస్తారు. ఈ మధ్య ఒక టీ వీ ఏ డ్ లో  ఒక అమ్మాయికి ఆరో ఎనిమిదో చేతులు పెట్టి, ఇంట్లో కుటుంబానికి, ఒకరికి ఇడ్లీ, మరొకరికి ఉప్మా, ఒకరికి దోసె చేస్తున్నట్టు చూపించారు. మిగతా చేతులతో, అలమారుల్లోంచి సామాన్లు తీస్తూ, నుదుటి  మీద పడిన ముంగురులు కూడా సవరించినట్టు, చాలా బాగా తీసారు. అదిగో, అది చూసినప్పటినుంచి, ఇదుగో ఇలాంటి వెర్రి మొర్రి ఆలోచనలు అన్నీ పుట్టుకుని వస్తున్నాయి. నాకుమాత్రం అలాంటి ఆలోచన వచ్చిన వాడి శ్రుజనాత్మక శక్తి కి  జోహార్లు చెప్పక తప్పడం లేదు.

నాకు నా ఆఫీసు లో రెండు కంప్యూటర్ లు రెండు మోనిటర్లూ వున్నాయి. కానీ రెండూ ఒకే సారి చూడడానికి అవదు కదా. బుర్ర అటూ ఇటూ తిప్పి ఒక దాని తరవాత ఒకటి చూడవలసిందే. చెరో కన్నుతోనూ, చెరో మోని టరూ చూడలేను కదా,   అలానే, రెండు కంపూటర్లు వున్నా, కీ బోర్డు లు కూడా రెండు వున్నాయి. ఒకే సారి రెండింటి మీదా పని చెయ్యలేను, కానీ అప్పుడప్పుడు అవసరం పడుతుంది. ఒక కంప్యూటర్ లోంచి ఏదైనా డేటా అప్ లోడ్ చేస్తూ వుంటే, మిగతా పనులు, అంటే సాహితి గ్రూప్ కి మెయిల్ పెట్టడమో, స్వంత బ్లాగ్ రాసుకోవడమో కాదు, అవుట్ లుక్ మెయిల్స్ చెక్ చేసి రిప్లై లు పంపడం, మిగతా కాన్ఫిగరేషన్ చెయ్యడమో, లేక టెస్టింగ్ చెయ్యడమో, డి బగ్  చెయ్యడమో,  ఇలాంటి ఆఫీసు పనులే, చేసుకోవచ్చన్నమాట.  అంటే  ఒక సారి ఒక కంప్యూటర్ వాడితే, మరో సారి మరొక కంప్యూటర్ వాడాలి. ఒక్క డేటా అప్ లోడ్ అప్పుడు తప్ప. అలా డేటా అప్ లోడ్ చేస్తున్నప్పుడు మిగతా పనులు అడ్డుకు పోతాయి. కంప్యూటర్ స్లో అయి పోతుంది. అందుకే ఈ తంటా.
సామర్ధ్యం ఎక్కువ చూపించాలని రెండేసి మోని టర్లూ రెండేసి కంప్యూటర్లూ కంపెనీ  వాళ్లిచ్చినంత మాత్రానా, అవి వాడడానికి రెండేసి బుర్రలూ, నాలుగు చేతులూ,  ఎనిమిది కళ్ళూ లేవుకదా. వాడ వలసినవి సరిగ్గా వాడితే చాలు. అసలు నాకు తెలియక అడుగుతానూ, అసలే ఎకానమీ బాగోలేదు. చాలా మంది ఉద్యోగాలు లేక ఏడుస్తూ వుంటే, వున్న నలుగురి మనుషులతో పది మంది పని చేయి౦చాలనా   ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ఈ కంపనీ వాళ్ళకి తెలివి తేటలు ఎక్కువ.. మనల్ని సడన్ గా టీం లీడో, ప్రాజెక్ట్ మానేజరో చేసేస్తారు. మనం ఆ పేర్లు చెప్పుకుని ఆనందిచడమే. అంటే మనకి ఎక్కువ పని అంట గట్టడం అన్నమాట.. అలా అని జీతాలు మాత్రం పెంచరు..

అవునూ విష్ణుమూర్తికి నాలుగు చేతులు వున్నాయి కానీ కాళ్ళు రెండే వుంటాయి,  తల కూడా ఒకటే వుంటుంది కదా. ఇలా ఆలోచిస్తూ రాత్రి పదకొండు దాకా టీ వీ చూసి పడుకునే ముందు దేముణ్ణి ప్రార్ధించాను, "దేముడా, నాకు మరో రెండు చేతులూ, మరో బుర్రా మంచివి, బాగా కనిపించేవి రెండు కళ్ళూ ప్రసాదించు తండ్రీ" అని.

ఎవేవో పిచ్చి కలలు.

" వెర్రి బాగుల దానా, ఇప్పటికే ఆడవాళ్ళంతా అటు ఆఫీసు పని, ఇటు ఇంట్లో పని చేసుకో లేక చస్తున్నారు. మీ అయన నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గరనుంచి ఒక రిమోట్ కంట్రోలు లాగా నిన్ను వాడుతున్నాడు. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? రెండు చానల్స్ ఒక సారి చూడవచ్చని మురిసి పోతున్నావుగానీ, ఇప్పుడు చూస్తున్న ఒక్క చానల్ చూడడానికీ నీకు సమయం లేకుండా, రెండింతలు పనిచెయ్యాల్సి వస్తుందేమో ఆలోచించావా"... ఎవరో నా చెవుల్లో మెల్లగా చెబుతున్నారు..
ఎవరో నా మోహం దగ్గరగా గుర్రు గుర్రు మంటున్నారు.. తడి తడి గా నా బుగ్గల మీద అనిపించింది.. మీసాలు కిత కితలు పెడుతున్నాయి.
సడన్ గా మెలుకవ వచ్చింది... అలారం గోలతో... కళ్ళు తెరిచాను, మా పెంపుడు పిల్లి నా మొహంలోకి చూసి మియావ్ అంది..


Tuesday, April 17, 2012

పతిదేవుని పరధ్యానం

పరధ్యానం అంటే కొంచం పదం బాగుంటుందని వాడా అంతే. నిజం చెప్పాలంటే మతి మరుపు అన్నమాట.
చాలా ఎక్కువ తెలివయిన వారికి మతి మరుపు కొంచం జాస్తిగా ఉంటుందని వినికిడి. పెద్ద తెలివి తేటలు లేవు కానీ, నాకూ మతి మరుపుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది, బహుశా తెలివి తేటలికి మతి మరుపుకి సంబంధం లేదని. ఏది ఏమైతేనేం, మా వారి కి మతిమరుపు చాలా ఎక్కువ. ఇది చాలా సెలె క్టివ్ మతి మరుపు. అన్ని విషయాలూ మర్చి పోరు. ఆయన టెన్త్ క్లాసు హాల్ టికెట్ నెంబర్ దగ్గర నుంచి మొదలు కొని, అన్ని పరీక్షల నెంబర్ , ఆయన ఎక్కినా మొదటి ఫ్లైట్ నెంబర్ దగ్గర నుంచి ఈ మద్య ఎక్కిన టాక్సీ నెంబర్ వరకూ అన్నీ నిద్దర్లో అడిగిన తడుము కోకుండా గడ గడా చెప్పేస్తారు. పాతికేళ్ళ క్రితం, మేము బీచ్ లో ఫలానా ఆదివారం ఏ విషయం మీద తగువు పడ్డామో కాళ్ళకు కట్టి నట్టు చెప్పేస్తారు. కానీ నేను ఆదివారం షాప్ కి వెళ్లి గ్రోసురీస్ తెద్దామని చెప్పిన విషయం గుర్తుండదు ఎందుకో మరి. అలానే, ఇంటికి కర్టెన్లు మారుద్దామని గత ఏడాదిగా మొత్తుకుంటున్నా విషయం కూడా గుర్తు వుండదు. "అవునా? కొందామన్నావా? ఎప్పుడూ" అని అమాయకం గా మోహం పెట్టి బోలెడు ఆశ్చర్య పడి పోతూ వుంటారు. అలా అని ఇలాంటి చిన్న చిన్న విషయాలని నేను పట్టించు కోననుకోండి . అదీ కాక ఇవన్నీ అందరి ఇళ్ళల్లోనూ సర్వ సాధారణం. కానీ కొన్ని మరపు రాని సంఘటనలు వున్నాయి.

ఎపిసోడ్ - 1

మా పెళ్ళయిన కొత్తల్లో కలకత్తా లో ఒక ఆరు నెలలు ఉండవలసి వచ్చింది. అసలే భాష రాని ప్రాంతం. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చినంత హిందీ కూడా రాదు. మేము ఒక తెలుగు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ లు గా వుండే వాళ్ళం. ఆ రోజుల్లో సినిమా కి వెళ్ళాలంటే రోజంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించేది. అందుకే వెళ్ళిన రోజునే రెండు మూడు సినిమాలు చూసేసి వచ్చే వాళ్ళం. ఒక రోజున నేను ఆయన, కలకత్తా బాగా తెలిసిన మేము అద్దెకుంటున్న వాళ్ళ అబ్బాయి ఒక పదమూడేళ్ళ వాడిని వెంట పెట్టుకుని వెళ్ళాము. ఆ కుర్రాడికి వూరు బాగా తెలుసు. వాడి పేరు శివ. ఖిద్దర్ పూర్ దగ్గర ట్రాం ఎక్కి ధర్మ తల్లా దగ్గర దిగాము. అక్కడ సరిగా గుర్తులేదు గానీ, జవహర్ లాల్ రోడ్డో ఏదో దాట వలసి వచ్చింది. మా ఆయన గజానికో అడుగు వేసేస్తూ, ఈగ లాగ జూమ్ అని రోడ్డు దాటేసారు. నేను శివ చెయ్యి పట్టుకుని, రోడ్డు అంతా ఖాళీ అయ్యేదాకా ఆగి మెల్లగా రోడ్డు దాటాను. నేను చెయ్యి పట్టుకోక పోతే, వాడు కూడా దాటేసే వాడేమో. ఇద్దరూ వెళ్లి పోతే, నా గతేమిటి? అందుకే వాడి చెయ్యి గట్టిగా పట్టుకున్నా. నిజం చెప్పాలంటే, బెంగాలీ వాళ్ళు చాలా సహాయ పరులు. భాష రాక పోయినా, వాళ్ళు ఆఫీసు కి వెళ్ళడం మానేసైనా మనల్ని మన గమ్యం చేరుస్తారు. ఆ సంగతి అప్పట్లో తెలియదు లెండి. మా ఆయనకి మతి మరుపు సంగతి కూడా తెలియదుగా మరి. అయినా నా జాగ్రత్తలో నేనున్నాననుకోండి. మేమిద్దరం రెండో వైపు చేరి మా ఆయన కోసం చూసాము. ఆయన కనిపించ లేదు. ఒక పది నిముషాలు ఎదురు చూసాము. ఎక్కడా కనిపించలేదు. కొంప దీసి మాకోసం మళ్ళీ అటువైపు వెళ్ళే రేమో అన్నాడు శివ. అమ్మో, కావిలిస్తే ఆయన్నే ఇటు రానీ, మనం మాత్రం వెళ్లొద్దు అన్నా. సరే అన్నాడు. మరో అయిదు నిముషాలు చూసి ఇక లాభం లేదు. మనం వెళదామనుకున్న సినిమా హాల్ కి వెళ్ళారేమో చూద్దామని బయలు దేరాము. పది నిముషాలలో నడిచి ఒక హాల్ కి వెళ్ళాము. అక్కడ అంతా వెదికాము ఆయన దొరక లేదు. మరో అయిదు నిముషాల దూరం లో మరో హాల్ కి వెళ్ళాము. అక్కడా దొరక లేదు. మూడవ హాల్ కి వెళ్ళాము. ఇవన్నీ మా అదృష్టం కొద్దీ దగ్గర దగ్గర గానే వున్నాయి. ఒక పక్క గాభరా. మరో పక్క ఆకలి. పెద్ద ఎండగా లేదు కానీ చాలా దాహం గా వుంది. ఇక ఎక్కడ వెదకాలో మాకు అర్ధం కాలేదు. ఇలా లాభం లేదని ఎక్కడ మేము రోడ్డు దాటేమో, అక్కడికే వెళ్లి నుంచున్నాము. అక్కడ మరో పావుగంట ఎదురు చూస్తూ నించున్నాము. కొంత సేపటికి ఆ ప్రక్కనే వున్న వెస్పా (బజాజ్) షో రూం లోంచి ఈ యన చిరునవ్వులు చిందిస్తూ ఈవతలికి వచ్చారు.
"ఎక్కడి కి పోయారు ఇంతసేపూ" అన్నాను గాభరాగా.
రోడ్డు దాటగానే, "ఈ షో రూం లో దూరా..మంచి వెస్పా కొత్త మోడల్ వచ్చింది. దాని డిటైల్స్ వింటూ వుంది పోయా.. మీ ఇద్దరూ నాతో వచ్చారన్న సంగతి మర్చిపోయా" .. అన్నారు.
చెప్పొద్దూ, నాకు రెండు మొత్తాలని అనిపించింది. మేమిద్దరమూ, పిచ్చి వాళ్ళల్లా రోడ్డు రోడ్డూ వెతుకుతూ వుంటే, హాయిగా, ఎయిర్ కండి షండు షో రూం లో స్కూటర్ చూస్తున్నానని చెపితే మీకైనా ఎలా వుంటుంది చెప్పండి.
శివ గాడు పకపకా నవ్వేసాడు. చిన్న కుర్రా డైనా పాపం మంచి వాడు. ఆ తరువాత రెస్టారెంట్ కి వెళ్లి కావలిసినవి తిని.. ఓ రెండో మూడో సినిమాలు చూసి రాత్రికి ఇల్లు జాగ్రత్తగా చేరుకునే వరకూ ఆయన చెయ్యి వదలకుండా పట్టుకున్నాను. అది వేరే సంగతి అనుకోండి.
ఎపిసోడ్ -2.

కలకత్తా నుంచి వచ్చేసాకా మరో సంఘటన జరిగింది.. ఈయన తో బాటు మరైన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరికీ రిజర్వేషన్ కావలిసి వచ్చినా మా ఆయన దగ్గరికి వచ్చేవారు. కలకత్తాలో పరీక్షలకి వెళ్ళేవారు, బొంబాయి వుద్యోగం కోసం వెళ్ళే వారూ, ఇలా వారానికి ఒకరికైనా రిజర్వేషన్ చేయించి, స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఆఖరి కంపార్ట్మెంట్ కనిపిస్తున్నంత దాకా చేతులు ఊపుతూ వుండే వారు.

కుటుంబం అంతా కలిసి ఆరు నెలలకి ఒకసారైనా తిరుపతి వెళ్తూ వుండే వాళ్ళం. అలానే ఒక సారి కుటుంబం అందరం తిరుపతి వెళ్ళాము. తిరిగి వస్తున్నప్పుడు, మద్రాస్ వెళ్లి (ఇప్పుడు చెన్నై అనుకోండి) అక్కడ విశాఖ పట్టణం వెళ్ళడానికి కలకత్తా మెయిల్ ఎక్కాము. తెల్లవారే సరికి విజయవాడ వచ్చాము. బహుశా పొద్దున్నే అయిదు అయి వుంటుంది. విజయ వాడ స్టేషన్ లో పొద్దున్నే వేడి వేడి ఇడ్లీలు బాగుంటాయని రైల్ దిగిపోయారు మా ఆయన మా మరిది తో కలిసి. ఎలాగా ఇంజను మార్చడం వలన అరగంట దాకా అక్కడ ఆగుతుంది, ఫరవాలేదు లే అనుకున్నాము. పావు గంటలో మా మరిది తిరిగి వచ్చాడు.
"అన్నయ్య ఏడిరా?" అని అత్తయ్యగారు అడిగారు.
"ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే, మాట్లాడుతున్నాడు" అన్నాడు.
అరగంట తరువాత ట్రైన్ కదిలి పోయింది పోయింది. మా ఆయన రాలేదు. కను చూపు మేర స్టేషన్ లో ఎక్కడా కనిపించ లేదు. అసలే ఫస్ట్ క్లాసు లో ఉన్నామేమో, అది ఇంచుమించు డ్రైవర్ పక్క కంపార్ట్ మెంట్ అనుకుంటా. అసలే మా అత్తగారికి చాలా భయం. ఇక అందరికీ గాభరా మొదలయింది. ఈయన ఎక్కడ ఉండి పోయారో తెలియదు. సాధారణం గా జేబులో ఎక్కువ డబ్బులు కూడా వుంచుకోరు. "అయ్యో ఇప్పుడెలాగా" అని అత్తయ్య గారు గాభరా పడి పోయారు. చైన్ లాగండి అంటూ మా మావగారి తో గొడవ పెట్టారు.
"అక్కర లేదు, మగవాడే కదా, వాడే వచ్చేస్తాడు." అన్నారు మా మావగారు ధీమాగా.
"టికెట్ ఉందా వాడి దగ్గర? " అని నన్ను అడిగారు అత్తయ్యగారు.
"లేదు నా పర్స్ లో ఉంది" అనను గతుక్కుమని, దిగులుగా.
"ఏమీ ఫర్వాలేదు.. నా కొడుకు వాడు, ఎలా అయినా వచ్చేస్తాడు, నా పేరు చెప్పుకుని" అని మళ్ళీ మా మావగారు ధీమాగా.
నాకు కూడా మా మావగారి మీద ఆయన పదవి మీదా నమ్మకం ఉంది కానీ, కొంచం భయం వేసింది. తెల్ల వారు ఝాము చీకటిలో, ఏమి జరిగిందో , తలుచు కుందుకి భయం వేసింది.
మెయిల్ చాలా స్పీడ్ గా వెళ్తోంది. మాకు గాభరా కూడా తగ్గలేదు. మరో అరగంటకి ఏలూరు స్టేషన్ లో అనుకుంటా ట్రైన్ ఆగింది. ఆగిన మూడు నిముషాలకి చిరు నవ్వులు చిందిస్తూ మా అయన, మా కంపార్ట్ మెంట్ దగ్గరికి వచ్చారు. బ్రతుకు జీవుడా అనుకున్నాము. ఆయన లోపలి రాగానే, మా అత్తగారు, మా కాబిన్ తలుపులు గడియ పెట్టేసారు, మళ్ళీ ఆయన దిగిపోకుండా. నాకైతే నవ్వు వచ్చింది, ఆయనేమైనా చిన్న పిల్లవాడా అని. అదే మాట అత్తయ్యగారితో అన్నాను. నావైపు చూసి నవ్వి, ఇంతకీ ఎక్కడికి పోయావు అని నిల దీసారు ఆయన్ని.
"మా సీనియర్ కనిపించాడు, వాడి తో మాట్లాడుతూ నించున్నాను. వాడు మాట్లాడుతూ వుండగా ట్రైన్ కదిలింది. నేను వాడికి అలవాటు ప్రకారం హ్యాపీ జర్నీ అని చెప్పేసి అక్కడ నుంచుని చేతులు ఊపుతున్నా. వాడు నాకేదో సైగలు చేస్తున్నాడు. కానీ నాకు వినిపించలేదు. గార్డ్ కంపార్ట్ మెంట్ వచ్చేసరికి నేను కూడా ఇదే ట్రైన్ ఎక్కాలి అని గుర్తుకు వచ్చింది. అప్పుడు అర్ధం అయింది మా సీనియర్ నాకు ట్రైన్ ఎక్కి ఏమిటి చెప్పాలని ట్రై చేసాడో. అప్పుడు గార్డ్ కంపార్ట్మెంట్ ఎక్కేసి, గార్డ్ తో కబుర్లు చెబుతూ కూచున్నా" .
అలా జరిగినప్పటినుంచి, ఆయన ట్రైన్ టికెట్ ఆయన దగ్గర, నాది నా దగ్గర వుంచడం మొదలు పెట్టా.

ఎపిసోడ్ - 3.

మరొకసారి ఏమి జరిగిందనుకున్నారు,
మా ఇంటిలో ఎప్పుడు చూసిన ఇల్లు గోడలు మార్చడమో, మరో రెండు గదులు పెంచడమో, మేడ మీద గదులు వేయడం, లేక పక్కనే వున్న మా ఆడబడుచు గారి స్థలం లో ఇల్లు కట్టడం, ఇలా ఎప్పుడూ ఏవో ఒక కట్టడం పనులు జరుగుతూ ఉండేవి. మా ఆయన చాలా సందడిగా తిరుగుతూ పనులు చూసుకునే వారు. హార్డ్ వేరు షాపులకి వెళ్లి క్వోటేషణ్ లు పట్టుకురావడం వాటిల్లో హడావిడిగా తిరిగే వారు. అప్పట్లో హెల్మెట్ తప్పకుండా వేసుకోవాలని కొన్నాళ్ళు రూలు కొత్తగా వచ్చింది. అప్పట్లో సంవత్సరం లో ఒక నేల పోలీసు వాళ్ళుహెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుని ఫైన్ వేసే వారు. మా ఆయన ఒక రోజు స్కూటర్ తీసుకుని, హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ మీద ఒక హార్డ్ వేరు షాపుకి వెళ్ళారు. చాలా సేపు పోయాకా, హెల్మెట్ చేతిలో పట్టుకుని ఒక ఫ్రెండ్ తో వచ్చారు. అతను విదేశాలలో చాలా కాలం వుండి వచ్చాడు ట. కొత్త కారు కొనుక్కున్నాడుట. ఏవేవో కబుర్లు చెప్పారు. అతని కారులో ఏమేమి ఫీచర్లు వున్నాయి వగైరా వగైరా చాలా చెప్పారు. అతను కాసేపు కూర్చుని, మేము చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి బయలు దేరాడు. మా ఆయన చక్కగా టా టా బై బైలు చెప్పారు. మేము కూడా కారు చూద్దామని వీధిలోకి వచ్చాము. కారు చాలా బాగుంది. ఇంతలో మా ఇంటిముందు ఉండ వలసిన స్కూటర్ లేదని నేను గ్రహించాను.
"మన స్కూటర్ ఏది?" అని ఆయన్ని అడిగా.
"స్కూటర్ ఏమిటి? నేను కారులో వచ్చా" అన్నారు గొప్పగా ఆయన.
"మీ స్నేహితుణ్ణి ఎక్కడ కలిసారు ?" అని అడిగా.
"పూర్ణా మార్కెట్ దగ్గర." అన్నారు చిరునవ్వుతో.
"మరి పూర్ణ మార్కెట్ కి ఎలా వెళ్ళారు?" అని అడిగా.
" స్కూటర్ మీద", అని నాలుక కరుచుకున్నారు.
"మరి స్కూటర్ ఏది? " అని అడిగా.
"పూర్ణ మార్కెట్ దగ్గర పెట్టి మర్చిపోయా, ఇదిగో మా ఫ్రెండ్ కనిపిస్తే, వాడితో కబుర్లు చెబుతూ కారులో వచ్చేసా" అన్నారు.
"చేతిలో హెల్మెట్ మాత్రం జాగ్రత్తగా పట్టుకు వచ్చేసారా?" అని అడిగా నవ్వుతూ.
"కనీసం హెల్మెట్ చూసైనా, మీ స్నేహితుడు కూడా స్కూటర్ గురించి అడగలేదా?" అని నవ్వా.
పాపం ఆయన స్నేహితుడు కూడా సిగ్గు పడి పోయి, ఫరవాలేదు లెండి, స్కూటర్ దగ్గర ది౦పేస్తా అని మళ్ళీ ఈయన్ని వెంటపెట్టుకుని పూర్ణా మార్కెట్ కి బయలు దేరారు.

ఎపిసోడ్ - 4.

మరొకసారి బొంబాయి మహానగరానికి వెళ్ళాము. అదే మొదటి సారి బొంబాయి వెళ్ళడం. ఇప్పుడది ముంబాయి గా మారింది. బంగాళా ఖాతం చూసినా ఏమీ అనిపించేది కాదు కానీ, అంతకు మించి వీ టీ, చర్చ్ గేటు చూస్తే కళ్ళు తిరిగేవి నాకు ఆ జన సముద్రం చూసి. మా స్నేహితులు కొందరు అంధేరీ లో వుండే వారు. మేము వి టీ కి దగ్గర హోటల్ లో వున్నాము. ఆయనా నేను చర్చ్ గేట్ కి వెళ్ళాము. అక్కడ అంధేరీ కి వెళ్ళడానికి రెండు టికెట్లు కొన్నారు. ముందు దాదర్ లో దిగి, సెంట్రల్ ప్లాట్ ఫారం కి మారి, అక్కడ మరో ట్రైన్ పట్టుకోవాలని నాకు చెప్పారు. నాకు సరిగ్గా అర్ధం కాక పోయినా, అలానే అని బుర్ర ఊపాను. ఎందుకు చెప్పడం, ఆయన చెయ్యి వదలను గా అని మనసులో అనుకున్నా. కలకత్తాలో జరిగిన అనుభవం మర్చిపోలేదుగా.
అప్పుడు మెల్లగా చెప్పారు. "ట్రైన్ చాలా రష్ గా వుంటుంది. ఆడవాళ్ళ కంపార్ట్ మెంట్ అయితే ఖాళీగా వుంటుంది, అందులో నువ్వు ఎక్కు, నేను మగవాళ్ళ దానిలో ఎక్కుతాను అన్నారు". గుండె గుభేలు మంది. పర్వాలేదు, "నేనూ మీతో వస్తాను అన్నా. ఈలోగానే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ఎక్కే జనం దిగే జనం చూసే సరికి గాభరా వచ్చింది. మేము ఎక్కడ ఎక్కాలా అని ఆలోచించే లోపే, అది కాస్తా వెళ్లి పోయింది. నేను వెర్రి మోహం తో చూసాను. ఆయన "మరేమీ ఫరవాలేదు. మరొకటి వస్తుంది. ఇప్పుడైనా ఆడ వాళ్ళ పెట్టెలో ఎక్కు. దాదర్ అనే స్టేషన్ లో దిగు. ఇక్కడి నుంచి అయిదోదో ఆరోదో " లెక్క చెప్పారు. ఒక్కొక్క స్టేషన్ పేరూ మూడు నాలుగు సార్లు చెప్పారు. అదేమైనా తెలిసిన ఊరా, ఆయన చెప్పిన ఒక్క స్టేషన్ పేరూ తెలియదు నాకు. దాదర్ , మూడే మూడు అక్షరాలు. నీకు తెలియక పోతే ఎవరినైనా అడుగు. పది నిముషాల్లో చేరిపోతాము, అని నాకు జాగ్రత్తలు చెపుతూ ఉండగానే మరో ట్రైన్ వచ్చింది. ఇది కొంచం ఖాళీ గానే వుంది. అయినా వినకుండా, నన్ను ఆడవాళ్ళ కంపార్ట్ మెంట్ లో ఎక్కించారు. సరే చేసే దేముంది ఎక్కి కూర్చున్నా. వెంటనే కదిలింది. చూస్తూ ఉండగానే కంపార్ట్ మెంట్ నిండి పోయింది. నేను చుట్టుపక్కల వున్న ఒక ఆవిడతో, దాదర్ లో నేను దిగాలని, వచ్చేముందు గానే కొంచం చెప్పమని ఇంగ్లీష్ లో చెప్పా. అందరూ నా మోహం చూసి, కొత్త దానినని పసిగట్టి, మరేం ఫరవాలేదు, కంగారు పడకు, నిన్ను ఎలానో ఆలా దింపే స్తామని నవ్వుతూ చెప్పారు. ఒక స్టేషన్ ముందుగానే దాదర్ నెక్స్ట్ స్టేషన్ అనీ, నన్ను కొంచం కొంచం గా ముందుకు తోసి డోర్ దగ్గరికి నన్ను చేర్చడానికి అందరూ కృషి చేసారు. చెప్పొద్దూ, నా కాళ్ళతో నడిచే పనే లేదు. తెలియకుండానే డోర్ దగ్గరికి చేరుకున్నా. దాదర్ వచ్చింది. కొన్ని క్షణాలు ఆగింది. ఆగగానే దిగేసి, ట్రైన్ కి కొంచం దూరం గా వచ్చి బాగా కనిపించేలా నించున్నాను. మా ఆయన మళ్ళీ నన్ను వెతుక్కో నవసరం లేకుండా. ట్రైన్ వెళ్ళింది. ప్లాట్ ఫారం మీద మనుషులు చాలా మంది వెళ్లి పోయారు.. మా ఆయన కనిపించలేదు. చచ్చేనురా దేముడా, ఈయన మళ్ళీ నన్ను మర్చిపోయి వేల్లిపినట్టున్నారు అనుకున్నా. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లు కూడా లేవుకదా. ఎలారా దేముడా అనుకున్నా. వెనక్కి వెళ్లినా హోటల్ కి సరిగ్గా చేరగాలనని నమ్మకం లేదు. అందులో బొంబాయి. చాలా భయం వేసింది. ఏమి చెయ్యాలో, ఎవరితో చెప్పాలో తెలియలేదు. కలకత్తాలో అయితే, కనీసం మా ఇంటివల్ల అబ్బాయైనా నా పక్కన వున్నాడు. వాడికి కలకత్తా అంతా బాగానే తెలుసు. ఇక్కడ ఎవరూ లేరు. దిక్కులు చూస్తూ, ఆయన వెనక్కి వస్తారేమోననే ఆశతో చూస్తూ నించున్నా. ఈ లోగా మరొక ట్రైన్ వచ్చింది. మరికాస్త జనం పోగయ్యారు. మరింత గోల.. ఈ జన సముద్రం లో ఈ యన ఉండడానికి అవకాశం లేదు కదా.. మేము ఎక్కినా ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈసారి దిగిన జనం కూడా హడావిడిగా చెల్లా చెదురై అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు చూసా ఆయన్ని. ఈ వచ్చిన రెండో ట్రైన్ లోంచి దిగి దొంగలా నావైపు చూస్తూ నవ్వుతూ నావైపు మెల్లగా నడుచుకుని వస్తున్నారు. నాకైతే అర్ధం కాలేదు.
" ముందు ట్రైన్ లో ఎక్కలేదా" అని అడిగా.
"ఎక్కాను, కానీ మర్చిపోయి దాదర్ కన్నా ఒక స్టేషన్ ముందు దిగిపోయా.. అమ్మ ఇది దిగలేదు అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ వుంటే, అక్కడ స్టేషన్ పేరు బోర్డ్ చూసా. మూడు అక్షరాలు కాకుండా చాలా పెద్ద పేరు కనిపించింది. 'ఎలి ఫిన్ స్టన్ రోడ్డు' అని. అప్పుడు అర్ధం అయింది ఒక స్టేషన్ ముందు దిగేసానని. అందుకే తరువాత ట్రైన్ పట్టుకుని వస్తున్నా" అన్నారు. బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక తమాషా చెయ్యాలా అని ఆయన మీద అరిచా... అరిచా అంతే.. కరవ లేను కదా.

Sunday, March 25, 2012

నందన నామ సంవత్సర శుభా కాంక్షలతో

ఈ రోజే ఉగాది, ఒక యుగానికి ఆది.
కావాలి ఒక నూతన జీవితానికి నాంది.
వినడానికి తయారవండి నా సోది,
తప్పించుకోలేము కదా విధి.


ఉగాది పచ్చడి చెయ్యలా?
మామిడి పిందెలు తేవాలా?
వేప పూవు లేదు ఎలా?
ప్రతీ ఏడూ అమెరికాలో ఇదే గోల.

ఫ్రోజన్ మామిడి ముక్కలతో కూడా
వెయ్యనా మెక్సికన్ బెల్లం గుండ
చక్కర వ్యాధి తలిస్తే గుండె దడ
ఎందుకు ప్రాబ్లం అని వేసా స్ప్లెండా.


ఉగాది పచ్చడి చేస్తూ వుంటే,
వేప పూవు లేదని వాపోతూ వుంటే,
మెంతులు వేస్తే పోలే అంటే
నవ్వుతారు ఎవరైనా వింటే..


కాకర కాయ కూడా చేదే
వెయ్యకూడదని రూలేం లేదే
అంతకన్నా ఏమీ తోచలేదే
ఏదైనా తినడం మాత్రం బాధే


ఉగాది పచ్చడి తినరా కన్నా
తప్పదు కదా బ్రతిమాలుతూ అన్నా
డాలరు ఇస్తా లంచంగా నాన్నా
వినడానికి చంటాడా వాడేమైనా


ఏదిరా నాన్నా చెయ్యి పట్టు,
అనగానే చూసాడు ఎందుకన్నట్టు,
చూపించా ఉగాది పచ్చడి కన్నట్టు .
అంతే, మరు నిముషం పరుగు పెట్టు.


పచ్చడి తినడమే పండాగా?
అలా అనుకోవడం దండగా?
తోచాయి తలపులు మెండుగా
గుచ్చాను అనుభవాలు దండగా


చేసేసా చైనా పింగాణీ గిన్నెలతో
మెక్సికన్ చింతపండు మగ్గుతో
అమెరికన్ ఆపిల్ పండ్లతో
అంతర్జాతీయ పచ్చడి మంచి రుచితో


ఎంతో మంది కన్నా సుఖంగా
బ్రతుకుతున్నందుకు తృప్తిగా.
భగవంతునికి కృతజ్ఞతగా
నైవేద్యం పెట్టేసా ఎంతో భక్తిగా,


ఏమి చేసాను ఇన్నాళ్ళూ ?
ఆలోచిస్తూ కోరుకున్నాను నా గోళ్ళు,
తిప్పాను గుండ్రంగా నా కళ్ళు.
తిరిగాను అరిగేలా రెండు కాళ్లు


పల్లె పడుచుగా పుట్టించిన దేముడు
అమెరికా దేశం తెచ్చి పడేసాడు
పూర్వజన్మ లో చేసిన కర్మ ఆనాడు
అనుభవిస్తున్నాను ఇక్కడ ఈనాడు.


చేసాను చాలా చాలా ఒప్పులు.
పొందేను ఎందరెందరి వో మెప్పులు
చెప్పుకోవాలని వుంది బోలెడు గొప్పలు
అయినా తప్పవేమో కొన్ని ముప్పులు


పట్టేను చాలా మందికి కాకా,
సాధించిన దేమిటి నిన్నటి దాకా,
ఉంటానో లేదో రేపటి దాకా
ఎంజాయ్ చేసేస్తా అందాకా.


అందరికీ నందన నామ సంవత్సర శుభా కాంక్షలతో,

Monday, March 19, 2012

నేను, నా డ్రైవింగ్ లైసెన్సూ ...

నేను, నా డ్రైవింగ్ లైసెన్సూ ...

మీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉందా? అదే, వుండే వుంటుంది లెండి. ఈ డ్రైవర్స్
లైసెన్స్ లేందే అమెరికాలో చాలా పనులు జరగవు. ఇది కేవలం కారు నడప దానికే కాదు
కదా. ఈ అమెరికాలో మన దైనందిన కార్యకరంమాల్లో అది చూపందే చాలా పనులు జరగవు.
క్రెడిట్ కార్డు తో సామాన్లు కొనాలంటే కొన్ని షాపుల్లో చూపించాలి, ఓ విమానం
ఎక్కి మరో వూరు వెళ్ళాలన్నా డ్రైవర్స్ లైసెన్సు ఉండాల్సిందే. కాకపోతే పాస్
పోర్ట్ పట్టుకుని వెళ్ళ వచ్చనుకోండి.

నేను ఇండియా లో వునప్పుడే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కానీ అంతగా ఎక్కువ
డ్రైవ్ చేసే పని పడ లేదు. ఎప్పుడూ డ్రైవర్ ఉండేవాడు. ఏదో సరదాగా నేర్చుకున్న
గాని, ఒక్కర్తిని ఎక్కడికి కార్ వేసుకుని వెళ్ళలేదు. మా డ్రైవర్ కి మా ఆయన
ఆర్డర్ వేసారు, నాకు డ్రైవింగ్ నేర్పమని. అతను బాగానే నేర్పాడు ఓ రెండు
రోజులు. అసలు నాకు డ్రైవర్స్ లైసెన్స్ అవసరం ఇండియా లో లేదు. ఎప్పుడూ డ్రైవర్
వుండే వాడు. లేకపోతె మా ఆయన డ్రైవ్ చేసేవారు. అయితే నాకే ప్రాక్టీసు
చెయ్యడానికి టైం దొరకలేదు. అయితే డ్రైవర్స్ లైసెన్సు కోసం మాత్రం వైజాగ్ లో
టెస్ట్ కి వెళ్ళా. మా ఆయనే డ్రైవ్ చేసి అక్కడి దాకా తీసుకుని వెళ్ళారు.

అదొక పార్క్ లాగా వుంది. పార్క్ అంటే పార్క్ అనలేము. జీ భూతాల్లాంటి చెట్లతో
ఒక అడవి లాగా వుంది. ఆ పార్క్ లోనే డ్రైవింగ్ టెస్ట్ జరిగే చోటని ఒక బ్రోకేర్
చెప్పాడు. ఆ పార్క్ కి రెండు ఎంట్రన్సు లు వున్నాయి. ఒకటి పెద్ద ఇనప గేటు
గొలుసులతో బంధించేసి వుంది. రెండవది చిన్న గేటు. దానికి అడ్డంగా పెద్ద లారి. ఆ
పార్క్ చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసాము. కానీ కార్ తో ఎలా లోపలి వెళ్ళాలో
తెలియలేదు. ఇక లాభం లేదని కార్ లారి పక్కనే పార్క్ చేసి, ఇద్దరం కార్ దిగి
లోపలి నడిచి వెళ్ళాము.

కార్ లోపలి తీసుకు వెళ్ళ కుండా డ్రైవర్స్ లైసెన్సు టెస్ట్ ఎలా చేస్తారో నాకైతే
అర్ధం కాలేదు. లోపలకి వెళ్ళాకా అక్కడ రెండు కుర్చీలు ఒక బల్ల ముందు ఇద్దరు
కూర్చున్నారు. మిగతా ఒక యాభై మంది గుంపులు గుంపులు గా నులుచుని వున్నారు.
అక్కడ ఒకే ఒక కార్ వుంది. ఒకరి తరువాత ఒకరు ఆ కార్ లో ఎక్కి ఓ యాభై గజాలు
ముందుకి వెళ్లి యాభై గజాలు వెన్నక్కి వచ్చి దిగి పోతున్నారు. దిగగానే ఆ
కుర్చీలలో కూర్చున్న వారి దగ్గరికి వెళ్లి వంగి, ఏదో మంతనాలాడి దణ్ణాలు
పెట్టి, ఏవో కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కార్ ముందుగా ఎక్కేటప్పుడు
వారి మోహం లో వున్న ఆందోళన, వారి దగ్గర కాగితం తీసేసుకోగానే పోయి, భుజాలు
విరుచుకుని, ఆనందంగా వెళ్లి పోతున్నారు. నాకు అర్ధమయింది, ఆ కుర్చీల్లో
కూచున్న వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఆఫీసర్లు అని. ఎవరూ కూడా ఏడుపు మోహం
పెట్టుకుని లేరు. అందరూ ఆనందంగానే వెళ్లి పోతున్నారు. నాకు కొంచం ధైర్యం
వచ్చింది. నాకూ కూడా వచ్చేస్తుందేమో నని ఆశ. మా కార్ తప్ప నాకు మరో కారు
నడపగలనా అని కొంచం సందేహం వచ్చింది. మాదేమో ఎస్టీం వి ఎక్ష్ లేటెస్ట్ మోడల్
(అప్పట్లో). ఇక్కడ చూస్తే పాత డొక్కు ఎ౦బా సిడర్. ఒక వ్యక్తి డ్రైవర్ సీట్
కాకుండా పక్కన సీట్ లో కూర్చుని వున్నాడు. అతను చాలా సీరియస్ గా వున్నాడు.
డ్రైవ్ చేసే వ్యక్తీ దిగగానే, అతనూ దిగి కొంచం దూరంగా నించుని వుంటే,
ఒక్కొక్కరూ అతని దగ్గరకి వెళ్లి ఏదో మాట్లాడుతూ వున్నారు. అతను కార్ ఓనర్ అని
నాకు అనిపించింది. బహుశా ఆ కార్ అందరికి అద్దెకి ఇచ్చినట్టు ఇస్తాడేమో మరి. మా
ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్లి ఏదో అన్నారు. అతను తల వూపేడు. కార్ బహుశా, నేను
డ్రైవ్ చెయ్యడానికి అతన్ని ఒప్పించి వుంటారు అనుకున్నా. నేను అనుకున్నదే నిజం
అయింది.

నేను మా ఆయనతో మెల్లగా అడిగాను "ఈ డొక్కు కార్ నేను డ్రైవ్ చెయ్యగలనా" అని.
"నువ్వేమీ భయపడకు. ఏమీ పరవాలేదు. తప్పకుండా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతావు"
అన్నారు. " పాస్ అవకపోతే " అన్నాను భయంగా. " అలా జరగదు, పాస్ అవుతావు, నేను
చెబుతున్నాగా" అన్నారు చిరు నవ్వుతో. చెప్పొద్దూ, నాకు నా డ్రైవింగ్ మీదే అంత
నమ్మకం లేదు, మా ఆయనకి నా మీద వున్న నమ్మకానికి చాలా మురిసిపోయాను.
ఒక అర డజన్ మంది తరవాత నా వంతు వచ్చింది. కొంచం భయం భయంగా వెళ్లి కార్ లో
కూర్చుని వున్నాను. అది ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ కాదు. అప్పటికి ఇండియా లో
ఇంకా రాలేదనుకుంటా. సీలో కార్ వచ్చింది కానీ, ఏదైనా ప్రాబ్లం వస్తే, అది
రేపైర్ చెయ్యడానికి మనుషులు దొరకరు అని చెప్పారు. అందుకే స్టిక్ షిఫ్ట్ కార్
డ్రైవింగ్ నేర్చుకున్నా. ఏదైనా ముందు, దాని క్లచ్, గేర్, ఆక్సిలి రే ట ర్ అవీ
చూసుకునే లోగానే, కార్ దానంతట అదే నడవటం మొదలు పెట్టింది. నేనైతే, క్లచ్ గానీ,
గేరు కానీ మార్చలేడు. కార్ దానంతట అదే పుష్పక విమానం లా ముందుకు వెళ్ళడం మొదలు
పెట్టింది. నేను చాలా కంగారు పడ్డా. ఈ లోగా నా పక్కన వున్న వ్యక్తీ, అదే కార్
ఓనర్ అని చెప్పా కదా, తల వెనక్కి తిప్పి చూడండి అన్నాడు. నేను బుర్ర వెనక్కి
తిప్పేనో లేదో, కార్ వెనక్కి వెళ్లడ౦ మొదలు పెట్టింది. గాభరాగా, నా పక్క
వ్యక్తి వైపు తల తిప్పి చూసా. అప్పుడు తెలిసింది , నా పక్కన వున్న వ్యక్తీ
చేతిలో మరో స్టీరింగ్ వున్నట్టు, అతనే కార్ కంట్రోల్ చేస్తున్నట్టూ. నాకైతే
నవ్వు ఆగలేదు. పక పకా నవ్వడం మొదలు పెట్టా.. నా పక్కన వున్న వ్యక్తీ గాభరా
పడ్డాడు. అయ్యో నవ్వకండి, నవ్వకండీ ప్లీజ్, తల వెనక్కి తిప్పి వెనక్కి చూడండి
అన్నాడు. నవ్వుతూనే, తల వెనక్కి తిప్పా, ఓ యాభై గజాలు వెనక్కి వెళ్లి కార్
ఆగింది. దిగండి అన్నాడు. దిగగానే, కుర్చీల లో కూర్చున్న వ్యక్తుల దగ్గరికి
వెళ్ళగానే, వాళ్ళు టెస్ట్ పాస్ అయ్యానని కాగితాల మీద సంతకం పెట్టేసి,
డ్రైవర్స్ ఇచ్చేసారు. మా ఆయన అంత నమ్మకం గా నేను టెస్ట్ పాస్ అవుతానని ఎలా
చెప్పసారో ఇప్పుడు అర్ధం అయింది. నా మీద నమ్మకం కాదు, ఆ కార్ డ్రైవర్ మీద
వున్న నమ్మకం తో అని. అయితే, నేను ఎక్కవ డ్రైవ్ చేసే అవసరం ఇండియాలో పడనే
లేదు. కనుక అసలు అలవాటు పడనే లేదు, ఇంతలోనే అమెరికా వచ్చేసాము.

ఇక అమెరికా కి వచ్చాకా ఆ ఇండియా లైసెన్స్ పనికి రాదుగా. అసలే అంతంత మాత్రం
ప్రాక్టీసు, ఆ పైన ఇక్కడ రైట్ హాండ్ డ్రైవ్. ఇక్కడికి వచ్చాకా కొంచం స్థిర పడ
దానికి కొంచం టైం పడుతుందిగా. ఆయన చాలా సార్లు అప్పటికే అమెరికా రావడం వలన,
వచ్చినప్పుడు ఎప్పుడో డ్రైవర్స్ లైసెన్స్ తీసేసుకునారు. ఇక నా ముందు ఒక
పుస్తకం పడేసి, అది బాగా చదువు, నిన్ను టెస్ట్ కి తీసుకుని వెళ్తా అన్నారు. ఒక
ప్రక్క వుద్యోగం, ఆపైన ఇంట్లో పని, శని ఆదివారాలు కంప్యూటర్ ట్రైనింగ్
క్లాసెస్ అస్సలు ఊపిరి ఆడేది కాదు. వాటి మధ్యనే కొంచం టైం చూసుకుని, ఆ పుస్తకం
నాలుగైదు సార్లు చదివా. ఒకరోజు, మా ఆఫీసు దగ్గరికి వచ్చి మావారు నన్ను
డ్రైవర్స్ లైసెన్స్ ఆఫీసుకు తీసుకుని వెళ్ళారు. టెస్ట్ రాసాను, వెంటనే పాస్
అయ్యాను. ఒక కార్డు ముక్క నా ముఖాన పడేసి, మూడు నెలల లోపు డ్రైవింగ్ టెస్ట్ కి
రమ్మన్నారు. సరే నని వచ్చేసా. వారం తిరక్కుండా, మా ఆయన, పడ డ్రైవింగ్ టెస్ట్
కి అన్నారు. అదేమిటి, నేను ప్రాక్టీసు చెయ్యందే అన్నా. పరవాలేదు. ఇండియాలో
కొంచం నేర్చుకున్నావు కదా అన్నారు. సరే నని నేను ఆఫీసు లో చెప్పేసి బయలు దేరా.
ఇక్కడ కూడా, ఇండియా లో లాంటి పద్దతి ఏమైనా ఉంటుందేమో అనుకున్నా. కానీ అలాంటి
పప్పులు ఏమీ ఇక్కడ ఉడకవు అని తెలిసింది. అప్పటికి నేను పెరలేల్ పార్కింగ్ కూడా
నేర్చుకోలేదు. డ్రైవింగ్ చేస్తూ, స్టాప్ సైన్ దగ్గర ఆగా. ఆగి వెంటనే కార్
పోనిచ్చా. సడన్ గా కార్ పక్కకి తీయమని చెప్పింది. ఎందుకో నాకు అర్ధం కాలేదు.
ఆపాక, నన్ను దిగమని, పక్కన కూర్చోమని చెప్పి, తాను డ్రైవ్ చెయ్యడం మొదలు
పెట్టింది. నా ఉద్దేశం లో బాగానే చేసాను. కానీ ఆ ఇన్స్పెక్టర్ నన్ను ఫెయిల్
చేసింది. నీకు అసలు కార్ మీద కంట్రోల్ లేదు. స్టాప్ సైన్ సరిగ్గా ఆగలేదు అంది.
"ఆపానుగా?" అన్నాను ఆశ్చర్యం గా. ఆపడం అంటే ఉత్తినే ఆపడం చాలదు. ఎటువేపైనా ఇతర
వాహనాలు వస్తున్నాయేమో చూడాలి అని చెప్పింది. నాకైతే, జీవితం లో మొదటిసారి
పరీక్ష ఫెయిల్ అయ్యానేమో, చాలా సిగ్గేసింది.
ఇంటికి వచ్చి ఛడామడా మా అయన మీద అరిచాసా.. నాకు సరిగా డ్రైవింగ్ నేర్పకుండా
టెస్ట్ కి తీసుకుని వెళ్తావా.. అంటూ. మా ఆయన నవ్వేసి, ఏమి పోయింది. ఇంకా రెండు
నెలల పైన టైం వుంది కదా.. మళ్ళీ వెళ్ళొచ్చు లే అన్నారు. నేను ఇంక వెళ్ళను అని
కోపం గా అరిచేసా.
రెండు నెలలూ తెలియ కుండానే గడిచిపోయాయి. ఒక ఆదివారం కాబోలు, ఓ అరగంట పారేలేల్
పార్కింగ్ నేర్పించారు. అంతే అంతకన్నా నేర్చుకోనే లేదు పద టెస్ట్ కి ఒక
శుక్రవారం మూడు గంటలకి అన్నారు. ఇక నాలుగు రోజుల్లో ఆ టెస్ట్ లైసెన్స్ టైం
అయిపోతోంది. వెళ్తే, ఈ నాలుగు రోజుల్లో వెళ్ళాలి, లేదా, మళ్ళీ డ్రైవర్స్
టెస్ట్ రాయాలి. రోజూ ఎక్కడికి వెళ్ళినా ఆయనే కారులో తీసుకుని వెళ్ళే వారు.
నన్ను మాత్రం కార్ ముట్టుకో నిచ్చేవారు కాదు. ఏమైనా అంతే, నీకు లైసెన్స్ లేదు
అని దబాయించే వారు.
సరే తప్పదు కదా అని టెస్ట్ కి వెళ్ళా. అక్కడ వాళ్ళ రికార్డు దొరక లేదు. అసలు
నీది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ పరీక్ష రాయి అన్నారు. నేను నా దగ్గర వున్న
కార్డు చూపించి , ఇంకా నాలుగు రోజులు వుంది అన్నా. ఇక ఏమి చెయ్యాలో తెలియక,
పాత రికార్డు లు అన్నీ తిరగేసి నా కార్డు పట్టుకున్నారు.
ఆ టైం లో ఎందుకో పారలెల్ పార్కింగ్ చెక్ చెయ్యలేదు. క్రితం సారి ఏ వీధిలో
తిరిగానో అదే వీధి మళ్ళీ పట్టుకుని వెళ్ళింది ఈ సారి ఇన్స్పెక్టర్. నేను
జాగ్రత్తగానే డ్రైవ్ చేసానని అనుకున్నా. కార్ ఆపేక నా పక్కన కూర్చున్న ఇన్స్పెక్టర్
నా వైపు జాలిగా చూసింది. గుండెల్లో రాయి పడింది. " నిన్ను పాస్ చేస్తున్నాను.
కానీ నీకు కార్ మీద ఇంకా కంట్రోల్ లేదు, జాగ్రత్తగా నడుపు' అని చిన్న
వార్నింగ్ ఇచింది. అలానే అని తల ఊపా.
ఎలా అయితేనేం నాకు డ్రైవర్స్ లైసెన్స్ ఈ దేశం లో కూడా వచ్చింది. కానీ మా వారు
నన్ను డ్రైవ్ చెయ్యనిస్తే గా.. పై వూళ్ళో ప్రాజెక్ట్ వచ్చి నా అంతట నేను
రెంటల్ కార్ తీసుకున్నాకా నేను సొంతం గా డ్రైవ్ చెయ్యడానికి కుదర లేదు.
కార్ తీసే ముందు ఒక సారి, , గమ్యం చేరుకున్నాకా, నేను క్షేమంగా చేరినట్టు
మరొకసారి ఫోన్ చెయ్యక పోతే, ఆయన ఇప్పటికీ ఊరుకోరు. ఆయనకి నా డ్రైవింగ్ మీద అంత
నమ్మకం మరి.. ఏం చెయ్యను?

Friday, June 24, 2011

అమెరికాలో ఆవకాయ

అమెరికాలో ఆవకాయ ఏమిటి అనుకుంటున్నారా ? అంటే, నేను అమెరికా వచ్చాకా ఆవకాయ పెట్టడం గురించి చెప్పాలని నా ఉద్దేశం . వచ్చిన కొత్తలో అమెరికన్ గ్రోసరీ షాపులే కాక ఇండియన్ గ్రోసరీ కూడా ఉంటాయని ఒక నెలలోనే తెలిసిపోయింది
నాకు . అప్పటికే ఐస్ క్రీంలు, ఫ్రూట్ జ్యూస్లూ సరదాలు తీరిపోయి, నాలుక చచ్చిపోవడం తో , ప్రియా వాళ్ళ గోంగూర పచ్చడి , ఆవకాయా వగైరాలు అర డజను రకాల పచ్చళ్ళు కొనేసుకున్నా. కొన్నాళ్ళు పోయాకా , ఆ ఆవకాయ ఏదో నేను ఎందుకు పెట్ట కూడదు అనిపించింది.

ఎండా కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి . మండే ఎండల్లో మనసుకు నచ్చేవి మల్లెపువ్వులు, మామిడిపళ్ళు. అదేలెండి , వాటితో బాటు కొత్త ఆవకాయ.


కిందటేడాది ఏమయిందంటే, హాంగ్ కాంగ్ మార్కెట్ కి ముందు వెళ్ళా, అక్కడ కార్ పార్క్ చెయ్యడానికి తల ప్రాణం తోకకి వచ్చింది. అమెరికా ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది అందరూ అంటున్నారు కానీ, ఈ చైనీస్ మార్కెట్ కి వస్తే, కొంచం అది అబద్దమేమో అని పిస్తుంది. సగం చైనా అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. అంటే నాకు చైనా, జపాను, వియత్న మీస్ వగైరా చుట్టుపక్కల దేశాల మనుషులంతా ఒక లాగే కనిపిస్తారు. అదే, పాకిస్తాను, బంగ్లా దేశ్, నేపాలు, శ్రీలంక దేశాల వాళ్ళు ఒక్కలా వున్నట్టు. బాస్కెట్ దొరకడం కూడా కొంచం కష్టం అయింది. మెల్లగా లోపలి వెళ్లాను. బాస్కెట్ పక్కన పెట్టి, కూరలు ఎంచుతున్నా.. ఈ లోగా ఒక చైనీస్ ఆమె ఒకరు నా వైపు చూసి , నవ్వుతూ ' కీ కాం ఛీ.. " అంటూ ఏదో అడిగింది. ఆవిడ ఏమందో నాకైతే అర్ధ౦ కాలేదు. ఏమంటే ఏమి అర్ధం చేసుకుంటుందేమో నని, ఏడవలేక నవ్వి నట్టు నవ్వాను. మరో సారి నా వైపు చూసి మళ్ళీ.. 'చింగ్ చాంగ్ యు యా" అంటూ అనేసి నా బాస్కెట్ కాస్తా పట్టుకుని పోయింది. నేను వెర్రి మొహం వేసుకుని, మళ్ళీ బయటికి వెళ్లి, మరో బాస్కెట్ వెతుక్కుని వచ్చా.. ఈ సారి ఎవరైనా దగ్గరికి వచ్చినా, వాళ్ళ మొహం లోకి చూడ దలుచుకో లేదు. అమెరికన్ సువర్ణ రేఖ మామిడి కాయలు లాంటివి కనిపించగానే, కొంచం నొక్కి చూసా. అవి పండినట్టు కనిపించలేదు. గట్టిగానే వున్నాయి. మరి ఆలోచించకుండా ఓ డజన్ మామిడి కాయలు తీసేసుకున్నా. కాయలైతే కొన్నా కానీ, అవి తరగడం ఒక పెద్ద గండం . ఇంటిలో వున్న నాలుగు కత్తులు, ఒక సుత్తి పట్టుకుని కూర్చున్నా. మరేమీ చెయ్యను? నా దగ్గర కత్తిపీట లేదు. ఒక వేళ వున్నా, చాకుతో తరగడం అలవాటు వున్న నాకు, కట్టి పీత తో అలవాటు లేక ఎప్పుడూ చెయ్యి కోసేసుకుంటా .. సుత్తి ఎందుకంటే, చాకుతో టెంక ఈజీ గా తరగ బడదుగా అందుకన్నమాట..

ఒక మామిడి కాయని తరిగా. మామిడి కాయ పయిన ఆకుపచ్చ చిన్న ఎరుపు రంగులతో గట్టిగానే వుంది కానీ తొక్క లోపల ముక్క పసుపు పచ్చగా వుంది. కొంచం అనుమానం వచ్చి చిన్న ముక్క రుచి చూసా. తియ్యగా పంచదార లాగా వుంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇండియాలో అయితే, పండిన సువర్ణ రేఖ కూడా కొంచం టెంక దగ్గర పుల్లగానే వుంటుంది కదా. మరొకాయ కూడా కోసి, రుచి చూసి, ఇక లాభం లేదని మిగతా కాయలు పండ బెట్టడానికి, పక్కకు పెట్టేసా.
మరో రెండు రోజులు పోయాకా, వీలు చూసుకుని, ఇండియా గ్రోసురీస్ కి వెళ్లి, అక్కడ పుల్ల మామిడి కాయలు కావాలంటే , కొన్ని చచ్చు పుచ్చులు గా వున్న మామిడి కాయలు చూపించాడు. అనుమానంగానే చూసా. ఎందుకంటే, అమెరికాలో అనీ హైబ్రిడ్ లాగానే వుంటాయి. చివరికి చీమ దోమతో సహా.. , వున్న వాటిల్లో మంచివి ఎంచి ఓ డజను కొని ఇంటికి పట్టుకుని వెళ్లి , ఆవకాయ పెట్టా . చెప్పొద్దూ బాగానే కుదిరింది . టొమాటో పచ్చడి , నిమ్మకాయ ఊరగాయ ఎప్పుడూ మైక్రో వేవ్ సహాయం తో చేసేస్తూ వుందేనాకు, ఈ ఆవకాయ పెట్టడం లో ఎక్స్పర్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అయితే నాకు తెలుసు ఆవకాయ పెట్టడం, ప్రతీ ఏడాది ఒక పెద్ద కొత్త ప్రయోగం లాగానే వుంటుంది.,

నా చిన్నప్పుడు మా వూళ్ళో , పల్లెటూళ్ళో , కనీసం రెండు వందల కాయలు ఆవకాయ పెట్టేవారు. కాయ పళం గా కొన్ని , వెల్లుల్లి ఆవకాయ , వెల్లుల్లి లేకుండా ఇంగువతో శనివారం తినడానికి కొన్ని కాయలు, ఎండు ఆవకాయ, బెల్లం ఆవకాయ, పనసపొట్టు ఆవకాయ , సెనగలు ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి. ఒకటేమిటి, ఎన్నెన్నో రకాలు పెట్టేవారు. అప్పటిలో ఆ రోహిణి కార్తెలు మండు టెండ లలో ఎలెక్ట్రి సిటి లేని ఆ పల్లెటూళ్ళల్లో , వాళ్ళు రోళ్ళల్లో మిరపకాయలు దంపించి, ఆ కరం జల్లించి, ఆవగుండా ఉప్పూ కూడా దంపించి ఆవకాయ పెట్టే వారు. ఎన్ని అవస్తలు పడి పెట్టివుంటారో, ఇప్పుడు మా పిన్నులు ఇద్దరి మీదా చాలా జాలిగా అనిపిస్తుంది . . .

అయితే ఆవకాయ పెట్టడం అమెరికా అయినా , ఇండియా అయినా, ప్రావీణ్యం అనేది వుండదు అని నా అభిప్రాయం. అది ఆ సీజన్లో లో మనకు దొరికే మామిడి కాయల మీద ఆధార పడి వుంటుంది అనిపిస్తుంది . ఎందుకంటే …. ఈ ఊరగాయలు పెట్టడం లో మాంచి నిపుణిరాలిగా పేరు పొందింది మా అక్క. అని మా కుటుంబ సభ్యులంతా భావిస్తాము అయితే, అక్క పెట్టేస్తే తినేయడమే కానీ, ఏమి అవస్తలు పడుతోందో అప్పట్లో తెలియదు. నా పెళ్లి అయిన కొత్తల్లో, మా అక్క మా అత్తగారింటికి ఆవకాయ సీసా పట్టుకుని మేము భోజనాలు వడ్డించుకునే సమయానికి వచ్చింది. అప్పుడే కంచాలు పెడుతున్నా.. అక్కని కూడా భోజనానికి కూర్చోమన్నాము. లేదు, ఇప్పుడే తిని వచ్చా అని చెప్పింది. ఆవకాయ సీసా తీసుకుని, అందరికి తలో చంచా వడ్డించా .. ఆవకాయ అన్నం తింటూ వుంటే చెప్పొద్దూ , మా అమ్మమ్మగారు చెప్పినట్టు , స్వర్గానికి ఒక మెట్టు తక్కువగా అనిపించింది ( ఆ ఒక్క ఆఖరి మెట్టూ ఎక్కేస్తే దిగడం కష్టమేమోనని ).
చాలా రుచిగా వుంది. వెంటనే మా అత్తగారు నాకు సౌ౦జ్న చేసారు , పెన్నూ పుస్తకం తెమ్మని . సరే నేను పట్టుకుని వెళ్ళా.
అక్కని చూసి మా అత్తగారు , ‘"ఏమిటో నండి నాకు ఎప్పుడూ ఆవకాయకి కొలతలు మర్చిపోతాను . మీరు కొంచం చెబితే నేను ఆవకాయ పాళ్ళు రాసుకుంటాను " అని మా అత్తగారు , కళ్ళజోడు సారి చేసుకుంటూ క్లాసు లో పిల్లలు నోట్స్ రాసుకునే విధానం లో కూర్చున్నారు.

మా అక్క కొంచం సిగ్గు పడింది . "నేనా ? అని .. ఒక నిముషం ఆగి, పాతిక మామిడికాయలు కొన్నాను, అందులో, ఓ రెండు పప్పుకి, పచ్చడికి అత్తెపెట్టాసాను. మూడు పావులు కారం మూఫు పావులు ఆవ గుండా రెండు పావులు ఉప్పు పోసాను , ఇప్పట్లో టాబుల్ సాల్ట్ కదా , వుఉప్పు ఎక్కువ అవుతుందేమో నని తక్కువ పోసాను, . అర కిలో నూని పొసా . మూడు రోజుల తరవాత, అడుగునుంచి కలిపి చూస్తే , ఊట కొంచం తక్కువ వుందని అనిపించి, మళ్ళీ బజారు కి వెళ్లి, మరో ఆరు మామిడికాయలు కొని ముక్కాలి తరిగి కలిపా . తరవాత , ఊట బాగా పల్చగా అనిపించి, కొంచం కారం గుండా ఆవగుండా కలిపి చూసా . అన్నం లో కొంచం పిండి కలిపి చూస్తే , కొంచం వుప్పుతగ్గినట్టు అనిపించి, మరో అర గ్లాసు పోశా ..మళ్ళీ ఎందుకైనా మంచిదని మరో రెండు గ్లాసులు నూని పోశా ఇదిగో , ఇవాళ పదో రోజు. బాగానే వుంది అనిపించి, మీ కోసం కొంచం పట్టుకుని వచ్చా .. అంటూ ముగించింది .

మొత్తానికి మా అత్తగారికి , నోట్స్ ఎలా రాసుకోవాలో తెలియలేదు. అంటే, ఆవిడకు ఆవకాయ పెట్టడం రాదనీ కాదు. ప్రతీ సారి ఆవిడ కూడా, ఓ వంద మామిడి కాయలు తెప్పించి, ఇలానే, ఉప్పులూ, కారాలూ కలుపుతూ మళ్ళీ ముక్కలు తరుగుతూ, అది కుదిరేదాకా , కుస్తీలు పడుతూ వుంటారు పైగా బెల్లం ఆవకాయ కోసం తొమ్మిది రోజులు ఊర పెట్టడం , తొమ్మిది రోజులు ఎండబెట్టడం జరుగుతూ వుంటుంది. పది పదిహేను రోజులు కష్ట పడ్డా, కుటుంబం అంతా ఏడాది పాటు తింటూ వుంటే అదో తృప్తి. ఆవకాయ ఈ సంవత్సరం వద్దులే అనుకోలేము. ఖర్మ గాలి ఏ సంవత్సరమైన పెట్టుకోక పోతే , ఎవరిన్తికైనా భోజనానికి వెళ్తే, .. ముందు గా వేయిన్చుకునేది ఆవకాయే. ఎందుకో దానికోసం అంత మోహం వాచిపోయేటట్టు బాధపడుతూ ఉంటాము ఎంత డాక్టర్లు మొత్తుకుంటున్నా, ఆవకాయ మాత్రం మానం కదా. .
నెల రోజులుగా ఆవకాయ పెట్టాలని తెగ అనుకుంటున్నా. రోజూ వుద్యోగం వలన కుదరనే కుదరదు, శని ఆది వారాలలో పార్టీలు , బట్టలు వుతుక్కోవడాలు ఇల్లు సద్దుకోవడం లాంటి పనులతో అస్సలు కుదరదు. ఎలాగో వీలు చేసుకుని కూరలు కోనేటప్పుడే , మామిడి కాయలు మర్చిపోకుండా తేవాలని గత నెల రోజులుగా అనుకుంటున్నా .
ఈ సంవత్సరం మానేద్దమనే అనుకున్నా . ఇంతలో మా అయన స్నేహితులు మీ అందరికి పరిచయస్తులు అయిన వేద గారు ఆయన రాసిన ఈ కింద పద్యాన్ని పంపారు ..

జిహ్వకు తగలకనే భయ
విహ్వలురై పోవునట్టి భీరులు కారోయ్
వహ్వా యని లొట్టలతో
ఆహ్వానము లిత్తురాంధ్రు లావకాయకున్

ఇక చదివేక .. ఇక ఆగ లేక... ఇదుగో ఇవాళే మామిడి కాయల వేటలో వెళ్తున్నా ..…

Friday, December 24, 2010

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి!

'అబ్భ! మా అమ్మ వంట తిన్నట్టుంది' ' అబ్భ! మా అమ్మ ఎంత బాగా వండుతుందో!!
ఇలాంటి మాటలు తరుచు చాలా మంది మగవాళ్ళు మంచి రుచి కరమైన భోజనం చేసినప్పుడల్లా అంటూ వుంటారు. అవును ఎవరి అమ్మ వంట వాళ్లకు నచ్చుతుంది. ఎందుకు నచ్చదూ? కని పెంచిన తల్లికి, పిల్లలు ఏది ఇష్టంగా తింటున్నారో, ఏది తినడం లేదో రోజూ చూసి, దానికి తగ్గట్టు ఆమె తన వంట పద్ధతుల్ని మార్చుకుంటుంది. తన ఇష్ట అయిష్టాలని పక్కకి పెట్టి, పిల్లలకి కావలిసినవి వండి పెడుతుంది.


అయితే మధ్య వయసు వచ్చేసరికి తల్లికో, తండ్రికో లేక ఇద్దరికీనో బి పి లేక డయాబెటిస్ లాంటి జబ్బులు వచ్చేసరికి, కొంచం ఉప్పు తగ్గించి, ఉప్పుతో బాటు కాస్త పులుపు, కారం కూడా తగ్గించడంతో, కొంచం రుచులు తగ్గుతాయి. దానితో, పిల్లలు మళ్ళీ, తల్లి వంట మీద కొంచం విసుక్కోవడం మొదలు పెడతారు. ఆడ పిల్లనయితే, "నోరు మూసుకుని తిను, పెళ్లి అయ్యాకా, మీ అత్తవారింటికి వెళ్లి కావలిసినట్టు చేసుకుని తిను" అనో, మగ పిల్లాడినయితే , "నేనూ చూస్తాను, రేపు నీ పెళ్ళాం వస్తే ఎంతబాగా చేసి పెడుతుందో " అని విసుర్లు వుంటూనే ఉంటాము. ఎప్పటికైనా అమ్మ వంట అమ్మవంటే. పెళ్లి అయ్యాకా, పుట్టింటికి వెళ్ళాకా, మళ్ళీ మనకోసం, ఆమె వండి వడ్డించితే, నాకు ఇలా కుదరదు ఎందుకో అని అనిపిస్తూ వుంటుంది ఆడ పిల్లలకి.


పెళ్లి కాక మునుపు, నేను ఎప్పుడూ వడ్డించినది తినడమే కానీ, బాగుంది బాగోలేదు అని చెప్పడం ఎప్పుడూ లేదు. అది ఎలా చేసారో అనే కుతూహలం కూడా వుండేది కాదు. నేను వంటింట్లోకి మాత్రం ఒక్క భోజనం చెయ్యడానికి మాత్రం వెళ్ళేదాన్ని. అప్పట్లో గ్రై౦డర్ మా ఇంట్లో లేదు. కనుక రుబ్బు రోలు రోజూ వాడ వలసి వచ్చేది. నేను కాలేజీ కి వెళ్ళక ఇంట్లో వుంటే, ఏదైనా రుబ్బురోలు పని వుంటే నాకు అంటగట్టేవారు. ఎలా కావలిస్తే అలా రుబ్బెయ్యడమే కానీ, దానితో ఎమిటి చెస్తారు అని కూడా అడిగేదాన్ని కాదు. ప్రెజర్ కుక్కర్స్ కొత్తగా వచ్చిన రోజులు. మా అమ్మగారు, కుక్కర్ పెడుతూ ఒకసారి పైకి అనుకున్నారు , 'ఆహా ఎవరు కనిపెట్టాడో కానీ ఈ కుక్కరు, మహానుభావుడికి, రోజూ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోవచ్చు' అని. అప్పుడే, నాకు పెసరట్ల కోసం నాన బెట్టిన ఒక కే జి పెసర పప్పు రుబ్బ డానికి ఇచ్చింది అమ్మ. అది విన్న నేను రుబ్బుతూ అన్నా " ఈ రుబ్బురోలు కనిబెట్టిన వాడు ఎవడో తెలిస్తే, ఈ పొత్రంతో వాడి బుర్ర బద్దలు కొట్టేదాన్ని అన్నా నవ్వుతూ. మా అమ్మ కూడా పక పకా నవ్వేసింది.

వంట అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. నా ఉద్దేశం లో అప్పట్లో అది పెద్ద విద్యా ఏమీ కాదు. అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు నేను వండవలసిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు, నేను ఏమీ కష్ట పడినట్టు అనిపించలేదు. చాలా ఈజీ గానే అనిపించింది. పైగా చాలా రుచిగా కూడా కుదిరింది. నా వంట తిన్న ఒకరిద్దరు మా కజిన్స్ అచ్చం మా అమ్మ వంటలాగానే వుండి, జీన్స్ లోంచి వంట వచ్చేస్తుందేమో అని కామెంట్ చేసినట్టు కూడా గుర్తు. అదే నా మనసులో వుండి పోయింది..కానీ, మా అమ్మకీ, అన్నయ్యకి, నన్ను పెళ్లి చేసుకున్నవాడు నాకు వంట రాదనీ వదిలేస్తాడేమో నని నని హడిలి చస్తూ వుండేవారు. నిజంగానే వదిలేస్తా డేమో, ఎందుకైనా మంచిది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, వుద్యోగం చేసుకుని బ్రతక వచ్చు అని , మరి కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకున్నా. నన్ను పెళ్లి చేసుకుంటానని మా ఆయన మా అమ్మని అడగడానికి వెళ్తే, మా అమ్మ, ముందుగానే, మా అమ్మాయికి వంట రాదు అని చెప్పేసింది. అసలు సంగతి, ఆయన మా అమ్మకి నచ్చలేదు లేండి. కానీ ఆయన, మీ అమ్మాయి కి వంట మనిషిని పెట్టేస్తా అన్నారు,పైగా తివాసీల మీద నడిపిస్తా మీ అమ్మాయిని అని చెప్పారు.. అయితే ,అమెరికాకి వచ్చాకా తెలిసింది, ఇక్కడ అపార్ట్ మెంట్ లో కూడా తివాసీలు ఉంటాయని. మా అమ్మ అది గుర్తుకు తెచ్చుకుని ఇప్పటికీ మురిసిపోతూ వుంటుంది.

పెళ్లి అయ్యాకా, అత్తవారింటిలో వంట పని రోజూ తగిలింది. చాలా ఇష్టంగానే వండేదాన్ని. నిజంగానే, బాగా కుదిరేది. మా అత్తగారు రోజూ ఏమి చెయ్యాలో, ఎవరెవరికి ఎలా చేస్తే ఇష్టమో చెప్పేవారు. అందుకని నాకు చాలా ఈజీ గానే వుండేది. అప్పటికీ కొన్ని కొన్ని మరపు రాని విషయాలు కొన్ని వున్నాయి. మా వాళ్ళంతా "గుత్తివంకాయ కూర చాలా బాగా చేసావు అని నన్ను పొగిడితే , వెంటనే మా అత్తగారు, "ఆ వంకాయలు నేనే ఎంచి ఎంచి కొన్నాను, అందుకే అంత బాగుంది అనే వారు".
"అయితే వుండండి, రోజూ కూరలు కొనేది మీరే కదా, ఈ సారి మళ్ళీ ఇలానే వుండుతాను" అని కొంటెగా జవాబిచ్చేదాన్ని. ' హమ్మో, ఏ ఉప్పో కారమో దండిగా వేసేయ్యకు " అని నవ్వేసేవారు. ఇలా వంట నేను ఎంతబాగా చేసినా, ఎంతో కొంత క్రెడిట్ మా అత్తగారికి వెళ్ళవలసిందే. అప్పటికీ , నేను పెట్టే సంబారు కి మాత్రం ఒక స్పెషల్ సర్టిఫికేట్ సంపాదించుకో గలిగాను. మా పుట్టింటి వాళ్ళు ఎక్కువ మా అత్తవారింటికి రాకపోవడం వలన, నేను కూడా ఎక్కువ పుట్టింటికి వెళ్ళడం తక్కువ అవడం వలన, వెళ్ళినప్పుడు, నాకు బోలెడు మర్యాదలు చేస్తూ, మా వదినలు వండి పెట్టడం వలన, ఇప్పటికీ నాకు వంట రాదేమో ననే అనుమానం మా పుట్టింటి వాళ్లకి మాత్రం లేకపోలేదు.

ఒక సారి మా స్నేహితుని ఇంటికి భోజనానికి వెళ్ళాము. వాడు భలేగా మాట్లాడుతాడు. అంతా కాసేపు కబుర్లు అయ్యాకా భోజనానికి కూర్చున్నాము. "ఆహా ఓహో ఎంత బాగా చేసేవే కూర, చాలా తమాషాగా లేదూ???, అబ్బ ఈ పులుసు ఏమిటో చాలా అద్భుతం గా చేసావు ", అంటూ ప్రతీ వంటకాన్నీ పొగుడు కుంటూ తిన్నాడు మా స్నేహితుడు. నిజమే, వాడి భార్య చేసిన దొండ కాయ కూర తమాషాగానే వుంది మరి, కొన్ని ముక్కలు మాడి పోతే, కొన్ని ముక్కలు ఉడికి , కొన్ని ఉడక్క, ఉప్పు కషాయం లా వుండి చాలా విచిత్రం గా వుంది. ఇక పులుసు కూడా అలానే చచ్చింది, అది చారో, పులోసో తేల్చుకో లేక పోయాము. చూడ డానికి పల్చగా నీళ్ళల్లా వుండి, అదులో రెండు వంకాయ ముక్కలు, రెండు ఆనపకాయ ముక్కలు రెండు బెండ కాయ ముక్కలూ వున్నాయి. అవి బాగా మెత్తగా వుడికేయి, బహుశా కుక్కర్ లో పెట్టినట్టు వుంది. మజ్జిగ అన్నం తో కొంచం తిని, వెంటనే బయటి కి పోయి, హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసి కడుపు నింపుకున్నాం. మా ఆయన నేను ఎంత బాగా వండినా ఒక్క రోజు కూడా బాగుందని చెప్పే వారు కాదు. భార్య వంటని పొగిడితే లక్ష్మి దేవి కి కోపం వస్తుందని మా అత్తగారు రోజూ చెబుతూ వుండే వారు. బహుశా అందుకే అయి వుంటుంది. నేను మాత్రం ఈ సారి ఊరుకో లేదు. మీ స్నేహితుణ్ణి చూసి కొంచం పొగడడం నేర్చుకో అని చెప్పా.. "అలా దొంగ పొగడ్తలు నీకు కావాలా" అని ఆయన అడిగితే, ఏమి చెప్పాలో తెలియలేదు.. "అంటే నేను అంత దరిద్రం గా వండుతానా" అని ఎదురు ప్రశ్న వేసా.

కొన్నాళ్ళయ్యాకా మేము అమెరికా వచ్చాము. మా చిన్న నాటి ఫ్రెండ్స్ ఇంట్లో వున్న నాలుగు రోజుల్లో ఒక సారి సంబారు పెట్టా. అబ్బా, ఇలా కానీ సంబారుతో అమెరికా అంతా నా పేరుతో చైన్ రెస్టా రెంట్స్ తెరవచ్చు అని మా ఫ్రెండ్స్ అనేసారు. దానితో నా ఆత్మ విశ్వాసం లెవెల్ పెరిగి పోయింది. నేను చాలా గొప్పగా వంట చేస్తానని అనేసుకున్నా.

మాకు అమెరికాలో మొదటి స్నేహితులు, అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కాకుండా, కొత్త వాళ్ళు ఆఫ్రో అమెరికన్స్. వాళ్ళలో ఒకడు మా ఇంటికి తరచూ వచ్చేవాడు. వాడి పేరు నెల్సన్ . ఒక రోజు నెల్సన్ మేము భోజనం చేసే సమయం లో వచ్చాడు. వుమ్మడి కుటుంబం లోంచి రావడం వలన, కొంచం కొంచం వండడం వచ్చేది కాదు. పప్పు పులుసు అవీ పెడితే, కొంచం పెద్ద గిన్నె తోనే పెట్టేదాన్ని. ఆరోజు, మా ఆయన, నెల్సన్ తో, పప్పు పులుసు బాగుంది, తిన కూడదూ అని అనడిగాడు. అంతే, అన్నంతో తింటాడేమో అని , కంచం తీసుకుని వచ్చా. ఏ లోగా, మీ అందరి భోజనం అయిందా అని అడిగాడు, అయిపోయింది అని కంచం లో కొంచం కూర వేసి, అన్నం వెయ్య బోతూ ఉండాగా, నెల్సన్, పులుసు గిన్ని ఎత్తిపట్టుకుని, మొత్తం పులుసు అంతా, మాయ బజార్ లో ఘటోత్కచుడి లాగా, అడుగున ఒక గరిటెదు మిగిల్చి మిగతాదంతా గడ గడా తాగేసాడు. నా కళ్ళతో నేనే నమ్మ లేక పోయా.. వాడు ఆకలితో మాడు తున్నాడా, లేక వీడికి రుచులతో పని లేదా, నిజం గానే ఆఫ్రో అమెరికన్ కి నేను పెట్టిన పప్పు పులుసు నచ్చిందా అర్ధం కాలేదు. ఇంతలో మా అయన వాడిని ఐస్ క్రీం తింటావా అని అడిగాడు. వాడు వెంటనే ' ఎస్' ఆన్నాడు, నేను చిన్న బౌల్ తీసి ఇండియా మోడల్ లో ఒక చిన్న గరిటెడు ఐస్ క్రీం వేసి, అందులో ఒక చంచా వేసా. వాడు నా వైపు వాడు ఒక సారి చూసి, చంచా తీసుకుని, ఐస్ క్రీం డబ్బా లాక్కుని, మొత్తం డబ్బా చూస్తూ ఉండగానే, ఖాళీ చేసేసాడు. వీడు మనిషా? బకాసురుడా? అనుకుని, ఏడవలేక నవ్వుతూ, 'నచ్చిందా' అని అడిగాము... 'ఇట్స్ ఒకే " అన్నాడు. ఆ తరవాత మా ఆయనకి చెప్పేసా ఇలా అడ్డ దిడ్డంగా వాడిని పిలవకు అని గాఠ్ఠిగా చెప్పేసా.

మరి కొన్నాళ్ళయ్యాకా, నెల్సన్ గాడి ఫ్రెండ్ ఏరన్ వచ్చాడు మా ఇంటికి. చెప్పొద్దూ వాడు మాకు చాలా సాయం చేసాడు. ఈ దేశం వచ్చినప్పుడు మాకు ఇల్లు వెదికి పెట్టడం, స్కూల్ లో మా అబ్బాయిని జాయిన్ చెయ్యడం లాంటి విషయాల్లో చాలా సహాయం చేసాడు. ఒక రోజు ఏరన్ ఎక్కడి కో వెళ్తూ మమ్మల్ని పలక రించడానికి వచ్చాడు. మాంచి మూడ్ లో వున్నట్టున్నాడు. చేతిలో ఒక బీరు బాటిల్ పట్టుకుని మరీ వచ్చాడు. మా యాన చాలా సంతోష పడి పోయి, వాడికి తినడానికి ఏమైనా పెట్ట మన్నాడు. ఆరోజు, మార్గ శిర లక్ష్మి వారం. నేను చక్ర పొంగలి చేశా. వెంటనే, ఒక బౌల్ లో వేసి పట్టుకుని వచ్చా. వాడు అదేమిటి అని అడిగాడు. నేను 'రైస్ పుడ్డింగ్ " అని చెప్పా, అలా అయితే అర్ధం అవుతుంది కదా అని. వాడు వద్దు అన్నాడు. అసలే తాగి వున్నాడు, అంది మీద స్వీట్ తింటే ఎలా? కానీ ఆయన బలవంతం పెట్టాడు. దానితో వాడు, పోనీ కదా అని ఒక చంచా నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుని వాష్ రూం కి వెళ్లి భళ్ళున వాంతి చేసుకున్నాడు. పాపం తాగి వున్నాడు కదా, అని పోనీలే అని వాడి ముందు నుంచి వెంటనే అది తీసేసా. కానీ వాడు మాత్రం ఊరుకో లేదు. అందులో ఏమిటి వేసావు అని అడిగాడు. నేను చెప్పా, బియ్యం, పెసర పప్పు, పంచదార, నెయ్యి, ఏలక పొడి అన్నీ చెప్పా, అదేమీ కాదు, ఇంకా ఏదో వేసావు అన్నాడు. చాలా సేపు అర్ధం కాలేదు. కొంచం సేపు పోయాకా గుర్తుకు వచ్చింది. అందులో పచ్చ కర్పూరం వేసా నని. మా అయన తో చెప్తే, దానిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో తెలియలేదు. రవి, అది ఒక కార్బన్ పదార్ధం అని, అది సువాసన గా ఉంటుందని, అలా ఏదో వర్ణించి చెప్పగానే, వాడు, పరిగెత్తుకుని వెళ్లి, మళ్ళీ కక్కి పోసాడు. ఆయన వర్ణన తో వాడి కి అర్ధం అయిందేమిటంటే, మేము దానిలో నేఫ్తలిన్ బాల్స్ వేశామని అనుకున్నాడు. అది అర్ధం చేసుకుని, నవ్వలేక చచ్చాము. కాదని చెప్పి, ఇంట్లో వున్న పచ్చ కర్పూరం వాడికి చూపించి నేఫ్తలిన్ బాల్స్ కూడా చూపించి, అది వేరు ఇది వేరు అని వప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది.

అప్పటి నుంచి, ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే, నాకైతే భయం.
కొందరు తెలుగు వాళ్ళు వచ్చి నా వంట తిన లేక , వున్నన్నాళ్ళూ హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని తిన్న రోజులు కూడా వున్నాయి. వాళ్లకి నాలుక చిల్లు పడే అంత పులుపు తినడం అలవాటు. నేను వండే కమ్మని వంట వాళ్లకు నచ్చలేదు. పార్టీ లకి వెళ్లి నప్పుడు కూడా, కొందరు, నాకు నచ్చని వంటను పొగుడు కుంటూ తినడం, నాకు నచ్చినది, వాళ్ళకు నచ్చక పోవడం.. ఇవన్నీ చూస్తూ వుంటే, అప్పుడు బాగా అర్ధం అయింది.. పుర్రెకో బుద్ధి, జిహ్వ కో రుచి అని.

Thursday, August 19, 2010

పేరు గొప్ప వూరు .....

పేరు గొప్ప వూరు .......

ఊహ ఎప్పుడూ నిజం కన్నా అందంగా వుంటుంది. ఊహలకు హద్దులు వుండవు. దేని గురించి అయినా ముందుగా వింటే, దాని గురించిన వూహలు నిజాన్ని అధిగమించి వుండి, తీరా నిజాన్ని చూసే సరికి మన ఎక్స్ పెక్టేషన్స్ కి చాలా దూరం గా వుండి చాలా డిసప్పాయింట్ మెంట్ కలుగు తుంది.

రెండు వేల కన్నా తక్కువ జనాభా వున్న పల్లెటూళ్ళో పుట్టాను నేను. మా నాన్న గారి ఉద్యోగ రీత్యా, ట్రాన్స్ ఫర్స్ వలన ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండకుండా తిరుగుతూ వుండేవాళ్ళం. చివరికి మా చదువు రీత్యా, మా అన్నయ్యని నన్నూ విశాఖ పట్నం లో ఉంచారు. నాకు చాలా ఇంచుమించు పెళ్లి అయ్యేవరకూ కూడా తెలిసిన పెద్ద వూరు విశాఖపట్నమే. ఒక సారి హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. కానీ రెండు మూడు రోజుల కంటే అక్కడ ఉండక పోవడం వలన, అంత పెద్దగా ఏ అభిప్రాయం ఏర్పరుచుకోలేదు. హైదరాబాద్ మాత్రం చాలా పెద్ద సిటీ. దానిని ఎవరూ కాదనలేరు.
నేను హై స్కూల్ లో చదివినప్పుడు మా క్లాసు లో కొందరు విజయనగరం నుంచి వచ్చిన అమ్మాయిలు వుండేవారు. వాళ్ళు విశాఖపట్నం రావడం వలన వారు జీవితంలో ఏదో కోల్పోయినట్లు మాట్లాడేవారు. విజయనగరం పేరు చెప్పినప్పుడు వారి కళ్ళల్లో ఒకరకమైన ఆనందం, కించిత్ గర్వం కూడా కనిపించేది. నాకైతే చెప్పొద్దూ, విజయనగర సామ్రాజ్యం చరిత్ర చదివి వున్నానేమో కొంచం అసూయ కలిగేది. విశాఖపట్నం దగ్గరి విజయనగరం, హంపి విజయనగరం వేరు వేరు అని అప్పట్లో నాకు తెలియదు. పైగా వాళ్ళు రాజుగారి కోట గురించి కూడా చెప్పేవారు. పెద్దయ్యాకా, వుద్యోగం చేసి, డబ్బులు బాగా సంపాదించి ఆ విజయనగరం చూడాలని చాలా అనుకునేదాన్ని. కొన్నాళ్ళకి ఆ విషయం మర్చిపోయా, మా అన్నయ్యకి విజయనగరం లో స్టేట్ బ్యాంకు లో కోట బ్రాంచ్ లో వుద్యోగం వచ్చేదాకా. అప్పుడు చిన్న ఆశ మొదలయింది. ఎలాగైనా విజయనగరం చూడొచ్చని.

మా అన్నయ్య, సోమవారం జాయిన్ అయ్యి, శనివారం వచ్చేసాడు. వస్తూనే, "హమ్మో, నాకు దోమతెర ఒకటి అర్జెంటు గా కావాలి. అక్కడ విజయ నగరం అందరికి బోద కాళ్ళు. మరో నెల తిరక్కుండానే, నా కాళ్ళు కూడా అలా అయిపోతాయని భయం వేస్తోంది" అని చెప్పాడు. వాడు అసలే సున్నితం. ఎప్పుడూ ఏ వో పత్యాలు చేస్తూనే ఉంటాడు. మా అమ్మమ్మ వాడిని 'నిత్య బాలింత' అని వేళా కోళం చేస్తూ వుండేది.
శనివారం సాయకాలమే, బజారుకి వెళ్లి వెంటనే ఒక దోమ తేరా, కొన్ని మస్కిటో కోయిల్స్ కొని పట్టుకుని వచ్చాము.
"కోట ఎలా వుంటుంది రా" అని చాలా కుతూహలం గా అడిగాను. అందులో విమెన్స్ కాలేజీ వుంది.
"ఒకసారి వచ్చి చూడు నీకే తెలుస్తుంది , అదొక పెద్ద పల్లెటూరు " అన్నాడు విసుగ్గా. వీడొకడు. చిన్నప్పటినుంచి అంటే. నేను చిన్నదాన్ని అయినా, అమ్మ నాన్న గార్లకు దూరంగా వున్నా ఎంతో ధైర్యంగా వుండేదాన్ని. వాడు బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చేసుకునే వాడు. ఇప్పుడూ మమ్మల్ని వదలి ఉండలేక అలా అంటున్నాడేమో అనుకున్నా. మరో రెండు వారాలు పోయాకా నేను అమ్మ వెళ్ళాము, ఆ మహా నగరాన్ని చూడ దానికి. వెళ్ళాకా తెలిసింది అది నిజంగానే పెద్ద పల్లెటూరని.
ఇక పెళ్లి అయ్యాకా అంటారా, మా ఆయన పదేళ్ళు వచ్చేవరకూ ఆ విజయనగరం మహా పట్టణం లో ఉన్నారుట. రిటైర్ మెంట్ వయసు వస్తున్నా, ఇప్పటికీ ఆ విజయనగరం కబుర్లే. ఆ తరువాత విశాఖ పట్నం లో పాతిక సంవత్సరాలున్నా, ఈ నాటికీ ఆ విజయనగరం గొప్పదనం ఇప్పటికీ వింటూ నా చెవులు చిల్లులు పడుతూ వుంటాయి.

మా ఆయన విజయనగరం లో వున్నప్ప్దుడు ఒక సారి మంత్రి, బ్రహ్మనంద రెడ్డి గారు, వస్తున్నారని విని, ఎంతో కుతూహలంగా, చక్కగా తయారయి, ఎండలో మాడుకుంటూ వెళ్ళి నాలుగు గంటలు ఎదురుచూసి వచ్చారుట. మా అత్తగారు, కాలికి దెబ్బ తగిలింది, వెళ్ళొద్దు అంటే వినకుండా వెళ్ళారుట. తిరిగి వచ్చి, వాడేమి మంత్రి, చి చీ, ఒక కత్తి లేదు, కిరీటం పెట్టుకోలేదు, అనేసి ఆడుకుందుకు వెళ్ళిపోయారుట.

ఇక విజయనగరం ఘోష ఇలా వుండగా, మా ఆయన మేనత్త గారి వూరు కాకినాడ. వారి అబ్బాయి మా ఆడబడుచు మొగుడు. ఇక వీరింటి నుంచి ఎవరు మా ఇంటికి వచ్చినా కాకినాడ గురించి వర్ణనలు. మా నాన్నగారు కాకి నాడ కాలేజీ లో చదువుకున్నారు. కొంచం కాకినాడ కళలల గురించి చాలా గొప్ప గానే విన్నాను. అక్కడి వంకాయలు కాస్త ఉప్పు కారం చల్లి, స్టవ్ దూరం నుంచి చూపించి తినెయ్య వచ్చుట. అంత బాగుంటాయట. అక్కడ బాబాయి హోటల్ లో పెసరట్టు, వేడి వేడి ఇడ్లీలు, అల్లం పచ్చడి తినక పోతే, జీవితం వేస్ట్ ట. అలానే, బుట్ట భోజనం ట.. అదేమిటో నాకైతే అంతుపట్ట లేదు. కాకి నాడ కాజాలు ఎలానూ ఫేమస్ కదా.. నాకు తెలిసి ఆడవాళ్ళ గొంతుతో పాడే బాబ్జి మాత్రం బాగా తెలుసు. ఎలా అయినా, రిటైర్ అయ్యాకా, ఆ కాకినాడ లో సెటిల్ అయిపోతే బాగుంటుందని ఒక డెసిషన్ కి వచ్చాశా. అదే మాట, ఒక సారి మా అమ్మతో అంటే, ఫకాలున నవ్వింది. ఒకసారైనా వెళ్ళావా అని అడిగింది. లేదన్నాను. మరి వెళ్ళకుండానే అలా ఎలా అనుకుంటున్నావు అని అడిగింది. " ఏమో అమ్మా అందరూ చెప్పే విధానం చూస్తే అలా అనిపించింది" అన్నా. ఒకసారి వెళ్లిరా అంది.
మరో మూడు నెలల్లోనే కాకినాడ వెళ్ళే అదృష్టం పట్టేసింది. మా ఆయన, నేను మా అబ్బాయిని తీసుకుని కార్ లో వెళ్ళాము. డ్రైవర్ కి ఈ వూళ్ళన్నీ బాగా తిరిగిన వాడు. అందుకే మేము కొత్త వూళ్ళో పెద్దగా అవస్థ పడనవసరం లేదు. ఆ వూళ్ళో వున్న పెద్ద హోటల్ లో దిగాము. నా దృష్టిలో పెద్దది కాదు. ఆవూళ్ళో అదే పెద్దదని చెప్పారు. మానస సరోవర్ ట. నాకైతే, అదే ఒక పెద్ద డిస ప్పాయింట్ మెంట్. నేను అప్పటికే, చాలా దేశాలు తిరిగేసాను. ముంబాయి, కలకత్తా లే కాకుండా, యూరప్, ఫార్ ఈస్టర్న్ దేశాలు, చుట్టు ప్రక్కన కొలంబో, బంగ్లాదేశ్ లాంటి చాలా ప్రాంతాలు తిరిగాను. మా డ్రైవర్ రాత్రి పూట కళ్ళు కనిపించవు. వాడికి అప్పటికే ఎనభై ఏళ్ళు ఉంటాయేమో. కానీ మా ఆయనకి వాడంటే చాలా గురి. నాకైతే వాడికి కళ్ళు సరిగా కనిపించ వని భయం. అంతె కాదు, ఏ వూరు వెళ్ళినా, వాడికి ఆ వూళ్ళో ఓ ఫ్యామిలీ వుందని రాత్రి అయ్యేసరికి వెళ్లి పోతూ ఉండేవాడు. అందుకని తొందరగా పనులు కానిచ్చి, సాయకాలం అయిదు గంటలకి వూరు చూడ డానికి బయలు దేరాము. వూరులో మంచి బజారు చూపించామన్నాము. వాడు, మనం ఉన్నదే బజారు అన్నాడు. సరే అంటా తిప్పి చూపించామన్నాము. మరో పడి నిముషాల్లో వూరు చివరకి వచ్చేసాము అన్నాడు. ఒకే, రెండోవ వైపు చూపించు అన్నాము. వాడు పక్క వీధిలోకి తిప్పి, ఇది గుడి వీధి అన్నాడు. ఓహో అలానా అన్నము. మరో పావు గంటలో వూరు రెండవ చివరకి తీసుకుని వెళ్ళాడు. అంతే ఇంక అంత కంటే చూడడానికి ఈ వూళ్ళో ఏమీ లేదన్నాడు. వాడు దొంగ వెధవ, చూపించడానికి బద్ధకిస్తున్నాడు అనుకున్నాము. సరేలే, వాడిని పంపేసి, మేమే కారు డ్రైవ్ చేసుకుని తిరగడం మొదలు పెట్టాము. ఎంత తిరిగినా, "అబ్భా" అని పించే విషయం మాకేమీ కనిపించలేదు. భోజనం ఒక హోటల్ లో తిన్నాము. అదీ అంతంత మాత్రమే. ఇంక అక్కడ చూడడానికి సముద్రమే వుంది కదా.. పైగా మా అయన వచ్చిన పనే షిప్పింగ్ పని. కాలిఫోర్నియా అఫ్ ది ఈస్ట్ అని పేరు పడ్డ విశాఖపట్నం నుంచి వచ్చిన నాకు కాకినాడ సముద్రం లో అందాలేమి ఎక్కువగా కనిపించలేదు. ఇక బాబాయ్ హోటల్ కి వెళ్ళాము. అదొక రేకుల షెడ్ అంతే.. టిఫిన్స్ రుచిగానే వున్నాయి. విషయం, అవి తినక పోతే జీవితం వేస్ట్ అని మాత్రం అనిపించలేదు. అంతకన్నా నేను బాగానే చేస్తాను అనిపించింది. పని అయిపోయాకా, విశాఖపట్నం వెళ్ళిపోతూ, మధ్యలో నా పుట్టింటికి వెళ్లి, మా అమ్మతో చెప్పా కాకినాడ వెళ్లి వస్తున్నామని. 'ఆహా, చూసావా? మీ రిటైర్ మెంట్ అక్కడేనా అని అడిగింది పకపకా నవ్వుతూ మా అమ్మ. నేనూ నవ్వేసాను..

ఈ కాకినాడ, విజయనగరం గొప్పలు, ఇన్నాళ్ళైనా, ఎక్కడో ఒకచోట ఈ రోజుకీ వింటూనే వున్నా. నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే అమెరికా లో గత నలభై సంవత్సరాలుగానో, అంతకన్నా ఎక్కువగానే ఉంటూ కూడా, ఇంకా విజయ నగరం, కాకినాడ అంటూ కబుర్లు చెబుతూ వుండడం. ఇన్ని కబుర్లు చెప్పే వాళ్ళు ఎవ్వరూ కూడా అమెరికా వదిలి ఆ కాకినాడో , విజయ నగరమో వెళ్ళే ఉద్దేశం మాత్రం వుండదు. చెప్పే వాడికి వినే వాడు లోకువ అన్నట్టు, ఆ వూరి గొప్పలు మాత్రం చెప్పుకు పోతూ వుంటారు. మా ఆయన కూడా అలాంటి వాళ్ళలో ఒకరు.

నేను పుట్టింది చాలా పల్లెటూరు అవడం వలనో ఏమో, ఎప్పుడూ మా వూరి గురించి నేను గొప్పగా అనుకోలేదు. ఎవరికీ అసలు నేను ఎక్కడ పుట్టానో కూడా చెప్పవలసిన అవసరం పడలేదు. పైగా విశాఖపట్నం లోనే, నా చదువంతా జరగడం వలన, పెళ్లి అయ్యాకా కూడా ఎక్కువ కాలం అక్కడే వుండడం వలన, మా వూరు విశాఖపట్నం అనే చెబుతా.

నేను యునివర్సిటీ లో చదివేటప్పుడు చాల మంది నా క్లాసు మేట్ అమ్మాయిలంతా విజయవాడ వాళ్ళు. విజయవాడ గురించి కూడా నేను తక్కువేమీ వినలేదు. విజయవాడ కనక దుర్గ దర్శనం కోసం వెళ్లి విజయవాడ కూడా చూసా. అలానే, నేను కాలేజీ లెక్చరర్ గా పని చేస్తూ ఏదో ట్రైనింగ్ కి అని గుంటూరు వెళ్లాను. ఇవన్నీ చూసాకా నాకు ఇప్పుడు ఎవరైనా, ఏ వూరి గురించి గొప్పగా చెప్పినా, వెళ్లి చూడాలనే ఇచ్చ కలగడం లేదు. కారణం వేరే చెప్పక్కర లేదుగా..

రెండేళ్ళ క్రితం ఒక విషయం జరిగింది. నాకు లాస్ అ౦జెలెస్ లో డౌన్ టౌన్ లో ప్రాజెక్ట్ వచ్చింది. నాతో చాలామంది ఇండియా నుంచి ప్రోగ్రామర్స్ అక్కడ పని చేస్తున్నారు. వాళ్ళంద రిలోనూ పెద్దవాడు, నాకన్నా నాలుగు అయిదేళ్ళు చిన్న వాడు ఒక డు వున్నాడు. నేను ఆరోజు సంక్రాంతి అవడం వలన, వెళ్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పాను. అందరికన్నా పెద్దవాడు నా దగ్గరికి వచ్చి, వట్టినే అలా చెప్పెయ్యడ మేమిటి , పొంగలి చేసి పెట్టి అప్పుడు చెప్పాలి అన్నాడు.
"నేను ఇక్కడ హోటల్ లో ఉంటున్నాను, కావలిస్తే, మా హ్యూస్టన్ లో మా ఇంటికి రండి అప్పుడు చేసి పెడతా అన్నాను నవ్వుతూ. స్టవ్ మీద కాదు, కుంపటి మీద చెయ్యాలి పొంగలి, అసలు మీకు కుంపటి అంటే ఏమిటో తెలుసా?" అని అడిగాడు.
"ఎందుకు తెలియదు, మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియక పోవచ్చు" అన్నా.
" మా అమ్మగారికి ఎప్పుడూ నేనే కుంపటి వెలిగించేవాడిని, నేను చాలా పల్లె టూల్లో పుట్టాను ఆలాంటి వూరు పేరు మీరు అసలు విని కూడా వుండరు" అన్నాడు.
"నేనూ అలానే చాలా పల్లెటూల్లోనే పుట్టాను, ఇంతకీ మీరు ఏ వూళ్ళో పుట్టేరేమిటి" అని అడిగాను.
"మాకవర పాలెం" అన్నాడు గర్వంగా, నేను ఆ పేరు ఎప్పుడూ విని ఉండనని పూర్తి నమ్మకంతో.
నా చెవుల విన్నా నేనే నమ్మలేక పోయా. ఎందుకంటే నేను పుట్టిందీ అదే వూరు. అలా చెబితే నమ్మలేక పోయాడు. నేను ఆ వూరు ఎక్కడ వుంటుందో చెప్పి , మా నాన్న గారు ఆ వూరి హెడ్ మాస్టర్ గా పని చేసేవారని చెప్పా. ఆ వూరి గ్రామ కారణం అతని మేనమామ అని అతను చెప్పాడు. హోటల్ రూం కి వెళ్లి, ఇండియా ఫోన్ చేసి ఆ విషయం మా అమ్మ, అన్నయ్యలతో చెప్పా. వాళ్ళు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నల పెళ్ళికి నన్నూ తీసుకుని వెళ్ళారని చెప్పారు. నేను అప్పుడు మూడేళ్ళ పిల్లనిట.

ప్రపంచం ఎంత చిన్నది? ఎంత ఆశ్చర్యం. ఎక్కడ మారు మూల పల్లెటూళ్ళో పుట్టిన నేను, ఆ అబ్బాయి అన్నేళ్ల తరువాత అమెరికాలో లాస్ ఏంజెలెస్ లో కలవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

నాకు ఏ వూరు వెళ్ళినా ఎన్నాళ్ళో వుండ బుద్ధి కాదు. విశాఖపట్నం వెళ్లి పోవాలనే వుంటుంది. అక్కడ ఏమిటి గొప్ప అంటే ఏమీ లేకపోవచ్చు. పైగా ఏడాదికి రెండు నెలలే చల్లగా వుండి, ఎప్పుడూ ఉక్క , చెమటలు కారుతూ వుంటుంది. అయినా, ఆ వూళ్ళో చాలా కాలం వుండడం వలన, ఆ కొండలు, ఆ సముద్రం, ఆ అందాలు మళ్ళీ కాలిఫోర్నియా లోనే కనిపించాయి. .
ప్రస్తుతానికి నా కొడుకూ, మా ఆయనా ఎక్కడ వుంటే అదే స్వర్గం గా అనుకుంటున్నా. చిన్నాప్పుడు చదువుకునే రోజుల్లో, ' ఏ వూరు ఏ వలస పిల్లా నీది' పాట అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది. .
మన ఇల్లు పూరిల్లు అయినా మనకి ఎంతో బాగుంటుంది కదా. ఎంత ఫైవ్ స్టార్ హోటల్ లో అయినా రెండు మూడు రోజులు ఉండగలము. కానీ ఎప్పుడూ అక్కడే ఉండిపోవాలని వుండదు. అలానే, మన తల్లి తండ్రులు మామూలు వ్యక్తులే అయినా, మనకు వాళ్ళంటే నే ప్రేమ వుంటుంది కానీ, డబ్బు పవర్ వుండి కదా అని, ఎవడినో తల్లి తండ్రుల్లాగా భావించలేము కదా.. అలానే, మన౦ పెరిగిన ఊరంటే, మనకి ప్రేమ ఉంటుందని తెలుసుకున్నా.
ఆయన ప్రస్తుతానికి ఫోన్ లో మాట్లాడు తున్నారు.. విజయనగరం జారుడు బండ, గంట స్తంభం గురించి, అగ్రహారం వీధి పక్క నే వున్న రైలు పట్టాల గురించి .. భగవంతుడు కూడా మార్చలేడు ఆయన్ని.
అన్ని దేశాలు తిరిగాకా, నాకు చాలా నచ్చిన ప్రదేశం కాలిఫోర్నియా లో సముద్ర తీరా ప్రాంతాలు. విశాఖపట్నం అందాలే కాదు, చల్లని వాతావరణం కూడా. రంగు రంగుల ఇల్లు, అందమైన భవనాలు.. అందమైన మనుషులు.